“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

17, మార్చి 2018, శనివారం

విశ్వవిజ్ఞాన అజ్ఞాని స్టీఫెన్ హాకింగ్ జాతకం - పరిశీలన

ఎన్నెరిగిననూ తన్నెరుగనిచో
తిన్నదరుగుటయేగాని
ఉన్నత ఫలమెట్లు దక్కురా సత్యా?

అంటూ గతంలో ఒక మహాకవి ఒక కవితను వ్రాశాడు. ఆ మహాకవి ఎవరో నేను చెబితే బాగోదు. ఆయనెవరో ఊహించే అదృష్టాన్ని మీ ఊహకే వదిలేస్తూ విశ్వ విజ్ఞాన అజ్ఞాని స్టీఫెన్ హాకింగ్ జాతకం పరిశీలిద్దాం.

నేను పొరపాటుగా వ్రాయలేదు. మీరూ సరిగానే చదువుతున్నారు. లోకమంతా విజ్ఞాని అంటుంటే ఈయనేంటి అజ్ఞాని అంటున్నాడు? అని మీకు అనుమానం రాకూడదు, ముఖ్యంగా ఇన్నేళ్ళనుంచీ నా వ్రాతలు చదువుతూ అడిక్ట్ అయినవారికి !!

ఎందుకంటే, మన ఆధ్యాత్మిక చింతన ప్రకారం, ఎన్ని విషయాలలో పరిజ్ఞానం సంపాదించినా, ఆత్మజ్ఞానం లేనివాడు అజ్ఞానే. లోకం దృష్టిలో వాడు ఏమైనా కావచ్చు. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో వాడు అజ్ఞానే. ఎందుకంటే తానెవరో తెలియకముందే చనిపోయాడు కాబట్టి.

అసలు విజ్ఞాని అనే మాటే చాలా తప్పుమాట. దానిని లౌకిక కోణంలో అస్సలు వాడకూడదు. విజ్ఞాని అనేవాడు జ్ఞాని కంటే పైస్థాయికి చెందినవాడు. అసలు జ్ఞానే కానివాడు ఇక విజ్ఞాని ఎలా అవుతాడు? కనుక ఈ పదానికి ఇతనికి అర్హత లేదు. ఈ భూగోళం మీద విజ్ఞాని అనేవాడు ఏ టైంలోనైనా ఒక్కడు ఉంటాడేమో? లేకపోతే వాడూ ఉండడు. భూమ్మీద జ్ఞానులే అతి తక్కువగా ఉంటారు. ఇక విజ్ఞాని అస్సలు ఉండడు. కనుక ఆ పదం ఈయనకు వాడకూడదు. భౌతిక శాస్త్రవేత్త అనేది వాడచ్చు.

సైంటిఫిక్ సర్కిల్స్ లో కూడా ఈయన్ను విమర్శించిన తెల్లవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయనది ఉత్త థియరీ మాత్రమేగాని ఈయన లెక్కలకు రుజువులు లేవని వారంటారు. సైన్స్ లో ఉత్త థియరీలు, లెక్కలు సరిపోవు. రుజువులు కావాలి. ఈయన చెప్పినవీ ఊహించినవీ పెద్దగా ఏవీ రుజువు కాలేదు. కనుక ఈయన ఒక తియరేటికల్ సైంటిస్ట్ మాత్రమే. బ్లాక్ హోల్స్ ఇలా ఉండచ్చు అలా ఉండచ్చు అంటూ ఎన్నైనా థియరీలు ప్రతిపాదించవచ్చు. కానీ వాటికి నిర్దిష్టమైన రుజువులు లేవు.

పైగా ఈయన్ను మించి ఆయా రంగాలలో రీసెర్చి చేసిన ఘనులు చాలామంది ఉన్నప్పటికీ ఈయనకు ఇంత పేరు ప్రఖ్యాతులు రావడానికి గల ఏకైక కారణం ఈయనకున్న రోగం. 'అంత రోగం పెట్టుకుని కూడా అంత చేశాడు' - అన్న ఒక సింపతీ ఇమేజి ఈయనకు ఏర్పడిపోయింది. అంతేగాని ఈయనలో మీడియా ఊదరగొడుతున్నంత గొప్ప విజ్ఞానం ఏమీ లేదు.

అదేదో సినిమాలో కోవై సరళ ఒక డైలాగ్ అంటుంది - 'నా బూతే నా భవిష్యత్తు' అంటూ. అలాగే ఈయన విషయంలో - 'నా రోగమే నా కీర్తి' అనుకోవచ్చు. ఈయనకు ఈ రోగం లేకుండా అందరిలా మామూలు మనిషే అయ్యుంటే ఎంతోమంది సైంటిస్ట్ లలో ఈయన కూడా ఇంకొక సైంటిస్ట్ అయ్యుండేవాడు. అంతేగాని ఇంత పేరు వచ్చేది కాదు. కనుక ఈయన పేరుకు ఈయన రోగమే కారణం గాని ఈయన చేసిన రీసెర్చి కాదు.

