ఈరోజు దీపావళి పండుగ. అమావాస్య గనుక ఉదయాన్నే పితృతర్పణాలు వదులుతూ కూచుని ఉన్నాను.ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది.ఎవరో వచ్చారు. శ్రీమతి ఆహ్వానించి కూర్చోబెట్టింది.
తర్పణ కార్యక్రమం ముగించి చూద్దునుగదా చరణ్ సోఫాలో శాంతంగా కూచుని కనిపించాడు.ఉభయకుశలోపరి ఫలహారం చేద్దామని లోపలకు పిలిచాను.డైనింగ్ టేబుల్ దగ్గర కూచుని శ్రీమతి వేస్తున్న వెజిటబుల్ దోసెలు తినసాగాం ఇద్దరం.
"వీటిల్లోకి ఈ పచ్చడి వేసుకో చరణ్ చాలా బాగుంటుంది" - అంటూ ఆవనూనెతో చేసిన ఉసిరికాయ పచ్చడి వడ్డించాను. దాన్ని నంచుకుంటూ ఒక దోసె లాగించాడు చరణ్.
'ఏంటి అన్నగారు ! ఇంత అద్భుతంగా ఉంది? తినీ తినకముందే గుండె వేగం పెరిగింది?' అన్నాడు ఆశ్చర్యంగా.
'అవును చరణ్. నువ్వు బాగా సెన్సిటివ్ గనుక ఆ విషయం వెంటనే పట్టేశావు.ఇది గుండెకు చాలా మంచిది.అందులోనూ చలికాలం కదా.ఆవనూనె బాగా వాడాలి.శరీరంలో వేడి పుట్టిస్తుంది.' అన్నాను.
'తెలుస్తున్నది అన్నగారు.I can feel its effect.' అన్నాడు చరణ్.
నేను నవ్వేశాను.
'అన్నగారు.మీ దగ్గరకు వస్తూ వస్తూ దారిలో ఒకటి అనుకున్నాను.ఇంట్లోకి రావడం తోనే అది తీరిపోయింది' అన్నాడు.
'ఏంటది?' అన్నాను
'దారిలో వస్తూ వస్తూ శంకరుల 'వివేక చూడామణి' గురించి మీ నోటివెంట నాలుగు ముక్కలు విందామని అనుకున్నాను.ఇంట్లోకి రావడంతోనే ఎదురుగా శంకరుల 'బ్రహ్మసూత్ర భాష్యం' కనిపించింది. రెంటికీ తేడా ఏముంది? భలే ఆశ్చర్యంగా ఉంది.' అన్నాడు.
నేను మౌనంగా ఫలహారం చేస్తున్నాను.
క్రమంగా ఇద్దరం ఫలహారం ముగించి లేచాం.
'టీ ఇవ్వమంటారా?' అంది శ్రీమతి.
'వద్దు.ఆ పాడు టీ త్రాగి పొట్ట పాడు చేసుకోవడం ఎందుకు? దాని బదులు ఇది త్రాగుతాం.' అంటూ ' ఎదురుగా ఉన్న సీసాలోనుంచి కొంత ద్రావకాన్ని రెండు గ్లాసులలో పోసి సరిపడా నీళ్ళు కలిపి చరణ్ కు అందించాను.
'ఏంటిది అన్నగారు.ఇంత చేదుగా ఉంది?' అన్నాడు త్రాగుతూ.
'భయం లేదులే చరణ్ త్రాగు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.' అంటూ ఈ పద్యం ఆశువుగా చదివాను.
కం|| చేదే మంచిది యొంటికి
చేదే నీ బాధలన్ని చక్కగ దీర్చున్
చీదుట మూల్గుట దొలగును
చీదర పడకుండ త్రాగు చరణా దీనిన్
'ఇంతకీ ఇదెంటో చెప్పలేదేం అన్నగారు? అన్నాడు చరణ్.
'దీనిపేరు 'గిలోయ్ జ్యూస్' అంటే మన తెలుగులో 'తిప్పతీగ రసం'. సంస్కృతంలో దీనిని 'అమృతలతా రసం' అంటారు.చేదుగా ఉంటుంది కానీ ఒంటికి చాలా మంచిది.' అన్నాను.
'ఏదో మీరిచ్చారు త్రాగాను.అంతకంటే నాకేం తెలీదు.' అన్నాడు చరణ్.
'మొన్న మీ వదినతో అదే చెబుతున్నాను చరణ్.ఆ మోడరన్ వంటకాలని ఏవేవో చేస్తూ ఉంటుంది.మనకెందుకు ఆ మసాలా వాసనలూ అవీనూ? మన ఇళ్ళలోనుంచి అలాంటి మసాలా వాసనలు రాకూడదు. మన ఇళ్ళలో చక్కగా ఇంగువ తిరగమోత వాసనలు రావాలి.ఏమంటావ్?' అన్నాను.
