Pages - Menu

Pages

4, జూన్ 2017, ఆదివారం

రెండవ అమెరికా యాత్ర -44 (బోటింగ్ మెడిటేషన్)

మంజు ఆంటీ వచ్చేసరికి మధ్యాన్నం పన్నెండు అవుతుందని ఆమె ఫోన్ చేసి చెప్పింది. మేము ఉదయాన్నే లేచి తయారై ఉపాహారం సేవించి లేక్ దగ్గరకు చేరుకున్నాం. ఇక్కడ సమ్మర్ మొదలైనప్పటికీ మనం ఇండియాలో అందులో గుంటూరు విజయవాడ ఎండలు చూసినవాళ్ళం గనుక మనకు ఇదొక లెక్క కాదు. ఇది మన చలికాలంలా ప్లెజంట్ గా ఉంది. కనుక బోటింగ్ చేద్దామని ప్లాన్ చేశాం.

రేవులో ఒక ప్లాస్టిక్ పెడలింగ్ బోటు రెడీగా ఉన్నది. అందులో ఇద్దరు మాత్రమే బోటింగ్ కు వెళ్ళవచ్చు. అందుకని ఇద్దరిద్దరు చొప్పున బోటింగ్ కు బయల్దేరాం. అలా కొన్ని రౌండ్స్ అయిన తర్వాత, ఒడ్డున కూచుని మాట్లాడుతున్న నేను అప్రయత్నంగా ధ్యానంలోకి వెళ్ళిపోయాను. నన్ను చూచి అందరూ నా పక్కనే కూచుని వాళ్ళూ ధ్యానం మొదలు పెట్టారు. ఈ విధంగా జరగడం, అప్రయత్నంగా ధ్యానస్థితి దానంతట అదే పైకొనడం పంచవటి సభ్యులకు, ముఖ్యంగా నాతో క్లోజ్ గా ఉండేవారికి చాలాసార్లు అనుభవమే.

అయితే, అప్పుడొక విచిత్రం జరిగింది. ఆ సమయంలో సరళాదేవి, ఆనంద్ బోటింగ్ చేస్తూ లేక్ మధ్యలో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో అసంకల్పితంగా వాళ్ళిద్దరూ కూడా పెడలింగ్ ఆపేసి ధ్యానస్థితిలోకి వెళ్ళిపోయారు. బోటు అలా నీటిపైన తేలుతూ ఉండిపోయింది. అలా ఒక అరగంట సేపు లేక్ మధ్యలో బోటులో తేలుతూ ఉన్న తర్వాత అలల తాకిడికి బోటు ఇంకోవైపుకు ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అప్పుడు వాళ్ళు తేరుకుని మళ్ళీ పెడలింగ్ చేస్తూ మావైపు వచ్చారు. ఆ తర్వాత మాతో పాటు కలసి ఇంకొక అరగంట వాళ్ళూ ధ్యానం చేశారు. ఇంటర్నల్ గా కనెక్ట్ అయి ఉన్న మనుషులు దూరంతో సంబంధం లేకుండా మనతో ఎలా రెస్పాండ్ అవుతారు అనడానికి ఇదొక ఉదాహరణ. ఈ మధ్యకాలంలో ఇలాంటి లోతైన ధ్యానస్థితి ఎప్పుడూ రాలేదని ఆనంద్ ఆ తర్వాత నాతో అన్నాడు.

నిజానికి, ఒక ధ్యాని మాత్రమే జీవితంలో ప్రతి క్షణాన్నీ ఎంజాయ్ చెయ్యగలడు. ఎందుకంటే అతని మనస్సూ ఇంద్రియాలూ పూర్తిగా అతని కంట్రోల్లో ఉంటాయి గనుక. అలా ఉన్నప్పుడు మనం ఏది చేస్తున్నా ధ్యానస్థితి మననుంచి జారిపోదు. అయితే ఇది తేలికగా వచ్చే స్థితి కాదు. ఎన్నో ఏళ్ళ కఠోర సాథనతో ఈ స్థితిని సాధించుకోవాలి. ఇదంతా చెయ్యలేని మామూలు మనుషులు జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నామన్న భ్రమలో బ్రతుకుతూ ఉంటారు గాని నిజానికి వారిది ఎంజాయ్ మెంట్ కాదు. భయంతో కూడిన తొందరపాటు పరుగు మాత్రమే.

ధ్యానం అంటే ఎందఱో ఎన్నో విధాలుగా నిర్వచనం ఇచ్చారు. నేనిచ్చే నిర్వచనం ఏమంటే - జీవితాన్ని అన్ని రకాలుగా పూర్తిగా ఎంజాయ్ చెయ్యడమే నిజమైన ధ్యాని లక్షణం అని నేనంటాను. నిజానికి ధ్యానంలో మంచి మాస్టరీ ఉన్నవారే అలా చెయ్యగలరు. మిగతావారికి అది సాధ్యం కాదు.

అందరం కలసి అలా ఆరుబైట పచ్చికలో ధ్యానంలో ఒక గంట గడిపాక మంజు ఆంటీ వచ్చారని అందరం లేచి ఆమెను ఆహ్వానించడానికి ఇంటి ముందుకు వెళ్లాం. ఆమె కారు తనే డ్రైవ్ చేసుకుని వచ్చారు. ఆమె పొట్టిగా సన్నగా ఉన్నారు. వయస్సు దాదాపు 70 పైనే ఉంటుంది. చిన్నపిల్లలా స్వచ్చమైన ముఖంతో నిర్మలమైన కళ్ళతో ఉన్నారు.

ఆమె ఒక రెండు గంటలు మాతో గడిపారు. ఆమె మాతో ఏం మాట్లాడారో ఆ వివరాలన్నీ వచ్చే పోస్ట్ లో వ్రాస్తాను. ప్రస్తుతానికి బోటింగ్ ఫోటోలు మీ కోసం.