“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

15, జూన్ 2017, గురువారం

రెండవ అమెరికా యాత్ర -50 (మాషీ మా)

అరవై ఏళ్ళ నాడు జరిగిన సంగతొకటి నాకిప్పుడు గుర్తొస్తోంది. తల్లీ తండ్రీ లేని ఒకమ్మాయి ఉండేది. ఆమె పేరు ఆశా. వాళ్ళు క్రిష్టియన్స్. ఆమె ఒరిస్సాలోని కటక్ నుంచి వచ్చి కలకత్తాలో హాస్టల్ లో ఉంటూ చదువుకుంటూ ఉండేది. ఆమె మా నాన్నగారి స్టూడెంట్. ఆ రోజుల్లో విద్యార్ధులకు వారి టీచర్స్ తో ఎంతో గొప్పదైన అనుబంధం ఉండేది.

ఒక వేసవి మిట్ట మధ్యాన్నం రోజున, మా అమ్మ పనంతా ముగించుకుని నిద్రపోతోంది. కానీ మా తలుపులు తెరిచే ఉండేవి. ఏదో పనుండి ఆశా మేముంటున్న బజారుకు వచ్చింది. మా ఇంటికి వచ్చిన ఆమె, మా అమ్మ నిద్రపోవడం చూచింది. పెద్ద బొంత లాంటిదాన్ని వేసుకుని అమ్మ పడుకునేది. ఎండకు అలసిపోయిన ఆశా, అమ్మ పక్కనే వచ్చి పడుకుని తనూ నిద్రలోకి వెళ్ళిపోయింది. నిద్రలో వత్తిగిల్లిన అమ్మ తలకు ఆశా తల తగిలింది. ఇద్దరూ ఒకే సారి మేల్కొన్నారు. ఆ తర్వాత స్నాక్స్, టీ సేవించి కాసేపు అదీ ఇదీ మాట్లాడి ఆశా తన హాస్టల్ కు వెళ్ళిపోయింది. సాయంత్రానికి మా నాన్న యూనివర్సిటీ నుంచి ఇంటికి వచ్చారు. మా అమ్మ ఆయనతో ఇలా చెప్పింది.

'ఇప్పుడు నేను స్నానం చెయ్యబోతున్నాను.'

ఆయన ఇలా అడిగారు.

'స్నానమా? ఈ సమయంలోనా? ఎందుకు?'

జరిగిన విషయాన్ని చెబుతూ అమ్మ ఇలా అన్నది.  ' ఆ క్రిష్టియన్ ఆశా వచ్చి నా దిండుమీదే తనూ తలపెట్టి పడుకుంది. అందుకని.'

దానికి మా నాన్న ప్రశాంతంగా ఇలా అన్నారు.

'ఓహో అదా సంగతి! అందుకా నువ్వు స్నానం చెయ్యాలని అనుకుంటున్నావు. సరే, రేపు యూనివర్సిటీలో ఆ అమ్మాయి కనిపించినప్పుడు ఈసారి మా ఇంటికి రావద్దని ఆమెతో చెబుతాలే'

అమ్మ నొచ్చుకుంటూ ఇలా అంది.

'ఓ వద్దు వద్దు. అలా చెప్పకండి. ఆమె బాధపడుతుంది. పాపం తల్లీ తండ్రీ లేని పిల్ల.'

నాన్న ఇలా జవాబిచ్చారు.

' అవునా? ఆ విషయం గుర్తుందా నీకు? తను నిన్ను అమ్మా అని పిలుస్తుంది కదా. నీ కూతురు నీకు తగిలితే నువ్వు స్నానం చేస్తావా? ఏ రకమైన తల్లివి నువ్వు?'

అమ్మ బిత్తరపోయింది. స్నానానికి వెళ్ళే ఆలోచనను విరమించుకుంది. ఆ తర్వాత ఎప్పుడూ అలాంటి ఆచారాలు ఆమె పాటించలేదు. తర్వాత రోజులలో ఆమె మాతో ఇలా అనేది.

' ఆరోజున నేను మంచి గుణపాఠం నేర్చుకున్నాను.'

ఇదంతా శ్రీ శారదామాత ఉపదేశాల ప్రభావం. ప్రేమను మించిన ఆచారం ఏదీ లేదని అమ్మ ఎప్పుడూ చెప్పేది.