'అబ్బా !భలే గుర్తు చేసారన్నగారు.మా చిన్నప్పుడైతే మా ఇంట్లో మామిడికాయ పప్పులో ఇంగువ తిరగమోత వేస్తె వీధి చివర్లో ఉన్న మా స్కూల్లోకి ఆ వాసన వచ్చేది అన్నగారు.ఒరేయ్ అమ్మ మామిడికాయ పప్పు చేసిందిరా అని అక్కడినుంచే అరుస్తూ ఇంటికి పరిగెత్తి వచ్చేవాళ్ళం నేనూ మా అన్నయ్యా. అసలూ సరిగ్గా వంట చెయ్యడం అంటే యాసిడ్ టెస్ట్ తిరగమోత సరిగ్గా వెయ్యడమే.అదొక్కటి సరిగ్గా వస్తే వంట మొత్తం వచ్చేసినట్లే.
మా చిన్నప్పుడు మాకు మేనత్త ఒకామె ఉండేది అన్నగారు.బాగా ఆరడుగుల ఎత్తులో పచ్చని పసిమిచాయలో ఉండేది.చీరను గోచీపోసి కట్టి రోటి ముందు కూచునేది.కేజీ కందిపప్పు రోట్లో వేసుకుని కొంచెం జీలకర్ర వేసి మొత్తం క్షణాల్లో రుబ్బి పారేసేది. మా అమ్మేమో ఇంట్లోంచి వేడివేడి తిరగమోత తెచ్చి ఆ రోట్లోనే వెయ్యాలి.లేకపోతే మా మేనత్త ఊరుకునేది కాదు.ఆ మొత్తం పచ్చడి సమంగా కచ్చాపచ్చాగా రుబ్బి చేత్తో అలా చులాగ్గా తీసి గిన్నెకు వేసేది.దాంతోనే మొత్తం అన్నం తినేసేవాళ్ళం.ఇక వేరే కూరలూ గట్రా అవసరం ఉండేది కాదు.అంత అమృతంగా ఉండేది ఆ కంది పచ్చడి.అంతెందుకు అన్నగారు.కూర తెలగపిండి వేసుకుని తింటే ఎంత బాగుంటుంది కూరల్లో? అలాగే పనసపొట్టు కూర, అరటి దూట కూర,రాచ్చిప్పలో చేసిన జీడికాయల పులుసు - అబ్బా అవన్నీ ఇప్పుడు చేసేవాళ్ళూ లేరు అడిగేవాళ్ళూ లేరు.చిన్నప్పటి రోజులకు మళ్ళీ తీసుకెళ్లారన్నగారు.' అన్నాడు చరణ్ తన్మయత్వంతో.
'రాచ్చిప్పలు ఇప్పుడెక్కడున్నాయి అసలు? అంది శ్రీమతి.
'రాచ్చిప్పను సరాసరి పొయ్యి మీద పెట్టి ఎంత మంట పెట్టినా పగలదు వదినగారు.అదేంటో దాని దుంప తెగ!! అందులో చేసిన పులుసు ఎంత మధురంగా ఉంటుందో? అసలంత ఓపికగా వండేవాళ్ళూ ఇప్పుడు లేరు.అలా తినేవాళ్ళూ ఇప్పుడు లేరు. జిల్లెల్లమూడిలో రాధన్నయ్య అని ఉండేవాడు. మహా తిండిపుష్టి ఉన్నవాడు.మనిషి చూట్టానికే ఘటోత్కచునిలా ఉండేవాడు.ఒకరోజున పందానికి ఏభై ఇడ్లీ తిని పది నిమ్మకాయ సోడాలు తాగాడు.ఈరోజుల్లో చేసే బటన్ ఇడ్లీలు కావు.బాగా అరచెయ్యి సైజులో ఉన్న పెద్ద పెద్ద ఇడ్లీలు.అవి తిని సోడాలు త్రాగేసరికి సమయం పదకొండు అయింది. 'ఏం అన్నయ్యా! ఇంకో యాభై ఇడ్లీలు తెప్పించనా' అని సరదాగా అడిగితే తేలిగ్గా నవ్వుతూ ' ఒద్దురా. మళ్ళీ మధ్యాన్నం భోజనం చెయ్యాలి కదా! కొంచం ఖాళీ ఉంచుదాం పొట్టలో అన్నాడన్నగారు' - అన్నాడు చరణ్ అదే తన్మయత్వంతో.
నవ్వుకుంటూ అందరం వచ్చి హాల్లో కూలబడ్డాం. రాత్రి క్లబ్ లో బాగా ఆలస్యం అయింది కదా అందుకని కొంచం నిద్రమత్తుగా ఉండి నేను దివాన్ మీద జారగిలబడ్డాను.
కాసేపు మౌనంగా గడిచాక ఉన్నట్టుండి - 'సాధన అనేది మనస్సుకేగా అన్నగారు?' అడిగాడు చరణ్.
అతని వంక తేరిపార చూచాను.
(ఇంకా ఉంది)