“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

12, నవంబర్ 2017, ఆదివారం

అప్సరసలను చూడాలని ఉంది

మంత్ర తంత్రాలంటే జనాలలో ఎంతటి మూఢనమ్మకాలూ, అవాస్తవిక భావాలూ ప్రచారంలో ఉన్నాయో అనడానికి నాకు మొన్నొచ్చిన ఫోనే ఉదాహరణ.

మొన్న మధ్యాన్నం ఒక అరగంట రెస్టు తీసుకుందాం అని మంచి నిద్రలో ఉండగా ఫోన్ మ్రోగి నిద్రలేపింది.

'హలో' అన్నా బద్ధకంగా.

'ఫలానా గారేనా?' అంది అవతలనుంచి ఒక మగస్వరం.

'ఆ. ఫలానానే. మీరెవరు?' అన్నాను.

'అమ్మయ్య ! మీ ఫోన్ నంబర్ అతికష్టం మీద దొరకింది.' అంది స్వరం.

'అంత కష్టం ఏముందబ్బా ! నా బ్లాగులో ఈజీగానే కనిపిస్తుంది కదా?' అని నాకు సందేహం వచ్చింది.

అంతలోకే ఆ స్వరం - 'మాది విశాఖపట్నం. నాకు మంత్రం తంత్రం అంటే చాలా ఇంటరెస్టు' అంది గోదావరి యాసలో.

'అలాగా' అన్నా ఆవులిస్తూ.

'ఏదైనా త్వరగా సిద్ధించే మంత్రం కావాలి. మీరు సాయం చెయ్యగలరా?' అంది స్వరం.

'నాకు పాస్ పోర్ట్ త్వరగా కావాలి. ఇప్పిస్తారా?' అన్నట్లు నాకు వినిపించి - ' అది నాపని కాదు. మీ ఊళ్ళో చాలామంది ఆ పని చేసిపెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళను కలవండి.' అన్నా.

స్వరం మన మాట వినిపించుకోకుండా 'చాలామంది మామూలు మంత్రగాళ్ళు దొరికారు. వాళ్ళ దగ్గర ఏవేవో మామూలు మంత్రాలు తీసుకున్నాను. అంటే కర్ణ యక్షిణి లాంటివి. ఇప్పుడు నాకు ఒక మంచి మంత్రం కావాలి. ఒక వారంలోనో రెండు వారాలలోనో సిద్ధించాలి. అలాంటి మంత్రం మీరు ఇవ్వగలరా?' అంది డిమాండ్ చేస్తున్నట్లుగా.

'మంత్రం సిద్ధిస్తే ఏం చేస్తావు నాయనా?' అడిగాను.

'అంటే - దేవత కనిపిస్తుందట కదా?' అంది స్వరం.

'కనిపిస్తే ఏం చేస్తావు?' అడిగాను నవ్వాపుకుంటూ.

'అబ్బే అలాంటి చెడు ఉద్దేశాలు నాకస్సలు లేవు. ఆమె ఎంత అందంగా ఉన్నా సరే, ఆమెను తల్లిగానే చూస్తాను. వేరే దృష్టితో అస్సలు చూడను' అంది స్వరం.

'అవునా?' అన్నాను.

'అవును. నాలో కామం అస్సలు లేదు. ఒకవేళ ఎప్పుడైనా అనిపించినా దాన్ని దారి మళ్ళిస్తాను.నాకు ప్రస్తుతం 28 ఏళ్ళు. ఇంకా పెళ్ళికాలేదు. ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను.' అంది స్వరం.

'కామం ఏంటి నాయనా? నేను ఆ విషయం అడగలేదు కదా నిన్ను?' అన్నాను.

'అలా కాదండి. కొంతమంది చెబుతారు కదా. అప్సరసలు సిద్ధిస్తే ముందు భార్యని చంపేస్తారు అని. నాకెలాగూ పెళ్లి కాలేదు. భార్య లేదు. కనుక ఆ ప్రాబ్లం లేదు. కానీ ఆ అప్సరసని నేను తల్లిగానే చూస్తాను.' అంది స్వరం.

'అలా చూస్తే ఆమెకు నచ్చలేదనుకో. అప్పుడేం చేస్తావు. అసలే అప్సరస. నువ్వు తల్లిగా చూస్తే ఎలా తట్టుకోగలదు? కుదరదేమో. ఒకసారి ఆలోచించు' అన్నా.

