“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

7, నవంబర్ 2016, సోమవారం

స్వామి యదునాధానందతో సంభాషణ - 1

'వచ్చే ఆదివారం మీదగ్గరకు వస్తున్నానండి' అంటూ చెన్నై నుంచి స్వామి యదునాధానంద గారి స్వరం ఫోన్లో ధ్వనించింది.

'చాలా సంతోషం స్వామీ రండి.' అన్నాను.

'మీకు ఇబ్బందేమీ లేదుకదా? ఆదివారంనాడు మీరు ఫ్రీగా ఉంటారని వస్తున్నాను.ఒకరోజంతా మీతోపాటు గడపాలని అనిపించింది.వస్తున్నాను.' అన్నాడాయన.

'ఏం ఇబ్బంది లేదు.మీరు వస్తున్నపుడు నాదేముంది? వీలు కాకపోతే వీలుచేసుకుంటాను.ఏం పరవాలేదు.మీరు రండి.మనం 30 ఏళ్ళ తర్వాత కలుస్తున్నాం.మీకు గుర్తుందనుకుంటాను.' అన్నాను.

'అవును.మిగతా విషయాలు సమక్షంలో మాట్లాడుకుందాం' అన్నాడాయన.

'సరే.నమస్తే' అని ఫోన్ పెట్టేశాను.

ఆ తర్వాత వారమంతా అఫీషియల్ పనులలో బిజీగా ఉంటూ గడిచిపోయింది.అయినా సరే,లోలోపల సరస్వతీ నదిలా, ఆరోజులు గుర్తొస్తూనే ఉన్నాయి.

ఈలోపల ఖమ్మం సాగర్ నుంచి ఫోనొచ్చింది.

'గురూజీ.ఆదివారం కుంగ్ ఫూ క్లాస్ పెట్టుకుందామా? చాలా నెలలైంది మీతో క్లాస్ చేసి?మీరు 'ఊ' అంటే నేనూ రమేష్ బయలుదేరి వస్తాము.' అన్నాడు.

'వద్దు.నాకు ముఖ్యమైన పని వేరే ఉన్నది.పై శని ఆదివారాలలో పెట్టుకుందాం.' అన్నాను.

స్వామీజీతో కాలం గడిపేటప్పుడు వేరే స్పందనలు భరించడం కష్టమౌతుంది.ఎందుకంటే ఆ సమయంలో పూర్తిగా ఆధ్యాత్మిక సంభాషణలే నడుస్తాయి.తక్కువ స్థాయికి చెందిన మాటలు భరించడం కష్టంగా ఉంటుంది.వేరే వ్యక్తుల 'ఆరా' కూడా ఆ సమయంలో ఇబ్బందిగా అనిపిస్తుంది.అందుకని అలా చెప్పాను.

చూస్తుండగానే ఆదివారం వచ్చేసింది.

ఉదయమే ఫోన్ కు మెసేజి వచ్చింది.

'నేను చెన్నైలో బయలు దేరాను.జనశతాబ్ది ఎక్స్ ప్రెస్ లో ఉన్నాను.న్యూ గుంటూర్ స్టేషన్ కు మధ్యాన్నం 1.45 కు వస్తుంది.మీరు నాకోసం భోజనం ఏర్పాట్లు చెయ్యవద్దు.నేను ఆశ్రమం నుంచి మధ్యాన్న భోజనం ప్యాక్ చేసి తెచ్చుకుంటున్నాను.' అని దాని సారాంశం.

'అలాగే.నేను గంట ముందే స్టేషన్ లో ఉంటాను.మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను.' అని మెసేజ్ చేశాను.

అనుకున్నట్లుగానే కార్ తీసుకుని గంట ముందే స్టేషన్ కు చేరుకున్నాను.

న్యూ గుంటూరు స్టేషన్ లో పెద్దగా జనం ఉండరు.నిన్న కూడా మొత్తం మీద ఒక పదిమంది కూడా లేరు.వాళ్ళలో కూడా ఇద్దరు తప్ప మిగతా అందరూ బెంచీల మీద నిద్రపోతూ కనిపించారు. ఒక ఇద్దరు మాత్రం స్తంభాల చుట్టూ కట్టిన గ్రానైట్ అరుగుల మీద పడుకుని కబుర్లు చెప్పుకుంటూ కన్పించారు.తీరా చూస్తే వాళ్ళు బృహన్నలలు.

