“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

12, నవంబర్ 2016, శనివారం

సత్యబోధ

బిజీబిజీ పనిలో ఉంటూ కూడా, కాసేపు ఖాళీ దొరికినప్పుడు, అందులోనూ పౌర్ణమి ఛాయలో, సరదాగా రిలాక్సేషన్ కోసం వ్రాసుకున్న కొన్ని పద్యాలు.వాటి అర్ధాలు ఇవి.

వ్రాసుకోవడం సరదాగా వ్రాసుకున్నా, వీటిలో మీరెవరూ కాదనలేని జీవిత సత్యాలున్నాయి.

చదవండి మరి.

ఉ|| కాటికి రాని బంధువులు కష్టము లందున లేని సోదరుల్
మీటగ గాని వీణియయు; మోటగు భార్యయు; మొండి పుత్రులున్
పీటలు లేని పెండ్లియును పాటల మెచ్చని పల్లెవారలున్
చేటుల దెత్తు రందరును; చేవల గూల్తురు చీడపీడలై

చాలామంది బంధువుల వరస మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా పోయినప్పుడు అప్పటిదాకా రాసుకుని పూసుకుని తిరిగిన వారే, పాడె పట్టడానికి ఎవరూ ముందుకు రారు.సొంత బంధువులు కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటే పరాయివారు ముందు కొచ్చి భుజం పట్టిన సంఘటనలు కోకొల్లలు.అలాంటి కాటికి తోడురాని బంధువులెందుకు?

కొంతమంది 'ఏకాక్షీ లోకరక్షకా' అన్నట్లు ఒక్కరమే పుట్టామే, మనకూ అన్నాదమ్ములు అప్పచెల్లెళ్ళు ఉంటె ఎంత బాగుండేది? అని బాధపడుతూ ఉంటారు.కానీ వాళ్ళందరూ ఉన్న కుటుంబాలలో కూడా అవసరానికి ఆదుకునే తోడబుట్టిన వాళ్ళు ఎందరున్నారు? ఎవరూ లేరు. కనుక ఆ చింత అనవసరం.

కొంతమంది ఇళ్ళల్లో వీణ ఉంటుంది. దాని అతీ గతీ పట్టించుకోకుండా ఆ తీగలు శృతి చెయ్యకుండా, దాని దుమ్ము దులపకుండా అలా మూలన పడేసి ఉంచుతారు. అలంకరణకు తప్ప అది ఎందుకూ పనికి రాదు.వీణ ఇంట్లో ఉన్నప్పటికీ దానిని సరిగ్గా మీటడం తెలిసినవారు ఎక్కడో కొందరే ఉంటారు.మరికొందరు ఆ తీగలను పిచ్చి పిచ్చిగా లాగేసి దానిని పాడు చేస్తూ ఉంటారు. అలాగే - వయసులో ఉన్న అందమైన భార్య ఎదురుగా ఉన్నప్పటికీ సరస సల్లాపాలతో ఆమెను అలరించి సంపూర్ణంగా ఆమెను తృప్తిపరచగల మగవాళ్ళు అరుదుగానే ఉంటారు.దానికి కామశాస్త్ర ప్రావీణ్యం ఉండాలి మరి !! అది లేనివారి భార్యల పని, మూలపడి దుమ్ము కొట్టుకున్న వీణ వంటిదే. ఏం చేస్తాం? కొన్ని జీవితాలంతే !!

కొంతమంది మగవారికి అన్నీ ఉంటాయి.కానీ సరసం తెలియని మోటు భార్యా, మొండివాళ్లై, చెప్పినమాట వినని సంతానమూ ఉంటుంది. అటువంటి మగవాడికి జీవితంలో ఇక ఎన్ని ఉన్నా ఏమీ లేనట్లే లెక్క. పాపం అలాంటి వారి ఖర్మ కూడా చాలా ఘోరమే !!

