“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

31, అక్టోబర్ 2016, సోమవారం

సాధన మనస్సుకేనా? - 2

"ఏం ఒళ్ళేం పాపం చేసింది?" అన్నాను.

చరణ్ కాస్త ఖంగు తిన్నాడు. తేరుకుని -"ఇందులో పాపపుణ్యాల ప్రసక్తి ఎక్కడుంది అన్నగారు?' అన్నాడు.

నా పాయింట్ తనకి సరిగ్గా అర్ధం కాలేదని అర్ధమైంది.

ఇంకోరకంగా చెబుదామని, దోవ మార్చి -"అసలు మనసుకి మాత్రం సాధన ఎందుకు?" అడిగాను.

మళ్ళీ కాసేపు ఆలోచనలో పడ్డాడు చరణ్.

"నిగ్రహం కోసం" అన్నాడు కాసేపటి తర్వాత.

"నిగ్రహం లేకుంటే ఏం? అది లేనివాళ్ళు కోటానుకోట్ల మంది ఉన్నారు. వాళ్ళంతా బానే ఉన్నారుగా?" అన్నాను.

"మనస్సు మన కంట్రోల్ లో ఉండాలిగా?" అన్నాడు.

"అవును.మనసు అది ఉండవలసిన స్థితిలో లేదు కనుక.దానికి శిక్షణ అవసరం.అంటే సాధన అవసరం.ఇదేగా నీ జవాబు?" అడిగాను.

సంశయిస్తూ -"ఆ ! అంతే" అన్నాడు.

"అలాగే, ఒళ్ళు కూడా అది ఉండవలసిన స్థితిలో లేదు కనుక దానికి కూడా సాధన అవసరం చరణ్." అన్నాను.

"ఒంటికి ఎలాంటి సాధన అవసరం అవుతుంది?" అడిగాడు.

"చెప్తా విను.ఒంటికి ఉన్న దుస్థితులు ఏవంటే - 'బద్ధకం, అతినిద్ర,అనవసరంగా తిండి తిని లావెక్కడం,సౌష్టవం కోల్పోవడం,సుఖం కోసం వెంపర్లాట,సుఖానికి బాగా అలవాటు పడటం' - ఇవి. వీటిని ఒదిలించడానికి దానికి తగిన సాధన ఇవ్వాలి.అందుకే నా మార్గంలోని మొదటి మెట్లలో యోగ వ్యాయామానికి, ప్రాణాయామానికి చాలా ప్రాముఖ్యతనిస్తాను. అలా చెయ్యడం ద్వారా శరీర సాధన జరుగుతుంది.అది మంచి కండిషన్ లో ఉంటుంది." అన్నాను.

"మనకు శరీరం సంగతి అంతా తెలుసు.కానీ మనస్సు గురించి అంతా తెలీదు కదా?" అడిగాడు చరణ్.

"పొరపాటు.నీ శరీరం గురించి కూడా నీకు ఏమీ తెలీదు.అలా తెలుసనీ ప్రతివాడూ అనుకుంటాడు.అదొక భ్రమ.నీ శరీరంలో నీకు చర్మం వరకే తెలుసు. ఆ లోపల ఉన్నవాటి మీద నీ అదుపు లేదు." అన్నాను.

"ఎందుకు లేదన్నగారు? చెయ్యి నొప్పి వస్తే చెయ్యి నొప్పి అని తెలుస్తున్నది. కాలు నొప్పి వస్తే కాలు నొప్పి అని తెలుస్తున్నది.అన్నీ తెలుస్తున్నాయి కదా?" అన్నాడు.

