నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

30, నవంబర్ 2016, బుధవారం

నవంబర్ 2016 - అమావాస్య ప్రభావం

Mundane Astrology వైపు దృష్టి సారించి చాలా రోజులైంది.ఒక్కసారి అటువైపు తొంగి చూద్దాం.

ఆఫ్కోర్స్ ! మనం చూచినా చూడకున్నా, గ్రహాలు వాటిపని అవి చేస్తూనే ఉంటాయి. అమావాస్యకూ పౌర్ణమికీ జరిగేవి జరుగుతూనే ఉంటాయి.కర్మచక్రం నిరంతరంగా తిరుగుతూనే ఉంటుంది.

ఈ అమావాస్య ఘడియలలో ఒక విమానం కూలింది. ఒక ఉగ్రవాద దాడి జరిగింది. అదికూడా సరాసరి సైనిక స్థావరం పైనే. అదీగాక ఈరోజున బెంగాల్లోని సుఖ్నా అనేచోట చీటా హెలీకాప్టర్ కూలి ముగ్గురు ఆర్మీ అధికారులు చనిపోయారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది.

విమానం కూలిన సంఘటన నిన్న రాత్రి కొలంబియాలో జరిగింది.75 మంది చనిపోయారు. వీరిలో ఫుట్ బాల్ జట్టు మొత్తం ఉంది. అయిదుగురో ఆరుగురో ఇంత ఘోర ప్రమాదంలో కూడా బ్రతికి బయటపడ్డారు.నేనెప్పుడూ చెప్పే కర్మసూత్రం ఇదే.ఇలాంటి ఘోర ప్రమాదంలో కూడా కొందరు బ్రతకడం వింత కాదా మరి !!

ఇకపోతే జమ్మూలోని సైనిక స్థావరం మీద ఆర్మీ దుస్తులలో వచ్చి దాడి చేసిన పాకిస్తాన్ తొత్తులు మన సైన్యంలో కొందరిని చక్కగా చంపేశారు. దానికి 'బలిదానం' అని మనం పేరు పెట్టుకుంటున్నాం. మొన్నీ మధ్యన మన సైనికుడి తల నరికినందుకు మనవాళ్ళు ఏదో తీవ్రంగా పాక్ సైనిక శిబిరాలను ధ్వంసం చేశారని, ఆ దెబ్బను తట్టుకోలేక వాళ్ళు మన కాళ్ళ బేరానికి వచ్చి 'దాడులు ఆపండి.మేం తట్టుకోలేక పోతున్నాం' అని మెసేజీలు ఇచ్చారని మన రక్షణ మంత్రిగారు మొన్ననే ఒక సభలో గర్వంగా చెప్పుకున్నారు. మరి రెండ్రోజుల్లోనే ఇదేంటి? పాకిస్తాన్ మాటల్ని ఇంకా ఎంతకాలం నమ్మాలి?

అసలు సంగతి అది కాదు.పాకిస్తాన్ కొత్త సైన్యాధిపతిగా కమర్ జావేద్ బజ్వా పగ్గాలు చేపట్టిన సందర్భంలో 'మేమేం చెయ్యగలమో చూడండి' అని వాళ్ళు మనకు ఒక గిఫ్ట్ ఇచ్చారు.అంతే !! మనం అది మరచిపోయి పాకిస్తాన్ మాట్లాడే మాటల్ని నమ్మి 'హిందూ ముస్లిం భాయీ భాయీ' అని వాళ్ళ భుజాల మీద చేతులేస్తే ఆ తర్వాత సైలెంట్ గా మన చేతులు మాయమై పోతాయి.గతంలో ఇదెన్నో సార్లు రుజువైంది.ఇంకా ఎన్నాళ్ళు పాకిస్తాన్ మాటలల్ని నమ్ముదాం?

ఇకపోతే, ఈరోజున బెంగాల్లో సుఖ్నా అనేచోట, ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయి ముగ్గురు ఆర్మీ ఆఫీసర్లు చనిపోయారు. ఒకరు క్రిటికల్ కండిషన్ లో ఆస్పత్రిలో ఉన్నారు.

వీటన్నిటికీ కారణమైన ఈ అమావాస్య గ్రహస్థితి ఏంటో చూద్దామా?

అపసవ్య కాలసర్ప యోగం??
----------------------------------
ప్రస్తుతం గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యన ఉన్నాయి.కానీ ఇది కాలసర్ప యోగం కాదు. ఎందుకంటే రాహువు పోతున్న దిశలో గ్రహాలు లేవు.కనుక దీనిని అపసవ్య కాలసర్ప యోగం అని పిలుద్దాం. ఇలా పిలవడం నాకిష్టం లేదు.కానీ ఇంకో పేరు లేదు గనుక ఇప్పటికిలా సర్దుకుందాం. ప్రస్తుతం జనాలు పడుతున్న బాధలన్నిటికీ ఇదొక కారణం.

గురుకుజుల ఉచ్చనీచ స్థితులు
----------------------------------------
నవాంశలో గురువు ఉచ్చ.కుజుడు నీచ.కుజుడు రాశిలో ఉచ్చ అయినా నవాంశలో నీచ గనుక అతని మంచితనం ఆవిరై పోయింది.కానీ గురు అనుగ్రహం ఉంది గనుకే గండాలు కొద్దిలో పోతున్నాయి.లేకుంటే ఇంకా పెద్దవి జరిగేవి.

శనీశ్వరుని అధీనంలో అమావాస్య
-------------------------------------------
ఈ అమావాస్య శనీశ్వరుని అధీనంలో ఉంది. ఎందుకంటే రవి చంద్రులు ఆయనతో కూడి వృశ్చికంలో ఉన్నారు.చంద్రునికి ఇది నీచ స్థితి. శనీశ్వరుడు వాయుతత్వానికి అధిపతి గనుక వాయుయాన ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతే !!

వృశ్చికం జలతత్వ రాశి గనుక ఇంకో రెండు మూడు రోజులలో జలయాన ప్రమాదాలు కూడా జరగాలి.చూద్దాం !!

పోతే - వృశ్చికరాశి వారిని ఈ అమావాస్య బాగా ఇబ్బంది పెట్టె మాట కూడా వాస్తవమే !!

అమావాస్య ఎఫెక్ట్ మళ్ళీ ప్రూవ్ అయిందా లేదా???
read more " నవంబర్ 2016 - అమావాస్య ప్రభావం "

27, నవంబర్ 2016, ఆదివారం

Din Dhal Jaye Hai Raat Na Jaay - Mohammad Rafi





Din Dhal Jaye Hai Raat Na Jaay
అంటూ మహమ్మద్ రఫీ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం దేవానంద్ నిర్మించి నటించిన క్లాసిక్ హిట్ "గైడ్" సినిమాలోది.ఈ సినిమా 1965 లో వచ్చింది.

శైలేంద్ర సాహిత్యమూ, సచిన్ దేవ్ బర్మన్ సంగీతమూ, రఫీ గాత్రమూ, దేవానంద్ నటనా కలసి ఈ పాటను ఎన్నటికీ మరపురాని ఒక మధుర గీతంగా మలిచాయి. అందుకే 50 ఏళ్ళ తర్వాత ఇప్పుడు విన్నా కూడా ఈ పాట ఎంతో అద్భుతమైన ఫీల్ ను ఇస్తుంది.

ఈ పాట మొదట్లో దేవానంద్ భారంగా పలికిన 'లేకిన్ జబ్ ఉతర్తా హై' అనే మాటా, గ్లాసులో విస్కీ పోసిన శబ్దమూ, ఆ తర్వాత వచ్చే ఉరుము శబ్దమూ ఈ పాట మొత్తానికీ అందాన్ని తెచ్చాయి. అందుకని వాటిని అలాగే ఉంచాను.

1972 లో మనవాళ్ళు తీసిన "బుల్లెమ్మ బుల్లోడు" అనే సినిమాలో ఇదే రాగచ్చాయలో సత్యం స్వరపరచిన "కురిసింది వానా నా గుండెలోనా నీ చూపులే జల్లుగా"అంటూ బాలసుబ్రమణ్యం,సుశీల పాడిన పాట సాగుతుంది. హిందీ ట్యూన్స్ ను తెలుగులోకి దించడంలో సత్యం దిట్ట. కానీ కొన్ని మార్పులు చేసి తనదంటూ ఒక బాణీతో కూడిన పాటను అందించేవాడు. ఇదీ హిట్ సాంగే. 

నా స్వరంలో కూడా ఈ మరపురాని మధురగీతాన్ని వినండి మరి.

Movie:-- Guide (1965)
Lyrics:-- Shalendra
Music:-- Sachin Dev Burman
Singer:--Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
--------------------------------------
[Din dhal jaaye hai – Raat na jaay
Tu tona aaye teri – Yaaad sataay
Din dhal jaay] - 2

Pyar me jinke – Sab jag chodaa
Aur huye badnaam
Unke hi haathon – Haal huva ye
Baithe – Dil ko thaam
Apne kabhee the – Ab hai paraaay
Din dhal jaaye hai – Raat na jaay
Tu tona aaye teri – Yaaad sataay
Din dhal jaay

Aesi hi rmjhim – Aesi puhaare
Aesi hi thee – Barsaat
Khud se judaa aur – Jag se paraaye
Hum dono – The saath
Firse wo saawan – Ab kyo na aaay
Din dhal jaaye hai – Raat na jaay
Tu tona aaye teri – Yaaad sataay
Din dhal jaay

Dill ke mere – Paas ho itne
Phirbhi ho – Kitnee dooor
Tum mujhse main – Dilse Pareshaan
Dono hai majboor
Aise me kisko – Kaun manaay
[Din dhal jaaye hai – Raat na jaay
Tu tona aaye teri – Yaaad sataay]-2
Din dhal jaay

Meaning

The day has ended,
but the night is continuing indefinitely
You have not come
but your memories torment me endlessly

For whose sake I left the world and earned a bad name for myself
She reduced me to this state
Where I am sitting here grasping my heart with my hands
One upon a time, she was mine
Now she belongs to some one else

The same drizzle, the same shower, the same rain
In the past, forgetting ourselves and the world, we were together
Why is that rainy season nowhere now?

You are so close to my heart, yet so far away
You are troubled by me
and me by my heart
We both are helpless
In this condition who can console who?

The day has ended,
but the night is continuing indefinitely
You have not come
but your memories torment me endlessly

తెలుగు స్వేచ్చానువాదం

పగలు గతించింది
రాత్రి మాత్రం ఎంతకీ ముగియడం లేదు
నువ్వు నా దగ్గరకు రావు
కానీ నీ జ్ఞాపకాలు మాత్రం నన్ను వదలడం లేదు

ఎవరికోసం నేను ఈ ప్రపంచం మొత్తాన్నీ వదులుకొని
లోకం దృష్టిలో చాలా చెడ్డ పేరును పొందానో
ఆమే నన్నీ స్థితికి తెచ్చింది
ఇక్కడ ఒంటరిగా కూచుని నా గుండెను నా చేతితో పట్టుకుని ఉన్నాను
ఒకప్పుడు ఆమె నాదే
కానీ ఇప్పుడు పరాయిదై పోయింది

అదే ముసురు, అదే వాన, అదే జల్లు
గతంలో ఒకరోజున ఇలాంటి వాతావరణంలో
మనల్ని మనం మరచిపోయి, లోకాన్ని మరచిపోయి ఉన్నాం
ఆ వర్షాకాలం ఇప్పుడేమై పోయింది??

నువ్వు నా హృదయానికి ఎంతో సమీపంలో ఉన్నా 
నిజానికి ఎంతో దూరంలో ఉన్నావు
నిన్ను నేను బాధ పెడుతున్నాను
నన్ను నా హృదయమే బాధ పెడుతున్నది
ఇద్దరమూ నిస్సహాయులమే
ఈ స్థితిలో ఎవరిని ఎవరు ఓదార్చగలరు?

