ఆదివారం, అందునా మధ్యాన్న సమయం గనుక రోడ్లమీద జనం పెద్దగా లేరు.కారు మెత్తగా రోడ్డుమీద సాగిపోతున్నది. తాపీగా డ్రైవ్ చేస్తూ ఇలా అడిగాను.
'మధ్య స్టేషన్లలో ఎవరో వచ్చి కలుస్తారని అన్నారు.వారు వచ్చారా?'
'ఆ. మా ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు.వాళ్ళు నెల్లూరు,కావలి,తెనాలిలలో వచ్చి కలిశారు.వాళ్ళంతా అప్పట్లో మా హోం లో ఉండి చదువుకున్నారు. ఇప్పుడు జీవితంలో బాగా సెటిల్ అయ్యారు.వాళ్ళలో కొందరు జైన్స్ కూడా ఉన్నారు.'
'జైన్స్ సామాన్యంగా మన స్కూల్స్ లో చదవరే?' అడిగాను.
'అవును.ఉన్నారు.మన స్కూల్స్ మంచి విలువలను నేర్పిస్తాయని వాళ్ళు వాళ్ళ పిల్లలను చేర్పిస్తారు.మన దగ్గర చదువుకున్న జైన్స్ ఉన్నారు.ఆ మధ్యన ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశాము.1930,40 లలో మన ఆశ్రమ స్కూల్ లో చదివినవాళ్ళు కూడా కొందరు వచ్చారు.వారిలో కొందరు అమెరికాలో కూడా స్థిరపడ్డారు.ఆ మీటింగ్ ఏర్పాటు చెయ్యడానికి ఒక కమిటీ వేసి ఏడాది పాటు కష్టపడ్డాము.చివరకు బాగా జరిగింది.అందరూ కలసి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.' అన్నాడాయన.
'మన మఠాలు కొత్తవి వస్తున్నాయా ఏవైనా?' అడిగాను.
'చాలా ఉన్నాయి.ఎప్పటినుంచో 'రామకృష్ణ సమితి' అని పెట్టి చాలాచోట్ల గృహస్థ భక్తులు నడుపుతున్నారు.వాళ్ళు చాలా ప్రాపర్టీ తయారు చేసి ఉంచారు.స్కూల్స్ కాలేజీలు నడుపుతున్నారు.అవి పెరిగి పెద్దవై పోయాయి.వాళ్ళేమో ముసలివారై పోయారు.ఇప్పుడు మేనేజ్ చెయ్యలేని స్థితిలో ఉన్నారు.కనుక ఇప్పుడు బేలూర్ మఠ్ ను టేకోవర్ చెయ్యమని అడుగుతున్నారు.కానీ మన దగ్గర తగినంత మంది స్వాములు లేరు.పాత కాలంలో లాగా ఇప్పుడు బ్రహ్మచారులు ఎక్కువమంది చేరడం లేదు.ఉన్న స్వాములు తక్కువమంది. సెంటర్స్ ఎక్కువగా ఉన్నాయి.మేనేజ్ చెయ్యడం కష్టంగా ఉన్నది.
ఉదాహరణకు విల్లుపురం అని తమిళనాడులో ఒక సమితి ఉన్నది.ఎన్నో ఏళ్ళనుంచీ అక్కడ గృహస్థ భక్తులే దానిని నడుపుతూ ఉన్నారు.వారికి స్కూలు ఉన్నది.ఇంకా చాలా ఎస్సెట్స్ ఉన్నాయి.ఇప్పుడు వాటి విలువ 100 కోట్ల పైనే ఉంటుంది.దానిని బేలూర్ మఠానికి ఇస్తామనీ, టేకోవర్ చెయ్యమనీ అయిదారు ఏళ్ళ నుంచీ వారు పోరు పెడుతున్నారు. తీసుకుని మేనేజ్ చెయ్యడానికి మన దగ్గర చాలినంత మంది స్వామీజీలు లేరు.అందుకని దానిని పెండింగ్ లో ఉంచాము.ఇలాంటి సెంటర్స్ చాలా ఉన్నాయి.' అన్నారాయన.