'ఒకవేళ కుదరక పోతే అప్పుడాలోచిస్తాను. ముందు నాకామె కనిపించాలి. అలాంటి మంత్రం ఇవ్వండి.' అంది స్వరం.

'మరి ఉపదేశం కావాలంటే నువ్వు గుంటూరుకు రావాల్సి ఉంటుంది' అన్నాను.

'నాకు వీలుకాదు. సెలవలు దొరకవు. మా బాస్ చాలా స్ట్రిక్ట్. సెలవలు అస్సలు ఇవ్వడు. అందుకని నేను రాలేను. ఫోన్లో చెప్పలేరా మంత్రాన్ని?' అడిగింది స్వరం, 'ఈ మాత్రం కూడా చెయ్యలేవా?' అని ధ్వనించేలా.

'వీడెవడ్రా బాబూ ! అమావాస్య ఇంకా ఆర్రోజులుంది కదా అప్పుడే మొదలైంది ఇతనికి?' అనుకుని మనసులోనే అప్పటి లగ్నాన్ని గమనించాను. రోజువారీ గ్రహస్థితులు మనకు తెలుసు గనుక వెంటనే ఆ వ్యక్తి ఎలాంటివాడు? ఎందుకు ఇదంతా అడుగుతున్నాడు? మొదలైన విషయాలన్నీ అర్ధమయ్యాయి.

'సరే చూద్దాం. ఎలాంటి అప్సరసా మంత్రం కావాలి నీకు?' అంటూ అడిగాను.

'మీరు వ్రాశారు కదా ఒక పోస్ట్ లో పుష్పదేహ అప్సరస చాలా బాగుంటుంది అని. ఆమె మంత్రం ఇవ్వండి.' అంది స్వరం.

'ఆమె చాలా కన్నింగ్. నువ్వు తట్టుకోగలవా ఆమెను?' అడిగాను.

'ఏం పరవాలేదు మేనేజ్ చేస్తాను. కానీ ఆమె నిరంతరం నాతోనే ఉండాలి. నేను నిద్రపోయినా కూడా నా పక్కనే కూచుని ఉండాలి. అనుక్షణం నన్ను వదలకుండా ఉంటూ నాకు సలహాలివ్వాలి. ఆ సలహాలు నేను తూచా తప్పకుండా పాటిస్తాను.' అన్నాడతను.

వ్యవహారం శృతి మించుతోందనిపించి, ' చూడు బాబూ ! నాకు అలాంటివి ఏవీ రావు.' అన్నాను డైరెక్ట్ గా.

అవతలనుంచి ఒక నవ్వు వినిపించింది.

'తెలుసు సార్. మీబోటి వాళ్ళు అంత ఈజీగా చిక్కరని. పోనీ నా మీద మీకు అనుమానం ఉంటే, నేనెలాంటి వాడినో తెలుసుకోవడానికి మీ దగ్గర ఉంటారు కదా కర్ణపిశాచి, కర్ణయక్షిణి వంటి వాళ్ళు. వాళ్ళని అడిగి చూడండి నా బయోడేటా చెబుతారు.' అన్నాడు.

'వాళ్ళెవరు?' అన్నాను.

కాసేపు నిశ్శబ్దం.

'మీరే కదా వ్రాస్తుంటారు కర్ణ పిశాచి గట్రా అని.' అన్నాడు.

'చూడు బాబూ. నిజం చెప్తాను విను. నాకలాంటివి ఏవీ రావు.' అన్నాను.

'మరి పాత పోస్టులలో చాలా వ్రాశారు కదా?' అన్నాడు స్వరం పెంచి.

'విను. నా అమెరికా శిష్యులు అప్పుడప్పుడూ వచ్చి నన్ను కలుస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు మంచి ఫారిన్ సరుకు తెచ్చి ఇస్తూ ఉంటారు. అది పుచ్చుకున్నప్పుడల్లా తిక్క పుట్టి ఏవేవో గాలికబుర్లు కల్పించి ఉన్నవీ లేనివీ వ్రాస్తూ ఉంటాను. అవి చదివి నీలాంటివాళ్ళు నిజాలని భ్రమిస్తూ ఉంటారు. అలాంటివి నాకు నిజంగా తెలియవు.' అన్నాను.

'అవునా?' ఆశ్చర్య పోయింది స్వరం. 