కొంతకాలం క్రితం ఇక్కడే అమెరికాలో ఒకబ్బాయి ఉండేవాడు. అతనిక్కడ పని చేస్తూ ఉండేవాడు. ప్రస్తుతం ఇక్కడ లేడు. ఇండియాకు వెళ్ళిపోయాడు. చాలా సంవత్సరాలుగా అతను నాకు తెలుసు. అలా కొన్నేళ్ళు గడిచాక ఒకరోజున అతన్ని ఇలా అడిగాను.

'నీ పేరు నాకు తెలుసు. మీ ఇంటి పేరు ఏమిటి?'


అతను వెంటనే తల దించుకున్నాడు. మెల్లిగా ఇలా అన్నాడు.


'మాషీ. మాది షెడ్యూల్డ్ కాస్ట్.'


వెంటనే నేను ఇలా అన్నాను.


'ఓ అవునా? మరి ఇన్నేళ్ళూ ఎందుకు నాకీ విషయం చెప్పలేదు? ఇన్నేళ్ళూ మా ఇంటికి ఎందుకు వస్తున్నావు? గెటౌట్ ఫ్రం మై హౌస్.'


అతను మెల్లిగా లేచి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాడు.


ఇలా అన్నాను.

'ఆగు. ఇదేనా నువ్వు నన్నర్ధం చేసుకున్నది? ఇన్నాళ్ళూ నన్ను మాషీ అని పిలుస్తున్నావు. మాషీ అంటే ఏమిటో నీకు తెలుసా? పిన్ని అని అర్ధం. అంటే నేను మీ అమ్మకు చెల్లెల్ని. మన మధ్యన కులం మతం జాతీ అనేవి అడ్డు కావు. నీదీ నాదీ ఒకటే కులం. అర్ధమైందా? మరి అలాంటప్పుడు నాతో ఇలాగేనా నువ్వు మాట్లాడేది? నేనెందుకు నిన్ను ఇంట్లోంచి వెళ్లి పొమ్మని అన్నానో తెలుసా? ఇన్నేళ్ళుగా నన్ను గమనిస్తూ, మా ఇంటికి వస్తూ పోతూ కూడా నువ్వు నన్ను ఏమాత్రం అర్ధం చేసుకోలేదు. అందుకే 'గెటౌట్' అన్నాను.'

అతను ఏడ్చేశాడు.


'నాకు కులం గిలం ఇవన్నీ ఏమీ లేవు. నేను ఒక చెడురోజున పుట్టాను. నా జాతకం చూచి మా బాబాయి మా అమ్మతో ఇలా అన్నాడు.' వదినా ! దీని జాతకం చూడు. దీనికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తాం కదా. అయినా సరే. ఎవరైనా దీన్ని ప్రేమగా చూస్తె అందర్నీ వదిలేసి వాడితో వెళ్ళిపోతుందిది. అలాంటి ప్రేమతత్వం దీనిది.


అందరూ అడుగుతుంటారు. ఎందుకింకా చార్ల్స్ టన్ వెళుతున్నావు? అని. నేను ఎవరికోసమో వెళ్ళడం లేదు. నాకోసం వెళుతున్నాను. అక్కడకు వెళ్లి అందరికీ సాయం చేస్తే నాకు బాగుంటుంది. మొదట్లో ప్రతివారం వెళ్ళేదాన్ని. ఇప్పుడు నాకూ తెలివితేటలు పెరిగాయి. అందుకే, ప్రస్తుతం నెలకొకసారి మాత్రమే వెళుతున్నాను. ఈ మధ్యనే తిరిగి వచ్చేటప్పుడు పెద్ద వాన పడింది. డ్రైవింగ్ చాలా కష్టం అయింది. నేనేం కేర్ చెయ్యలేదు. దేవుడితో ఒకటే చెప్పాను. మొత్తం నువ్వే చూసుకో అని. ఏమీ కాలేదు. నేను క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాను.

చాలా సార్లు నా కారు ప్రమాదానికి గురైంది. ఒకసారి తుక్కు తుక్కు అయిపొయింది. కానీ నాకేం కాలేదు. పోలీసులొచ్చి నన్ను హాస్పటల్ కు వెళ్ళమన్నారు. ఎందుకు అని వారిని అడిగాను. ఒకసారి చెకప్ చేయించుకోండి. లోపల బోన్స్ ఏమైనా విరిగాయేమో అని అన్నారు. వాళ్ళ ఎదురుగానే రోడ్డు మీద డాన్స్ మొదలు పెట్టాను. వాళ్ళు నవ్వి వెళ్ళిపోయారు. ఒక్కసారి మాత్రం నా పొరపాటు వల్ల యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు రోడ్డుమీద నీళ్ళున్నాయని అనుకున్నాను. కానీ ఐస్ ఉంది. అదిగాని ప్రతిసారీ ఎదుటివారి తప్పువల్లే జరిగింది. నేనే కారునూ డాష్ ఇవ్వను. అప్పుడప్పుడూ సైడ్ వాక్ కు మాత్రం తగులుతూ ఉంటాను అంతే.