పగలు గతించింది
రాత్రి మాత్రం ఎంతకీ ముగియడం లేదు
నువ్వు నా దగ్గరకు రావు
కానీ నీ జ్ఞాపకాలు మాత్రం నన్ను వదలడం లేదు...
read more " Din Dhal Jaye Hai Raat Na Jaay - Mohammad Rafi "

26, నవంబర్ 2016, శనివారం

స్వామి యదునాధానందతో సంభాషణ -8 (శ్రీ రామకృష్ణులు దైవం యొక్క అవతారమా? నేనొప్పుకోను )





ఈ విధంగా చాలా సేపు మాట్లాడుతూ కూచున్నాము. ఇంతలో భోజనాల వేళ అయింది.అదేరాత్రి పదింటికి చెన్నై బస్సులో స్వామీజీ బయలుదేరి వెళ్ళాలి. అందుకని పెందలాడే భోజనం కానిచ్చాము.

'నాకు గోరువెచ్చని నీళ్ళు ఇవ్వండి.చల్లనీళ్ళు నేను త్రాగను.నాకు కొంచం జలుబు చేసే తత్త్వం ఉంది.' అన్నారు స్వామీజీ.

'అలాగే. నేనూ అంతే. చలికాలం గోరువెచ్చని నీరే నేనూ త్రాగుతాను.' అన్నాను.

'మీరు వంటల్లో వెల్లుల్లి వాడతారా?' అడిగారు స్వామీజీ అనుమానంగా.

'శుభ్రంగా వాడతాము.అలాంటి పట్టింపులు మాకు లేవు.' అన్నాను.

'అవును.వెల్లుల్లి గుండెకు చాలా మంచిది.శాకాహారంలో కూడా ఇది పనికిరాదు అది పనికిరాదు అంటూ అనవసరమైన పట్టింపులు చాదస్తాలు మంచివి కావు.ప్రతి వస్తువుకూ కొంత చెడు గుణం ఉంటుంది.దానిని పోగొట్టి వాడుకుంటే అది శరీరానికి మంచే చేస్తుంది.చలికాలంలో జలుబు చేసే తత్త్వం ఉన్నవారు పొద్దున్నే ఒక వెల్లుల్లి రెబ్బ, కొంచం మిరియాలు కలిపి నూరి దానిని ఒక గ్లాసు నీళ్ళలో కాచి, దానికి కొంచం ఉప్పు తగిలించి త్రాగితే చాలా మంచిది.తిన్నది కూడా బాగా అరుగుతుంది.నేను అదే చేస్తాను.' అన్నాడు స్వామీజీ.

శుద్ధ వైష్ణవ సాంప్రదాయం నుంచి వచ్చిన స్వామీజీకి తిండి విషయంలో ఇంత విశాల భావాలు ఉన్నందుకూ వెల్లుల్లి తింటానని అన్నందుకూ నాకు సంతోషం అనిపించింది.

'అవును స్వామీజీ ! హోమియోలో కూడా వెల్లుల్లిని ఒక మందుగా వాడతారు. "అల్లియం సటైవా" అంటే అదే.' అన్నాను.

మాట్లాడుకుంటూ భోజనాలు కానిచ్చి, శ్రీమతి వద్ద సెలవు తీసుకుని కార్లో బస్టాండ్ కు బయలుదేరాము.

దారిలో మా సంభాషణ ఇలా సాగింది.

'రామకృష్ణా మఠానికి గాని, శారదా మఠానికి గానీ అప్పుడప్పుడూ వెళుతూ ఉంటారా? ' అడిగాడు స్వామీజీ.

'చిన్నప్పుడు వెళ్ళేవాడిని. కానీ ఒక పాతికేళ్ళ నుంచీ పూర్తిగా మానేశాను.' అన్నాను.

'ఎందుకు?' అన్నాడాయన.

'అక్కడ వాతావరణాలు నాకు నచ్చడం లేదు.నేను ఆశించినంత ఉన్నతమైన వ్యక్తులూ నాకు కన్పించడం లేదు.ఎంతో మహనీయులైన స్వామి నందానంద, స్వామి తపస్యానంద,స్వామి ఉద్ధవానంద,స్వామి గంభీరానంద మొదలైన వారిని నేను చూచాను.అలాంటి స్వామీజీలు ప్రస్తుతం ఎక్కడా కన్పించడం లేదు.అందుకని ప్రస్తుతం నేనెక్కడికీ పోవడం లేదు.ఈ జీవితంలో చూడవలసిన వారిని చూచాను. చాలు. ఇక ఎవరినీ చూడవలసిన పని లేదు. ఎవరి బోధలూ వినవలసిన పని కూడా లేదు.' అన్నాను.

ఆయన మౌనంగా వింటున్నాడు.

'అదీగాక నేటికాలపు స్వామీజీలలో ఆధ్యాత్మిక అహంకారం ఎక్కువగా నాకు కనిపిస్తున్నది."మీరు గృహస్తులు కనుక మీకు మోక్షం రాదు.కారణం ఏమంటే మీకు బ్రహ్మచర్యం ఉండదు కదా?మీకంటే మేమే గొప్ప" అని వీరి భావన. ఇదే మాటను కొంతమంది మాతాజీలు అన్నారు. ఆ దెబ్బతో నాకు వీళ్ళంటే విరక్తి వచ్చేసింది. అందుకని ఎక్కడికీ వెళ్ళడం మానేశాను. పాతకాలపు స్వామీజీలు ఎవరూ ఇలా సంకుచితమైన భావాలు ఉన్నవారు కారు.

మా గురువైన గంభీరానందస్వామి ఎంతో ఉన్నతమైన భావాలు కలిగిన మహనీయుడు. ఒకసారి కల్పతరు దినోత్సవ సందర్భంగా 1963 లో కలకత్తాలో ఒక సభ జరిగింది.ఆ సభకు గంభీరానంద స్వామి అధ్యక్షులుగా ఉన్నారు.సభలో మాట్లాడిన వక్తలలో - సాదువులే గొప్ప అని కొందరు - గృహస్తులే గొప్ప - అని కొందరు మాట్లాడారు.శ్రీ రామకృష్ణుల అనుగ్రహం మాకే ఉందంటే మాకే ఉందని వారు వాదులాడు కున్నారు.

అందరూ మాట్లాడాక, అధ్యక్షోపన్యాసం చెయ్యడం కోసం గంభీరానంద స్వామి లేచారు. ఆయన ఈ ఇరువర్గాలకూ బాగా చీవాట్లు పెట్టారు.

'శ్రీరామకృష్ణులను మీరు ఎంత తక్కువ చేస్తున్నారు? ఎంత దిగజారుస్తున్నారు? ఇటువంటి సంకుచిత భావాలను ఆయన సహించేవారే కాదు.ఆయన్ను మీరేం అర్ధం చేసుకున్నారసలు? మీ రెండు వర్గాల కోసమేనా ఆయన పుట్టింది? కాదు. ప్రపంచంలోని అన్ని జాతులూ అన్ని కులాలూ అన్ని జీవుల కోసం ఆయన అవతారం దాల్చాడు.వారూ వీరూ అని ఆయనకు తారతమ్యం ఎంతమాత్రమూ లేదు.ఆయనొక మహాసముద్రం వంటి వాడు.ఆయన్ను మీరొక ఉగ్గుగిన్నెలో దాచాలని చూస్తున్నారు.ఇది చాలా తెలివితక్కువ పని.' అని గట్టిగా వారికి బోధించారు.

అలా చెప్పేవారు ఇప్పుడు కరువయ్యారు. స్వామీజీలలో కూడా క్వాలిటీ తగ్గింది.అందుకే నేను వారి దగ్గరకు వెళ్ళడం పూర్తిగా మానేశాను.అసలు శ్రీ రామకృష్ణులను వీరెవరూ సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదని నా ఉద్దేశ్యం.లోకం ఎలాగూ ఆయన్ను అర్ధం చేసుకోలేదు. కనీసం ఆయన సాంప్రదాయపు స్వామీజీలు కూడా అలాగే ఉన్నారు.అదీ బాధాకరం.

అసలీ గోలంతా ఏమిటి? సన్యాసులేమిటి? గృహస్థులేమిటి? అందరికీ ఆయన మోక్షం ఇచ్చారు.సాధన అనే పదమే వినని రసిక్ అనే కాళికాలయ పాకీవాడికి కేవలం ఆయన అనుగ్రహంతో మోక్షం దొరికింది.వినోదిని అనే డ్రామా నటికి అలాగే మోక్షం లభించింది. ఊరకే ఆయన కాళ్ళు పట్టుకుని ఏడ్చినందుకు రమణి అనే వేశ్యకు ఆయన మోక్షం ఇచ్చారు.మన్మద్ అనే రౌడీ, ఆయన అనుగ్రహంతో గొప్ప సెయింట్ గా మారిపోయాడు.జీవితమంతా తనను తిట్టిపోసిన హాజ్రాకు మోక్షం ఇచ్చారాయన.అహంకారంతో తనను వదిలేసి వెళ్ళిపోయిన హృదయ్ కు మోక్షం ఇచ్చారు.ఇలా చెప్పుకుంటూ పోతే, ఇంకా ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు ఉన్నాయి. వీరికందరికీ మోక్షం వచ్చినపుడు మనకు రాదా? తప్పక వస్తుంది. అనన్యమైన భక్తి ముఖ్యం గాని ఇవన్నీ ఏమిటి నాన్సెన్స్?" అన్నాను.

ఆశ్చర్యంగా నా వైపు చూచారు స్వామి.

'మీ భావాలు వింటూ ఉంటే,బేలూర్ మఠంలో నేను బ్రహ్మచారి ట్రెయినింగ్ లో ఉన్నపుడు జరిగిన ఒక సంఘటన నాకు గుర్తొస్తున్నది.' అంటూ చెప్పసాగారు ఆయన.

చెన్నై మఠంలో రెండేళ్ళు ఉన్న తర్వాత నాకు బేలూర్ మఠంలో బ్రహ్మచారి ట్రెయినింగ్ మొదలైంది.ఆ బ్యాచ్ లో మేం మొత్తం దాదాపు ముప్పై మందిమి ఉన్నాము.ట్రెయినింగ్ అయిపోయాక మేము ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో మిగతా ప్రశ్నలతో బాటు ఒక ప్రశ్న ఉంటుంది. అదేమంటే - 'శ్రీ రామకృష్ణులను మీరు అవతారంగా ఒప్పుకుంటున్నారా?" అని.

మా బ్యాచ్ లోని అందరూ  దానికి 'అవును.ఒప్పుకుంటున్నాను.' అని వ్రాశారు.కానీ నేను మాత్రం 'నో. నేను ఒప్పుకోవడం లేదు' అని వ్రాశాను. బ్రహ్మచర్య ట్రెయినింగ్ కాలేజికి ఒక సీనియర్ స్వామీజీ ప్రిన్సిపాల్ గా ఉంటారు.ఆయన నా ఆన్సర్ చూసి షాకయ్యారు. నన్ను ఆఫీస్ రూమ్ కి పిలిపించి అడిగారు.నేను నా మాట మీదే ఉన్నాను."శ్రీ రామకృష్ణులు అవతారం కాదు.నేనొప్పుకోను." - అని ఆయనతో గట్టిగా చెప్పాను.ఏం చెయ్యాలో ఆయనకు పాలు పోలేదు. 

"ఇలా అయితే నీకు బ్రహ్మచర్య దీక్షను ఇవ్వడం కుదరదు.నిన్ను మా మఠంలో ఉంచుకోవడం కూడా కుదరదు." అని ఆయన అన్నారు.

