“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

14, మే 2017, ఆదివారం

రెండవ అమెరికా యాత్ర - 32 (లలితా సహస్ర నామాలపై పరాశక్తి ఆలయంలో ఇచ్చిన ఉపన్యాసం)






అలా ఉద్భవించిన లలితా దేవి రెండు పనులు చేసింది. ఒకటి - భండాసురవధ. రెండు - మన్మధుడికి మళ్ళీ జన్మను ఇవ్వడము.

లలితాదేవి యొక్క మంత్రి శ్యామలాదేవి. సైన్యాధిపతి వారాహీదేవి. ఆమెకు అనేకమంది శక్తులతో కూడిన సైన్యం ఉన్నది.వీరందరితో కలసి ఆమె యుద్ధం చేసి భండాసురుడిని, విశుక్రుడిని, విశంగుడిని వారి సైన్యాన్ని సంహరించింది. ఈ విషయాలన్నీ లలితా సహస్ర నామాలలోని ఈ మంత్రాలలో చెప్పబడ్డాయి.

భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితా

విశుక్ర ప్రాణ హరణ వారాహీ వీర్యవందితా

మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా

కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా

ఆ తర్వాత - బూడిదగా మారిన మన్మధునికి ఆమె తిరిగి జీవితాన్నిచింది. అందుకనే అమ్మను - ' హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి' అని సహస్రనామాలలో ధ్యానిస్తాము.

అలా మళ్ళీ బ్రతికిన మన్మదునితో అమ్మ ఇలా చెప్పింది.

'నువ్వు మళ్ళీ వెళ్లి నీ పుష్ప బాణాలను శివునిపైన ప్రయోగించు. అప్పుడాయన మోహితుడై పార్వతిని వివాహం చేసుకుంటాడు. దేవతల పని జరుగుతుంది.'

దానికి మన్మధుడు ఇలా అంటాడు.

'అమ్మా ! ఒకసారి ఆ పని చెయ్యబోయి ఇలా కాలి బూడిదగా మారాను. బుద్ధి వచ్చింది. మళ్ళీ ఎలా శివునిపైన నా బాణాలు ప్రయోగించగలను? నాకు భయంతో వణుకు పుడుతున్నది. ఆ పని చెయ్యమని నన్ను నియోగించకు.'

అప్పుడు లలితాదేవి ఇలా చెప్పింది.

'చూడు మన్మధా! ఈ సారి నీకు ఆ భంగపాటు ఎదురవ్వదు. ఎందుకంటే ఇప్పుడు నేను నీకు శక్తినిస్తున్నాను. అనేక విశ్వాలలో అనేకమంది బ్రహ్మలనూ విష్ణువులనూ శివులనూ నేనే సృష్టించాను. వారి భార్యలైన శక్తులుగా కూడా నేనే ఉంటున్నాను. ఇప్పుడు నా శక్తితో వెళ్ళు. నీ బాణాలకు శివుడు మోహితుడై పోతాడు. నా శక్తి ఎలాంటిదో నువ్వే చూడు.'

ఆ మాటలతో ధైర్యం తెచ్చుకున్న మన్మధుడు తిరిగి వెళ్లి శివునిపైన పుష్పబాణాలను ప్రయోగిస్తాడు. ఆయన వాటికి లోనైపోయి మోహావేశపరవశుడై పార్వతిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు.అప్పుడు వారికి బిడ్డగా జన్మించిన కుమారస్వామి తారకాసుర సంహారం గావిస్తాడు.

యుద్ధంలో భండాసురుడిని సంహరించిన తర్వాత సంతృప్తిని పొంది లలితా దేవి తన పరివార దేవతలైన అష్టసఖులను పిలిచి ఇలా అంటుంది.

' ఓ వశిన్యాది వాగ్దేవతలారా! మీరిప్పుడు నన్ను స్తుతిస్తూ ఒక స్తోత్రాన్ని చెప్పండి. మీ నోటివెంట దానిని వినాలని నేను అనుకుంటున్నాను.'

జగన్మాతను ఆవరించి ఎప్పుడూ ఎనిమింది మంది శక్తులు అష్ట దిక్కులుగా ఉంటారు. వారే వశిన్యాది వాగ్దేవతలు. వీరు శ్రీచక్రంలో సప్తమావరణం అయిన సర్వరోగహర చక్రంలోని అష్టదళాలలో కొలువై ఉంటారు. వీరు జగన్మాతకు ఇష్టసఖులు.

