“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

31, మే 2017, బుధవారం

రెండవ అమెరికా యాత్ర -40 (చికాగో - షాంపేన్ లలో మూడు రోజులు)













ముందే అనుకున్నట్లుగా శనివారం తెల్లవారు జామునే లేచి తయారై ఉదయం ఆరున్నరకల్లా బయలుదేరి ఏడున్నరకు కేంటన్ లో ఉన్న ఆనంద్ గారి ఇంటికి చేరుకున్నాం. వాళ్ళు అప్పటికే అక్కడ మాకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాసేపు అక్కడ కూచుని, మా కార్లు ఆనంద్ ఇంటిదగ్గరే వదిలేసి ముందే తీసుకున్న పెద్ద వ్యాన్లో లగేజి అంతా సర్దుకుని ఎనిమిది ప్రాంతంలో అక్కడనుంచి ఒకే వ్యాన్లో అందరం కలసి బయలుదేరాం. అయిదున్నర గంటల ప్రయాణం తర్వాత ఇల్లినాయ్ రాష్రంలో ఉన్న షాంపేన్ కు చేరాలని ప్లాన్. మధ్యలో చికాగో దగ్గరలో ఉన్నపుడు ఇండియానాపోలిస్ రాష్ట్రంలో నుంచి కొంతదూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఆ విధంగా మూడు రాష్ట్రాలను తాకుతూ ప్రయాణం సాగుతుందన్నమాట.

అనుకున్నట్లుగానే ప్రయాణమంతా జోకులతో నవ్వులతో చాలా సరదాగా సాగింది.మధ్యలో ఒక రెస్ట్ ఏరియాలో ఆగి తెచ్చుకున్న ఉపాహారం సేవించి మళ్ళీ అక్కణ్ణించి బయలుదేరాం. లాంగ్ వీకెండ్ గనుక రెస్ట్ ఏరియాలు కూడా జనాలతో చాలా సందడిగా ఉన్నాయి. ఎక్కువగా ఇండియన్స్, అమెరికన్స్, ఆ తర్వాత చైనీస్ అక్కడ కనిపించారు.

ఇల్లినాయ్ రాష్ట్రానికీ మిషిగన్ రాష్ట్రానికీ మధ్య ఒక గంట టైం తేడా ఉంటుంది. ఇల్లినాయ్ ఒక గంట వెనుక ఉంటుంది. మధ్యలో టైం జోన్ మారినప్పుడు వాచ్ లో సమయం వెనక్కు తిప్పాను. టైం జోన్స్ మీద చర్చ మొదలైంది.

Longitudes, Latitudes, Equinoxes, Solstices, ఉత్తరాయణ దక్షిణాయణాలు, గ్రహ చలనాలూ, ఋతువులూ, గ్రహణాల గురించి దారిలో అందరికీ వివరంగా అర్ధమయ్యేటట్లు చెప్పాను. ఈ టైం జోన్స్ ఎలా ఉంటాయి? దేశాల మధ్యన ఎందుకు టైం మారుతుంది? మొదలైన విషయాలు Astronomy ఆధారంగా అర్ధం చేసుకుంటూ అందరం మాట్లాడుకున్నాం.

మధ్యలో ఒక KFC లో ఆగి కూల్ డ్రింక్స్ తీసుకుని మళ్ళీ అక్కడనుంచి బయల్దేరాం. వెజిటేరియన్ శాండ్ విచ్ తీసుకుందామని అక్కడ కౌంటర్లో ఉన్న అమెరికన్ను అడిగితే, ఎలా చెయ్యాలో మీరు చెబితే ఆ విధంగా చేసి ఇస్తానని అన్నాడు. మీరు ఇండియాలో ఎక్కడనుంచి వస్తున్నారని అడిగితే సౌత్ ఇండియా అని చెప్పాము. అక్కడి వారు చికెన్ కూడా తినరా? నాకు తెలిసిన కొందరు సౌత్ ఇండియన్స్ తింటారే? అని ఆశ్చర్యపోయాడు. అలాంటిదేమీ లేదు, ఇది పర్సనల్ చాయిస్, అంతేకాని కర్చరల్ హేబిట్ కాదు అని అతనికి వివరించి చెప్పాము. 

దారి పొడుగునా సరదా మాటల్లోనే ఖగోళ శాస్త్రాన్నీ, భూగోళ శాస్త్రాన్నీ, జ్యోతిష్యాన్నీ, సైన్సునూ, ఆధ్యాత్మికతనూ స్పర్శిస్తూ నేర్చుకుంటూ మధ్యాన్నం రెండున్నర ప్రాంతంలో షాంపేన్ లో ఉన్న శ్రీనివాస్ గారి ఇంటికి చేరుకున్నాం. కానీ ఒక గంట వెనక్కు రావాలి గనుక అప్పటికి అక్కడ సమయం ఒకటిన్నర మాత్రమే అయింది. మేము అక్కడకు చేరేసరికి శ్రీనివాస్ దంపతులు మాకోసం ఎదురుచూస్తున్నారు. వారి ఇద్దరు అబ్బాయిలు కూడా అమెరికాలోనే వేరే రాష్ట్రాలలో ఉద్యోగాలు/ చదువులలో ఉన్నారు. నేనొస్తున్నానని వాళ్ళు కూడా ఒకరోజు ముందే వచ్చి ఉన్నారు.

సాయంత్రం చాలా డీపర్ విషయాల గురించి ఉపన్యాసం ఇవ్వాలి గనుక కొంత రెస్ట్ అవసరం. అందుకని వెంటనే భోజనాలు కానిచ్చి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి లేచేసరికి గీతా, ఆమె భర్తా పిల్లలూ కూడా వచ్చి ఉన్నారు. అక్కడకు వాళ్ళు నాలుగు గంటల దూరంలో ఉంటారు. షాంపేన్ లో రెండురోజులు నాతో కలసి ఉండాలని అందరూ బయల్దేరి వచ్చేశారు. అందరం కాసేపు కూచుని మాట్లాడుకున్నాక, కొంచం ఫ్రెష్ అయి, ఊరికి కొంచం బయటగా పొలాలలో ఉన్న సరస్వతీదేవి ఆలయానికి బయలుదేరాం.