ఇంతకీ ఈయన రోగానికీ, వచ్చిన పేరుకీ కారణాలు ఈయన జాతకంలో ఏమున్నాయో గమనిద్దాం.

ఈయన 8-1-1942 న ఆక్స్ ఫర్డ్ లో పుట్టాడు. సమయం తెలియదు. పైపైన చూద్దాం.

మేషంలో వక్రనీచశని, కుజునితో కలసి ఉండటం వల్ల ఈయనకు ఆసాధ్యమైన క్రానిక్ డిసీజ్ వచ్చింది. ఈ యోగం చంద్రుని నుంచి అష్టమంలో ఉన్నదనీ, ఆ అష్టమం దీర్ఘరోగాలకు సూచిక అనీ గుర్తుండాలి. చంద్రుడు ఈ జాతకంలో బలహీనుడుగా ఉన్నాడు. సూర్యుని నుంచి ఈ యోగం పంచమ కోణంలో ఉంటూ బలహీనమైన జీవశక్తిని సూచిస్తోంది. జీవకారకుడైన గురువు వక్రించి సూర్యుని నుంచి రోగస్థానంలో ఉండటం చూడవచ్చు. బలహీనవక్ర గురువు యురేనస్ తో కలసి సహజ ద్వితీయస్థానంలో ఉండటం వల్ల ఈయనకు గొంతు ఆపరేషన్ జరిగి మాట పూర్తిగా పోయింది. సూర్యుని నుంచి ద్వితీయ స్థానంలో ఉన్న బుధ శుక్రులమీద శని కుజుల ప్రతికూల కేంద్రదృష్టి వల్ల మొదట్లో మాట బాగా ఉన్నప్పటికీ ఆపరేషన్ జరిగి అది పూర్తిగా పోయింది. అయితే చంద్రుని నుంచి పంచమంలో ఉన్న అదే యోగం ఈయనకు మంచి సైంటిఫిక్ థింకింగ్ నూ, ఊహా శక్తినీ ఇచ్చింది.

మేషంలోని శనికుజులకూ, మకరంలో ఉన్న బుధ శుక్రులకూ ఖచ్చితమైన కేంద్ర దృష్టులున్నాయి. బుధుడు నరాల రోగాలకు కారకుడన్న విషయం గుర్తుంటే, ఈయనకు ఈ క్రానిక్ డిసీజ్ ఎందుకొచ్చిందో అర్ధమౌతుంది. ఈ బుధుడు నవాంశలో extra saturnine planet అయిన యురేనస్ తో కలసి ఉండటంతో శరీరం ఆ స్థితిలో ఉన్నాకూడా భూమికి దూరంగా ఖగోళంలో ఉన్న వస్తువుల గురించి రీసెర్చి చేశాడు. బుద్ధికారకుడైన బుధుని మీద యురేనస్ ప్రభావం వల్లనే గ్రహాంతర వాసులున్నారని, ఇతర గ్రహాలలో జీవం ఉండవచ్చనీ నమ్మేవాడు. చెప్పేవాడు. యురేనస్ రాశి చక్రంలో జీవకారకుడైన వక్రగురువుతో కలసి ఉండటం ఈయనకు విచిత్ర వ్యాధిని తెచ్చిపెట్టింది.

చంద్రుని నుంచి నవమంలో ఉన్న వక్ర గురువు అష్టమంలోకి రావడంతో శకటయోగం ఏర్పడి, దేవుడిని నమ్మని నాస్తికుడిగా మారాడు. అంతేకాదు ఈయన జ్యోతిష్యాన్ని కూడా నమ్మేవాడు కాదు. ఇది చాలామంది సైన్సు వాదులకున్న రోగమే. ఇందులో వింతేమీ లేదు.

నవాంశలో శని రాహువులు బలహీన సూర్యునితో కలసి శపిత యోగాన్నిస్తూ జెనెటిక్ దోషాలను సూచించే వృశ్చికంలో ఉండటం వల్ల ఈ క్రానిక్ డిసీజ్ బలంగా ఈయనకు పట్టుకుంది.

ప్రస్తుతం గోచార శని కుజులు ఈయన జనన సూర్యుని మీదకు సంచారం చెయ్యడం ఈయన మరణానికి కారణమైంది. నరాల బలానికి కారకుడైన బుధుడు ప్రస్తుతం గోచారంలో నీచస్థితిలో ఉండటం గమనార్హం.

ఒకడిలో నిజంగా 'విషయం' ఉండటానికీ, లోకంలో పేరుప్రఖ్యాతులు రావడానికీ ఏమీ సంబంధం లేదని ఈయన జాతకం నిరూపిస్తుంది. కొందరికి అవకరం కూడా ఉన్నదానికంటే ఎక్కువ ఇమేజిని తెచ్చి పెడుతుంది. ఈ కేస్ అలాంటిదే.

ఈ లోకంలో అంతా బూటకమే ! అంతా మాయే !! 

విచిత్ర లోకం !!