ఉదాహరణకు విల్లుపురం అని తమిళనాడులో ఒక సమితి ఉన్నది.ఎన్నో ఏళ్ళనుంచీ అక్కడ గృహస్థ భక్తులే దానిని నడుపుతూ ఉన్నారు.వారికి స్కూలు ఉన్నది.ఇంకా చాలా ఎస్సెట్స్ ఉన్నాయి.ఇప్పుడు వాటి విలువ 100 కోట్ల పైనే ఉంటుంది.దానిని బేలూర్ మఠానికి ఇస్తామనీ, టేకోవర్ చెయ్యమనీ అయిదారు ఏళ్ళ నుంచీ వారు పోరు పెడుతున్నారు. తీసుకుని మేనేజ్ చెయ్యడానికి మన దగ్గర చాలినంత మంది స్వామీజీలు లేరు.అందుకని దానిని పెండింగ్ లో ఉంచాము.ఇలాంటి సెంటర్స్ చాలా ఉన్నాయి.' అన్నారాయన.
'గతంలో లాగా నేడు బ్రహ్మచారులూ సన్యాసులూ ఎక్కువమంది రాకపోవడానికి కారణం - పాశ్చాత్య సంస్కృతి మీద నేడు పెరిగిపోతున్న మోజూ,పిల్లల్లో విలువలను తల్లిదండ్రులు సక్రమంగా పెంచకపోవడమూ, డబ్బూ విలాసాలూ సుఖాలే జీవిత పరమావధి అనే భావజాలమూ - అనుకుంటాను.' అన్నాను.
'అవును.అంతే.' అన్నాడాయన.
'మీరు మఠంలో చేరి ఎన్నేళ్ళైంది?' అడిగాను.
'1-1-1990 'కల్పతరు డే' రోజున మైలాపూర్ మఠంలో చేరాను.' అన్నాడాయన.
'చూస్తుండగానే 26 ఏళ్ళు గడచిపోయాయి.మనం గుంతకల్ లో కలసి తిరిగిన రోజులు నిన్నా మొన్న లాగా ఉన్నాయి.' అన్నాను.'
'అవును.మీరు 1987 లో ఆదోనికి వెళ్ళిపోయారు కదా.ఆ తర్వాత నేను చెన్నైలో మా పేరెంట్స్ దగ్గరకు వెళ్ళిపోయాను.మేము తాంబరం లో ఉండేవాళ్ళం.ఇప్పుడూ మా అమ్మగారు అక్కడే ఉన్నారు.చెన్నై వెళ్ళాక TVS కంపెనీలో కొన్నాళ్ళు జాబ్ చేశాను.అప్పట్లో క్రికెట్ బాగా ఆడేవాడిని.రంజీ కి కూడా సెలక్ట్ అయ్యాను.కానీ ఆడలేదు.ఈలోపల మఠంలో చేరాను.ఇంక అన్నీ వదిలేశాను.' అన్నాడాయన నవ్వుతూ.
'తపస్యానంద గారు ఎప్పుడు పోయారు?' అడిగాను.
'ఆయన 1904 లో పుట్టారు.1991 లో పోయారు.నేను మఠంలో చేరిన తర్వాత ఒక ఏడాది మాత్రమే ఆయన జీవించి ఉన్నారు.' అన్నాడు.
ఆయన అలా చెబుతుంటే - 1984 లో నేను చెన్నై మఠానికి వెళ్లి స్వామి తపస్యానందగారిని దర్శించి వారి ఆశీస్సులు తీసుకున్న రోజులు గుర్తుకొచ్చాయి.
'స్వామి నందానంద గారిని మీరు చూచారు కదా?' అడిగాను.
'అవును.ఆయన చివరి రోజులలో చూచాను' అన్నాడాయన.
'ఏం మనుషులు స్వామీ వాళ్ళంతా? దేవతలే వాళ్ళు. అసలు అలాంటి మనుషులు భూమిమీద పుడతారంటే ఇప్పుడెవరైనా చెబితే కూడా మనం నమ్మలేము.కానీ కళ్ళతో చూచాము గనుక నమ్మాలి." అన్నాను.
'అవును.' అన్నాడు.
'మీకు మఠంలో చేరాలని అసలెందుకు అనిపించింది? తపస్యానంద గారిని చూచాక అలా ఇన్స్పైర్ అయ్యారా?' అడిగాను.