పెళ్లిని ఎంతమంది ఎన్ని రకాలుగా చేసుకున్నా, పీటల మీద కూచుని శాస్త్రీయంగా వేదమంత్రాల మధ్యన చేసుకున్న పెళ్ళే పెళ్లి. అటువంటిది కాని పెళ్లి అంత శోభించదు మరి. అలాగే, ఆటా పాటా తెలియని మోటు పల్లెజనం కూడా శోభించరు. పల్లెప్రజలు  పట్నవాసుల దృష్టిలో ఎంత మోటువారైనా, వారికి అనేక జానపద గీతాలూ, పద్యాలూ, పొలం పాటలూ నోటికి వస్తాయి.కానీ అది పాతకాలం మాట.ఇప్పటి పల్లెప్రజలు నాగరీకులను మించి నాగరీకంగా ఉన్నారు. వీరికి ఈ పాటలూ పద్యాలూ ఏవీ రావు. వీరిదీ కృత్రిమ జీవితమే.

ఈ పద్యంలో వచ్చిన కేసులన్నీ, సహజత్వాన్ని కోల్పోయిన అభాగ్యులు. వీరి సావాసం మంచిది కాదు. ఎందుకంటే వీరు ఏమాత్రం మారకపోగా వీరి నెగటివిటీని పక్కవారికి కూడా అంటించాలని చూస్తారు గనుక.

ఉ|| ప్రేమల నెంచనట్టి సఖి; పెంచుట నేర్వని తల్లిదండ్రులున్
రాముడు లేని దేశమును; రాజగు వాడటు లేని రాజ్యమున్
దోమలు మూగు యూరు; తన దాహము దీర్చగ రాని నీరమున్
భామలు గాని భామలగు; భోజన మెక్కని బొజ్జలే గదా !!

మన ప్రేమను అర్ధం చేసుకొనని ప్రేయసి ఉంటే ఎంత? ఊడితే ఎంత?అలాంటి ప్రేయసి ఎంత అప్సరస అయితే మాత్రం ఏంటి ప్రయోజనం? ప్రేమించే హృదయం లేని అందం వృధా కదూ !! అలాంటి ప్రేయసిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది.

అలాగే - పిల్లలను సరిగా పెంచడం తెలియని తల్లిదండ్రులు కూడా వృధా మనుషులే. నేటి తల్లిదండ్రులందరూ ఈ కోవలోకే వస్తారు మరి.

రామాలయం లేని ఊరూ, రాజు లేని రాజ్యమూ కూడా ఎందుకూ పనికిరానివే.వాటిలో కళాకాంతీ ఉండవు. అలాగే దోమలు విపరీతంగా ఉన్న ఊరూ అంతే. అన్ని దోమలున్నాయంటే అదొక మురికి కూపమై ఉంటుంది కదా ! ఇంకా చెప్పాలంటే - కొన్ని ఊర్లలో అంతా ఉప్పునీరు ఉంటుంది.లేదా ఫ్లోరైడ్ వాటర్ ఉంటుంది.అలాంటి నీరు ట్యాంక్ నిండా ఉన్నా అది ఎందుకు? దానితో దాహం తీరదు.కనుక అది వృధానే.

ఈ పద్యంలో చెప్పబడిన కేసులన్నీ భామలు గాని భామలు.అంటే బృహన్నల లన్నమాట. వారిలో కొందరు మంచి మంచి అమ్మాయిలకంటే అందంగా ఉంటారు.కానీ ఏం ప్రయోజనం? "కొండవలసకి ఉండవలసింది మాత్రం లేదన్నట్లు" ఉంటుంది వారి పరిస్థితి. బొర్ర బొజ్జలు ఉండి, జీర్ణశక్తి మాత్రం సున్నాగా ఉండే వారిలా ఉంటుంది వీరి గతి. ఇలాంటి కేసులను చూచి జాలిపడటం తప్ప మనం ఏమీ చెయ్యలేం.  

చం|| సరసులు గాని శ్రోతలును; చంపుట నేర్వని సైన్యమెంతయున్
అరవము రాని వైష్ణవుడు; నాడగ సిగ్గిలు నాట్యగత్తెయున్
మరుగున నుండు వేశ్యయును; మౌనము నందని తాపసోత్తముల్
కరువగ బోని గుక్కయును;కానల నుండెడు దిష్టిబొమ్మలే !!