'మీ ఇష్టం.కానీ నా మాట మాత్రం అదే. ఇక్కడ నన్ను ఉంచుకోవడమూ లేదా పొమ్మనడమూ మీ ఇష్టం కాదు.బ్రహ్మచర్యదీక్షనూ సన్యాసదీక్షనూ మాకు మీరివ్వడం లేదు. ఠాకూర్ ఇస్తున్నారు. ఆయన ఇష్టమైతే ఉంటాను.లేకుంటే ఆయనే నన్ను పంపించేస్తారు.' అని నేనన్నాను.

కాసేపు ఆలోచించిన మీదట ఆయన నాతో ఇలా చెప్పారు.

'నీ కేసును నేను ట్రస్టీలకు పుటప్ చెయ్యవలసి ఉంటుంది. నీవు వెళ్లి వారిని కలువు.' ఇలా అంటూ ఆయన ఫోన్ చేసి నా విషయం వారికి చెప్పారు.

రామకృష్ణా మిషన్ లో అత్యున్నతమైన అడ్మినిస్ట్రేటివ్ బాడీని ట్రస్ట్ బోర్డ్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మఠాలు మిషన్ లు అన్నింటినీ ఈ ట్రస్టీలు కంట్రోల్ చేస్తూ ఉంటారు.వీరు చాలా సీనియర్ స్వామీజీలై ఉంటారు.మిషన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు అందరూ ఈ బోర్డులో ఉంటారు. వారి దగ్గరకు నన్ను ఇంటర్వ్యూకు పంపారు. నాతోటి బ్రహ్మచారులందరూ నా పని అయిపోయిందని అనుకున్నారు. ఆరోజుతో నన్ను బాగా తిట్టి ఇంటికి పంపించేస్తారని భయపడ్డారు.

ట్రస్టీ స్వామీజీలు అందరూ ఒక గదిలో సమావేశమై నన్ను పిలిచారు.నేను ధైర్యంగా ట్రస్టీల రూమ్ లోకి వెళ్లాను. అయిదారుగులు మోస్ట్ సీనియర్ స్వామీజీలు అక్కడ కూచుని ఉన్నారు.వాళ్ళ ముఖాలు చాలా సీరియస్ గా ఉన్నాయి.

'ఠాకూర్ ను అవతారంగా నువ్వు ఒప్పుకోవా?' అని వారు అడిగారు.

'ఒప్పుకోను.అదేగా నేను ఆ కాగితంలో వ్రాసింది.' అన్నాను.

'అలా అయితే ఇన్నాళ్ళూ ఈ మఠంలో ఎందుకున్నావు? బ్రహ్మచారి ట్రెయినింగ్ ఎందుకు కంప్లీట్ చేశావు?' అని వారడిగారు.

'నా మనసులో ఉన్న విషయం నేను చెప్పాను. మిగతా బ్రహ్మచారులు తల ఊపారని నేను కూడా ఊపలేను.' అని నేను ధైర్యంగా చెప్పాను.

ఆ రూమ్ లో వాతావరణం అంతా చాలా సీరియస్ గా ఉన్నది.

'అసలు నీ ఉద్దేశ్యం ఏమిటో స్పష్టంగా చెప్పు. ఠాకూర్ ను నువ్వేమని అనుకుంటున్నావు?' అని వారు అడిగారు.

అప్పుడు నేను ఇలా చెప్పాను.

'ఠాకూర్ ను అవతారం అని మీరంటున్నారు.కానీ అలా అనడం ఆయన్ను తక్కువ చెయ్యడం అని నేను భావిస్తున్నాను. భగవంతుడంటే ఒక మహాసముద్రమైతే, అవతారం అనేది ఆ సముద్రంలోని ఒక అల మాత్రమే. రాముడైనా కృష్ణుడైనా ఇంకే అవతారమైనా కూడా ఆ మహాసముద్రంలోని అలలే. కానీ - ఆ సముద్రమే శ్రీరామకృష్ణులని నేను భావిస్తున్నాను. అవతారం అనేది చాలా చిన్న మాట. అలాంటి మాట వాడి ఠాకూర్ ను మనం ఎందుకు తక్కువ చెయ్యాలి? అది నాకిష్టం లేదు. అందుకే అలా జవాబు చెప్పాను.

'ఠాకూర్ ను అవతారంగా నువ్వు ఒప్పుకుంటావా?' అన్న ప్రశ్నను మీరు ఆ ఫార్మాట్ లో నుంచి ముందు మార్చండి.సమస్త ప్రకృతికీ అతీతుడైనప్పటికీ, సమస్త ప్రకృతికీ ఆధారంగా కూడా ఉన్నట్టి అవాన్మానస గోచరుడైన పరబ్రహ్మంగా నీవు శ్రీరామక్రిష్ణులను గుర్తిస్తున్నావా లేదా? అంతటి పరిపక్వతా అవగాహనా నీకున్నాయా?' అని మీరు అడగాలి. అదే సరియైన ప్రశ్న." - అని నేనన్నాను.

ఆ గదిలో పిన్ డ్రాప్ సైలెన్స్ ఆవరించింది.

అప్పటివరకూ మహా సీరియస్ గా ఉన్న ట్రస్టీ స్వామీజీల ముఖాలు ఒక్కసారిగా పరమానందంతో వికసించాయి. అందరూ లేచి నా భుజం తట్టి - 'వెరీ గుడ్ త్యాగరాజ్. అద్భుతంగా చెప్పావు.నువ్వు చెప్పినది పరమసత్యం.ఇదా నీ భావన !! మరి ముందే ఎందుకు చెప్పలేదు?' అని నన్ను బ్లెస్ చేశారు.

'నువ్వు మంత్రదీక్ష తీసుకున్నది ఎవరి దగ్గర? నీ గురువు ఎవరు?' అని వారు అడిగారు.

'తపస్యానందస్వామి శిష్యుడనని చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను.' అని వారికి ధైర్యంగా చెప్పాను.

'ఓ ! అదా సంగతి ! నువ్వు వారి శిష్యుడవా? వెరీ గుడ్. You have proved yourself' అని అందరూ అన్నారు. అనడమే కాదు. ఒక్కొక్కరూ ఒక కేజీ స్వీట్స్ ప్యాకెట్ నాకిచ్చారు. అన్ని స్వీట్స్ ప్యాకేట్స్ తో బయటకొచ్చి, అక్కడ నాకోసం వెయిట్ చేస్తున్న బ్రహ్మచారులందరికీ ఆ స్వీట్స్ పంచాను.

తిట్లు తిని, ఊస్టింగ్ తో బయటకు వస్తానని అనుకున్న ప్రిన్సిపాల్ స్వామీజీ, మొయ్యలేనన్ని స్వీట్స్ పేకెట్స్ పట్టుకుని నేను రావడం చూచి మళ్ళీ షాకయ్యారు. విషయం తెలిసిన తర్వాత మహదానందంతో ఆయన కూడా ఇంకొక స్వీట్ ప్యాకెట్ నాకిచ్చారు.' అన్నాడు స్వామీజీ.

మౌనంగా వింటున్న నాకు కూడా చెప్పలేనంత ఆనందం కలిగింది. కారును సైడుకు తీసి ఆపేశాను. ఆయన వైపు తిరిగి ఇలా అన్నాను.

'స్వామీజీ.పొద్దున్న నుంచీ మీరు చెప్పిన విషయాలన్నీ ఒక ఎత్తు. ఇదొక్కటీ ఒక ఎత్తు. అద్భుతంగా చెప్పారు మీరు.చాలా కరెక్ట్.' అన్నాను.

'అవును. ఎందుకంటే శ్రీరామకృష్ణులను గురించి వివేకానంద స్వామికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఆయన్ను సరిగ్గా అర్ధం చేసుకున్నది వివేకానందుడొక్కడే. కానీ ఆయన కూడా శ్రీ రామకృష్ణుని జీవితాన్ని గురించి వ్రాయడానికి వెనుకంజ వేశాడు. ఆపనిని తాను చెయ్యలేననీ, ఆయన మహత్యాన్ని వర్ణించడంలో తాను న్యాయం చెయ్యలేననీ ఆయనన్నాడు.

కానీ - ఎన్నో పేజీలు  వ్రాసి కూడా చెప్పలేని విషయాన్ని ఒక్క చిన్న పదంలో చెప్పవచ్చు. అందుకే వివేకానంద స్వామి వ్రాసిన శ్రీరామకృష్ణ స్తోత్రంలో ఒక మాట వాడాడు. " భాస్వర భావసాగర" అనేదే ఆ మాట !!

నాకు కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి !!

స్వామీజీ కంటిన్యూ చేశాడు.

'ఠాకూర్ భావసాగరుడు. అవికూడా మామూలు భావాలు కావు. ఉజ్జ్వలమైన కాంతితో వెలుగుతున్న దివ్యభావాలవి. మిగతా మహనీయులూ అవతారాలూ ప్రవక్తలూ ఒక్కొక్కరు ఒక్కొక్క భావాన్ని మాత్రమే వారి జీవితాల్లో ఆచరించగలిగారు.మనకు చూపించగలిగారు.ఉదాహరణకు బుద్ధుడు - శుద్ధ జ్ఞానమూర్తి.శంకరుడూ అంతే. చైతన్యుడు భక్తి భావ ప్రపూర్ణుడు.గోరఖ్ నాద్, మొదలైనవారు యోగులు.రమణమహర్షి జ్ఞాన స్వరూపుడు.అరవిందులది యోగమార్గం.ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క భావాన్ని మాత్రమే ఆచరించగలిగారు. కానీ శ్రీరామకృష్ణులలో ఇవన్నీ ఉన్నాయి. ఆయనలో యోగము, భక్తి, జ్ఞానము,తంత్రము ఇంతేగాక అన్ని రకాలైన మతాలూ మార్గాలూ సాధనలూ మొత్తం రాశిగా ఏర్పడి ఉన్నాయి.

మిగతా మహనీయులది ఒక భావం మాత్రమే.కానీ ఈయనో?భావసముద్రుడు. మిగతా మహాపురుషులందరూ నీటి బిందువులు. ఈయన మహాసాగరుడు. ఈ విషయం స్పష్టంగా తెలుసు గనుకనే వివేకానందస్వామి, శ్రీ రామకృష్ణులను - "భాస్వర భావసాగర" అని సంబోధించాడు.

కనుక - ఆయన్ను ఉత్త అవతారం అని భావించడం తప్పు. అది కరెక్ట్ భావన కాదు. అవతారాలన్నీ ఏ పరబ్రహ్మం నుంచి ఉద్భవిస్తాయో అదే శ్రీరామకృష్ణుడు. ఇది సత్యం. అందుకని నేను అదే భావాన్ని వారితో చెప్పాను.' అన్నాడు స్వామీజీ.

నేను చాలాసేపు ఏమీ మాట్లాడలేక పోయాను. ఎందుకంటే స్వామీజీ చెబుతున్నది సత్యం అని నాకు తెలుసు.మహనీయులైన నా గురువుల నోళ్ళ వెంట ఇవే మాటలను నేను 30 ఏళ్ళ క్రితం విన్నాను.

స్వామీజీ కొనసాగించాడు.

'ఇంకో విషయం వినండి. బేలూర్ మఠంలో న్యూ యియర్ రోజున ఠాకూర్ కు ప్రత్యేక పూజ జరుగుతుంది.ఆనాడు ఆయనకు దాదాపు ఏభై రకాల నైవేద్యాలు సమర్పిస్తారు.వాటిల్లో చేపకూర కూడా ఉంటుంది. బెంగాల్ లో అది సర్వసాధారణం.