'లేదు.నాకు చిన్నప్పటి నుంచీ ఈ ఆలోచన ఉన్నది.చెన్నైలో ఉద్యోగం చేసే రోజులలో మైలాపూర్ మఠానికి తరచూ వెళ్ళేవాడిని.అక్కడే తపస్యానంద గారిని కలిశాను.ఆయన దగ్గర మంత్రదీక్ష తీసుకున్నాను.
ఒకరోజున హటాత్తుగా ఆయనే అడిగారు.'ఏంరా త్యాగరాజ్? ఎప్పుడు చేరుతున్నావ్ మాతో? అని'.
'మీ ఇష్టం మహరాజ్. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వచ్చేస్తాను.' అని చెప్పాను.
'సరే.వచ్చే 'కల్పతరు డే' రోజున వచ్చేసేయ్' - అని ఆయన అన్నారు.
అంతకు ముందే మా అమ్మగారికి చెప్పి ఉంచాను.నేను పెళ్లి చేసుకోను.ఈ రొచ్చు జీవితం నాకు అసహ్యంగా ఉంది.నేను ఈ జీవితం భరించలేను.నేను మాంక్ ని అవుతాను అని. దానికి మా అమ్మ సంతోషంగా ఒప్పుకుంది. కానీ ఒక షరతు విధించింది. నువ్వు మఠంలో చేరేముందు ఒక నెలరోజులు నా దగ్గర ఉండాలి.నాకిష్టమైనవీ నీకిష్టమైనవీ అన్నీ చేసి ఆ నెలరోజులూ నీకు తినిపిస్తాను.ఆ తర్వాత వెళ్లి చేరు.అని చెప్పింది. సరేనని అలాగే చేశాను.' అన్నాడు.
'అంత సంతోషంగా ఒప్పుకుందా? ఎంత మహాతల్లో ఆమె?' అనుకున్నాను మనసులో.
'డిసెంబర్ 31 రాత్రి మా ఫ్రెండ్ ఒకాయన ఇంట్లో నిద్రించాను. మర్నాడు ఉదయమే లేచి తాంబరం స్టేషన్ నుంచి మైలాపూర్ సబర్బన్ రైలెక్కి మఠానికి వచ్చి బ్రహ్మచారిగా చేరిపోయాను.' అన్నాడు.
'చిన్నప్పుడు మీరు వైష్ణవ నామం పెట్టుకుని తిరిగేవారు కదా? మఠానికి కూడా అలాగే వెళ్ళేవారా? తపస్యానంద గారికి చెప్పారా మీరు వైష్ణవులని?' అడిగాను నవ్వుతూ.
'చెప్పాను.నా నామం అదీ చూచి ఆయన నవ్వుతూ ఇలా అన్నారు.' రేయ్ త్యాగరాజ్ ! నువ్వు శ్రీరామకృష్ణుల దగ్గరకు వస్తున్నావు. ఈ నామాలూ గీమాలూ వీటన్నిటికీ అతీతంగా నీవు వెళ్ళాలి.'
'బ్రహ్మచారి ట్రెయినింగ్ ఎన్నాళ్ళు సాగింది మీకు?' అడిగాను.
'1990 నుంచి 1999 వరకూ బ్రహ్మచర్య ట్రెయినింగ్ లో ఉన్నాను. ఆ తర్వాత సన్యాస దీక్ష స్వీకరించాను.' అన్నారాయన.
'అంటే మీరు స్వామీజీ అయ్యి అప్పుడే 17 ఏళ్ళు అయింది' అన్నా.
'అవును.ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నాను.' అన్నాడాయన నవ్వుతూ.
ఇంతలో మా ఇల్లు రానే వచ్చేసింది.
'నేనుండేదా కొండపై' అన్నట్లు మాది సెకండ్ ఫ్లోర్. మీరు రెండంతస్తులు ఎక్కాలి ఇప్పుడు.' అన్నా నవ్వుతూ.
'ఏం పరవాలేదు. నేను క్రికెట్ ప్లేయర్ని. ఎక్సర్సైజ్ నాకు అలవాటే.' అన్నాడు ఆయనా నవ్వుతూ.
(ఇంకా ఉంది)