ఒక ఉపన్యాసకునికి గానీ, ఒక గాయకునికి గానీ, వింటున్న శ్రోతలలో సరసత్వం లేకుంటే వారికీ చెవిటివారికీ ఏమీ తేడా ఉండదు. ఆ ఉపన్యాసమూ ఆ గానమూ అడవిగాచిన వెన్నెల అవుతాయి.అలాగే - చంపడం రాని సైన్యం లక్షల్లో ఉన్నా కోట్లల్లో ఉన్నా ఉపయోగం సున్నానేగా !! వైష్ణవులు ఎక్కువగా తమిళులలో ఉంటారు.కానీ వారికే అరవం రాకపోతే? ఎంత చులకనగా ఉంటుంది?? ఒక నాట్యగత్తె ఉంది.ఆమెకు నాట్యం బాగా వచ్చు.కానీ అందరి ముందూ చెయ్యాలంటే మాత్రం ఆమెకు భలే సిగ్గు.ఇక ఆ నాట్యం ఎందుకు పనికొస్తుంది?

సిగ్గుపడే వేశ్య కూడా అంతే.గుమ్మం దాటి బయటకు రాకుండా లోలోపల దాక్కుంటూ ఉంటె ఆమె చేస్తున్న పని ఎలా సఫలం అవుతుంది? కాదు.

అరిచే కుక్క కరవదు అంటారు.అలాగే - ఒక కుక్క ఊరకే అరుస్తూ ఉండి, కరవడం మర్చిపోతే దానిపని అధోగతే అవుతుంది. ఎప్పుడైనా ఒకసారన్నా కరవాలి.లేకపోతే సాటి కుక్కలే దాన్ని గౌరవించవు.నిన్న రాత్రి రెండున్నరకి నైట్ ఇన్స్పెక్షన్ కి పోతుండగా ఒక వీధి కుక్క ఇలాగే నా  బైక్ వెంట పడింది. మన కుంగ్ ఫూ పవర్ ఉపయోగించి దానికంటే పెద్దగా "కెవ్వుమంటూ" నేనే అరిచేశాను.బైక్ మాత్రం ఆపలేదు. మన అరుపుదెబ్బకు అదే భయపడి పారిపోయింది. కుంగ్ ఫూ "షౌట్"  ఇలా ప్రాక్టికల్ గా ఉపయోగ పడిందన్న మాట !!

చివరగా - మౌనం ఎరుగని తాపసి కూడా శోభించడు. తపస్సుకు మౌనమే అందం. అది లేకుండా ఎప్పుడూ వాగుతూ ఉంటే అతని తపస్సు ఫలించదు. మౌనం ద్వారానే రమణ మహర్షి అంతటి జ్ఞాని అయ్యాడు మరి.

ఈ పద్యాలలో వచ్చిన కేసులన్నీ కూడా - గడ్డితో కూరిన దిష్టి బొమ్మలు. అవి ఊరకే ఆకారంతో ఉంటాయి గాని వాటిల్లో జీవం ఉండదు.

ఉ|| బొంగురు గొంతు సుందరియు; బొక్కుట యొల్లను వీరశ్రేష్టుడున్
ఇంగువ లేని పాకమును; ఇల్లడ మొచ్చిన మల్లయోధుడున్
భంగుల బీల్చు యోగులును; భూముల దున్నని పంటకాపులున్
చెంగున బోని గుఱ్ఱమును; చూడగ వీరులు; లోన డొల్లలే !!

ఒక సుందరి చూట్టానికి ఎంత అందంగా అప్సరసలాగా ఉన్నా ఏమి సుఖం? నోరు తెరిస్తే మొగగొంతుతో బావురు మంటూ ఉంటే, ఆ అందం అంతా దెబ్బకు ఆవిరై పోతుంది. వీరుడైన వాడికి మంచి తిండిపుష్టీ కండపుష్టీ ఉండాలి. తిండి పుష్టి ఉన్నవాడికి కండపుష్టి ఉంటుంది. కనుక తిండి అంటే ఇష్టం లేని వీరుడు ఎక్కువకాలం వీరుడుగా ఉండలేడు.కండ పుష్టినీ నిలుపుకోలేడు.