అప్పుడు వారు అమ్మను స్తుతిస్తూ లలితా రహస్య నామాలను ఆశువుగా చెప్పారు. మిగతా దేవతల సహస్ర నామాలను ఎవరో ఒక రుషి రచించడం జరిగింది. కానీ లలితా రహస్య నామాలను మాత్రం సాక్షాత్తూ వశిన్యాది వాగ్దేవతలే చెప్పారు. కనుక అవి చాలా శక్తివంతములైనట్టివి.

ఈ నామముల ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ పూర్వ ఉత్తర పీఠికలు ఇలా అంటాయి.

ఓ అగస్త్య మునీ! విను! 

తంత్రేషు లలితా దేవ్యాస్తేషు ముఖ్యమిదం మునే
శ్రీవిద్యైవ తు మంత్రాణాం తత్ర కాదిర్యధా పరా
పురాణాం శ్రీపురమివ శక్తీనాం లలితా యదా
శ్రీవిద్యోపాసకానాంతు యదా దేవో పరశ్శివ:
తదా నామ సహస్రేషు పరమేతత్ ప్రకీర్తితమ్

తంత్రములలో లలితాతంత్రము ఎట్లు అత్యుత్తమమో, మంత్రములలో శ్రీవిద్య ఎట్లు ముఖ్యమో, మళ్ళీ దానిలో కాదివిద్య ఎట్లా అత్యుత్తమమో, యంత్రములలో శ్రీయన్త్రము ఎట్లు ముఖ్యమో, శక్తులలో లలితాశక్తి ఎట్లు శ్రేష్ఠమైనదో, శ్రీవిద్యోపాసకులలో ఎట్లు పరమశివుడు శ్రేష్టుడో, అదే విధంగా సహస్ర నామాలలో లలితానామాలు అత్యుత్తమములైనట్టివి.

యధాస్య పఠనాద్దేవీ ప్రీయతే లలితాంబికా
అన్య నామ సహస్రస్య పాఠాన్న ప్రీయతే తధా
శ్రీమాతు ప్రీయతే తస్మాదనిశం కీర్తయేదిదం

ఈ నామములను చదవడం వల్ల అమ్మవారు ప్రీతిని పొందినట్లుగా ఇతరములైన నామ పారాయణాదులచేత అవదు.

శ్రీమంత్రరాజ సదృశో యదా మంత్రో న విద్యతే
దేవతా లలితా తుల్యా యదా నాస్తి ఘటోద్భవ 
రహస్య నామ సాహస్ర తుల్య నాస్తి తధా స్తుతి:

శ్రీవిద్యామంత్రం వంటి మంత్రము ఎక్కడా లేనట్లుగా, లలితాదేవి వంటి దేవత లేనట్లుగా, లలితా రహస్య నామముల వంటి నామములు కూడా ఎక్కడా లేవు.

తనను ఎలా అర్చిస్తే తనకు ప్రీతి కలుగుతుందో కూడా అమ్మవారే స్వయంగా చెప్పింది.

చక్రాధిరాజ మభ్యర్చ్వ జప్త్వా పంచ దశాక్షరీం
జపాంతే కీర్తయేన్నిత్యమిదం నామ సహస్రకం

శ్రీచక్రే మాం సమభ్యర్చ్వ జప్త్వా పంచదశాక్షరీం
పశ్చాన్నామ సహస్రం మే కీర్తయేన్మమ తుష్టయే

మొదటగా నన్ను శ్రీచక్రంలో అర్చించాలి. ఆ తర్వాత శ్రీవిద్యా మంత్రాన్ని వెయ్యిసార్లుగాని మూడువందలసార్లు గాని నూట ఎనిమిది సార్లుగాని జపించాలి. ఆ తర్వాత నా సహస్రనామాలు పఠించాలి. అప్పుడు నాకు ప్రీతి కలుగుతుంది.

మామర్చయన్తు వా మా వా
విద్యాం జపతు వా న వా
కీర్తయేన్నామ సహస్రమిదం
మత్ప్రీతయే సదా
జప పూజాద్యశక్తోపి పఠేన్నామ సహస్రకం

ఒకవేళ ఈ తంతు అంతా చెయ్యలేకపోయినా సరే, కనీసం సహస్ర నామాలు పారాయణ చేస్తే నేను సంతోషాన్ని పొందుతాను.

అంటూ సాక్షాత్తూ జగన్మాతయే స్వయంగా చెప్పింది.

(ఇంకా ఉంది)