'నీ మీదొట్టు. ఇంకో సంగతి విను. నాకూ అప్సరసలను చూడాలని వాళ్ళతో ఆడుకోవాలని ఉంది. నీకు ఎవడైనా మంచి గురువు దొరికితే నాకూ ఆ అడ్రస్ చెప్పు. నేనూ వచ్చి ఉపదేశం తీసుకుంటా. నువ్వు రెండు వారాలు అడిగావు. నేను అంతకాలం కూడా ఆగలేను. జస్ట్ ఒకటి రెండు రోజుల్లో అప్సరస కనిపించాలి. ఆ తర్వాత పొమ్మన్నా పోకుండా నాతోనే ఉండాలి. అలాంటి కేస్ ఏదైనా దొరికితే చూడు.' అన్నా సీరియస్ గా.

'చూడండి సార్. మీ జిత్తులు నా దగ్గర కాదు. మీకవన్నీ తెలుసని నాకు తెలుసు. మీరు నన్ను పరీక్షిస్తున్నారు. నాలాంటి శిష్యుడు మీకు దొరకడు. గ్యారంటీ. నాకు అర్జంటుగా మంత్రం కావాలి. ఇంకో సంగతి. పిచ్చిపిచ్చి మంత్రాలిస్తే నేనూరుకోను. అది సిద్ధించాలి. అలాంటి మంత్రం మీరివ్వాలి. ఎందుకంటే నేనిప్పటికే చాలాసార్లు మోసపోయాను. కొంతమంది ఏవేవో మంత్రాలిస్తారు. ఎన్నేళ్ళు చేసినా అవి సిద్ధించవు. ఈ విషయంలో నాకు బాగా అనుభవం ఉంది.' అంది స్వరం కరుకుగా.

ఇక ఇలా లాభం లేదని, గొంతు తగ్గించి రహస్యంగా ఇలా చెప్పాను.

'చూడమ్మా. నీ నిజాయితీ నాకు బాగా నచ్చింది. నీ మొహం నాకు తెలీదు. నాది నీకు తెలీదు. ఇప్పుడే నన్ను దబాయిస్తున్నావు. ముందు ముందు ఇంకేం చేస్తావో నేనూహించగలను. నాకు కరెక్ట్ గా నీలాంటి శిష్యుడే కావాలి. నీకు అప్సరసలే కదా కనిపించాల్సింది. ఈరోజే ఫలించే ఒక ఉపాయం చెప్తా. చేస్తావా? ఈరోజు సాయంత్రానికే నీకు ఒక్క అప్సరస కాదు బోల్డుమంది కనిపిస్తారు.' అన్నా ఊరిస్తూ.

'అవునా. త్వరగా చెప్పండి' అన్నాడు ఆత్రంగా.

'మీది విశాఖపట్నం అన్నావు కదా. ఒక పని చెయ్యి. సాయంత్రం నీ పని ముగించుకుని జగదాంబ సెంటర్ కు వెళ్ళు. అక్కడ ఒక పక్కగా నిల్చుని నేను చెప్పే మంత్రం జపించు. రోడ్డుమీద ఎంతోమంది అప్సరసలు హడావుడిగా నడుస్తూ, షాపింగ్ చేస్తూ, స్కూటర్ల మీదా, కార్లలోనూ పోతూ కనిపిస్తారు.' అన్నాను.

'అవునా. సరే సార్. ఆ తర్వాత నేనేం చెయ్యాలి?' అన్నాడు.

'ఏం లేదు. వెరీ సింపుల్. వాళ్ళలో నీకు నచ్చిన అప్సరస దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకో.' అన్నా.

'అప్పుడేమౌతుంది? ఆ అప్సరస నాతో వచ్చేస్తుందా?' అన్నాడు.

'ఆమె వచ్చినా రాకపోయినా, ఆమె అరిచే అరుపులకు చుట్టూ ఉన్న రాక్షసులు వచ్చి నీమీద కలబడి నీకు దేహశుద్ధి చెయ్యబోతారు. కానీ నువ్వేం తగ్గకు. నన్ను తలచుకుని వాళ్ళ మీద కలబడు. కానీ అప్సరస చెయ్యి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టకు.' అన్నాను.

'అప్పుడేమౌతుంది?' అన్నాడు స్వరం అనుమానంగా.

'ఏమీ కాదు. నీకు స్పృహ తప్పుతుంది. కళ్ళు తెరిచే సరికి ఒక బెడ్ మీద నువ్వుంటావు. కంగారు పడకు. అదే స్వర్గం. అయితే దాని పేరు 'మెంటల్ హాస్పిటల్ విశాఖపట్నం' అని నీకు కన్పిస్తుంది. అది కూడా అప్సరస పెట్టే పరీక్షే. భయపడకు.' అన్నాను.

