“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

25, ఫిబ్రవరి 2018, ఆదివారం

పాపం శ్రీదేవి !


13-8-1963
సినీనటి శ్రీదేవి చనిపోయింది. అందులోనూ అర్ధాంతరంగా 54 ఏళ్ళకే పోయింది. ఈ అంకె నిజమో కాదో నాకు తెలీదు. వికీ సోర్స్ నుంచి అనుకోడమే.

మరిప్పుడు ఈమె జాతకం చూడకపోతే మన పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది గనుక చూడక తప్పదు. ఇష్టం లేకపోయినా కొన్ని కొన్ని పనులు నా అభిమానులకోసం చెయ్యాల్సి వస్తోంది. ఏం చేస్తాం ?

ఈమె అందచందాలకు ముగ్డులైపోయి ఈనాటికీ ఈమెను ఆరాధిస్తున్న పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు. వారికి ఈ వార్త బాధాకరమే గాని, వాస్తవాలను గమనిద్దాం. షావుకారు జానకి, కాంచన లాంటి పాత తరం హీరోయిన్లు ఈరోజుకూ చక్కగా హాయిగా ఉన్నారు. ఈ మధ్యతరం హీరోయిన్లు మాత్రం హటాత్తుగా హరీమంటున్నారు. కారణాలేమై ఉంటాయో?

25-2-2018
పాతకాలం వాళ్ళకు కొన్ని విలువలున్నాయి. జీవితంలో ఎంతసేపూ గ్లామర్ ఒక్కటే వాళ్లకు ప్రధానం కాదు. వయసుతో బాటు వచ్చిన మార్పులను హుందాగా స్వాగతిస్తూ, అనవసరమైన కాస్మెటిక్ ఆపరేషన్లూ గట్రాల జోలికి పోకుండా, ఆహార నియమాలు పాటిస్తూ, హైఫై జీవితం జోలికి పోకుండా, యోగాభ్యాసం చేస్తూ ఎనభైలు దాటినా వాళ్ళు హాయిగా జీవిస్తున్నారు. ఈకాలపు హీరోయిన్లేమో అనవసరమైన మందులు వాడుతూ, సర్జరీలు చేయించుకుంటూ, వయసు పైబడుతున్నా ఇంకా కుర్రపిల్లల్లా కనిపించాలన్న భ్రమలో మధ్యలోనే హరీమంటున్నారు.

కొన్ని నెలల క్రితం పెదిమలు కొంత బండగా కనిపించడం కోసం శ్రీదేవి ఏదో సర్జరీ చేయించుకుందని వార్తలొచ్చాయి. అది విన్నప్పుడు లైపో సక్షన్ చేయించుకుని చనిపోయిన ఆర్తీ అగర్వాల్ నాకు గుర్తొచ్చింది. ఇలాంటి సర్జరీల వల్ల ఇలాంటి ప్రమాదాలు చాలా ఉంటాయి. కానీ ఆ సర్జన్లు ఇవేవీ చెప్పరు. దానికీ దీనికీ సంబంధం లేదని అంటారు. అంతా సేఫ్ అని నమ్మిస్తారు. జనం కూడా వాళ్ళ మాటల్ని నమ్ముతారు.

ఆ తర్వాత ఇరవై ఏళ్ళకు ఒక సైన్స్ జర్నల్లో ఇలా వ్రాస్తారు.

' ఫలానా సర్జరీ తర్వాత వాడే ఫలానా మందు వల్ల గుండె దెబ్బతింటుంది అని ఈ మధ్యనే మా ఇరవైయేళ్ళ పరిశోధనల్లో తెలిసింది. అందుకని ఆ మందును యూరప్ అమెరికా మార్కెట్లో మాత్రం ప్రస్తుతానికి నిషేధిస్తున్నాం. మిగతావాళ్ళు ఏమైపోయినా మాకనవసరం.'

ఈ లోపల ఆ మందును విచ్చలవిడిగా వాడేసి మిగతా ఖండాలలో దేశాలలో జనం ఒళ్ళు గుల్ల చేసుకుని చనిపోతూనే ఉంటారు. హేతువాదులకూ సైన్సువాదులకూ ఇలాంటి విషయాలు కనిపించవు గాక కనిపించవు !