ఒకసారి ఒక అమెరికా కుర్రవాడొచ్చి నా కారుకు డాష్ ఇచ్చాడు. నేను కారు దిగేసరికి అతను భయంతో ఏడుస్తున్నాడు. 'ఊరుకో బాబూ. తప్పులు ఎవరైనా చేస్తాం. ఏం కాదులే. భయపడకు. నువ్వు బాగున్నావు. నేను బాగున్నాను. ఇది చాలా ముఖ్యమైన విషయం. కార్లకు దెబ్బలు తగిలితే పరవాలేదులే. బాగు చేసుకోవచ్చు.' అని అతన్ని ఓదారుస్తున్నాను. ఇంతలో పోలీసొచ్చాడు. అతనికి ఏమీ అర్ధం కాలేదు. 'మీలో ఎవరు ఎవర్ని గుద్దారు?' అని అతను అడిగాడు. మనం ఇలాగే ప్రవర్తించాలి. ఇలా మనం చెయ్యకపోతే అది మానవత్వానికే మచ్చ అవుతుంది.

నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. 'మాషీ. మా అబ్బాయి మెడిసిన్ చదువుతున్నాడు. లేదా లాయర్ కావాలని అనుకుంటున్నాడు. అతన్ని ఆశీర్వదించు.' అని. వారికిలా చెబుతాను.

'దానికి నా ఆశీస్సులు ఏమీ అవసరం లేదు. అదంతా అతని కృషిని బట్టి ఉంటుంది. కానీ నేను ఒక్క విషయం చెబుతాను. 'నువ్వు మంచి మనిషిగా తయారవ్వు. నీ మానవ జన్మను సార్ధకం చేసుకో.' అని మాత్రమే నేను చెబుతాను. పూజలు చెయ్యడం, గంట గణగణ మోగించడం నా వల్ల కాదు. అది నా మార్గం కాదు. దాని బదులు ఒకరిని వీల్ చెయిర్లో తీసికెళ్ళి సాయం చెయ్యడం నాకు ఇష్టంగా ఉంటుంది. అదే అసలైన పూజ.

అదే స్వామి వివేకానంద చెప్పిన అసలైన పూజ. మనం ఇదే చెయ్యాలని ఆయన ఆశించారు. దీనికోసమే సిస్టర్ నివేదిత తన దేశాన్ని, మతాన్ని తన మనుషులని అందరినీ వదిలేసి మన దేశానికి వచ్చింది. సన్యాసిని అయింది. ఇండియాకు సేవ చేస్తూ చనిపోయింది.

లండన్లో ఉండగా ఆమె స్వామి వివేకానందను ప్రేమించింది. ఆయనకు ప్రొపోజ్ కూడా చేసింది. ఆయనిలా అన్నారు. 'నేను సన్యాసిని. బ్రహ్మచారిని. నువ్వు కోరుతున్న విధంగా నిన్ను ప్రేమించలేను. కానీ నీకొక మార్గం చెబుతాను.నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తుంటే, నాతో మా దేశానికి రా. ఇండియాకు సేవ చెయ్యి. అక్కడున్న దిక్కులేని ఆడవాళ్ళకు సేవ చెయ్యి. ఆ పనిలో నీ జీవితాన్ని పునీతం చేసుకో. అప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నిజంగా నమ్ముతాను.'

ఆమె తన ప్రేమను నిరూపించుకుంది. ఇండియాకు సేవ చేస్తూ ఆమె తనువు చాలించింది. అదీ నిజమైన ప్రేమ అంటే !!

అదీ నా జీవితం! అదీ మా నాన్న జీవితం! మేమందరం ఠాకూర్ నుంచి,శ్రీశ్రీ మా నుంచి, వివేకానంద స్వామి నుంచి, ఎంతో నేర్చుకున్నాం. స్ఫూర్తిని పొందాం.

మీకో విషయం చెప్పనా? మా నాన్న సోమవారం నాడు చనిపోయారు. శుక్రవారం నాడు డాక్టర్ వచ్చి ఆయన్ను చెకప్ చేసి ఇలా అన్నారు.

