Pages - Menu

Pages

19, జనవరి 2017, గురువారం

Donald Trump Oath taking Chart - Predictions

మీడియా వార్తల ప్రకారం రేపు మధ్యాన్నం పన్నెండు గంటల సమయంలో,వాషింగ్టన్ డీసీ లో,డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నాడు. ప్రెసిడెంట్ కుర్చీలో కూచున్నాక ఈయన తీసుకోబోయే నిర్ణయాల వల్ల ముందు ముందు ఎలా ఉంటుందో అని ఎందరికో అనేక భయాలున్నాయి.

ఈ ముహూర్త సమయ కుండలి ప్రకారం ఈయన ఏలబోయే రాజ్యం ఎలా ఉండబోతున్నదో,అసలు ఈయన చెప్పినవన్నీ చెయ్యగలడా, లేడా,మొదలైన విషయాలను గమనిద్దాం.

ఈ ముహూర్తం జ్యోతిష్యం వచ్చినవారు నిర్ణయించినదే అని తెలుస్తున్నది. ఎందుకంటే - సూర్యుడిని దశమంలో ఉంచుతూ మిట్టమధ్యాన్నపు అభిజిత్ లగ్నాన్ని ముహూర్తంగా నిర్ణయించారు. దీనినే మన పల్లెల్లో "గడ్డపార ముహూర్తం" లేదా "పలుగు ముహూర్తం" అంటారు. సూర్యుడు సరిగా నడినెత్తికి వచ్చాడా లేదా అనేది చూడటానికి ఒక పలుగును భూమిలో పాతి దాని నీడ పూర్తిగా మాయం అయినప్పుడు ముహూర్తంగా నిర్ణయిస్తారు.ఈ ముహూర్తం కూడా అదే.

అయితే సూర్యుడు ఊరకే దశమంలో ఉంటే సరిపోదు.ఆయన మంచి బలంగా కూడా ఉండాలి. అది లేనప్పుడు ఏదో అరకొర ఫలితాలే లభిస్తాయి.

ఈ చార్టులో సూర్యుని పరిస్థితి గందరగోళంగా ఉన్నది. గురుదృష్టి సూర్యునికి బలాన్నిస్తున్నప్పటికీ, శని దృష్టి దానిని బలహీనం చేస్తున్నది. సూర్యునికి రెండింట ఉన్న శుక్ర కేతువుల వల్ల అనేక రకాలైన స్కాండల్స్ కనిపిస్తున్నాయి. ద్వాదశంలో ఉన్న బుధునివల్ల రహస్య అజెండాలు దర్శనమిస్తున్నాయి.అష్టమంలోని రాహువు వల్ల ముస్లిం దేశాలతో శత్రుత్వం, నష్టం కనిపిస్తున్నాయి.

ఈ చార్టులో కనిపిస్తున్న మాలికాయోగం కూడా -- ఈయన పాలన అనేక ఎగుడు దిగుడులతో సాగుతుందని సూచిస్తోంది.

ఇప్పుడు ఫలితాలను గమనిద్దాం.

ఈరోజు పుష్య కృష్ణనవమి, శుక్రవారం, స్వాతీ నక్షత్రం అయింది. వార నక్షత్రాదిపతులైన శుక్ర, రాహువులను బట్టి ఈయన పాలసీ అంతా - ముస్లిమ్స్ ని అమెరికాలోకి రాకుండా కంట్రోల్ చెయ్యడం,సుఖవంతమైన జీవితం కోసం బ్రెజిల్ మొదలైన ఇతరదేశాలనుంచి అమెరికాలోకి వస్తున్న వలసదారులను కంట్రోల్ చెయ్యడం మొదలైన పనుల మీద ఉంటుందని ఊహించవచ్చు.

1.లగ్నాధిపతి కుజుని సున్నా డిగ్రీల బలహీన గండాంతస్థితివల్ల --  ఈయన టర్మ్ అనుకున్నంత సాఫీగా ఎదురులేకుండా ఏమీ ఉండదని తెలుస్తున్నది.కుర్చీలో కూచున్న తర్వాత ఈయనను అనేక సంకట పరిస్థితులు చుట్టుముడతాయి. తను చెప్పినవి అన్నీ చెయ్యడానికి అనేక అడ్డంకులు ఈయనకు ఎదురు వస్తాయి. కాకపోతే లోపల్లోపల తన ఎజెండాకు అనుగుణంగా అనేక నిర్ణయాలు తీసుకుంటాడు.కానీ ఆ నిర్ణయాల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. చెప్పినవన్నీ చెయ్యడం అంత సులువు కాదని ఈయనకు బాగా తెలిసి వస్తుంది.

2. చంద్రుని స్థితివల్ల -- ఈయనకు ప్రజాభిమానం ఊహించినంత ఉండదు. అభిమానం కంటే వ్యతిరేకతే ప్రజలలో ఈయనకు ఎక్కువగా ఉంటుంది.

3. రాహువు స్థితివల్ల -- అహంకారపూరితమైన నిర్ణయాలు విధానపరంగా తీసుకోవడం జరుగుతుంది. తను అనుకున్నదే కరెక్ట్ అనే దూకుడు ధోరణివల్ల నష్టపోవడం ఉంటుంది.ఈ ధోరణి వల్ల సన్నిహితులు కూడా క్రమేణా దూరం అవుతారు. ముస్లిం తీవ్రవాదులతో బద్ధవైరం ఉంటుంది. ఈయన పాలసీలన్నీ వాళ్ళను ఎలా కట్టడి చెయ్యాలి అన్నదాని మీదే కేంద్రీకృతం అవుతాయి.