ఈ మధ్యకాలంలో వీళ్ళు ప్రయాణీకులను చాలా ఇబ్బంది పెడుతున్నారనీ, కొండొకచో దౌర్జన్యం కూడా చేస్తున్నారనీ, చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనీ నాకు కొందరు బాధితులు చెప్పారు. మెయిన్ స్టేషన్ లో అయితే పోలీస్ ఫోర్స్ ఉంటుందని ఇలాంటి నిర్మానుష్య స్టేషన్లను వీళ్ళు అడ్డాలుగా మార్చుకుంటూ ఉన్నారన్న మాట !

సెక్యూరిటీ కమాండెంట్ కు ఫోన్ చేద్దామని చెయ్యి ఫోన్ ను బయటకు తీసింది. అంతలోకే ఇంకో ఆలోచన వచ్చింది. 'ప్రస్తుతం వీళ్ళు ఏమీ గొడవ చెయ్యడం లేదు కదా.అలా చేస్తే అప్పుడు చూద్దాం లే.' అని ఆగిపోయి వాళ్ళను గమనించ సాగాను.

వారి జీవితాలను చూస్తే జాలేస్తుంది. కానీ అదే సమయంలో వాళ్ళలో ఉన్న కొన్ని లక్షణాలు చాలా బాగున్నట్లు అనిపిస్తాయి. ముఖ్యంగా - 'ఎవరినీ లెక్క చెయ్యని ధైర్యం, ప్రపంచానికి తాము అతీతులమన్నట్లు ప్రవర్తించే లెక్కలేనితనం,నీరసం బద్ధకం లేకుండా ఎప్పుడూ చలాకీగా ఉండటం' - మొదలైన లక్షణాలు నిజమైన యోగుల లక్షణాలను గుర్తుకు తెస్తాయి.

వాళ్ళను అలా గమనిస్తుంటే బైబుల్ (Matthew 19:12) నుంచి జీసస్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి.

'For there are eunuchs who were born that way from their mothers' wombs; Others were made that way by men; And still others live like eunuchs for the sake of kingdom of God; Let him who can understand this, understand."

కొందరు తమంతట తామే, దైవం కోసం, సాధన కోసం, బ్రహ్మచర్యాన్ని పాటిస్తారని ఆయన అన్నాడు. ఇది వేదాంత - యోగ - తంత్ర మార్గాల విధానం.భారతదేశంలో ఆయన నేర్చుకున్నదానినే తన శిష్యులకు అర్ధమయ్యే భాషలో ఆయన చెప్పాడు.

అసలూ - ఒక బృహన్నలకూ ఒక యోగికీ ఏమిటి తేడా?

బృహన్నల అశక్తుడు.అతని అవయవాలు సరిగా పనిచెయ్యవు. లేదా కొందరికి అవి ఉండవు.అతను లైంగిక శక్తిహీనుడు.కానీ యోగి అలా కాదు.అతనికి అన్నీ సక్రమంగానే ఉంటాయి. అతనిలో శక్తి బాగానే ఉంటుంది.కానీ సాధన కోసం అతను కామాన్ని నిగ్రహించి లైంగికశక్తిని దేహంలోనే పోగుచేస్తూ వస్తాడుగాని దానిని వృధా చెయ్యడు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థాయిలను అందుకోవడానికి అతనికి అదే ఆధారం గనుక.అతని అంతరిక ప్రయాణానికి అదే అసలైన మూలధనం. ఆ ధనం లేకుంటే అతని ప్రయాణం ముందుకు సాగదు.

ఒక బ్రహ్మచారీ, స్వామీ అయిన వ్యక్తిని కలుసుకోవడానికి వస్తే వీళ్ళు ఎదురు కావడం ఏమిటి? ఇది కాకతాళీయం ఎలా అవుతుంది? అని ఇదే విషయం మీద ధ్యానిస్తూ అక్కడే కాసేపు కూచున్నాను.

మనస్సు గతంలోకి ప్రయాణించింది.

స్వామీజీ నాకు 1985 నుంచీ తెలుసు. నాకంటే మూడేళ్ళు చిన్నవాడు. ఆయన పూర్వాశ్రమ నామధేయం త్యాగరాజన్. పుట్టింది చిత్తూరు జిల్లా పాకాలలో.పెరిగింది చదువుకున్నది చెన్నైలో. మంచి క్రికెట్ ప్లేయర్. శ్రీవైష్ణవ కుటుంబానికి చెందిన తమిళుడు.