'అంకుల్. మీ రీడింగ్స్ అన్నీ బాగున్నాయి.మీరు ఆరోగ్యవంతులుగా ఉన్నారు.'

మా నాన్నకు డయాబెటీస్ ఉండేది. తీవ్రమైన ఆస్మా కూడా అప్పుడప్పుడూ ఆయన్ను బాధించేది. కానీ ఆరోజున అన్నీ నార్మల్ గా ఉన్నాయి. అప్పుడాయన ఇలా అన్నారు.

'డాక్టర్ బాబూ. చాలా సంతోషం. ఎందుకంటే, ఇప్పుడు నా పన్నెండో కూతురు బీ.ఏ పరీక్ష వ్రాసేసింది. ఇప్పుడు నేను పోయినా నాకేం భయం లేదు. వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నపుడు నాకు జబ్బు చేస్తే నేను చాలా భయపడేవాడిని. వాళ్ళను దిక్కులేని వారిగా ఒదిలేసి పోతానేమోనని. కానీ ఇప్పుడా భయం లేదు. వాళ్ళు బ్రతకగలరు. కనుక ఇప్పుడు నేను పోయినా నాకేం బాధ లేదు.'

ఆయనెప్పుడూ ఒక మాటను తరచుగా అనేవారు.

'నేను పోయే రోజున జగన్మాతే స్వయంగా వచ్చి నన్ను తీసుకెళుతుంది. అమ్మ తప్ప ఇంకెవరూ నన్ను తాకను కూడా తాకలేరు.'

అంతకు చాలా కాలం ముందు ఒక సంఘటన జరిగింది. అప్పుడు కూడా రోగంతో ఆయన చావుకు దగ్గరయ్యారు. డాక్టర్లు ఆశ వదిలేశారు. ఆయన్ను మంచం నుంచి దించి నేలమీద పడుకోబెట్టారు. మా అమ్మావాళ్ళు అందరూ ఏడవడం మొదలు పెట్టారు. సాయంత్రం నాలుగు గంటలైంది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. మీకు అక్షయ చైతన్య బ్రహ్మచారి తెలుసా? శ్రీ శ్రీమాకు ఆయన ఒక శిష్యుడు. ఆయన ఎందుకో ఉద్బోధన్ ఆఫీసుకు వచ్చాడు. మా నాన్నను చూడాలనిపించి 'గోకుల్ బాబూ, గోకుల్ బాబూ' అని పిలుస్తూ దగ్గరలోనే ఉన్న మా ఇంటికి వచ్చాడు. మా నాన్నకు స్పృహ లేదు. అందరం చుట్టూ కూచుని ఏడుస్తూ ఉన్నాం. మా నాన్న మూడో అంతస్తులో ఉన్నాడు. అక్షయ చైతన్య బ్రహ్మచారి మెట్లెక్కి వెతుక్కుంటూ వస్తున్నాడు. ఎవరో రెండో అంతస్తులోనే ఆయనకు చెప్పారు ఇదీ సంగతి అని. ఆయన వచ్చి సరాసరి మా నాన్న తలదగ్గర కూచుని మౌనంగా మంత్రజపం మొదలుపెట్టాడు. కాసేపటికి నాన్న కళ్ళు తెరిచి ఏమీ జరగనట్లుగా -' మీరు ఎప్పుడొచ్చారు?' అని ఆయన్ను అడిగాడు. అంతే ! అక్కడ సీనంతా మారిపోయింది. అందరూ నవ్వుకుంటూ లేచి సమోసాలు చాయ్ సేవించడం మొదలుపెట్టారు. వారందరూ అమ్మ బిడ్డలు. అమ్మను చూచి అమ్మను సేవించిన పవిత్రాత్ములు. వారిలో అంత శక్తి ఉండేది.

