Once you stop learning, you start dying

14, జులై 2017, శుక్రవారం

జీవితం

జీవితం

దేనినో ఆశించి
ఉన్నదాన్ని చేజార్చుకోవడం
దేనినో ఊహించి
కానిదానికి ఓదార్చుకోవడం

దూరపు కొండలను చూస్తూ
ఎదురుగా ఉన్నదాన్ని విస్మరించడం
భారపు బండలను మోస్తూ
కుదురుగా ఉండలేక వెర్రులెత్తడం

దేవుడెంత ఇచ్చినా
ఇంకేదో ఇవ్వలేదని ఏడవడం
దేబిరింత లాపలేక
దేవుళ్ళాడుతూ లోకాన్ని వదలడం

ప్రేమించేవారిని దూరం చేసుకోవడం
ఆత్మీయులతో వైరం పెంచుకోవడం
అనవసరపు బరువులకు చాన్సులివ్వడం
అపసవ్యపు దరువులకు డాన్సులెయ్యడం

అన్నీ తెలుసనుకుంటూ
అడుసులో కాలెయ్యడం
అన్నీ కాలిపోయాక
ఆకులు పట్టుకోవడం

వయసు ఛాయల్లో కాలిపోవడం
మనసు మాయల్లో కూలిపోవడం
మంచి చెప్పినా వినకపోవడం
వంచనలకేమో లొంగిపోవడం

డబ్బు సంపాదన కోసం ఆరోగ్యాన్ని పణం పెట్టడం
అదే ఆరోగ్యాన్ని మళ్ళీ డబ్బుతో కొనుక్కోవడం
అహంతో అందరినీ దూరం చేసుకోవడం
ఆఖరికి వాళ్ళే కావాలని అలమటించడం

ఎందుకు బ్రతుకుతున్నామో
తెలియకుండా బ్రతకడం
ఎక్కడికి పోతున్నామో
తెలియకుండా పోవడం

ఏ నేలపై నడుస్తున్నామో
అదే మట్టిలో మట్టిగా రాలడం
ఏ గాలిని పీలుస్తున్నామో
అదే గాలిలో గాలిగా తేలడం

ఇదే జీవితం...