Pages - Menu

Pages

20, జూన్ 2017, మంగళవారం

పరమపూజ్య స్వామి ఆత్మస్థానంద మహాసమాధి - జాతక విశ్లేషణ

పరమపూజ్య స్వామి ఆత్మస్థానందగారు నిన్న సాయంత్రం కలకత్తాలో మహాసమాధి పొందారు. ఆయన వయస్సు 98 సంవత్సరాలు. ఆయన రామకృష్ణా మఠం - రామకృష్ణా మిషన్ ల 15 వ సర్వాధ్యక్షులు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారికి ఆయనంటే గురుభావం ఉన్నది.

19 ఏళ్ళ చిన్న వయస్సు (1938) లో, శ్రీ రామకృష్ణుల ప్రత్యక్ష శిష్యుడైన స్వామి విజ్ఞానానందగారి వద్ద ఆయన మంత్రదీక్షను గ్రహించారు. నా గురువులైన స్వామి నందానందగారు కూడా విజ్ఞానానంద స్వామివారి శిష్యులే.

22 ఏళ్ళ చిన్న వయస్సు (1941) లో వైరాగ్య ప్రేరితుడై ఆయన రామకృష్ణమఠంలో బ్రహ్మచారిగా చేరిపోయారు. ఆనాడు మొదలైన ఆయన తపోమయ నిస్వార్ధ సేవాజీవితం 76 ఏళ్ళ పాటు నిరాఘాటంగా కొనసాగి నిన్న ముగిసింది. ఉజ్జ్వలమైన దివ్యజీవితాన్ని దాదాపు ఎనిమిది దశాబ్దాలపాటు గడిపిన ఆయన తన యాత్రను ముగించుకుని నిన్న శ్రీరామకృష్ణుల చరణ సన్నిధికి చేరుకున్నారు.

నిజమైన జగద్గురువులంటే ఇలాంటి మహనీయులేగాని ఊరకే బిరుదులు తగిలించుకునే నేటి గురువులు కారు.

వీరి జాతకాన్ని ఒక్కసారి గమనిద్దాం.

ఈయన 10-5-1919 న సబాజ్ పూర్ లో జన్మించారు. ఇది ఒకప్పటి అవిభక్త బెంగాల్ రాష్రం (నేటి బంగ్లాదేశ్) లో ఉన్నది. ఆరోజున వైశాఖ శుక్ల ఏకాదశి అయింది. మహనీయుల జననం ఇలాంటి శుభప్రదమైన రోజులలోనే జరుగుతుంది అనడానికి ఇదొక ఉదాహరణ. లగ్నాధిపతి ఐన కుజునితో కలసి పంచమాధిపతిగా ఉచ్చస్థితిలో ఉన్న సూర్యుడు ఉన్నతమైన ఆధ్యాత్మికజీవితాన్ని సూచిస్తున్నాడు. నవమాధిపతి అయిన గురువు తృతీయంలో ఉండి నవమాన్ని చూస్తూ గతజన్మలో కూడా ఇలాంటి గొప్పజన్మనే సూచిస్తున్నాడు. సుఖస్థానంలో ఉన్న బాధకుడు శని వివాహాన్ని నాశనం చేశాడు. దారాకారకుడైన చంద్రుడు డిగ్రీ పరంగా బలహీనుడుగా ఉంటూ వివాహం లేదని సూచిస్తున్నాడు. కానీ చంద్రుడు తిధులపరంగా బలవంతుడు గనుక బ్రహ్మచర్య నిష్ఠతో కూడిన యోగజీవితాన్ని ఇచ్చాడు.

చంద్రలగ్నాత్ పంచమాధిపతి అయిన శని లాభస్థానంలో ఉండి మంత్రసిద్ధిని సూచిస్తున్నాడు. నవమంలో కేతువు ఉంటూ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సూచిస్తున్నాడు. కేతువు యొక్క నీచత్వం చంద్రుని నుంచి భంగమైపోయింది.

లగ్నాత్ పంచమంలో రాహువు ఉండి మళ్ళీ మంత్రసిద్ధిని ఇస్తున్నాడు. ఒకరకంగా ఇది రాహుదోషం గనుక వివాహమూ సంతానమూ లోపించాయి. అయితే, అనేకమంది శిష్యకోటిని ఈ యోగం ఇచ్చింది. రాహువు యొక్క నీచత్వం లగ్నాత్ భంగమైపోయింది. నవమంలో ఉన్న ద్వాదశాదిపతి బుధుని వల్ల మళ్ళీ ఉన్నతమైన ఆధ్యాత్మిక ఔన్నత్యం కలిగింది.బుధుని నీచత్వం చంద్రుని నుంచి భంగమై పోయింది.

ఆత్మకారకుడైన బుధుని వర్గోత్తమ స్థితి వల్ల మళ్ళీ ఉన్నతమైన శాస్త్ర జ్ఞానమూ, ఆధ్యాత్మిక జీవితమూ కనిపిస్తున్నాయి. ఆత్మకారక లగ్నమూ కారకాంశా కూడా మీనమే అయింది. అక్కడ నుంచి పంచమంలో మళ్ళీ ద్వాదశాదిపతి శని ఉంటూ లోతైన ఆధ్యాత్మిక చింతనను సూచిస్తున్నాడు. నవమంలో రాహువు ఉంటూ మళ్ళీ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్నీ అనుభవ జ్ఞాన సంపదనూ ఇస్తున్నాడు.

ఏ రకంగా చూచినా ఈ జాతకం అద్భుతమైన ఆధ్యాత్మిక పరిణతినీ ఔన్నత్యాన్నీ సూచిస్తున్నది. కనుకనే,శ్రీరామకృష్ణుల అనుగ్రహానికి పాత్రుడై, ఒక నిజమైన ఆధ్యాత్మిక సంస్థకు సర్వాధ్యక్షులుగా ఎదిగి జగద్గురువు కాగలిగారు.

ఈ మహనీయుని పాదపద్మాలకు నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆజన్మాంతం బ్రహ్మచారిగా బ్రతికి తనకంటూ ఏమీ లేకుండా, ఏమీ మిగుల్చుకోకుండా, తపస్సు, సేవ, త్యాగం, నిస్వార్ధతలతో కూడిన జీవితాన్ని గడిపి, 98 ఏళ్ళ వయస్సులో పండిన పండులా రాలిపోయి, దైవం ఒడిలోకి చేరుకున్న ఇలాంటి మహనీయులను తలచుకుంటే చాలు మనకుకూడా కొద్దో గొప్పో ఔన్నత్యం ఒనగూడుతుంది !

2008 లో వీరిని కలకత్తా బేలూర్ మఠంలో దర్శించుకుని ఆశీస్సులు పొందే అదృష్టం కలగడం నిజంగా నా జీవితంలో ఒక భాగ్యమేమో మరి ?