సరే ఆ సంఘటన ఎప్పుడో ఎన్నేళ్ళ క్రితమో జరిగింది కదా. ఇప్పుడు మళ్ళీ మా నాన్నకు బాగులేదు. డాక్టర్ భట్టాచార్య వచ్చి చెక్ చేసి మీ రీడింగ్స్ అన్నీ బాగున్నాయని చెప్పగా మా నాన్న అలా అన్నారు. అది శుక్రవారం నాడు సాయంత్రం. మా నాన్న ప్రతిరోజూ వెళ్లి స్వామి శారదానందగారిని దర్శించి వచ్చేవాడు. ఆరోజు కూడా వెళ్లి వచ్చాడు. ఏది ఎలాగున్నా సరే అదిమాత్రం జరగాల్సిందే. మా ఇంట్లో సంగీత వాయిద్యాలుండేవి. మా నాన్నగారు మంచి గాయకుడు. ఆర్గాన్ వాయిస్తూ ఆయన ప్రతిరోజూ రాత్రిపూట భక్తిగీతాలను ఆలపించేవాడు. శనివారం నాడు 24 మే. ఆరోజున కలకత్తాలో చాలా వేడిగా ఉండింది. ఆరోజు రాత్రి ఆయన పాడలేదు. 25 కూడా అలాగే గడిచింది. సోమవారం వచ్చింది. బయట చాలా వేడిగా ఉందంటే, ఆయన ఒళ్ళు తడిగుడ్డతో తుడిచి టాల్కం పౌడర్ అద్దాను. 'చాలా హాయిగా ఉందమ్మా' అని ఆయనన్నారు. అందరినీ వెళ్లి భోజనం చెయ్యమని పంపాను. నేనే మా నాన్న దగ్గర ఉన్నాను. అందరూ క్రింద అంతస్తులో ఉన్నారు. ఇంతలో మా నాన్న హటాత్తుగా తన ఎదురుగా ఎవరినో చూస్తున్నట్లు ఆనందంతో - అమ్మా అమ్మా అమ్మా - అని మూడుసార్లు అరిచారు. కళ్ళు మూతలు పడ్డాయి. ప్రాణం పోయింది. అంతే !

మా పెద్దన్న అప్పట్లో మద్రాస్ లో గ్రౌండ్ ఇంజినీర్ గా ఉన్నారు ఆయన బాస్ కు నేనే ఫోన్ చేశాను. ఆయనిలా అన్నారు. 'ఇప్పుడే స్పెషల్ ప్లేన్ ను మద్రాస్ పంపిస్తున్నాను. దులాల్ సాయంత్రానికి వచ్చేస్తాడు.' అనుకున్నట్లుగానే మా పెద్దన్నయ్య సాయంత్రానికి మద్రాస్ నుంచి కలకత్తాకు వచ్చాడు. ఇంటికి వచ్చీ రావడంతోనే కూలబడి ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే మా నాన్నగారు మా అందరికీ తండ్రి మాత్రమే కాదు. ఆయన మా అందరికీ బెస్ట్ ఫ్రెండ్ కూడా.

మమ్మల్ని ఆయనెప్పుడూ అరవలేదు. కొట్టలేదు తిట్టలేదు. మేం ఏదైనా పరీక్షలో తప్పినప్పుడు ఎందుకు తప్పావు అని ఒక్కసారి కూడా మమ్మల్ని ఆయన ప్రశ్నించలేదు. ఆయన చాలా ఖచ్చితమైన మనిషి. అదే సమయంలో ఆయన ఎంతో ఆధ్యాత్మికమైన వాడు. ఆయన మనసు ఎంతో మెత్తనిది. కానీ అదే సమయంలో చాలా గట్టిది కూడా. తనకోసం కాదు. ఇతరుల కోసం.

మనకు స్వతంత్రం వచ్చిన సమయంలో కలకత్తాలో హిందూ ముస్లిం గొడవలు తారాస్థాయిలో జరిగాయి. చాలా రక్తపాతం జరిగింది. ఆ సమయంలో ఒకసారి, మా ఇంటిపక్కనుంచి అరుపులు వినిపిస్తే చూద్దామని మా నాన్న వెళ్లారు. నేనూ ఆయన పక్కనే ఉన్నాను. మేం పై అంతస్తు నుంచి తొంగి చూచాం. మా ఇంటి పక్కన ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆయన్ను మేం దాదా అని పిలిచేవాళ్ళం. ఆయన చేతిలో పెద్ద కత్తి తీసుకుని అరుస్తూ కనిపించాడు. ఎదురుగా నేలమీద ఒక ముస్లిం ఉన్నాడు. ఆ ముస్లిం పాలకోసం అక్కడకు వచ్చాడు.

'ఏం గొడవ జరుగుతున్నదక్కడ?' అంటూ నాన్న అరిచారు.

ఆ ముస్లిం తలెత్తి పైకి చూచాడు.

' బాబూ నన్ను రక్షించండి. నాకు చిన్న పిల్లలున్నారు.' అంటూ మా నాన్నకు దణ్ణం పెట్టాడు.

మా నాన్న ఇలా గద్దించాడు.

'ఏయ్. ఆగు నేను క్రిందకు వస్తున్నాను.'

