Pages - Menu

Pages

18, ఏప్రిల్ 2017, మంగళవారం

రెండవ అమెరికా యాత్ర - 7 (పూర్ణాయుష్కురాలు Emma Morano జాతకం)


Emma Morano అనే పూర్ణాయుష్కురాలు 117 ఏళ్ళు బ్రతికి మొన్న కన్ను మూసింది. ఈమె జాతకాన్ని నా శిష్యుడు వంశీ ఇండియా నుంచి నాకు పంపించాడు. దానిని మీకోసం ఇప్పుడు ఎనలైజ్ చేసి చూపించ బోతున్నాను. ఇలా చెయ్యడం వల్ల నాకు కొత్తగా ఒరిగేది ఏమీ లేదు. పూర్ణాయుస్సు ఉండాలంటే ఆ జాతకంలో ఏయే యోగాలు ఎలా ఉండాలో మీకు వివరించడం కోసమే ఈ ప్రయత్నం.

రాబోయే మా పుస్తకం లో ఆయుష్య యోగాలను వివరంగా చర్చిస్తాము. ప్రస్తుతానికి ఈ ఒక్క జాతకాన్ని చూడండి.

Emma Moran (29 November 1899 – 15 April 2017) అనే మహిళ 117 ఏళ్ళు బ్రతికింది. ఈమె స్వదేశం ఇటలీ.

8, 3 ఆయుష్య స్థానాలు. వీటిమీద శుభగ్రహాల దృష్టి ఉండి, భావాలు బలంగా ఉంటే వారికి ఆయుస్సు బాగా ఉంటుంది. లేకుంటే చెడిపోతుంది.

ఈమె జాతకంలో చంద్ర లగ్నాత్ తృతీయ అష్టమ స్థానాలు ధనుస్సు, వృషభం అయ్యాయి.వీటిల్లో ధనుస్సులో, లగ్నాధిపతి శుక్రుడు బలంగా ఉన్నాడు.తులా లగ్నానికి యోగకారకుడూ,ఉఛ్చగ్రహమూ అయి ఉండి ఆయుష్కారకుడైన శనితో కలసి ఇంకా బలాన్ని పొందాడు. అష్టమంలో లగ్నాధిపతి అయిన శుక్రుని సూచిస్తున్న కేతువు ఉన్నాడు. అంటే అష్టమాధిపతి అష్టమంలో ఉన్నట్లే. ఇది బలమైన పూర్ణాయుర్యోగం. అందుకే ఈమె 117 ఏళ్ళు బ్రతికింది.

ఆయుస్సును లెక్కించే మార్గాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో ఒక సింపుల్ రూల్ ను ప్రస్తుతం చూద్దాం.

లగ్నం నుంచి అష్టమాధిపతి, సప్తమం నుంచి అష్టమాధిపతి (ద్వితీయాపతి) లలో, బలమైన గ్రహం కేంద్ర పణఫర అపోక్లిమ రాశులలో ఉంటే వరుసగా పూర్ణ, మధ్యమ, అల్పాయుష్షులు ఆ జాతకునికి ఉంటాయన్నది ఒక సూత్రం.

ఈ జాతకంలో అష్టమ ద్వితీయాధిపతులైన గురు బుధులిద్దరూ చతుర్ధ కేంద్రంలోనే ఉన్నారు. కనుక ఇది పూర్ణాయు జాతకం అవ్వాలి. అదే జరిగింది చూచారా !! ఇలాంటి అద్భుతమైన సూత్రాలు జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో ఉన్నాయి.

చైనాలోనూ జపాన్ లోనూ 120 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు ఈనాటికీ ఉంటున్నారు. కానీ వారికి బర్త్ సర్టిఫికెట్స్ లేవు. కనుక వారిని రికార్డ్ పరంగా లెక్కలోకి తీసుకోలేము. ఈమె బర్త్ డిటైల్స్ రికార్డ్ కాబడి ఉన్నాయి గనుక ఈ జాతకాన్ని లెక్కించడం జరుగుతున్నది.

ఆత్మకారకుడు బుధుడు గనుక కారకాంశ మీనం అయింది. అక్కడనుంచి తృతీయంలో మళ్ళీ కేతువు(శుక్రుడు) అష్టమంలో చంద్రుడూ ఉన్నారు. ఇది మళ్ళీ మంచి యోగమే.

ఈమెకు ఎలా చూచినా చంద్రుని నుంచే ఈ ఆయుష్య యోగం పడుతున్నది. కనుక ఈమెకు ఈ జీన్స్ ఈమె తల్లి నుంచి వచ్చాయని ఊహించవచ్చు. ఇది నిజమే.ఈమె తల్లి కూడా దాదాపు నూరేళ్లు బ్రతికింది.