ఆ రోజుల్లో వీరి అన్నయ్య గుంతకల్ లో రైల్వేలో పని చేసేవాడు.నేనూ అక్కడే పనిచేసేవాడిని. స్పిరిట్యువల్ గా ఒకే మనస్తత్వం ఉన్న కొందరు ఉద్యోగులం తరచూ కలుస్తూ ఉండేవాళ్ళం. కాలక్రమేణా అందరం ఫేమిలీ ఫ్రెండ్స్ గా మారాం. వారిలో సీతారామ శాస్త్రిగారొకరు.ఆయన అప్పటికే పరమహంస యోగానందగారి క్రియాయోగ అభ్యాసి.ఆ రోజుల్లోనే రైల్వేలో డీజిల్ చార్జ్ మాన్ గా షిఫ్ట్ డ్యూటీలతో కూడిన ఉద్యోగం చేస్తూకూడా రోజుకు అయిదారు గంటలపాటు ధ్యానంలో ఉండేవాడు. ఆయన భార్యను నేను 'వదినా' అని పిలిచేవాడిని. ఆమె మహాసాధ్వి. ఆమె అక్కగారు చందోలు శాస్త్రిగారి కోడలు. వారికి ఇద్దరు పిల్లలు.మంచి సంస్కారవంతమైన ఆధ్యాత్మిక కుటుంబం.

మొదటి సారిగా వాళ్ళింట్లోనే నేను త్యాగరాజన్ ను చూచాను. అప్పటికి అతనికి 17 లేదా 18 ఏళ్ళు ఉంటాయి. నుదుట పొడవైన ఎర్రని నామం ఒకటి పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. ఎక్కువగా మౌనంగా ఉండేవాడు.ఏదైనా మాట్లాడినా క్లుప్తంగా మాట్లాడేవాడు.క్రికెట్ బాగా ఆడేవాడు. అప్పట్లోనే నేను గుంతకల్ లో కరాటే స్కూల్ ఒకటి నడిపేవాడిని.అందులో చేరి కొన్నాళ్ళు నాకు స్టూడెంట్ గా కూడా ఉన్నాడు.ఆ తర్వాత నేను ఆదోనికి వెళ్ళిపోయాను.తను చెన్నైకి వెళ్లిపోయాడని తెలిసింది.ఆ తర్వాత మేం కలవలేదు.కానీ వార్తలు తెలుస్తూనే ఉన్నాయి. 

రామకృష్ణ మఠంలో సీనియర్ స్వామీజీ అయిన స్వామి తపస్యానందగారి దగ్గర మంత్రదీక్ష స్వీకరించాడని, ఆ తర్వాత మైలాపూర్ మఠంలో బ్రహ్మచారిగా చేరాడని, ఆ తర్వాత స్వామీజీ అయ్యాడని వార్తలు వస్తూ ఉండేవి.రెండేళ్ళ క్రితం చెన్నై T.Nagar లో ఉన్న రామకృష్ణా మిషన్ బాయ్స్ హాస్టల్ లో రెసిడెంట్ స్వామిగా దర్శనం ఇచ్చాడు. ఆ తర్వాత ఇదే మళ్ళీ కలవడం.

జీవితం చాలా విచిత్రమైనది.ఎవరు ఏం కావాలని అనుకుంటారో చివరకు ఏమౌతారో ఎవరూ చెప్పలేం !!

ఆరోజుల్లో కూడా తను నిష్టగా సంధ్యావందనం గాయత్రీ జపం క్రమం తప్పకుండా చేసేవాడు.ఎక్కువగా మౌనంగా ఉండేవాడు. ఆ వయసు పిల్లల్లో సాధారణంగా కన్పించే అమ్మాయిల పరిచయాలూ,సినిమాలూ, స్నేహితులూ లాంటి చెత్తగోల ఇతనిలో కన్పించేది కాదు.

హంస తీరు హంసదే కాకితీరు కాకిదే కదా. ఈ రెంటిలో ఏది ఏమిటి అనేది వాటి చిన్నప్పుడే తెలిసిపోతుంది. తను చిన్నప్పటి నుంచీ హంసలాగే ఉండేవాడు కాని కాకిగోల అతనిలో కనిపించేది కాదు.