ఆ పూజ చేసే స్వామీజీ ఒక న్యూ యియర్ రోజున నాతో ఇలా అన్నారు.

'త్యాగరాజ్. పూజ అయిపోయింది. ప్రసాదం తీసుకోండి. ముఖ్యంగా ఆ చేపకూర ప్రసాదం కొంచం టేస్ట్ చెయ్యండి. బాగుంటుంది.' 

' క్షమించండి మహరాజ్ ! నేను చేపలు తినను.' అని నేను సమాధానం చెప్పాను.

దానికాయన "ఠాకూర్ దగ్గర అవన్నీ వదిలెయ్యాలి. దీనిని ప్రసాదంగా మాత్రమే తీసుకోండి.కొంచమే తీసుకోండి. ఎక్కువ తినమని నేను చెప్పడం లేదు. ఒక చిన్న ముక్క తినండి.అసహ్యం అనే భావాన్ని మీ మనసులో నుంచి తీసెయ్యాలి." అన్నాడు.

నాకు కోపం వచ్చింది.

'అసలు మీరు పెడుతున్న నైవేద్యం ఆయన తీసుకుంటున్నాడని మీరు అనుకుంటున్నారా?' అని సూటిగా అడిగాను.

'అదేంటి త్యాగరాజ్ ! నేను ఈ ఆలయంలో గత పదేళ్లుగా ఈ పని చేస్తున్నాను. అలా అంటావేంటి. ఠాకూర్ నా పూజను స్వీకరించడం లేదని నీకెలా తెలుసు?" అని ఆయన అన్నాడు.

నేనిలా చెప్పాను.

'మీరు మాట్లాడే తీరును బట్టే నాకలా అనిపిస్తున్నది. చేపలు తినమని నన్ను మీరు బలవంతం చెయ్యడం ఎందుకు? వేరే చాలా ఉన్నాయి కాదా ఆ నైవేద్యంలో? ఏదో ఒక స్వీట్ తీసుకుంటాను. నా చాయిస్ ను మీరు గౌరవించాలి. మిమ్మల్ని చేపలు మానుకొమ్మని నేను చెప్పడం లేదు. కానీ నన్ను మీరు ఫోర్స్ చెయ్యకూడదు.ఎందుకంటే ఇది నా ఇష్టం. ఠాకూర్ ఎప్పుడూ ఎదుటి మనిషిని గౌరవించమనే చెప్పేవారు.ఇతరుల విశ్వాసాలను దెబ్బ తీయవద్దనే ఆయన ఎప్పుడూ అనేవారు.అన్ని మతాలూ అన్ని సంప్రదాయాలూ సత్యాలే అనేది ఆయన బోధలలో ఒకటి. మీరు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. పరమ విశాల భావాలకు నిలయం అయిన ఠాకూర్ ను మీలాంటి సంకుచిత భావాలతో మీరెన్నటికీ అర్ధం చేసుకోలేరు. అందుకే అలా అన్నాను.' అని ఆయనతో చెప్పాను.

ఇందులో స్వామీజీ ఏం చెప్పాలని అనుకున్నారో నాకర్ధం కాలేదు. ఆ అర్చక స్వామి చెప్పిన మాటల్లో కూడా కొంత సత్యం ఉందనీ, దానికీయన అంతగా రియాక్ట్ కావలసిన అవసరం లేదనీ నాకనిపించింది.కానీ ఆ విషయాన్ని నేను బయటకు అనలేదు.

అప్పటిదాకా కారును రోడ్డు పక్కనే పార్కు చేసి మౌనంగా ఇదంతా వింటున్నాను. యధాలాపంగా టైం వైపు చూచాను. బస్సు టైం దగ్గర పడిందని అర్ధమైంది. వెంటనే కార్ స్టార్ట్ చేసి బస్టాండ్ వైపు పోనిచ్చాను.

బస్టాండ్ లో కొద్ది సేపు వెయిట్ చేసిన తదుపరి, చెన్నై వెళ్ళే బస్సు వచ్చింది. స్వామీజీ బస్సెక్కి నాకు టాటా చెప్పి తన సీట్లో కూచున్నాడు. బస్సు బయల్దేరింది.

నేనూ ఆయనకు టాటా చెబుతూ మౌనంగా అక్కడ నిలబడ్డాను. బస్సు వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపు నేనక్కడే నిలబడి ఉన్నాను. చివరకు తేరుకుని బయటకొచ్చి ఇంటి దారి పట్టాను.

కారు ప్రయాణిస్తోంది. యాంత్రికంగా డ్రైవ్ చేస్తూనే ఉన్నాను.కానీ మనస్సులో ఒకటే మాట పదేపదే మెదులుతోంది.

'భాస్వర భావసాగర'

ఎంత గొప్ప పదం !! తన దైవం అయిన శ్రీ రామకృష్ణులను వర్ణించడానికి వివేకానందస్వామి ఉపయోగించిన మాట ఇది !! రామకృష్ణుల జీవితాన్ని వ్రాయడానికి తాను అశక్తుడనని ఆయన భావించి ఉండవచ్చుగాక. ఆ ప్రయత్నం చెయ్యడానికే ఆయన భయపడి ఉండవచ్చు గాక !! కానీ ఈ ఒక్క పదంతో ఆ పనిని ఆయన చేశాడు.కనీసం చాలావరకూ కృతకృత్యుడయ్యాడు.లెక్కలేనన్ని ఉజ్జ్వల దివ్యభావముల మహాసాగరమే శ్రీరామకృష్ణుని స్వరూపం అన్న విషయం ఆయన ఎంతో స్పష్టంగా ఈ పదంలో చెప్పాడు. ఎంత గొప్ప విషయం !!

ఇంటికి చేరి నిద్రకు ఉపక్రమించాను. నిద్ర పోతున్నా కూడా ఆ ఒక్క పదమే నా మనస్సులో సుడి తిరుగుతూ ఉన్నది. కలల్లో కూడా ఎన్నెన్నో కాంతి వలయాలు! రంగురంగుల తేజోగోళాలు! ఒకదానిలో మరొకటి లీనమౌతూ, విడిపోతూ, విశ్వాంతరాళాలను ఆక్రమిస్తూ, అనంత దిగంతాలలోకి మాయమై పోతూ, తెల్లవార్లూ కనిపిస్తూనే ఉన్నాయి.

తెల్లగా తెల్లవారింది. మెలకువ వచ్చింది. మెలకువ వస్తూనే నా మదిలో, శ్రీ రామకృష్ణ స్తోత్రం నుంచి ఈ పాదం మెదిలింది  - 

'భాస్వర భావసాగర చిర ఉన్మద ప్రేమ పాధార్ 
భక్తార్జన యుగళచరణ తారణ భవ పార్ ".

"నీవు అనంతములైన దివ్య భావముల మహా సముద్రమువు. ప్రేమోన్మత్తుడవు. నీ భక్తులు నీ చరణములను ధ్యానించి, ఈ ప్రపంచమనే సాగరమును అతి తేలికగా దాటగలుగుతున్నారు".

నిద్ర లేచినా, కళ్ళు తెరవకుండా అలాగే పడుకొని ఉన్న నా మనోనేత్రం ముందు దివ్య దరహాసంతో వెలుగుతున్న శ్రీరామకృష్ణుని మనోహర తేజోమయ రూపం ప్రకాశిస్తూ కనిపిస్తూనే ఉంది.

ఫోన్ మ్రోగుతుంటే కళ్ళు తెరిచి ఫోనెత్తాను.

'నేను యదునాధానందను మాట్లాడుతున్నాను. ఇప్పుడే చెన్నైలో క్షేమంగా దిగాను. మీతో గడిపిన రోజంతా ఎంతో ఆనందంగా గడిచింది. రాత్రంతా నిద్రలేదు.సీట్లో కూచుని శ్రీరామకృష్ణులను ధ్యానిస్తూనే ఉన్నాను. చాలా బాగుంది. ఎప్పుడో బేలూర్ మఠంలో జరిగిన సంఘటన మీ మాటలతో బయటకు వచ్చింది. చాలా ఏళ్ళ తర్వాత మిమ్మల్ని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. త్వరలో మళ్ళీ కలుద్దాం.' అన్నాడాయన.

'అలాగే స్వామీజీ.త్వరలో చెన్నై వచ్చే పని ఉన్నది. వచ్చినపుడు మిమ్మల్ని కలుస్తాను. ఉంటాను.' అని ఫోన్ పెట్టేశాను.  

ఉన్నతములైన భావములను నిరంతరం మనస్సులో చింతించేవారిని కలవడం నాకూ ఆనందమేగా మరి !!

(అయిపోయింది)
read more " స్వామి యదునాధానందతో సంభాషణ -8 (శ్రీ రామకృష్ణులు దైవం యొక్క అవతారమా? నేనొప్పుకోను ) "

25, నవంబర్ 2016, శుక్రవారం

Ye Mousam Rangin Sama - Mukesh, Suman Kalyanpur


Ye Mousam Rangeen Samaa...

అంటూ ముకేశ్, సుమన్ కళ్యాణ్ పూర్ పాడిన ఈ పాట 1961 లో వఛ్చిన Modern Girl అనే సినిమాలోది. మధుర సంగీత దర్శకుడు రవి శంకర్ శర్మ(రవి) ఈ గీతానికి చాలా మధురమైన రాగాన్ని సమకూర్చాడు. ఈ పాటలో ప్రదీప్ కుమార్, సాయిదా ఖాన్ నటించారు.

నా చిన్నప్పుడు "రేడియో" యుగంలో 'వివిధ భారతి' లో ప్రతిరాత్రి పది గంటలకు 'ఛాయాగీత్' అని ఒక ప్రోగ్రామ్ వస్తూ ఉండేది. దాంట్లో అన్నీ పాత పాటలే వినిపించేవారు. ఈ పాట తరచూ ఆ ప్రోగ్రామ్ లో వినిపించేది.

పల్లెటూరి రాత్రిలో, ఆరుబయట నులక మంచం వేసుకుని, నక్షత్రాలను చూస్తూ, చెరువు మీద నుంచి వచ్ఛే చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఈ పాటలను నేను వినేవాడిని.ఆ విధంగా ఈ పాత పాటలన్నీ నాకు నచ్చిన గీతాలయ్యాయి.ఇప్పుడు కరావోకేలో అవే ఆపాత మధురాలను పాడుతున్నాను.

సుమన్ కళ్యాణ్ పూర్ గొంతులో కోకిల పలుకుతుంది..ఆమె గాత్రం అంత మధురంగా ఉంటుంది.ఇక ముకేశ్ సంగతి చెప్పనక్కర్లేదు. అతని గొంతులో అదొక విధమైన జీరతో కూడిన మాధుర్యం ఉంటుంది. 

ఈ పాటలో ఏదో మాయాజాలం ఉంది. అది ముకేశ్ గొంతులో ఉందా లేక సుమన్ కళ్యాణ్ పూర్ గొంతులో ఉందా?లేక రవి స్వరపరచిన రాగంలో ఉందా? అంటే ఖఛ్చితంగా చెప్పలేము.బహుశా ఈ మొత్తం సమ్మేళనం లో ఉందని నా ఊహ.ఏదేమైనా, రాత్రిపూట నేను చెబుతున్న వాతావరణంలో వింటే మాత్రం, ఈ పాట మిమ్మల్ని మరో లోకానికి ఖఛ్చితంగా తీసుకుపోతుంది.

