“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

15, జులై 2017, శనివారం

నిజంగా పుట్టిన రోజు...

పుట్టిన రోజులు
గతంలో ఎన్నో చూచాను
ఈరోజు మాత్రం చచ్చే రోజును
చవి చూద్దామనుకుంటున్నాను

పుట్టిన తర్వాత జీవితంలో
ఇన్నాళ్ళూ ఓడిపోయాను
చావులోనైనా గెలుపును
రుచి చూద్దామనుకుంటున్నాను

బ్రతకాలని ఆశిస్తూ
నిరంతరం చస్తూ బ్రతికాను
చావులోనైనా నిజంగా
బ్రతకాలని అనుకుంటున్నాను

చావంటూ భయపడుతూ
ఇన్నాళ్ళూ భయంభయంగా బ్రతికాను
కనీసం చావులోనైనా భయాన్ని
గెలుద్దామనుకుంటున్నాను

నన్ను నేను మర్చిపోయి
అందరికోసం ఇన్నేళ్ళూ బ్రతికాను
ఇప్పుడు నాలో నేను మునిగిపోతూ
నాకోసం చద్దామనుకుంటున్నాను

అందరి కుళ్ళుస్వార్ధాల కోసం
నా జీవితాన్ని ఎంతో వృధా చేశాను
ఈ ఆఖరి ఆహుతిలో పరమార్ధాన్ని
అర్ధం చేసుకుందామని అనుకుంటున్నాను

నావారు కాని అందరి కోసం
జీవితాన్ని ఇన్నాళ్ళూ పందెం కాశాను
ఎవరూ లేని ఒంటరితనం కోసం
నేడు చావును పొందాలనుకుంటున్నాను

బ్రతుకు భిక్షనాశిస్తూ
ఎందరి తలుపులనో తట్టాను
ఇప్పుడు నా తలపులనే కరగించి
నేనే లేకుండా పోదామని ఆశిస్తున్నాను

నాలోని నిమ్నత్వాన్ని ఆహుతి చేస్తూ
నాలోని ధన్యత్వానికి ఆజ్యం పోస్తూ
నా అంతరిక యజ్ఞంలో నేనే సమిధనై
కాలిపోదామనుకుంటున్నాను

లోకాన్ని చదివిన తెల్లని మనసుతో
శోకాన్ని దాటిన చల్లని ఆత్మతో
జీవితవృక్షానికి పండిన పండునై
రాలిపోదామనుకుంటున్నాను

అహాలూ అసూయలూ అస్సలంటూ లేని
ద్వేషాలూ దైన్యాలూ మచ్చులే కనరాని  
విశాల గగనపు సుదూర సీమలో
తేలిపోదామనుకుంటున్నాను

వెన్నుపోట్లూ కత్తిగాట్లూ
నయవంచనలూ నమ్మకద్రోహాలూ
ఏవీ ఎరుగని అతి మంచితనంలో
సోలిపోదామనుకుంటున్నాను

అమాయకత్వపు కళ్ళతో
అసూయ నెరుగని మనసుతో
అపురూపమైన ఆత్మసౌందర్యంతో
వెలిగే నా ప్రేయసి కౌగిలిలో
వాలిపోదామనుకుంటున్నాను

బంధాలను దాటుకుంటూ బాధల్ని చీల్చుకుంటూ
భవాన్ని ఓర్చుకుంటూ బ్రతుకును నేర్చుకుంటూ
అసూయా ద్వేషాలంటని అపురూప అందాన్ని
ఆస్వాదించాలనుకుంటున్నాను

లోకపు కుళ్ళుల కంటకుండా
తక్కువ బుద్ధులు సోకకుండా
నిర్మలంగా వెలిగే ఉజ్జ్వలసీమలో
నిద్ర పోదామనుకుంటున్నాను

ఈ పుట్టిన రోజుతో
నేను నిజంగా చచ్చిపోవాలి
ఈ చావులో అసలైన నేను
నిజంగా పుట్టాలి...