అయితే, లగ్నాత్ చతుర్ధం(సుఖస్థానం) అయిదు గ్రహాల కలయిక వల్ల పాడై పోయింది. అందుకే ఈమెకు సంసార సుఖం లేదు. 27 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ఈమె 39 ఏళ్ల వయసులో తన భర్తనుంచి విడిపోయింది. ఆ తర్వాత దాదాపు 80 ఏళ్ళు ఈమె వంటరిగా బ్రతికింది. ఇది ఈమె జాతకంలోని శాపం. చెడిపోయిన సుఖస్థానం వల్ల కలిగే ఫలితం ఇది.

విచిత్రమేమంటే ఈమెకు వంశపారంపర్యంగా తల్లి నుంచి వచ్చిన దీర్గాయు యోగం ఈమె ఒక్కగానొక్క కొడుక్కి రాలేదు. ఆ అబ్బాయి పుట్టిన ఆర్నెల్లకే చనిపోయాడు. బహుశా అతనికి తండ్రి వైపు జీన్స్ ఎక్కువగా వచ్చి ఉండవచ్చు.

ఈమెకు పెద్దగా రోగాలు లేవు. ఏ మందులూ ఎక్కువగా వేసుకోలేదు. రోజుకు మూడు ఎగ్స్ తినేది. ఇంట్లో తయారు చేసుకున్న బ్రాందీ ఒక గ్లాసు త్రాగేది. ఇవే తన ఆర్యోగ్య ఆయుష్య రహస్యాలని ఆమె చెప్పింది. అసలు విషయం అది కాదు. ఆమె తల్లి వైపు అందరూ నూరేళ్లు బ్రతికిన వారే. ఆ జీన్స్ తనకూ రావడం వల్ల ఈమె అలా బ్రతికింది.

ఇలా నూరేళ్లు దాటి బ్రతికిన వారిని ఏదో గొప్పవారని లోకం అనుకుంటున్నది. ఇదొక పిచ్చి భ్రమ. ఎన్నేళ్లు బ్రతికామనేది గొప్ప కాదు. ఆధ్యాత్మికంగా ఏం సాధించామన్నదే అసలైన విషయం.

నా 'శ్రీవిద్యా రహస్యం' లో ఒకచోట ఇదే వ్రాశాను. మర్రి చెట్టు మున్నూరేళ్ళు బ్రతుకుతుంది. తాబేలు నూరేళ్లు బ్రతుకుతుంది. ఏం ఉపయోగం? చెట్టు చెట్టుగానే ఎండిపోతుంది. తాబేలు తాబేలు గానే ఉండిపోతుంది. అవి దేవతలుగా రూపాంతరం చెందలేవు. ఒక్క మనిషికి మాత్రమే ఆ అవకాశం ఉన్నది. కానీ అతను దానిని అర్ధం చేసుకోకుండా తన జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాడు. అదే ఖర్మంటే !!

వివేకానంద స్వామి 39 ఏళ్ళు మాత్రమే బ్రతికాడు. కానీ ఏం? ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన స్థితిని పొంది ప్రపంచానికి ఆధ్యాత్మిక భిక్ష పెట్టాడు. శ్రీ రామకృష్ణులు 50 ఏళ్ళు మాత్రమే ఈ భూమిమీద ఉన్నారు. కానీ, ప్రపంచపు ఆధ్యాత్మిక గమనాన్ని మొత్తం మార్చివేశాడాయన. అవీ జీవితాలంటే !!

రోజూ గుడ్లు తింటూ బ్రాందీ త్రాగుతూ వందేళ్లు బ్రతికినా వెయ్యేళ్ళు బ్రతికినా ఏమీ ఉపయోగం లేదు. అది పశుజీవితం మాత్రమే.పశువు కూడా తింటుంది. బ్రతుకుతుంది. అలా బ్రతికితే మనిషికీ పశువుకీ తేడా ఏముంటుంది? 30 ఏళ్ళు బ్రతికినా నిజమైన ఋషిలా బ్రతకాలి. అదీ అసలైన బ్రతుకంటే !!

ఈ చక్రం నుంచి జ్యోతిష్యశాస్త్రం లోని ఆయుష్య యోగాలను మాత్రం చక్కగా అర్ధం చేసుకోవచ్చు. అంతవరకే దీని ఉపయోగం. అంతకంటే గొప్ప విషయం ఇక్కడ ఏమీ లేదు.

బాబా జాన్ కూడా వేపచెట్టు క్రింద నూట ఇరవై ఏళ్ళు బ్రతికింది. ఎమ్మా మోరెనో కూడా గుడ్లు తింటూ బ్రాందీ త్రాగుతూ 117 ఏళ్ళు బ్రతికింది. ఇద్దరికీ ఎంత తేడా? బ్రతకడం విషయం కాదు. ఎలా బ్రతికాం? ఏం సాధించాం? అన్నదే అసలు విషయం. మనిషి ఉన్నతంగా ఇవాల్వ్ కానప్పుడు ఎన్నేళ్లు బ్రతికినా వృధానే. ఇది నగ్నసత్యం.