ఈ పాటలోనూ, 1950,60 లలో కొన్ని సినిమాలలోనూ నటించిన సాయిదా ఖాన్, బ్రిజ్ సదానా అనే ఒక హిందీ నిర్మాతను పెళ్లి చేసుకుంది. కానీ కొన్నేళ్ల తర్వాత 1990 లో అతని చేతిలోనే సాయిదా, ఆమె కూతురూ ఇద్దరూ హత్యకు గురయ్యారు.వాళ్ళను షూట్ చేసి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.అలా ఆమె జీవితం ముగిసింది.దీనికంతటికీ కారణం వాళ్ళమధ్యన జరిగిన చిన్న వాదన. అంతే.

ఇతని కొడుకు కమల్ సదానా మాత్రం ఈ  షూట్ అవుట్ నుంచి బ్రతికి బయట పడ్డాడు. 20 ఏళ్ల తర్వాత ఇదే సంఘటన ఆధారంగా ఇతను "A Moment of Pause" అనే సినిమాను నిర్మించాడు.వీలైతే ఆ సినిమాను చూడండి.

సినిమావాళ్ళ జీవితాలు చాలావరకూ అలాగే ముగుస్తూ ఉంటాయి. ఆ గొడవంతా మనకెందుకులే గాని, ప్రస్తుతానికి నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Modern Girl (1961)
Lyrics:--Gulshan Bawra
Music:--Ravi Shankar Sharma (Ravi)
Singers:--Mukesh, Suman Kalyanpur
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
------------------------------
Ye mausam rangin sama Thair zara o jaan e jaa
Tera mera, mera tera, pyaar hai-To phir kaisa sharmana
Ruk to mai jau jaan e jaa - Mujhko hai inkar kaha
Tera mera, mera tera Pyar sanam, na ban jaae afsana
Ye mausam rangin sama Thair zara o jaan e jaa
Tera mera, mera tera, pyar hai-To phir kaisa sharmana
Ruk to mai jau jaan e jaa - Mujhko hai inkar kaha
Tera mera, mera tera Pyar sanam, na ban jaae afsana

Ye chand ye sitare
Kahte hai milke sare, aaja pyar kare
Ye chanda bairi dekhe
Aise me bolo kaise Iqraar kare
Dilmehai kuchhKuchh kahe zuban
Pyar yahi hai jaan e jaan
Tera mera, mera tera Pyaar hai
To phir kaisa sharmana
Ruk to mai jau jaan e jaa - Mujhko hai inkar kaha
Tera mera, mera tera Pyar sanam, na ban jaae afsana

Ye pyar ki lambi rahe Kahti hai ye nigahe,
kahi dur chale
Baithe hain ghera dale Ye zalim duniya vale
Hame dekh jale
Jaltaa hai to jale jahan
Thair zara o jaan e jaan
Tera mera, mera tera Pyaar hai, to phir kaisa sharmana
Ruk to mai jau jaan-e-jaan Mujhko hai inkar kaha
Tera mera, mera tera Pyar sanam, na ban jaae afsana

Meaning
The weather is very pleasant
Listen O my love
We do love each other
So why should you feel shy?

I am listening dear
When did I refuse you?
My idea is...
Our love should not become a forgotten legend

This moon, these stars
all are saying together
Come ! let us love !
The Moon is watching us
How can I promise you anything now?
There is something alive in the heart
and the tongue is saying "This is what is called Love"
We do love each other
So why should you feel shy?

The path of Love is very long
Our eyes are saying - 'Walk it and go to a distant unknown place'
But, people of the world are burning with jealousy
and creating hurdles in our path
If the world wants to burn in jealousy
Let it burn
But you stop and listen ! Darling
We do love each other
So why should you feel shy?

తెలుగు స్వేఛ్చానువాదం
ఈ వాతావరణం ఎంతో బాగుంది
ప్రేయసీ విను
నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు
ఇంకా నా దగ్గర నీకు సిగ్గెందుకు?
వింటున్నాను ప్రియా
నేనెప్పుడు నిన్ను కాదన్నాను?
మన ప్రేమ ఒక వృధా గాథ కాకూడదనే నా ఆలోచనంతా

ఈ జాబిలీ ఈ తారలూ అన్నీ కలసి
రండి ప్రేమలో తేలిపోదాం- అని ఒకే మాటను అంటున్నాయి
చంద్రుడు మనల్ని చూస్తున్నాడు
ప్రస్తుతం నీకు ఏ వాగ్దానమూ చెయ్యలేను
నా హృదయంలో ఏదో కదులుతోంది
పలుకేమో 'ఇదే ప్రేమంటే' అని అంటోంది
నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు
ఇంకా నా దగ్గర నీకు సిగ్గెందుకు?

ప్రేమదారి చాలా పొడుగైనది
దానిలో నడచి సుదూర లోకాలకు వెళ్ళండి
అంటూ మన కన్నులు అంటున్నాయి
కానీ లోకులు అసూయతో రగిలిపోతూ
మనకు అడ్డంకులు సృష్టిస్తున్నారు
అది వాళ్ళ ఖర్మ
వాళ్ళనలాగే చావనీ
నువ్వు మాత్రం నేను చెప్పేది విను
నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు
ఇంకా నా దగ్గర నీకు సిగ్గెందుకు?

వింటున్నాను ప్రియా
నేనెప్పుడు నిన్ను కాదన్నాను?
మన ప్రేమ ఒక వృధా గాథ కాకూడదనే నా ఆలోచనంతా...
read more " Ye Mousam Rangin Sama - Mukesh, Suman Kalyanpur "

24, నవంబర్ 2016, గురువారం

స్వామి యదునాధానంద గారితో సంభాషణ - 7 (శ్రేష్ఠభక్తి)

స్వామీజీ చెప్పసాగారు.

"ఒక్క జపమే చాలు.దానితోనే సర్వమూ సాధించవచ్చు" అని శ్రీమాత అనేవారు. అమ్మ చెప్పిన తదుపరి ఏ విషయంలో నైనా సరే ఇక మారుమాట ఏముంటుంది? కానీ ఈ మాటను సరిగా అర్ధం చేసుకోవాలి. ఏ సాధనా చెయ్యకుండా జపం ఒక్కటే చేసేవారికి జపమే చాలు.అనుక్షణమూ లోపల్లోపల 'అజపాజపం' చేసేవారికి అదొక్కటే చాలు.దానినుంచే అన్నీ వస్తాయి. కానీ రోజంతా కర్మలలో మునిగి ఉండేవారికి ఒక అరగంటో గంటో చేసే ఉత్తుత్తి జపం ఏ మాత్రమూ సరిపోదు.వారు మిగతా విషయాలలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది.


ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా - చివరకు మనం శ్రేష్ఠభక్తులుగా మారాలి.అదొక్కటే అతి ముఖ్యమైన విషయం.

శ్రేష్ఠభక్తికి మొదటి ఉదాహరణ ప్రహ్లాదుడు.అతను పూర్తిగా పాజిటివ్. తండ్రి హిరణ్యకశ్యపుడు పూర్తిగా నెగటివ్.పాజిటివ్ నెగటివ్ కలిస్తే ఎలక్ట్రిక్ స్పార్క్ వస్తుంది. ఆ విద్యుత్ శక్తి స్వరూపమే నరసింహస్వామి.

"ఎక్కడున్నాడో నీ దేవుడు చూపించు" అని తండ్రి కోపంగా అరిచాడు.అన్ని చోట్లా ఉన్నాడని అన్నాడు ప్రహ్లాదుడు."అయితే ఈ స్తంభంలో ఉన్నాడేమో చూపించు" అంటూ స్తంభాన్ని గదతో మోదాడు హిరణ్యకశ్యపుడు.ఆ పగిలిన స్తంభంలో నుంచి వెయ్యి సూర్యుల కాంతితో నరసింహస్వామి ఆవిర్భవించాడు. దేవుని అవతారాలు ఎన్నో ఉన్నాయి.కానీ అన్నింటిలోకీ మహా శక్తివంతమైన అవతారం నరసింహావతారమే.ఈ అవతారంలో భగవంతుడు ఉన్నది కూడా అత్యంత స్వల్పకాలమే. మహా అయితే ఒక గంటసేపు ఉన్నదేమో ఈ అవతారం.

మహోగ్రస్వరూపంతో ఉన్న నృసింహుడిని చూచి దేవతలే భయంతో వణికిపోయారు. ఆయన్ను శాంతింప చెయ్యడానికి మళ్ళీ చిట్టి ప్రహ్లాదుడినే ముందుకు పంపారు.తన బుజ్జి భక్తుడిని చూచి ఆయన శాంతించాడు. ప్రహ్లాదుడిని తన తొడపైన కూర్చోబెట్టుకుని ముద్దు చేశాడు.

అప్పుడు దేవతలతో ఇలా అన్నాడు.

'హిరణ్య కశ్యపుడిని చంపడం కోసం నేనీ అవతారం ఎత్తవలసిన అవసరం లేనే లేదు.నేనున్నచోటనుంచే 'ఉఫ్' అని ఊదితే వాడు గాలిలో కలిసి పోతాడు.నా సృష్టిలో వాడొక జీవి అంతే.ఈ అవతారం ఎత్తకుండానే నేను అతడిని సంహరించగలను.కానీ నా శ్రేష్ఠభక్తుడైన ప్రహ్లాదుడి మాట నిలబెట్టడం కోసం, ఈ స్తంభంలోనుంచి ఈ విధంగా ఆవిర్భవించాను.నా ప్రియభక్తుల మాటను నేను గౌరవిస్తాను.వారు ఏదో యధాలాపంగా అన్నా సరే, దానిని నేను నెరవేర్చక తప్పదు."

శ్రేష్ఠ భక్తి అంటే అది !!

ఇటువంటి శ్రేష్ఠభక్తికి రెండో ఉదాహరణ అభిరామి భట్టార్.ఈయన అసలు పేరు సుబ్రమణ్య అయ్యర్. ఈయన 18 వ శతాబ్దంలో తమిళనాడులో ఉండేవాడు. పార్వతీ అమ్మవారికి ఈయన మహాభక్తుడు.ఆ ఊరిలో ఉన్న పార్వతీ దేవికి పేరు 'అభిరామి'.

ఆ సమయంలో మరాఠా రాజు సెర్ఫోజీ తమిళనాడును పాలించేవాడు. ఒకరోజు మహారాజు శివాలయానికి వచ్చాడు.అక్కడ పూజలేమీ చెయ్యకుండా ఊరకే కూచుని ఒళ్ళు మరచిన ధ్యానంలో ఉన్న సుబ్రమణ్య అయ్యర్ ను ఆయన చూచి - "ఈయన ఎవరు? ఈయన ప్రవర్తన వింతగా ఉన్నదే? మీలా ఈయన మామూలు పూజలు చెయ్యడం లేదు? ఊరకే కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు? ఏంటిది?" - అని అక్కడి పూజారులను ప్రశ్నించాడు.

వారిలో కొంతమంది - ' ఈయన అమ్మవారికి శ్రేష్ఠ భక్తుడు.' అని జవాబు ఇచ్చారు. కానీ అయ్యర్ అంటే గిట్టని మరికొందరు అర్చకులు మాత్రం - ' అతనొక పిచ్చివాడు.దురహంకారి. అతన్ని పట్టించుకోకండి' అని రాజుగారికి చాడీలు చెప్పారు.

అతన్ని పరీక్షించాలని అనుకున్న సెర్ఫోజీ మహారాజు, ధ్యానంలో ఉన్న అయ్యర్ దగ్గరికి వెళ్లి -'ఈరోజు తిధి ఏమిటి?' అని ప్రశ్నించాడు. అయ్యర్ అప్పటిదాకా తన ధ్యానంలో అమ్మవారి దివ్యతేజోవంతమైన రూపాన్ని చూస్తున్నాడు.అది పున్నమి చంద్రునిలా వెలుగుతున్నది. రాజు ప్రశ్నతో ధ్యానం చెదరి కళ్ళు తెరిచిన అయ్యర్ తను చూస్తున్న జగజ్జనని తేజస్సును మర్చిపోలేక - "ఈ రోజు పౌర్ణమి" అని జవాబు చెప్పాడు.

