మూడో రోజున డా|| పద్మిని గారి అబ్బాయి ఉపనయనం జరిగింది. శివశక్తి ఆలయంలో పనిచేస్తున్న పూజారి ఒక నెలరోజులు ఏదో పనిమీద వెళితే, అతని స్థానంలో పని చెయ్యడానికి వచ్చిన విష్ణువర్ధన్ అనే తెనాలి పురోహితుడు, ఉపనయనం కార్యక్రమాన్ని శ్రద్ధగా చేయించాడు. ఉపనయన సందర్భంలో నేను పక్కనే ఉండాలనీ పిల్లవాడికి ఆశీస్సులు అందించాలనీ డా|| పద్మిని గారి సంకల్పం. అందుకే నేను ఇక్కడకు వచ్చిన సమయంలోనే ఉపనయనం కార్యక్రమం పెట్టుకున్నారు.
చి|| అర్చిత్ చాలా తెలివైన పిల్లవాడు. పన్నెండేళ్ళ వయస్సులోనే ఒక ఇంగ్లీషు ఫిక్షన్ నవల వ్రాశాడు. అది అమెజాన్ లో కూడా దొరుకుతున్నది. మరో రెండేళ్లకు ఇంకో నవల వ్రాశాడు. మొత్తం మీద పదిహేనేళ్ళు వచ్చేసరికి రెండు మంచి ఇంగ్లీషు ఫిక్షన్ బుక్స్ వ్రాసేశాడు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే షేర్ మార్కెట్లో అడుగులు వేస్తున్నాడు. అమెరికాలో చదువుకుంటూ, అమెరికన్ స్టైల్లో పెరిగినా సరే, చక్కగా మన పద్ధతి ప్రకారం ఉపనయనం చేయించుకున్నాడు. గాయత్రీ ఉపాసన ఎలా చెయ్యాలో వివరంగా తెలుసుకుని సాధన చెయ్యమని అతనికి చెప్పాను. నేను కొద్ది రోజులు ఇక్కడ ఉన్నట్లయితే నేనే నేర్పించి ఉండేవాడిని. కానీ ప్రస్తుతం కుదరక పోవడంతో ఈ సారి కలిసినప్పుడు నేర్పిస్తానని చెప్పాను.
శివశక్తి ఆలయంలో పంచలోహాలతో చేసిన శ్రీచక్రాలు రెండున్నాయి. అందులో ఒక దాని బరువు 60 కేజీలని తెలిసింది. వీటిని ఇండియా నుంచి తెప్పించి ఆలయంలో ప్రతిష్ట చెయ్యాలన్న సంకల్పం డా|| రత్న గారిది. డా|| రత్న దంపతులు దాదాపు ౩౦ ఏళ్ళ నుంచీ అమెరికాలో ఉంటున్నారు. సాయంత్రం నాతో మాట్లాడటానికి డా| పద్మిని గారింటికి వచ్చారు. మాటల మధ్యలో శ్రీవిద్యోపాసన చెయ్యాలని ఉన్నదనీ సరియైన గురువు దొరకడం లేదనీ, చూస్తుండగానే పెద్ద వయస్సు వచ్చేసిందనీ ఆమె నాతో అన్నారు. ఆమెకు దాదాపు 70 ఏళ్ళ వయస్సు ఉండవచ్చు. ఆమె శ్రద్ధ చూస్తే సంతోషం కలిగింది. అందుకని డా|| పద్మినిగారు, ఆమె అక్కగారైన లక్ష్మి గార్లతో పాటు డా|| రత్న గారికి కూడా శ్రీవిద్యాదీక్ష ఇచ్చాను.
ఈ సారి వచ్చినపుడు హ్యూస్టన్ లో ఉన్న తమ ఇంటికి రావాలని డా|| శ్రీనివాస్ కోరారు. అలాగే వస్తానని చెప్పాను. ఉపనయనం అయిన తర్వాత అందరి దగ్గరా సెలవు తీసుకుని వెనక్కు బయలుదేరాము.
తిరుగు ప్రయాణం చాలా ఇబ్బందులతో సాగింది.
ముందుగా బుక్ చేసుకున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం రెండు గంటలు లేట్ అని తెలిసింది. హ్యూస్టన్ నుంచి దాని కనెక్టింగ్ ఫ్లైట్ దొరకదు. అందుకని అమెరికన్ ఎయిర్ లైన్స్ కు టికెట్ మార్చి తీసుకున్నాము. తీరా ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాక అదీ లేటే నని తెలిసింది. అందుకని రూట్ మార్చి డల్లాస్ మీదుగా బుక్ చేశాము. డల్లాస్ చేరే సరికి రాత్రి పది అయింది. అక్కడ కూడా కనెక్టింగ్ ఫ్లైట్ లేకపోవడంతో ఉదయం వరకూ వెయిట్ చెయ్యవలసి వచ్చింది. అమెరికన్ ఈగిల్ ఎయిర్ లైన్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన హోటల్లో బస చేశాము. హోటల్ కు చేరేసరికి రాత్రి పన్నెండు అయింది. రెస్టారెంట్ మూసేసి ఉన్నది. అందుకని తలా ఒక బ్రెడ్ ముక్క తిని ఆ రాత్రికి పడుకున్నాము. మర్నాడు ఉదయాన్నె లేచి తయారై 5 కల్లా క్రిందకు వచ్చేసరికి హోటల్ షటిల్ బస్ వెళ్ళిపోయింది. అందుకని క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్ పోర్ట్ కు 6 కల్లా చేరాము. ఏడుకు ఫ్లైట్ ఎక్కి పదిన్నరకు డెట్రాయిట్ లో దిగాము. ఆ విధంగా అనుకోకుండా డల్లాస్ లో ఒక రాత్రి గడిపాము.
టెక్సాస్ ట్రిప్ అలా ముగిసింది.