నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

28, మార్చి 2017, మంగళవారం

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !!

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

దేనికోసం నీ యుగాల అన్వేషణ?
దేనికోసం  ఈ ఎడతెగని పరిశ్రమ?

నువ్వు వెదికే హృదయం
ఈలోకంలో ఉందంటావా?
నువ్వాశించే ప్రణయం
నీకసలు లభిస్తుందంటావా?

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

చీకటి నిండిన ఈ లోకంలో
ఆకలి దప్పుల పెనుమైకంలో
నువ్వు కోరే వెలుగు నీకు దొరికేనా?
నీ పయనం ఒక మలుపు తిరిగేనా?

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

పంకంతో నిండిన సరస్సులో
పద్మం కోసం వెదుకుతున్నావా?
స్వార్ధంతో కుళ్ళిన లోకంలో
ప్రేమకోసం తపిస్తున్నావా?

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

పెనుచీకటిలో దారి తెలీకున్నా
ధృవనక్షత్రం పైనే దృష్టి నిలిపి
అరికాళ్లను ముళ్ళు కోసేస్తున్నా
చిరునవ్వును పెదవులపై నిలిపి

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

నిరాశకే ఆశను నేర్పిస్తూ
విధాతకే వణుకును పుట్టిస్తూ
నీ రాతనే నువ్వు మార్చి వ్రాసుకుంటూ
వడపోతగా జ్ఞాపకాలను పేర్చుకుంటూ

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

ఉందో లేదో తెలియని
గమ్యాన్ని వెదుక్కుంటూ
ఎదురౌతుందో లేదో తెలియని
నేస్తాన్ని తలచుకుంటూ

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

కృంగుబాట్లకు చెదరకుండా
వెన్నుపోట్లకు వెరవకుండా
అలుపునెరుగని బాటసారివై
మొక్కవోవని ప్రేమఝరివై

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!