"లేదు చరణ్.అంతవరకే తెలుస్తుంది.అంతకంటే లోపలికి తెలీదు.ఒక ఉదాహరణ చెప్తా విను.నీకు డొక్కలో ఏదో నొప్పి వస్తుంది.పరీక్షలు చేయిస్తావు.లివర్ లో ఏదో ఒక గడ్డ అని తెలుస్తుంది. అనుకో కాసేపు. అన్నీ నీకు తెలిసే పనైతే పరీక్షలు ఎందుకు? నీకు నీకే తెలియాలి కదా నా లివర్ లో పలానా ప్రాంతంలో ఇంత సైజులో గడ్డ ఉందని ? అలాగే, నీ వైటల్ రీడింగ్స్ అన్నీ నీకే తెలియాలి కదా? మెడికల్ టెస్టులు ఎందుకు చేయిస్తున్నావు? ఒక జ్వరం వస్తే అది ఎందుకు వచ్చిందో దేనివల్ల వచ్చిందో నీకే తెలియాలి.కానీ అలా తెలియడం లేదు కదా? అంటే,నీ ఒళ్ళు గురించి నిజానికి నీకేమీ తెలీదు.నీకు తెలిసిందల్లా చర్మం వరకే.నీకు కనిపించేది చర్మం మాత్రమే. అందుకే దానికి సేవ చేస్తూ ఉంటావు.ఆ లోపలవి నీకు కనిపించవు.అందుకే "బ్యూటీ ఈస్ స్కిన్ డీప్" అని మాటొచ్చింది. నిజానికి మనిషి ఈలోకంలో చేస్తున్నది "చర్మసేవ" మాత్రమే.అంతకంటే వాడికింకేమీ తెలీదు. చర్మంలోనే శర్మం (సుఖం) ఉందనుకుంటాడు మనిషి.అది ఒక జంతువు యొక్క స్థితి మాత్రమే.ఇలా అనుకుంటూ ఉన్నంతవరకూ వాడికీ జంతువుకీ పెద్ద తేడా లేదు.అంతే." అన్నాను.

చరణ్ వింటున్నాడు.

"నిజానికి మనిషి ఏ రకంగా చూచినా పరిమితుడే.అతని శరీరానికీ కొన్ని పరిమితులున్నాయి.మనస్సుకూ పరిమితులున్నాయి.ఈ పరిమితమైన స్థితినుంచి అపరిమితమైన స్థితికి చేరుకోవడమే మనిషి కర్తవ్యమ్.దానికి సాధన అవసరం.అయితే తనకున్న భౌతిక పరిమితుల దృష్ట్యా శరీరం అనేది అన్ని హద్దులనూ అధిగమించి పోలేదు.దానికి కారణం శరీరం భౌతికమైనది. కానీ మనస్సు అలా కాదు.అది అభౌతికం.కనుక అది విశ్వం మొత్తాన్నీ ఆక్రమించగలదు.విశ్వం మొత్తాన్నీ తనలో ఇముడ్చుకోగలదు కూడా.

'భౌతికం అంటేనే ఘనీభవించిన స్థితి అని అర్ధం.ఒక రాయి ఉన్నదని అనుకో.అది ఘనీభవించి ఆ స్థితికి వచ్చింది.కనుక అది ఆ హద్దులలోనే ఇమిడి ఉంటుంది.ఆ హద్దులు దాటితే తన రూపాన్ని కోల్పోతుంది.కానీ మనస్సు అలా కాదు.దానికి రూపం లేదు.అది హద్దులు దాటగలదు.కానీ అదికూడా విశ్వమానసంగా మారినపుడు తన పూర్వస్తితిని కోల్పోతుంది. అయితే దానికి ఆకారం లేదు గనుక ఒక రాయి నాశనం అయినట్లు అది అవదు.అదీ తేడా. సాధన అనేది ఒంటికీ, మనసుకీ - రెంటికీ అవసరమే." అన్నాను.

'మన మనస్సు గురించి కూడా మనకు లోతుగా తెలీదు కదా అన్నగారు?' అన్నాడు చరణ్.