ఈ వీడియోని చూడండి మరి !
https://www.youtube.com/watch?v=0g201YThZJc

54 ఏళ్ళు వచ్చాక మూతి ఎలా ఉంటే ఏమైంది? ముక్కు ఎలా ఉంటే ఏమైంది? అని సామాన్యులమైన మనం అనుకోవచ్చు గాక. గ్లామర్ డాల్స్ అలా అనుకోవు కదా ! హిందీ నటుడు దేవానంద్ తన హెయిర్ స్టైల్ కుర్రవయసులో ఉన్నట్టే కనిపించడం కోసం చనిపోయే ముందు కూడా జుట్టుమీద ఏడాదికి లక్షల్లో ఖర్చు చేసేవాడుట. సినీ పక్షులందరూ అలాంటి వాళ్ళే. ఎందుకంటే వాళ్లకు శరీరమే కదా పెట్టుబడి ! అది గ్లామరస్ గా ఉన్నంతవరకే వాళ్ళ జీవితాలు ! అందుకని అలాంటి జాగ్రత్తలు తప్పవేమో మరి !

ఎన్ని మందులు వాడినా, ఎన్ని సర్జరీలు చేయించుకున్నా, చివరకు వాటి సైడ్ ఎఫెక్ట్స్ తో ఒళ్ళు గుల్ల అవడమే గాని ఉపయోగం అంటూ ఏమీ ఉండదు. బొటోక్స్ ఇంజెక్షన్లూ, సిలికాన్ ఇంప్లాంట్ లూ హైఫై సొసైటీలో మామూలే కావచ్చు. కానీ అవన్నీ సహజసిద్ధమైన ఆరోగ్యాన్ని గుల్లచేసి పారేస్తాయని చాలామందికి తెలీదు. ఆహార నియమం, యోగాభ్యాసం, నియమాలతో కూడిన జీవితంతో వచ్చే ఆరోగ్యం ఇలాంటి పిచ్చి పనులతో ఎప్పటికీ రాదు.

నానమ్మాళ్ చూడండి ! తొంభై ఏళ్ళ వయసులో కూడా ఎంత ఆరోగ్యంగా ఉందో? ఆమె ఏ మేకప్ చేసుకోకపోయినా ఆమెలో జీవకళ ఉంది. అదేమరి యోగాభ్యాస మహిమ అంటే ! నేటి హీరోయిన్లు ఎన్నెన్ని మేకప్ లు వేసుకున్నా వాళ్ళ మొహాల్లో జీవకళ ఉండదు. మామూలుగా వాళ్ళు అంత అందంగా ఏమీ ఉండరు. మేకప్ లేకపోతే వాళ్ళ ముఖాలు చాలా కళావిహీనంగా ఉంటాయి.

సరే ఎవరెలా పోతే మనకెందుకు గాని, శ్రీదేవి జాతకాన్ని ఒకసారి చూద్దాం, వికీ సోర్స్ నిజమే అయితే !

రెండు ముఖ్యమైన యోగాలు ఈమె మరణాన్ని సూచిస్తున్నాయి.

1. జననకాల సూర్య శుక్రులు ఈమెకు కర్కాటకంలో ఉన్నారు. వీరిమీదకు గోచార రాహువు ప్రస్తుతం సంచరిస్తున్నాడు. సూర్యునిపైన రాహువు సంచారం ప్రాణగండాన్ని సూచిస్తుంది. అంతేగాక, గ్లామర్ కూ, మేకప్ కూ, అందానికీ కారకుడైన శుక్రుని మీదకు రాహుసంచారం వల్ల సర్జరీ వల్ల ప్రమాదం అని సూచన ఉంది. అదీగాక ఆ శుక్రుడు ఆమె జాతకంలో అస్తంగతుడై ఉన్నాడు మరి !! 

2. గోచార యముడు (ప్లూటో) ధనుస్సు 26 డిగ్రీలలో ఉంటూ ఈమె జననకాల గ్రహాలలో చాలావాటితో ప్రస్తుతం చాలా దగ్గర దృష్టులలో ఉన్నాడు.