కానీ ఆరోజు అమావాస్య !!

మహారాజు కోపంతో ఊగిపోయి, "మహారాజునైన నాతోనే నీకు వెటకారంగా ఉన్నదా?నీకు చాలా పొగరులా ఉన్నదే? సరే చూస్తాను. ఈరోజు రాత్రికి పున్నమి చంద్రుడు కన్పించకపోతే నీకు చావు తధ్యం." అని అదే ఊరిలో ఆ రాత్రికి బస చేశాడు.

ఆరోజు అమావాస్య గనుక చంద్రుడు కనిపించడు గనుక అయ్యర్ కు చావు తప్పదని అందరూ అనుకున్నారు.  ఆ రాత్రికి సుబ్రమణ్య అయ్యర్ ఆశువుగా శ్లోకాలలో అమ్మను ప్రార్ధించసాగాడు.నూరు శ్లోకాలు పూర్తయ్యేలోపు ఏదో ఒక అద్భుతం జరగకపోతే అగ్నిలో దూకి తానే చనిపోదామని, రాజు చేతిలో శిరచ్చేదం చేయించుకోవడం కంటే అదే మంచిదని ఆయన అనుకున్నాడు. ఎదురుగా మహారాజు కూర్చుని ఇదంతా చూస్తున్నాడు.

78 శ్లోకాలు పూర్తయ్యేసరికి అయ్యర్ కు మాత్రమే దర్శనమిస్తూ ప్రత్యక్షమైన పరమేశ్వరి తన చెవికమ్మను తీసి ఆకాశంలోకి విసిరిందని, అది పున్నమి చంద్రునిలా కాంతులు విరజిమ్మి, దశదిశలా తెల్లని వెలుగును నింపిందని చరిత్ర చెబుతున్నది. ఆ విధంగా అమావాస్య రోజున పౌర్ణమి అయింది. దీనిని కళ్ళారా చూచిన సెర్ఫోజి మహారాజు అదిరిపోయి, అయ్యర్ ను క్షమించమని ప్రార్ధించి అతనికి 'అభిరామి భట్టార్' అని బిరుదు ప్రదానం చేశాడని రికార్డ్ చెయ్యబడి ఉన్నది.ఇది మొన్న మొన్న జరిగిన సంఘటనే. ఎప్పటిదో కాదు. ఆ తర్వాత మిగిలిన 22 శ్లోకాలనూ ఆయన పూర్తి చేశాడు.

"తాటంక యుగళీ భూత తపనోడుప మండలా" - కదా అమ్మ !!

తన శ్రేష్ఠభక్తుడైన అభిరామి భట్టార్ మాటను నిజం చెయ్యడానికి అమావాస్య రాత్రిపూట పున్నమి వెన్నెలను కాయించింది జగజ్జనని.

శ్రేష్ఠ భక్తి అంటే అది !!

ఇలాంటి శ్రేష్ఠభక్తికి ఇంకో నిదర్శనం రామానుజాచార్యుల వారి జీవితంలో మనం చూడవచ్చు.ఆయన మహాభక్తుడే గాక పూర్ణాయుష్కుడై 120 ఏళ్ళు బ్రతికిన మహనీయుడు.

ఒకరోజున ఆయన దగ్గర పనిచేసే చాకలి వచ్చి ఇలా అన్నాడు.

' అయ్యా ! నేను ఎప్పటినుంచో మీకు బట్టలు ఉతుకుతూ ఉన్నాను. మీరు కూడా నాకు తగినంత ధాన్యం వగైరాలు ఇస్తూ ఉన్నారు.కానీ మీరిస్తున్న సంభారాలు ఈ మధ్య నాకు సరిపోవడం లేదు.ఎందుకంటే, నా కుటుంబం పెద్దదై పోయింది.అందుకని ఆ వెచ్చాలను ఇంకొంచం ఎక్కువగా ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను.'

రామానుజులు యధాలాపంగా - 'సరే ! రేపటినుంచీ నీకు కావలసినంతగా అవి ఇవ్వబడతాయి' అని అన్నారు.కానీ ఆ సంగతి ఆయన మరచిపోయారు.ఆ చాకలి కోరినట్లు రేపటినుంచీ ఎక్కువ సంభారాలు ఇవ్వమని తన కోశాదికారికి చెప్పడం విస్మరించారు. ఆ తర్వాత కొన్నేళ్ళు గడిచాయి.

కొన్నాళ్ళకు ఆ చాకలి మరణించాడు. పరామర్శ కోసం అతని ఇంటికి వెళ్ళారు రామానుజులు. అప్పుడు హటాత్తుగా తానిచ్చిన మాట ఆయనకు గుర్తుకొచ్చింది. ఆయన పశ్చాత్తాపంతో క్రుంగి పోయాడు. ఇచ్చిన మాటను నెరవేర్చలేక పోయానే అని ఎంతో బాధ పడ్డాడు.

కానీ ఆ చాకలి భార్య ఆయనతో ఇలా చెప్పింది.

'స్వామీ ! మాకు మీరిస్తున్న సంభారాలు చాలడం లేదనీ, ఇంకా ఎక్కువగా కావాలనీ నా భర్త కొన్నేళ్ళ క్రితం మిమ్మల్ని అర్ధించాడు. ఆ మరుసటి రోజు నుంచీ మాకు ఏ లోటూ లేకుండా మీ సంస్థానం నుంచి మాకు కావలసినంత సరుకులు ఇన్నేళ్ళుగా లభిస్తూ ఉన్నాయి.దానివల్ల మేము ఏ లోటూ లేకుండా హాయిగా బ్రతుకుతున్నాము. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు.' అంటూ ఆయన పాదాలకు నమస్కరించింది.

రామానుజులు నిర్ధాంతపోయారు !!

'తను చెప్పిన మాటను తానే మరచి పోయాడు. తన ఉద్యోగులకు తాను ఏమీ ఆదేశాలు ఇవ్వలేదు. కానీ తన మాట నెరవేరింది. ఇదెలా సాధ్యం?" అని ఆలోచనలో మునిగిన ఆయన మనోనేత్రం ముందు మనోహరమైన చిరునవ్వుతో వెలుగుతున్న నారాయణుని దివ్యరూపం గోచరమైంది.

భక్తుడు మరచిపోయినా భగవంతుడు మరచిపోడు. యధాలాపంగా తన భక్తుడు ఇచ్చిన మాటను ఆయనే నిజం చేస్తాడు. అన్నేళ్ళుగా ఆ చాకలి కుటుంబానికి ఏ లోటూ లేకుండా అన్నీ సరఫరా చేసింది దైవమే !!

ఇది నమ్మలేని వింతగా మనకు అనిపించవచ్చు. అలా అనిపించడానికి కారణం మనలో పాతుకుపోయిన విశ్వాస రాహిత్యం తప్ప ఇంకేమీ కాదు. భక్తిప్రపంచంలో అన్నీ సాధ్యాలే.భక్తి అంటే ఏమిటో తెలియని వారికి ఇవి కాకమ్మ కబుర్లలా అనిపించవచ్చు. కానీ వారికి తెలియని ప్రపంచం ఎంతో ఉంది.

శ్రేష్ఠ భక్తికి ఇది ఇంకొక ఉదాహరణ !!

నేనొకసారి కడప రామకృష్ణాశ్రమానికి వెళ్లాను. అక్కడ ఒక ముసలాయన నాతో మాట్లాడటానికి వచ్చారు.

తాను ఎన్నో గ్రంధాలు చదివానని, మహా పండితుడనని, అనర్గళంగా ఏ విషయం మీదనైనా మాట్లాడగలనని, ఎంతో మందికి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చానని ఆయన ఎంతో గర్వంగా నాకు చెప్పారు.వేదాలు ఉపనిషత్తులు, పురాణాలు, సమస్త గ్రంధాలు తనకు కొట్టిన పిండి అని అన్నారు.

'గాస్పెల్ చదివారా?' - అని నేనడిగాను.

'అదేంటి స్వామీ అలాగంటారు? శ్రీ రామకృష్ణుల భక్తుడినై ఉండి గాస్పెల్ చదవకుండా ఉంటామా? ఎన్నోసార్లు తిరగా మరగా చదివాను' అన్నాడు.

'ఊరకే చదవడం కాదు. దానిలోనివి మీరు ఏం పాటిస్తున్నారు?తన పాండిత్యం గురించి ఇలా గొప్పలు చెప్పుకోమని ఠాకూర్ చెప్పారా ఎక్కడైనా? అసలు పాండిత్యానికి ఆయనేమైనా విలువ ఇచ్చేవారా? మరి మీరెందుకు దాని గురించి అంత గొప్పగా చెప్పుకుంటున్నారు?' అని ఆయన్ను అడిగాను.

ఆయనేమీ జవాబు ఇవ్వలేదు.

భక్తులమని, ఆధ్యాత్మికులమని భావించుకునేవారు అందరూ ఇలాగే ఉంటారు. వారికి పాండిత్యం ఉండవచ్చు, విషయం తెలియవచ్చు, కానీ ఆచరణ లేకుంటే వారి "జ్ఞాన"మంతా  ఎందుకూ పనికిరాదు.ఇలా ఉన్నవాళ్ళు అసలు భక్తులే కారు.ఇక శ్రేష్ఠభక్తులు ఎలా కాగలరు?" అన్నాడు స్వామీజీ.

నా భావాలు కూడా ఇలాగే ఉంటాయి గనుక ఆయన చెబుతున్న మాటలు నాతో నేనే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంటే, మౌనంగా వింటూ ఉన్నాను.

(ఇంకా ఉంది)
read more " స్వామి యదునాధానంద గారితో సంభాషణ - 7 (శ్రేష్ఠభక్తి) "

17, నవంబర్ 2016, గురువారం

స్వామి యదునాధానంద గారితో సంభాషణ - 6 (నేనే వాళ్ళ స్థానాల్లో ఉంటే?)

స్వామీజీ చెప్పినది నాకేమీ నచ్చలేదు.

ఇంతకుముందు చెన్నైలో చెప్పినప్పుడూ నచ్చలేదు, ఇప్పుడూ నచ్చలేదు. ఆయనంటే నాకు జాలి కలిగింది. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పి ఆయన భావాలని మార్చాలని నేననుకోలేదు. ఊరకే ఆయన చెబుతున్నది విని ఊరుకున్నాను.

తన సలహాతో చంద్రపాల్ జీవితాన్ని స్వామీజీ పూర్తిగా నాశనం చేశాడని నా ఊహ.

వినడానికి వింతగా ఉంది కదూ?? అలాగే ఉంటాయి నా భావాలు. చిన్నప్పటినుంచీ నన్ను చూస్తున్నవారికే నేను అర్ధమై చావలేదు. ఏదో నా వ్రాతలు పైపైన చదువుతున్న మీకెలా అర్ధం అవుతాను?

చాలా కష్టం.

కానీ, పంచవటి గ్రూపులోని నా శిష్యులలో కొందరు నా భావాలను బాగా వంటపట్టించుకున్నారు. ఇది నిజమేనా? పోనీ ఇలా అనకూడదేమో? వారివీ నావీ ఒకే భావాలు కనుకనే అందరం ఒక గూటికి చేరామని అనుకుంటే సరిగ్గా ఉంటుంది. పోనీ అలాగే అనుకుందాం.

వారిలో ఒకరు అమెరికానుంచి మొన్న నాకు ఫోన్ చేశారు.

'గురూజీ.మీరు వ్రాసినవి మీ భావాలేనా? స్వామీజీ చంద్రపాల్ కు ఇచ్చిన సలహాను మీరు ఆమోదిస్తున్నారా?' అని అడిగారు.