4. గురువు స్థితివల్ల -- దూరదేశాలతో శత్రుత్వం ఎక్కువౌతుంది. మతపరంగా వివిధ వర్గాలతో విభేదాలు ఎక్కువౌతాయి.అయితే -- విపరీత రాజయోగం వల్ల వీటిల్లో కొంత మంచి కూడా చివరకు ప్రాప్తిస్తుంది.

5. శని స్థితివల్ల -- విధానపరమైన నిర్ణయాలవల్ల, శ్రామిక వర్గంతోనూ, పేదప్రజలతోనూ ముఖ్యంగా బ్లాక్స్ తోనూ ఇతనికి కుదరక, చెడ్డపేరు వస్తుంది. ముఖ్యంగా డ్రాగన్ కు సూచిక అయిన చైనాతో, ఇతర శ్రామిక కమ్యూనిస్టు దేశాలతో బద్ధ విరోధం ఏర్పడుతుంది. దశాంశలో శనీశ్వరుని నీచస్థితీ, ఆయనతో కలసిన బుధుని స్థితీ దీనినే సూచిస్తున్నది.

6. బుధుని స్థితివల్ల -- ఈయన ఇచ్చే స్టేట్ మెంట్స్ గాని, ఈయన కమ్యూనికేషన్ గాని అంతా గందరగోళంగా,రెండు పడవల మీద ప్రయాణంలాగా ఉంటుంది. కొంతసేపు నిరంకుశంగా కొంతసేపు ప్రజారంజకంగా ఇలా ద్వంద్వ వైఖరితో సాగుతుంది.

7. సూర్యుని స్థితి వల్ల -- మన దేశానికి ఈయన పాలసీల వల్ల మేలూ కీడూ రెండూ జరుగుతాయి.అయితే మనం భయపడుతున్నంత తీవ్రమైన చెడు ఉండదు.క్వాలిటీ ఉన్న మన వర్క్ ఫోర్స్ కు ఈయన తీసుకునే నిర్ణయాల వల్ల భయం ఉండవలసిన అవసరం ఏమీ లేదు.

8. కేతు శుక్రుల వల్ల -- ఇంటా బయటా ఈయనకు విభేదాలు ఎక్కువై తనవారితోనే క్రమేణా విడిపోవడాలు జరుగుతాయి. ఆడవాళ్ళతో స్కాండల్స్ వల్ల ఈయనకూ ఈయన అనుచరులకూ చెడ్డపేరు వస్తుంది. దశాంశలో నీచశుక్రుని స్థితికూడా దీనినే సూచిస్తున్నది. రాహు కేతు యాక్సిస్ యొక్క స్థితిని బట్టి, శుక్ర కేతువుల బాధకరాశి స్థితిని బట్టి, ముస్లిం తీవ్రవాదులతో అమెరికాకు ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పవచ్చు.

9. నవాంశచక్రం ఎప్పుడూ రాశిచక్రం కంటే బలమైనది. దీనిలో ఒక ముఖ్యమైన సూచన ఉన్నది.కర్కాటకంలో ఉన్న నీచకుజ,బుధ,రాహువులను బట్టి అమెరికా ప్రజలలో దురహంకార ధోరణులు జాత్యహంకార ధోరణులు, ట్రంప్ అధికారంలోకి వచ్చాక బాగా పెరుగుతాయని ఈ గ్రహయోగం సూచిస్తున్నది.

10. మీనంలో ఉన్న శని సూర్య యోగం -- ప్రజలకూ పాలకులకూ ఎప్పుడూ ఉండే అభిప్రాయ భేదాలనూ గొడవలనూ సూచిస్తున్నది.చతుర్ధమైన కర్కాటకం నుంచి దశమమైన మకరంవైపు ఉన్న రాహుకేతు ఇరుసు కూడా దీనినే సూచిస్తున్నది. కన్యనుంచి గురుదృష్టి అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే బలమైన రిపబ్లికన్ సపోర్ట్ ను  సూచిస్తే, ఉత్తర పశ్చిమ రాష్ట్రాలనుంచి ఉన్న డెమొక్రాటిక్ అసమ్మతిని కుంభంలోని చంద్రుడూ మీనంలోని శనీశ్వరుడూ సూచిస్తున్నారు. వెరసి ట్రంప్ పరిపాలన ఒక మిక్సెడ్ బ్యాగ్ కాబోతున్నదని ఈ యోగాలవల్ల తెలుస్తున్నది.

అమెరికా దేశపు సహజలగ్నం మిథునమనీ, ధనుస్సనీ అభిప్రాయ భేదాలున్నాయి. ఈ రెంటిలో ఏదైనా కూడా కొన్ని రోజుల్లో జరుగబోతున్న శనీశ్వరుని గోచారమార్పు ఈ రెంటినీ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

దీనివల్ల రాబోయే రెండున్నరేళ్ళలో అమెరికాతో విదేశాల సంబంధాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. అంటే --అమెరికా ఫారిన్ పాలసీ విధానాలు ఇప్పటిదాకా ఉన్నదానికి విభిన్నంగా తీవ్రమైన మార్పుకు గురౌతాయి.

ఆ తర్వాత శనీశ్వరుడు మకరరాశిలో సంచరించే రెండున్నరేళ్లలో అమెరికా చాలా గడ్డుకాలాన్ని చవిచూస్తుంది. అది ఇంటా బయటా కూడా ట్రంప్ కు గడ్డు కాలమే. అంటే -- ఈయన టర్మ్ లో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ పేలవంగా ఉంటుందని ఆ సమయంలో అనేక సమస్యలను ఈయన ఎదుర్కోవలసి ఉంటుందని గోచారం చెబుతున్నది.