'ఎందుకు తెలీదు? అంత:పరిశీలనా శక్తి ఉన్నవాడికి బాగానే తెలుస్తుంది.కానీ నువ్వు ఎంతగా పరిశీలించినా నీ ఒంట్లో జరుగుతున్న క్రియలు నీకు తెలియవు.అదొక చీకటి లోకం.జ్ఞాననేత్రం ఉంటేనే ఆ విషయాలు కనిపిస్తాయి. మామూలు మనిషికి అది ఒక చీకటి ప్రపంచం అంతే.కానీ నీ మనస్సును గమనించుకుంటే దాని వేషాలన్నీ నీకు అవే అర్ధమౌతాయి.అదీ ఒంటికీ మనసుకీ తేడా.

'అసలూ - దైవం ఇచ్చినదాన్ని "పనికిరాదు" అని నిర్లక్ష్యం చెయ్యడానికి నీకు హక్కెక్కడిది? ఒకవేళ దేహం పనికిమాలినది అయితే దైవం దానిని ఎందుకు సృష్టించాడు? ఎందుకు నీకిచ్చాడు? దైవ సృష్టిలో ఉన్నదానిని నిర్లక్ష్యం చేసే అధికారం మనకెక్కడిది? కనుక నీలో ఏదీ పనికిరానిది కాదు.వాటిని ఎలా వాడుకోవాలో నీకు తెలియాలి.నువ్వు నీ శరీరంతో సహా దేనినీ నిర్లక్ష్యం చెయ్యకూడదు.అలాగని దేనికీ అలుసూ ఇవ్వకూడదు.అందుకనే శరీరం మాయ అనీ భ్రమ అనీ భావించే మూర్ఖ వేదాంతులు కాలగర్భంలో కలసి పోయారు.అవి నిలబడే సిద్ధాంతాలు కావు.' అన్నాను.

'ఇలాంటి అసలైన విషయాలు ఎవ్వరూ చెప్పడం లేదన్నగారు.' అన్నాడు.

'ఎవరూ అంటే?' అడిగాను.

'అదే టీవీల్లో, పేపర్లలో,గుళ్ళలో ఉపన్యాసాలు ఇచ్చే గురువులు' అన్నాడు.

'టీవీల్లో,పేపర్లలో,గుళ్ళలో నీకు గురువులు ఎలా దొరుకుతారు చరణ్? అది ఉత్త కాలక్షేపం మాత్రమే.అందుకే "పురాణ కాలక్షేపం" అనే మాట వచ్చింది. నిజమైన ఆధ్యాత్మికత అలా దొరికేది కాదు.' అన్నాను.

'ఎవరి మతవ్యాపారం వారు చేసుకుంటున్నారన్నగారు' అన్నాడు చివరకు.

'ఒకరి గోల వదిలేయ్ చరణ్.మనకెందుకు? మనం పుట్టింది లోకాన్ని ఉద్దరించడానికి కాదు.ముందు మనల్ని మనం ఉద్దరించుకుంటే చాలు. అలాంటి మత వ్యాపార ఊబిలో పడే ఖర్మ ఉన్నవాళ్ళు పడతారు.అదృష్టం ఉన్నవారు సత్యం చెంతకు చేరతారు.లేనివారు వారి దారిన వారు పోతారు. మనకెందుకు? ముందు మన సంగతి మనం చూచుకుందాం. ఇదే వివేకం అంటే. నువ్వు "వివేక చూడామణి" గురించి విందామని వచ్చావు.నువ్వు ప్రస్తుతం విన్నది అదే.' అన్నాను నవ్వుతూ.

చాలాసేపు మౌనంగా కూచుండిపోయిన చరణ్ చివరకు తేరుకుని - 'ఉంటా అన్నగారు.మళ్ళీ కలుస్తా.' అంటూ లేచాడు.

'సరే.మంచిది.వెళ్లిరా' అన్నాను.

సెలవు తీసుకుని చరణ్ నిష్క్రమించాడు.