నాకు భలే నవ్వొచ్చింది.

నా భావాలను కనీసం కొద్దిమందైనా సరిగ్గా అర్ధం చేసుకున్నారన్న సంతోషంలో వచ్చిన నవ్వు అది. ఇన్నాళ్ళూ పంచవటి గ్రూప్ లో ఉన్నందుకు 'అసలైన విషయం' కొందరికైనా సరిగ్గా అర్ధం అయినందుకు వచ్చిన నవ్వు అది.

'లేదు.స్వామీజీ భావాలను నేను ఆమోదించడం లేదు.' అన్నాను.

'కానీ మీ బ్లాగ్ చదివే వారు అలా అనుకోవడం లేదేమో? అందుకని మీరు కొంచం వివరిస్తే బాగుంటుంది' అని ఆయన అన్నాడు.

ఇది నిజమే అని నాకూ అనిపించింది.

కొంచం వివరిస్తే గాని నేనేమి చెప్పదలుచుకున్నానో మీకు పూర్తిగా అర్ధం కాదు.

ప్రతి మనిషి జీవితంలోనూ ఎదురు దెబ్బలు తగులుతాయి. తట్టుకోలేనంత బాధ కలిగించే సంఘటనలు ఎదురౌతాయి.అవి చాలా బాధాకరమైన క్షణాలని ఆ మనిషి అనుకుంటాడు.'అంత చెడు సమయం నా జీవితంలో ఇంకెప్పుడూ రాలేదు' అని తర్వాత్తర్వాత తీరికగా కూచుని వెనక్కు తిరిగి చూచేటప్పుడు అనుకుంటాడు. కానీ అతను అర్ధం చేసుకోలేని విషయమే అది. అదేమంటే - ఆ క్షణాలే అతని జీవితంలో బంగారు క్షణాలు. ప్రతి మనిషి జీవితంలోనూ అత్యంత విలువైన క్షణాలేవంటే - అతన్ని అమిత బాధకు గురిచేసిన క్షణాలే.

సుఖంగా గడిపిన రోజులు పెద్ద గొప్పవేమీ కాదు. ఆ సమయంలో మనం మొద్దునిద్ర పోతూ ఉంటాం. కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రమె మన కళ్ళు తెరుచుకుంటాయి. ఆ కాసేపే మనం సత్యాన్ని చూడగలుగుతాం. ఆ క్షణాలు చాలా విలువైనవి.వాటిని మనం మిస్ చేసుకుంటే ఇక జీవితంలో మళ్ళీ మనకా చాన్స్ రాదు.

కష్టం వచ్చినప్పుడే మనిషి కళ్ళెదురుగా సత్యమైన దారికి తలుపులు తెరుచుకుంటాయి. అప్పుడు కూడా ఆ దారిని చూడలేకపోతే, దానిలో నడవలేకపోతే, ఇక ఆ జీవితం వృధానే.

చంద్రపాల్ జీవితంలో అలాంటి సమయం అప్పుడొచ్చింది. తన బంధువులూ స్నేహితులూ నిజంగా తనవాళ్ళేనని అప్పటిదాకా తను అనుకుంటున్నాడు. కానీ వారంతా నిజానికి తనవాళ్ళు కారనీ, నిజానికి ఈ ప్రపంచంలో తనకెవరూ లేరన్న చేదునిజాన్ని ముఖాముఖీ దర్శించే అవకాశం అతనికి వచ్చింది.కానీ అతనా అవకాశాన్ని దారుణంగా పోగొట్టుకున్నాడు.మళ్ళీ పాత జీవితంలోకి అడుగు పెట్టాడు. భగవంతుడు ఇచ్చిన సువర్ణావకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నాడు.దురదృష్టవశాత్తూ దానికి స్వామీజీ పరోక్షంగా కారకుడయ్యాడు.

పుట్టినప్పటినుంచీ తను ఉంటున్న ఊబిలోనుంచి బయటకొచ్చి ఒడ్డున నిలబడి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న చంద్రపాల్ ను స్వామీజీ తిరిగి అదే ఊబిలోకి తోసేశాడు. ఇదీ అసలక్కడ జరిగిన సంగతి !!!

కానీ వారిద్దరికీ ఈ విషయం తెలీదు.

చంద్రపాల్ కు తెలియకపోతే వింత లేదు. అతను అజ్ఞానంలో ఉన్నాడు.అతనొక సామాన్య మానవుడు.ఎటు పోవాలో అతనికి తెలియదు. కానీ ఈ విషయం స్వామీజీకి కూడా తెలియకపోవడమే అసలైన వింత. అది చాలదన్నట్లు ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ఆయన అదేదో గొప్ప విజయం అయినట్లు అందరికీ చెప్పుకోవడం ఇంకా పెద్ద వింత.

ప్రపంచం యొక్క నిజస్వరూపాన్నీ, మానవ సంబంధాల డొల్లదనాన్నీ చంద్రపాల్ కు విడమర్చి చెప్పి అతన్ని నిజమైన ఆధ్యాత్మిక పధంలో నడిపించడం స్వామీజీ చేసి ఉండవలసింది. కానీ అలా జరగలేదు. జరగకపోగా, దానికి పూర్తి విరుద్ధమైన పని జరిగింది.

జీరో నుంచి కోటీశ్వరుడు కావడం ఎలా? అనేది చంద్రపాల్ చేశాడు. కానీ ఒక అజ్ఞాని నుంచి జ్ఞానిగా ఎలా మారాలి? అన్నది అతను మిస్ అయ్యాడు.డబ్బు సంపాదించడం కంటే, సత్యజ్ఞానాన్ని పొందటమే జీవితంలో అతి ముఖ్యమైన అంశం.డబ్బు లేకుంటే జీవితంలో పెద్దగా పోయేది ఏమీ లేదు.కానీ చచ్చేలోపు జ్ఞాని కాలేకపోతే, ఆ జీవితం టోటల్ గా వేస్ట్ అయినట్లే.

ఈ కధంతా స్వామీజీ చెబుతూ ఉన్నపుడే నాకు రెండు ఆలోచనలు వచ్చాయి. అవేమంటే - స్వామీజీ స్థానంలో నేనుంటే ఏం చేసేవాడిని? చంద్రపాల్ స్థానంలో నేనుంటే ఏం చేసేవాడిని?

మొదట్లో వీటిని బ్లాగులో వ్రాయాలని అనుకోలేదు. పంచవటి గ్రూపులో నా శిష్యులకు మాత్రమే చెబుదామని అనుకున్నాను. కానీ తర్వాత నా ఉద్దేశ్యం మార్చుకున్నాను. అలా మార్చుకోవడానికి కారణం ఏమంటే - ఈ సీరీస్ చదివినవారు, స్వామీజీ భావనలు నా భావనలే అనుకునే ప్రమాదం ఉన్నది. ఈ విషయాన్ని నేను క్లారిఫై చెయ్యాలి.

స్వామీజీ భావాలు ఆయనవే. అవి నావి కావు. నేను ఊరకే జరిగిన సంఘటనను యధాతధంగా వ్రాశానేగాని, అంతమాత్రం చేత ఆయన అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నట్లు కాదు.ఆయన భావాలతో నేను కొంతవరకే ఏకీభవిస్తాను.ఆ తర్వాత నా దారి పూర్తి విభిన్నంగా ఉంటుంది.

ఈ విషయాన్ని స్పష్టం చెయ్యడానికే ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.

నా ఆలోచనలను విడివిడిగా వరుసగా చూద్దాం.

1. స్వామీజీ స్థానంలో నేనుంటే??

స్వామీజీ స్థానంలో నేనుంటే చంద్రపాల్ తో ఇలా చెప్పేవాడిని.

'చూడు చంద్రపాల్ ! ఇప్పుడైనా ప్రపంచం అంటే ఏంటో నీకు అర్ధమైందా? నువ్వు ప్రేమించిన వారెవరూ నీవారు కారు. నీ స్నేహితులు నీకు నిజమైన స్నేహితులు కారు. నీ బంధువులు కూడా అంతే.అందరూ అవకాశవాదులే.అందరూ స్వార్ధపరులే. నిజంగా నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఉన్నారని నువ్వు అనుకుంటూ ఉంటె అది నీ భ్రమ. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరువు. సత్యాన్ని గ్రహించు. నిజంగా నీ వారెవరో తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకునే మార్గంలో కనీసం ఇప్పటికైనా నడక ప్రారంభించు.

నీ జీవితంలో ఇప్పటికే 50 ఏళ్ళు భ్రమతో కూడిన రోజులుగా గడచిపోయాయి. నీ జీవితం ముప్పాతిక వంతు ఇప్పటికే వృధా అయింది.కనీసం ఇప్పుడైనా మేలుకో. ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టు. దారి కావాలంటే నేను చూపిస్తాను.నాతో నడువు.నేను చెబుతున్నది నిజమో కాదో నీకు నీకే అర్ధమౌతుంది. ఎన్నటికీ చెదరని సంతృప్తిని ఆనందాన్నీ నువ్వు పొందే మార్గం నేను చూపిస్తాను.నేను చెబుతున్న సంతృప్తీ ఆనందమూ నిన్ను ఎప్పటికీ వదలిపోవు.ఏది నీతో ఉన్నా ఏది లేకపోయినా, ఎవరు నీతో ఉన్నా ఎవరు లేకపోయినా నీ స్థితిలో ఏ మార్పూ రాని గమ్యాన్ని చేర్చే దారిని నీకు చూపిస్తాను. నా అడుగుల్లో అడుగులు కలిపి నడువు.

ఒకవేళ నీలో కసి ఉంటే, అన్నీ కోల్పోయానన్న బాధ నీలో ఉంటే, వెనక్కు వెళ్ళు.అన్నీ మళ్ళీ సంపాదించు. నిన్ను నమ్ముకున్న నీ కుటుంబానికి ఆధారం కల్పించు. ఆ డబ్బంతా వారికి ఇచ్చేసి అప్పుడు నా దగ్గరకు రా.

ఇప్పుడు నా మార్గంలోకి నువ్వొస్తే నీలో కొంత అసంతృప్తి మిగిలి ఉంటుంది. 'చేతకానివాడిలా నేను పారిపోయి వచ్చాను' అని నీలో ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. దానిని తొక్కగలిగితే మరీ మంచిది.కానీ ఆ పనిని చేసే శక్తి నీకు లేకపోతే, నీలో ఉన్న గిల్టీ ఫీలింగ్ ను నువ్వు జయించలేకపోతే, వెనక్కు వెళ్లి, సంపాదించి, నువ్వనుకుంటున్న డొల్ల విజయాన్ని మళ్ళీ సాధించి, అప్పుడు దాన్ని విసరి పారేసి, నాతో రా. నేను చెబుతున్నదేంటో నీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను.

'నువ్వనుకుంటున్నదానిని జీవితం నీకు ఇవ్వలేక పోతే నువ్వేం చేస్తావు?' అని కదా అడిగావు. ఇదే నా సమాధానం.

'నీ జీవితాన్ని నువ్వు కొత్తగా నిర్మించుకో. పాత జీవితాన్ని విసరి పారెయ్యి.' ఇదే నా జవాబు కూడా. కానీ నేను చెబుతున్న కోణం వేరు.

మళ్ళీ పాత ఊబిలోకి అడుగుపెట్టి డబ్బు సంపాదించి మళ్ళీ కోటీశ్వరుడివి కమ్మని నేను చెప్పను. నా ఉద్దేశం అది కాదు. నువ్వు అలా చేసినా కూడా అది అంతిమ విజయం కాదని నేను చెబుతున్నాను. అదొక ఎండమావి. ఈ విషయం నీకిప్పుడు అర్ధం కాదు. కానీ ఇది నిజం.