>కర్కాటకంలో ఉన్న జననకాలసూర్యునితో, ఖచ్చితమైన షష్టాష్టకదృష్టిలో ఉంటూ మరణాన్ని సూచిస్తున్నాడు.

> మీనంలో ఉన్న జననకాల గురువుతో ప్రతికూల కేంద్ర దృష్టిలో ఉన్నాడు.

> జననకాల శని మకరంలో 26 డిగ్రీలలో వక్రించి ఉన్నాడు. ఈయన్ను ధనుస్సులోకి స్వీకరిస్తే సరిగ్గా గోచార యముని (ప్లూటో) తో కలుస్తాడు. ఇది ఖచ్చితమైన మరణగండం. ఎందుకంటే శనీశ్వరుడూ ప్లూటో ఇద్దరూ మరణానికి కారకులే. ఒకే డిగ్రీమీద ప్రస్తుతం ఉన్నారు. ఇది మరణ గండమే.

> అంతేగాక, గోచార ప్లూటో, జననకాల కేతువుమీద సంచరిస్తూ రాహువు దృష్టికి లోనౌతున్నాడు. ఇవన్నీ మరణ సూచనలే.

అయితే, కర్కాటకం అనేది సహజ చతుర్ధంగా గుండెకు సూచిక. అక్కడ ఉన్న జననకాల సూర్యుడు కూడా గుండెకే సూచకుడు. అక్కడకు ప్రస్తుతం వచ్చిన రాహువు గుండెపోటును సూచిస్తున్నాడు. అందువల్లే మరణం జరిగి ఉండవచ్చు. కానీ ఆ గుండెపోటుకు దారితీసిన పరిస్థితులు మాత్రం, కాస్మెటిక్ సర్జరీలూ, వాటితో వాడిన మందులూ,వాటి సైడ్ ఎఫెక్ట్ లూ అని నా అభిప్రాయం.

గ్లామర్ వరల్డ్ లో మైకేల్ జాక్సన్ నుంచి నేటి శ్రీదేవి వరకూ అందరూ 'నేను ఇంకా అందంగా లోకానికి కనిపించాలి' అన్న ఒక్క ఆలోచనకు బలి అయినవారే అని నా ఊహ ! కుహనా సౌందర్యదేవత పాదాలదగ్గర ఎంతమంది ఇలా ప్రాణాలు అర్పించాలో?

అసలూ - నిజమైన సౌందర్యం అంటే ఏమిటి? అదెక్కడుంటుంది? అది మేకప్ లో ఉంటుందా? డ్రస్సులో ఉంటుందా? లేక స్వచ్చంగా వెలిగే అంతరంగంలోనూ అది బయటకు ప్రతిఫలించే కళ్ళలోనూ ఉంటుందా? జీవం లేని ప్లాస్టిక్ నవ్వులలో అది ఉంటుందా? లేకపోతే నిష్కల్మషంగా హృదయంలో నుంచి పొంగి వచ్చే సంతోషపు నవ్వులో ఉంటుందా? కృత్రిమంగా తెచ్చుకునే వంపుసొంపులలో అది ఉంటుందా? లేక సహజసిద్ధమైన వ్యాయామాల వల్ల వచ్చే ఫిట్నెస్ లో ఉంటుందా?

జీసస్ అన్న మాట ఒకటి గుర్తుకొస్తోంది.

'ప్రపంచంలో ఒకడు అన్నీ సంపాదించినా చివరకు తన ఆత్మను పోగొట్టుకుంటే అందువల్ల ఉపయోగం ఏముంది?'

కోరికలు తీరకుండా అర్ధాంతరంగా పోయినవాళ్ళు ప్రేతాత్మలౌతారని అంటారు. సిల్క్ స్మిత అలాగే దయ్యమైందని ఒక పుకారు చాలా బలంగా సినీ ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు శ్రీదేవి కూడా అలాగే అర్ధాంతరంగా పోయింది. ఈమె ఏమౌతుందో చూడాలి మరి !!