ఇలా అంటూ క్రిందకు వెళ్ళిన ఆయన ఇలా అన్నాడు.

'ఎందుకు అతన్ని చంపాలని అనుకుంటున్నావు?'

'ఈ ముస్లిములు మన హిందూ అమ్మాయిలను ఎత్తుకెళ్ళి పోతున్నారు. నానా చెడు పనులు చేస్తున్నారు. వీళ్ళను బ్రతకనివ్వ కూడదు.' అని ఆ బ్రాహ్మణ దాదా కోపంగా అరిచాడు.

మా నాన్న ఇలా అన్నాడు.

'వద్దు. అతని ముఖం చూడు. చిన్న పిల్లలున్నారని అతను అంటున్నాడు. నీకంతగా ప్రాణమే తియ్యాలని అనుకుంటే నా ప్రాణం తీసుకో. అతన్ని వదిలేయ్'

మా నాన్నకు ఆ బజార్లో మంచి పేరుండేది. మా నాన్న అలా అనేసరికి దాదా ఇంకేమీ అనలేకపోయాడు. కత్తి దించేశాడు. ఆ ముస్లింతో ఇలా అన్నాడు.

'పో. పారిపోయి నీ ప్రాణం కాపాడుకో. ఈ బజారును వదిలి వెళ్ళిపో.'

అదే విధంగా, మా అత్తా మామలను ముస్లిములు రక్షించారు. మా వాళ్ళు ముస్లిం బజారులో ఉండేవారు. గొడవలు తారాస్థాయికి చేరినప్పుడు వాళ్ళను భద్రంగా తీసుకొచ్చి మా ఇంట్లో దించారు ముస్లిములు.

వాళ్ళు హిందువులా ముస్లిములా అనేది సమస్య కాదు. సైతాన్ ప్రతిచోటా ఉంటాడు. దేవుడూ ప్రతిచోటా ఉంటాడు. మనం ఎవరి అదుపులో ఉన్నామన్నదే అసలైన పాయింట్.

నేను మా నాన్నను ఇదే అడిగాను.

'అసలు సైతాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? దేవుడు మంచివాడైతే చెడును ఎందుకు ఈ సృష్టిలో ఉంచాడు?'

మా నాన్న ఇలా అన్నారు.

'ఎందుకంటే, రాత్రి లేకుంటే పగటి విలువ ఎవరికి తెలుస్తుంది? అందుకు.'

ఆ దారిలో పోతే మీకు శిక్ష పడుతుంది. ఆ దారిలో వెళ్ళకండి. మంచి మార్గంలో నడవండి. అప్పుడు మీకు శాంతి దొరుకుతుంది అని చెప్పడం కోసం దేవుడు సైతాన్ని సృష్టించాడు. మంచినీ చెడునూ అందుకే ఆయన సృష్టించాడని మా నాన్న నాకు చెప్పాడు.

ఇదంతా చెప్పిన మాషీమా ఒక్కసారిగా ఇలా అంది.

'ఓకే ! నాలుగు గంటల నుంచీ మాట్లాడుతున్నాను. ఇక చాలు.'

ఏదన్నా పాట పాడమని ఆమెను కోరారు వింటూన్నవారిలో కొందరు.

సరేనంటూ ఆమె ఈ పాటను ఆలపించింది.

తుమీ హో మాతా పితా తుమీ హో
తుమీ హో బంధూ సఖా తుమీ హో
తుమీ హో సాథీ తుమీ సహారే
కోయీ న అప్నా శివా తుమ్హారే
తుమీ హో నయ్యా తుమీ ఖబయ్యా
తుమీ హో బంధూ సఖా తుమీ హో
జో ఖిల్ సకేనా వో ఫూల్ హం హై 
తుమ్హారే చరణోం కే ధూల్ హం హై 
దయా కీ దృష్టి సదా హి రఖనా
తుమీ హో బంధూ సఖా తుమీ హో
తుమీ హో బంధూ సఖా తుమీ హో

ఈ పాట పాడిన తర్వాత తను ఇంట్లో చేసి మాకోసం తీసుకొచ్చిన బెంగాలీ స్వీట్ Mishti Doi (తీపిపెరుగు) ని మాకిచ్చి తినిపించింది ఆమె. కొంచం సేపు ఉన్న తర్వాత, అందరి దగ్గరా సెలవు తీసుకుని తన కారును డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది.

శారదామాత అనుగ్రహం తీర్చిదిద్దిన ఒక పుణ్యాత్మురాలిని చూస్తూ మేమందరం అలా ఉండిపోయాం.