సాధారణంగా ఇలాంటి జీన్స్ పెద్దవాళ్ళ నుంచి వస్తూ ఉంటాయి. తరతరాలుగా నియమనిష్టలతో శుద్దమైన జీవితాలు గడిపిన కుటుంబాలలో ఇలాంటి పిల్లలు పుడుతూ ఉంటారు.చిన్నప్పటి నుంచీ ఇలాంటి వారి తీరు వేరుగానే ఉంటుంది.

త్యాగరాజన్ కు మొదటగా శ్రీరామకృష్ణులు శారదామాత వివేకానందుల గురించి తెలిసినది మా ఇంట్లోనే. ఒక్కొక్క సారి సాయంత్రం పూట నేను ఖాళీగా ఉన్నప్పుడు తను మా ఇంటికి వస్తూ ఉండేవాడు.అప్పట్లో నాకు పెళ్లి చేసుకోవాలని ఉండేది కాదు.సన్యాసం తీసుకుందామని గట్టిగా అనుకుంటూ ఉండేవాడిని.అందుకని ఎప్పుడూ ఆధ్యాత్మికతా యోగసాధనా వాటిలోని లెవల్సూ శ్రీరామకృష్ణుల జీవితమూ,వారి ప్రత్యక్ష శిష్యుల జీవితాలూ,వాటిలోని సంఘటనలూ ఇవే విషయాలు మాట్లాడుతూ ఉండేవాడిని.ఆ విధంగా అతనికి ఈ భావజాలం పరిచయం అయింది. ఆ తర్వాత కారణాంతరాలవల్ల నేను స్వామిని కాలేక పోయాను.కానీ తను అవగలిగాడు.అదీ సంతోష కరమైన విషయం.కానీ ప్రస్తుతం నాకేం రిగ్రెట్స్ లేవు.

ఎవరి అదృష్టం ఎలా ఉందో ఎవరికి తెలుస్తుంది? ఠాకూర్ అనుగ్రహం ఎవరిమీద ఎలా వర్షిస్తుందో ఆయనకొక్కడికే తెలుసు. అల్పబుద్దులమైన మనకు ఆయన లీల అర్ధం కాదు. ఎవరి చేత ఎక్కడ ఏ పని చేయించాలో ఆయనకే తెలుసు.ఆ ప్రకారం అంతా నడుస్తూ ఉంటుంది. ఉండే విధంగా ఉంటే, గృహస్థుడైనా సన్యాసి అయినా తేడా ఏమీ లేదు. ఠాకూర్ అనుగ్రహం ఎలా పొందాలో తెలిస్తే ఎక్కడున్నా ఒకటే.అంతా మనం జీవించే తీరులోనే ఉంటుంది.బంగారం మురికి గుంటలో ఉన్నా బంగారమే కదా !!

ఈ విధమైన ఆలోచనల్లో పడి ప్లాట్ ఫారం మీద కూచుని నా ధ్యానంలో నేనున్నాను.చూస్తుండగానే రైలు రానే వచ్చింది. నేనున్న చోటనుంచి బాగా ముందుకు పోయి ఆగింది. నేను నిదానంగా నడుస్తూ ముందుకు వెళ్లేసరికి స్వామీజీ రైలు దిగి ప్లాట్ ఫారం మీద ఒక పక్కగా నిలబడి ఉన్నాడు.

బ్రహ్మచర్యం, ధ్యానం, నియమనిష్టలతో కూడిన జీవితంతో వచ్చే వర్చస్సు ఆయన ముఖంలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఏంటోగాని వివేకానందస్వామి పోలికలు కొన్ని ఆయన ముఖంలో కన్పిస్తున్నాయి.

'నమస్తే స్వామీజీ' చేతులు జోడించి నవ్వుతూ పలకరించాను.

ఒకప్పుడు నా కరాటే స్టూడెంట్ అయినా ఇప్పుడు స్వామి గనుక మనం ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాల్సిందే.

'నమస్తే' ఆయనకూడా చేతులు  జోడించి నవ్వుతూ అన్నాడు.

కుశల ప్రశ్నలు అయిన తర్వాత కారులో ఎక్కించుకుని మా ఇంటిదారిలో కారును పోనిచ్చాను.

(ఇంకా ఉంది)