నీ పాత రొచ్చు జీవితాన్ని వదిలేయ్. అసలైన కోణంలో జీవితాన్ని చూడటం నేర్చుకో.ఏ క్షణం నిన్ను వదిలేసి పారిపోతాయో తెలియని వాటికోసం నీ విలువైన జీవితాన్ని పణంగా పెట్టకు.దానిబదులు, ఎప్పుడూ నీతో ఉండే దానికోసం ప్రయత్నం చెయ్యి.

డబ్బు ఒక్కటే ఇప్పటిదాకా నీకు తెలిసిన నిజం.అది నిజం కాదు.పచ్చి అబద్దం. డబ్బు ఒక్కదానితోనే మనిషికి శాంతి ఎప్పటికీ రాదు. అధికారమైనా అంతే.ఇంకేదైనా అంతే. ఇవేవీ లేకున్నా 'ఆ ఒక్కటి' ఉంటే నీకన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నా 'ఆ ఒక్కటి' లేకుంటే నువ్వు బికారివే. ప్రస్తుతం ఈ విషయం నీకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు కదా !! నువ్వు బికారిగానే రైళ్ళలో తిరుగుతున్నావు. నేను చెబుతున్నదీ నీకు ఇప్పటిదాకా తెలియనిదీ అయిన ' ఆ ఒక్కటి' ఏంటో తెలుసుకో. దానిని పొందే ప్రయత్నం చెయ్యి.అదే కొత్త జీవితం అంటే. అదే అసలైన సత్యం.

అని చెప్పి అతని కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసి ఉండేవాడిని.కానీ స్వామీజీ ఆ పనిని చెయ్యలేదు.

కొంచం కొంచంగా అతని కళ్ళు అప్పుడే తెరుచుకుంటున్నాయి. కానీ స్వామీజీ ఆ కళ్ళను పూర్తిగా మూసేసాడు. నేనలా చేసి ఉండేవాడిని కాను.

2. చంద్రపాల్ స్థానంలో నేనుంటే??

చంద్రపాల్ స్థానంలో నేనుంటే - స్వామీజీని ఇలా అడిగేవాడిని.

'స్వామీజీ.నా జీవితాన్ని కొత్తగా మళ్ళీ నిర్మించుకొమ్మని మీరు చెబుతున్నారు.బాగుంది. కానీ మీనుంచి నేను వినాలనుకున్నది ఇది కాదు. ఈ Corporate motivational jargon కాదు నాకు కావలసింది.ఇవి నాకెప్పుడో తెలుసు.కావాలంటే వాటి గురించి నేనే మీకు ఇంకా బాగా చెప్పగలను. ఎందుకంటారా? ఈ విషయాలు నాకు ప్రాక్టికల్ గా తెలుసు. మీరు ఊరకే పుస్తకాలు చదివారు.నేను పుట్టినప్పటి నుంచీ బిజినెస్ ఫీల్డ్ లో మునిగి తేలినవాడిని. కనుక You can win, Everything is in your hands, If you have a will you have a way, Nothing is too late to start ... మొదలైన చెత్త కాదు మీరు నాకు చెప్పాల్సింది. ఇవన్నీ నాకెప్పుడో తెలుసు.

పైగా, నాదొక ప్రశ్న.మీరు నాకు చెబుతున్నవి ముందు మీరు ఆచరించి ఆ తర్వాత నాకు చెప్పాలి. మీ జీవితాన్ని మీరే వదిలేసి సన్యాసం స్వీకరించబోతున్నారు. ప్రస్తుతం బ్రహ్మచారిగా మీరున్నారు.కొన్నేళ్లలో మీరూ స్వామీజీ అవుతారు కదా?జీవితం నుంచీ దాని బాధ్యతల నుంచీ పారిపోతున్న మీరు,అదే జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోమని నాకెలా చెప్తున్నారు?మీరు చెయ్యని చెయ్యలేని పనిని నన్ను చెయ్యమని ఎలా చెప్పగలుగుతున్నారు?

అసలు స్వామి వివేకానందను మీరు సరిగ్గా అర్ధం చేసుకోలేదని నా ఉద్దేశ్యం. ఈ రోజుల్లో ఆయన బోధనలను పూర్తిగా వక్రీకరిస్తున్నారు.ఆయన్ను ఒక యూత్ ఐకాన్ గా, ఒక పాజిటివ్ తింకర్ గా, ఒక మేనేజిమెంట్ గురుగా ప్రాజెక్ట్ చేస్తున్నారు.ఇది పూర్తిగా తప్పు. మీరు చేస్తున్నది ఘోరమైన పొరపాటు.ఒక ప్రవక్తను మీరు చాలా దిగజారుస్తున్నారు. ఆయన చెప్పింది మేనేజిమెంట్ క్లాసులు కాదు. శుద్ధమైన వేదాంతాన్ని ఆయన ప్రాక్టికల్ గా బోధించారు. అసలు ఆయన్ను మీరు ముందు సరిగ్గా అర్ధం చేసుకోండి.

"ప్రపంచాన్ని జయించండి" అని ఆయన చెప్పినదానికి అసలైన అర్ధం - మోసపూరిత వ్యాపారాలు చేసి ఏదో రకంగా కోట్లు సంపాదించమని కాదు. ఇదే ప్రపంచంలో దాని వ్యామోహపు మురికిగుంటలో పడి ఈత కొడుతూ చచ్చేవరకూ ఇదే నిజం అనుకుంటూ అఘోరించమని కాదు. ప్రపంచపు నిజస్వరూపం ఏమిటో తెలుసుకోండి. దానిపైన మీ వ్యామోహాన్ని జయించండి. మిమ్మల్ని మీరు నిజంగా తెలుసుకోండి. అని ఆయన చెప్పాడు.ఆయనొక మహాప్రవక్త. ఆయనొక దేవత. కానీ, మీరేమో ఆయన్ను రోడ్డు మీదకు లాగి ఒక చీప్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ను చేసి కూచోబెట్టారు.

"ఉత్తిష్టత జాగ్రత ప్రాప్యవరాన్నిబోధత" అన్న కఠోపనిషత్తు మంత్రాన్ని ఆయన మీకు బోధించాడు. దానర్ధం -" నిద్ర నుంచి లెండి. కష్టపడండి. మీ గమ్యం చేరేవరకూ విశ్రాంతి తీసుకోవద్దు' అన్నది నిజమే. కానీ ఆయన చెబుతున్నది -ఒక IIT పరీక్షనో ఒక IIM పరీక్షనో, లేదా ఒక సివిల్ సర్వీస్ పరీక్షనో పాసయ్యేవరకూ తిరిగి తిరిగి వ్రాసి దానిని సాధించమని కాదు. బిజినెస్ లో ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ మళ్ళీ అదే బిజినెస్ చేసి బ్లాక్ మనీ కూడబెట్టమని కాదు.ఆయన మనల్ని చెయ్యమంటున్న ప్రయత్నం అది కాదు.ఆయన చెబుతున్నది డబ్బు సంపాదన గురించి కానే కాదు.

నిజమైన జీవిత గమ్యాన్ని చేరుకోవడంలో చూపవలసిన శ్రద్దను గురించి ఆయన చెబుతున్నాడు. నిజమైన జీవిత గమ్యం అంటే పరీక్షలు పాసవడం, ఉద్యోగాలు సంపాదించడం, వ్యాపారాలు చెయ్యడం, రాజకీయంగా పదవులు సంపాదించి దొంగ సొమ్ము కూడబెట్టడం - ఇవి కావు. పోనీ నువ్వు అక్రమంగా కాకుండా సక్రమంగా సంపాదించినా కూడా - అంతిమ విశ్లేషణలో అదెందుకూ పనికిరాదు. నీకది చెదిరిపోని ఆనందాన్ని ఎప్పటికీ ఇవ్వలేదు.

నేను మీ మాటలతో చాలా డిసప్పాయింట్ అయ్యాను. మీనుంచి ఇలాంటి చీప్ కార్పోరేట్ జార్గన్ కాదు నేను వినాలని ఆశించినది. నిజమైన జీవితాన్ని గురించి నేను వినాలనుకున్నాను. మీ మాటలు నన్ను చాలా ఆశాభంగానికి గురి చేశాయి.

ఒకవేళ - నిజమైన ఆనందం మీరు కోరుకుంటున్న సాధు జీవితంలో ఉంటే - నన్ను కూడా అందులోకి రమ్మని మీరు పిలవాలి.అప్పుడు మీరంటే నాకు గౌరవం ఇనుమడించేది. లేదా నన్ను తిరిగి ఏ ఊబిలోకైతే మీరు నెట్టాలని భావిస్తున్నారో, అదే సత్యమైతే, మీ కాషాయ వస్త్రాలు వదిలేసి మీరు కూడా నా దారిలోకి రావాలి. అప్పుడు మాత్రమే మీలో నిజాయితీ ఉన్నట్లు నేను భావిస్తాను.

మీరు ఒక దారిలో పోతూ నన్ను వేరే దారిలోకి పొమ్మని చెప్పడంలో మీ ఆంతర్యం ఏమిటి? ఇది సరియైన గైడెన్స్ యేనా? మీరు చెబుతున్నది లాజిక్ కు విరుద్ధంగా ఉన్నది.మీ మాటలు నిజాలని నేనెలా నమ్మాలి?

నేనే చంద్రపాల్ నైతే ఇవే మాటలను స్వామీజీని అడిగి ఉండేవాడిని.

ఏదేమైనా - చంద్రపాల్ కథ విని నాకు చాలా జాలేసింది. స్వామీజీని చూస్తే కూడా ఇంకా జాలేసింది.

ప్రకృతి చంద్రపాల్ జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని కలిగించింది. ప్రపంచపు నిజతత్వాన్ని అతనికి చూపిద్దామని అతని కళ్ళు కొంచం తెరిచింది.కానీ ఆ తెరుచుకుంటున్న కళ్ళను స్వామీజీ మళ్ళీ మూసేశాడు. ఎంత గట్టిగా అంటే - మళ్ళీ అవి తెరుచుకోనంతగా !!

ఇరవై లక్షలు ఇచ్చి లాతూర్ భూకంపంలో అన్నీ కోల్పోయిన అభాగ్యులకు చంద్రపాల్ నాలుగు ఇళ్ళు కట్టించి ఇచ్చి ఉండవచ్చు. కానీ అతను మాత్రం Homeless గానే మిగిలిపోయాడు.తన అసలైన ఇంటిని అతను చేరుకోలేకపోయాడు.ఎప్పుడూ చెదిరిపోని, నాశనం కాని ఒక గొప్ప ఇంటిని చేరుకునే అవకాశాన్ని అతను శాశ్వతంగా కోల్పోయాడు.

ఒక జ్ఞానిగా మారే అవకాశం కోల్పోయి ఒక మామూలు వ్యాపారిగా అయిపోయాడు.

గొంగళి పురుగుకు సీతాకోక చిలుకగా మారే అవకాశం వచ్చింది. కానీ అది వెనక్కు వెళ్ళిపోయి గొంగళి పురుగులానే ఉండిపోయింది. అదికూడా - ఒక సీతాకోక చిలుకగా మారాలని ప్రయత్నిస్తున్న ఇంకొక గొంగళి పురుగు సలహా విని !! ఎంత బాధాకరం !!

మళ్ళీ అలాంటి అవకాశం అతని జీవితంలో వస్తుందా? 

ఏమో? ఎవరికి తెలుసు?

(ఇంకా ఉంది)
read more " స్వామి యదునాధానంద గారితో సంభాషణ - 6 (నేనే వాళ్ళ స్థానాల్లో ఉంటే?) "