అలాగే ఎంత మంచి వంటకం చేసినా, అందులో ఇంగువ తిరగమోత సరిగ్గా వెయ్యకపోతే దానికి రావాల్సిన రుచి రాదు.అటులనే - ఒకడు కండలు పెంచి ఎంత వస్తాదైనా, ఇల్లరికం వచ్చాడంటే వాడి పని అయిపోయినట్లే. అంత పెద్ద పహిల్వాను కూడా రెండురోజుల్లో ఆ ఇంటిలో పనివాడై పోతాడు.

భంగు బైరాగులు ఉంటారు. వారికి యోగమూ తెలీదు. ఏమీ తెలీదు. వారికి తెలిసిందల్లా గంజాయి దమ్ము కొట్టి మత్తుగా పడిపోవడమే. ఇలాంటి వారు దొంగయోగులు. వీరు బైరాగులే గాని వైరాగులు కారు. ఇక - పొలం దున్నడం తెలియని రైతూ అంతే. ఆ పేరుకు అతను ఎంతమాత్రమూ తగడు. "దున్నే వాడిదే భూమి" అనే నినాదం ఎంతవరకూ కరెక్టో నాకు తెలియదు గాని, దున్నడం రాని రైతు మాత్రం రైతు కాదనే నేనంటాను.

గుర్రం స్వభావం ఏమిటి? చెంగు చెంగున పరిగెత్తడమే. అలా పరిగెత్తలేని గుర్రం, గుర్రం అనిపించుకోదు.బహుశా గాడిద అనిపించుకోవచ్చు. ఎందుకంటే తాపీగా నడవడం గాడిద స్వభావం గాని గుర్రం స్వభావం కాదు కదా మరి !!

ఈ పద్యంలో వ్రాసిన కేసులన్నీ - "విగ్రహపుష్టి నైవేద్యనష్టి" అన్నట్లు పైకి చూడ్డానికి బాగానే ఉంటారు.కానీ లోలోపల డొల్లలు. అంటే "పైన పటారం లోన లొటారం" అన్నమాట. వీరి పరిస్థితి కూడా బాధాకరమే.

చివరి మాట:--

రేపే పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ మనకు పిచ్చి ప్రకోపించడం మామూలే కదా !! ఈ పౌర్ణమికి ఇలా అయ్యి పద్యాలు వ్రాయించిందన్న మాట.

ఏం చేస్తాం !!

కొందరు పిచ్చోళ్ళు పద్యాలు వ్రాస్తారు - నాలాగా.

ఇంకొందరు పిచ్చోళ్ళు వాటిని చదువుతారు - మీలాగా.

మరికొందరు పరమ పిచ్చోళ్ళు తాపీగా ఇదంతా చదివి, "ఏంటీ వ్రాతలు? పిచ్చి గాకపోతే?"-అనుకుంటారు - మీలో కొందరి లాగా.

మరికొందరు సూపర్ పండిత పిచ్చోళ్ళు, "ఈ పద్యాలలో చందస్సూ వగైరాలు తప్పులున్నాయి" అని నాకు గంభీరంగా మెయిల్స్ కూడా ఇస్తారు. ఆఫ్ కోర్స్ అలాంటి సూపర్ పిచ్చోళ్ళను వెంటనే బ్లాక్ చేసేస్తాననుకోండి. అది వేరే విషయం !!

ఏం చేద్దాం? నన్నెవరైనా విమర్శిస్తే నాకస్సలు నచ్చకపోగా అరికాలిమంట నెత్తికెక్కుతుంది.కుండలినీ శక్తి నిద్రలేవడం అంటే అదే!! మీకు చేతనైతే నన్ను పొగడండి.లేదా మౌనంగా ఊరుకోండి. అంతే !! మీకు వేరే చాయిస్ లేదుగాక లేదు.

యోగులకు కోపమే కదా భూషణం !!

నేనింతే ! నా చందస్సూ ఇంతే !! నా పద్యాలూ ఇంతే !!!

Happy Pournami !!  Happy Super Moon !!