'ఒకే సార్ అలాగే. అప్పుడు నేనేం చెయ్యాలి.' అంది స్వరం. 

'ఒకసారి అక్కడకు చేరాక నువ్వేం చెయ్యనక్కరలేదు. అంతా వాళ్ళే చూసుకుంటారు. అసలు నువ్వేం చెయ్యలేవు కూడా. ఎందుకంటే నీకు ఒళ్లంతా పచ్చి పుండులా ఉంటుంది. ఇంతలో ఒక అప్సరస తెల్లడ్రస్ లో, చేతిలో ఇంజక్షన్ తో వచ్చి నీ ముందు నిలబడుతుంది. నువ్వేమీ జంకకుండా గట్టిగా ఆమె చెయ్యి పట్టుకొని నేను చెప్పబోయే మంత్రం చదువు.' అన్నాను.

'ఆ తర్వాత ఏమౌతుంది?' అన్నాడు.

'ఏం కాదు. ఆమె మళ్ళీ పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. అప్పుడు అదే తెల్ల డ్రస్ లో ఉన్న కొందరు యమభటులు వచ్చి నిన్ను గట్టిగా అదిమిపట్టి తీసుకెళ్ళి ఒక కుర్చీలో కూచోబెడతారు. ఆ కుర్చీకి చాలా వైర్లు కనెక్ట్ అయి ఉంటాయి. అప్పుడు వాటిల్లో ఒక వైరును ప్లగ్గులో పెట్టి స్విచ్ వేస్తారు. వెంటనే నీకు సమాధి స్థితి సిద్ధిస్తుంది. ఆ క్షణం నుంచీ ఆ తెల్ల డ్రస్ అప్సరస నిన్ను వదలి ఎక్కడికీ పోదు. అనుక్షణం నీకు కాపలాగా ఉంటుంది. నువ్వు నిద్రపోతున్నా కూడా నీ పక్కనే స్టూల్ మీద కూచుని ఉంటుంది. నువ్వు కళ్ళు తెరవగానే నీకు కావలసిన సపర్యలు చేస్తుంది. నువ్వు కోరుకున్నట్లుగానే ప్రతిదాంట్లో నీకు సలహాలు ఇస్తుంది. ఒకవేళ ఆమె డ్యూటీ మారినా అదే డ్రస్ లో ఉన్న ఇంకొక అప్సరస వచ్చి ఆమె ప్లేస్ లో కూచుంటుంది. ఈ విధంగా ఎప్పుడూ ఎవరో ఒక అప్సరస నీకు తోడుగా ఉంటూనే ఉంటుంది. ఎలా ఉంది నా ఉపదేశం?' అడిగాను సీరియస్ గా.

'ఏంటి సార్ ! నేను మీకు పిచ్చోడిలా కనిపిస్తున్నానా?' అన్నాడు స్వరం తీవ్రంగా.

'అబ్బే లేదు నాయనా. నీకేం పిచ్చి లేదు. పిచ్చి నాకే. బ్లాగులో ఫోన్ నంబర్ ఇచ్చి నీలాంటి పిచ్చోళ్ళతో మాట్లాడుతున్నానే. అదీ నా పిచ్చి. సరేగాని నువ్వు అన్నది నా డైలాగు, నువ్వు చెప్తున్నావ్ అంతే.

లేకపోతే ఏంటి? నీకు ఫోన్లో మంత్రం చెప్పాలా? అది ఒక వారంలో సిద్ధించాలా? అప్సరస వచ్చి నీ ఒళ్లో కూచోవాలా? లేకపోతే నా సంగతి చూస్తావా? నేను నీకు పిచ్చోడిలా కన్పిస్తున్నానా ఏంటి? ఇంతసేపు నీలాంటి పిచ్చోడితో ఫోన్ మాట్లాడిందే ఎక్కువ. ఇంకోసారి ఫోన్ చేసి డిస్టర్బ్ చేశావంటే లెక్కల్లో తేడా వస్తుంది జాగ్రత్త.

బుద్ధిగా నీ ఉద్యోగం నువ్వు చేసుకో. కానీ పెళ్లి మాత్రం చేసుకోకు. చేసుకుని ఒక ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యకు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే నీ పిచ్చి తగ్గటానికి ముందుగా మంచి ట్రీట్మెంట్ తీసుకో. బై.' అని కటువుగా చెప్పి ఫోన్ కట్ చేశాను.

కధ కంచికి ! మనం ఇంటికి !! అదన్నమాట సంగతి !!!