నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

21, మార్చి 2018, బుధవారం

ఈక్వినాక్టియల్ డే - జ్యోతిష్యశాస్త్రం నిజమే అనడానికి ఇంకొక ఋజువు

జ్యోతిశ్శాస్త్రం నిజమేనని రుజువులేంటి? ఉంటే చూపించండి ! అంటూ కొంతమంది అడుగుతూ ఉంటారు. నిజంగా జిజ్ఞాసతో ఆ ప్రశ్న అడిగితే లక్ష రుజువులు చూపగలను. కానీ జిజ్ఞాస లేకుండా, ఊరకే కాలక్షేపం కామెంట్స్ చేస్తూ వెకిలిగా మాట్లాడేవారికి జవాబు ఇవ్వకపోగా వారిని వెంటనే బ్లాక్ చేసి పారేస్తూ ఉంటాను. అది నా అలవాటు. ఎందుకంటే కాలక్షేప రాయుళ్ళతో వాదన పెట్టుకుని నా సమయాన్ని వృధా చేసుకోవడం నాకస్సలు ఇష్టం ఉండదు మరి !

జ్యోతిశ్శాస్త్రానికి రుజువులు కావాలంటే మన జీవితాలను పరిశీలించుకుంటే బోలెడన్ని కనిపిస్తాయి. అయితే చూచే దృష్టి మనకుండాలి. అప్పుడు విషయాలు అర్ధమౌతాయి.

నేటి సంగతే గమనిద్దాం !

ఈరోజు ఈక్వినాక్టియల్ డే. అంటే పగలూ రాత్రీ సమంగా ఉండే రోజు. రేపటినుంచీ రాత్రుల నిడివి తగ్గి పగటి నిడివి పెరుగుతుంది. కనుక ప్రపంచమంతా ఈ రోజున ఎనర్జీ లెవల్స్ లో మార్పులు కలుగుతాయి. ఇవి ప్రతి ఏడాదీ కలుగుతాయి. గమనిస్తే అర్ధమౌతాయి. లేకపోతే అర్ధం కావు.

ఈ రోజున మీ జీవితాలను గమనించుకోండి. ఇన్నాళ్ళూ వాయిదా వేస్తున్న పనులను ఈరోజు అనుకోకుండా చేస్తారు. అవి ఏవో పెద్ద పెద్ద ప్రాజెక్టులే కానక్కరలేదు. చిన్న చిన్న పనులే కావచ్చు. కానీ ఈరోజున చేస్తారు. ఇది ప్రతివారి జీవితంలోనూ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా జరుగుతుంది. ఎందుకంటే సూర్యకాంతిలో ఈరోజు మార్పు ఉంటుంది.

మనిషి జీవితం సూర్యకాంతిమీదా, ప్రకృతిలో మన చుట్టూ ఉన్న విద్యదయస్కాంత రేడియేషన్ మీదా ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. ఇందులో ఏమీ అనుమానం లేదు. వీటిని నమ్మని వారి మీద కూడా ఇవి ప్రభావం చూపిస్తాయి. రేడియేషన్ కూ మన నమ్మకానికీ సంబంధం లేనేలేదు.

గమనించుకోండి ! ఈరోజున మీరు క్రొత్త నిర్ణయాలు తీసుకుని ఉంటారు. లేదా వాయిదా వేస్తున్న పనులను ఈరోజు మొదలుపెట్టి ఉంటారు. కొందరైతే వాటిని పూర్తి చేస్తారు. నేటి మీ షెడ్యూల్ నిన్నటివరకూ ఉన్నదాని కంటే ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. మీమీ జీవితాలు ఈరోజున ఒక క్రొత్త మలుపు తిరుగుతాయి. ఆ మార్పులు మళ్ళీ ఒక్కొక్కరికీ ఒక్కొక్క విధంగా ఉంటాయి. కొంతమందిలో దాగున్న దీర్ఘరోగాలు బయటపడతాయి. ఇంకొంతమంది జ్వరాలు జలుబు దగ్గులు మొదలైన వాటి బారిన పడతారు. ఇంకొంతమందిలో నూతనోత్సాహం పెల్లుబుకుతుంది. మరికొంతమంది ఈరోజు ఉన్న ఎనర్జీ ఊపులో ఇంపల్సివ్ నిర్ణయాలు తీసుకుని తర్వాత తీరికగా బాధపడతారు. ఇదంతా వారివారి జాతకాలను బట్టి జరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఈరోజును ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే చక్కటి ఫలితాలను ఈరోజే చూడవచ్చు !

జ్యోతిష్య శాస్త్రం నిజమే అనడానికి ఇది ఇంకొక ఉదాహరణ. కళ్ళున్నవారు చూడవచ్చు !!