ఈరోజుల్లో ఏది మర్చిపోయినా అంత కంగారు రాదుగాని, మొబైలు గాని, దాని చార్జర్ గాని మర్చిపోతే మాత్రం చాలా కంగారు పుడుతుంది. ఎందుకంటే పనులన్నీ వాటితోనే జరుగుతున్నాయి గనుక.
నిన్న అర్ధరాత్రిదాకా ఒక ఫంక్షన్ లో కల్చరల్ ప్రోగ్రాం నిర్వహిస్తూ చాలా బిజీగా ఉండవలసి వచ్చింది. ఆ తర్వాత ఇంటికి వచ్చి నిద్రపోయే ముందు చూస్తే, మొబైల్ చార్జర్ కనిపించలేదు. ఈ ఫోన్ పిన్ కు అన్ని చార్జర్లూ సరిపోవు. ఆ మోడల్ ను అలా డిజైన్ చేశాడు లెనోవో గాడు. చార్జ్ చూద్దామంటే, 5% ఉంది. మనకేమో అఫీషియల్ కాల్స్ ఏ సమయంలోనైనా రావచ్చు. ఇక్కడ చార్జ్ చూస్తే తెల్లవార్లూ వచ్చేలా లేదు. ఏం చెయ్యాలి? దానిని ఉంచిన బ్యాగ్ మొత్తం వెదికినా అది కనిపించలేదని తెలిసింది. ఎక్కడ పోయిందబ్బా? అని కొంత ఆలోచన చేసి, ఆ ప్రోగ్రాం హడావిడిలో ఎక్కడో పోయి ఉంటుందిలే, సర్లే పోతే పోయిందిలే ఇంకోటి కొందాం అనుకుంటూ, ఎందుకైనా మంచిదని ఒక్కసారి ప్రశ్న చార్ట్ ని గమనించడం జరిగింది.
ప్రశ్న స్థలం -- గుంటూరు.
తేదీ -- 18-1-2018
ప్రశ్న సమయం -- రాత్రి 12.30
చూడగానే కుండలిలో కాలగ్రస్తయోగం చక్కగా కన్పిస్తోంది. ఆ పైన లగ్నానికి కాలార్గళం పట్టింది. ఒక మనిషిని విసిగించడానికి ఇవి చాలా ఎక్కువ. ఇవి చాలవన్నట్లు, లగ్నాధిపతి చతుర్దంలో తీవ్ర అస్తంగత్వంలో ఉండి మానసిక భ్రమను సూచిస్తున్నాడు. అంతేగాక, చతుర్ధం వల్ల ఆ వస్తువు ఇంట్లోనే ఉంది కానీ కన్పించడం లేదని సూచిస్తున్నాడు. మన: కారకుడైన చంద్రుడు కూడా అక్కడే ఉంటూ వస్తువు ఇంట్లోనే ఉందని, కానీ తప్పుదోవ పట్టిస్తోందనీ సూచిస్తున్నాడు. లగ్నంలో గురువుగారు ఉండి వస్తువు త్వరలోనే దొరుకుతుందని సూచిస్తున్నాడు. ద్వితీయాధిపతిగా విలువైన వస్తువులకు కారకుడు కుజుడు రాశిసంధిలో ఉంటూ వస్తువుల అనిశ్చిత పరిస్థితిని సూచిస్తున్నాడు. కానీ స్వక్షేత్ర స్థితి వల్ల, అది పోలేదని సూచిస్తున్నాడు. లగ్నం మొదటి ద్రేక్కాణంలో ఉంటూ వస్తువు ఇంటి మొదటిభాగంలోనే ఉందని సూచిస్తున్నది. దానిని ఉంచిన బ్యాగ్ హాల్లోనే ఉంచబడింది.
ఇవన్నీ గమనించిన మీదట అది ఎక్కడికీ పోలేదని, అదే బ్యాగ్ లోనే ఇంకో అరలో ఉంటుందని, సరిగ్గా వెదికితే దొరుకుతుందనీ అర్ధమై, నిద్రకు ఉపక్రమించాను.
పొద్దున్నే లేచి అదే బ్యాగ్ లో సైడ్ జిప్ పాకెట్ లో చూడగా అందులో మొబైల్ చార్జర్ చక్కగా దర్శనమిచ్చింది. నిత్యజీవితంలో ప్రశ్నశాస్త్రం ఎలా ఉపయోగపడుతుంది? అనడానికి ఇది ఇంకొక ఉదాహరణ.
అయితే, చార్ట్ ని సరియైన దృష్టితో అర్ధం చేసుకోవాలి. విషయమంతా ఈ అర్ధం చేసుకోవడంలోనే ఉంది. చార్ట్ అనేది అలా అర్ధం కావాలంటే, జ్యోతిష్య శాస్త్ర సూత్రాలు బాగా వంటబట్టి ఉండాలి, ఆ తర్వాత స్ఫురణ (ఇంట్యూషన్) ఉండాలి. వీటికి తోడుగా వందలాది చార్టులను విశ్లేషణ చేసిన అనుభవం ఉండాలి. ఈ మూడూ కలసినప్పుడు ప్రశ్నశాస్త్రం చక్కని ఫలితాలను తప్పకుండా ఇస్తుంది.
అయితే, చార్ట్ ని సరియైన దృష్టితో అర్ధం చేసుకోవాలి. విషయమంతా ఈ అర్ధం చేసుకోవడంలోనే ఉంది. చార్ట్ అనేది అలా అర్ధం కావాలంటే, జ్యోతిష్య శాస్త్ర సూత్రాలు బాగా వంటబట్టి ఉండాలి, ఆ తర్వాత స్ఫురణ (ఇంట్యూషన్) ఉండాలి. వీటికి తోడుగా వందలాది చార్టులను విశ్లేషణ చేసిన అనుభవం ఉండాలి. ఈ మూడూ కలసినప్పుడు ప్రశ్నశాస్త్రం చక్కని ఫలితాలను తప్పకుండా ఇస్తుంది.