“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

19, ఏప్రిల్ 2018, గురువారం

గత నెలరోజులుగా యాక్సిడెంట్లు - లైంగిక నేరాలు - గ్రహప్రభావం

ధనూరాశిలో శనికుజుల యుతి మీద గతనెల 27 వ తేదీన ఒక పోస్ట్ వ్రాస్తూ నేను చెప్పిన సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో జరుగుతూ ఉండటం మీరందరూ చూస్తున్నారు కదా ! సరిగ్గా చెప్పాలంటే మార్చి 8 వ తేదీన కుజుడు ధనూరాశిలోకి ప్రవేశించి శనీశ్వరుడితో కలిశాడు. ఆ రోజునుంచీ యాక్సిడెంట్ల పర్వం మొదలైంది. మార్చి 21 న ఈక్వినాక్టియల్ డే నుంచీ మరీ ఎక్కువైంది.

ఈ నలభై రోజులుగా నేను ఎన్నో వార్తలు విన్నాను. అంతర్జాతీయ స్థాయిలో గాని. జాతీయ స్థాయిలో గాని. సిటీలో గాని, మాకు తెలిసిన వారిలో గాని ఈ కాలంలో ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి. వీటిలో, వందలాదిమంది సైనికులు చనిపోయిన విమాన ప్రమాదాలనుంచి, టూ వీలర్ ప్రమాదాలనుంచి. కార్లు ఆటోల ప్రమాదాల నుంచి, ఊరకే నడుస్తూ క్రింద పడి గిలక బెణికిన వారివరకూ, మోకాళ్ళు మోచేతులు ఎముకలకు దెబ్బలు తగిలినవారి వరకూ అన్ని రకాల కేసులూ ఉన్నాయి.


మార్చి 22 తేదీ రాత్రి స్వయంగా నాకూ యాక్సిడెంట్ అయింది. రాత్రి పదిగంటల సమయంలో నరసరావుపేట నుంచి గుంటూరుకు వస్తుండగా బైక్ యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతం నాకు చాలా చెడుదశ జరుగుతున్నది. అందులో నా ప్రాణాలే పోవలసింది. ఎప్పుడో చేసిన పుణ్యం కాస్త మిగిలి ఉండబట్టి, ఇలాటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించి రెమెడీలు చేస్తూ ఉండబట్టి చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాను. కుడిమోకాలు ప్రాక్చర్ అయింది. లిగమెంట్స్ తెగిపోయాయి. నాలుగురోజులు ఆస్పత్రిలో ఉండి ప్రమాదం నుంచి బయటపడి కోలుకుంటూ ప్రస్తుతం ఇంకా బెడ్ రెస్ట్ దశలోనే ఉన్నాను. ఇంకా ఒక నెల రోజులు బెడ్ రెస్ట్ లోనే ఉండాలి. పనీపాటా లేదని అనలేను. పని ఒక్కటే లేదు, పాటలున్నాయి, అందుకే బ్లాగులో ఈ పాటల వెల్లువ !

ఇదే సమయంలో మనకు ఖగోళంలో కనిపిస్తున్న ఇంకొక యోగం మీనరాశిలో శుక్రుని ఉచ్ఛ స్థితి, మరియు ఆ తర్వాత ఉచ్ఛ సూర్యునితో మేషరాశిలో ఆయన యుతి. ఇదంతా ఒకటి రెండు నెలలనుంచీ జరుగుతూ ఉన్నప్పటికీ, మార్చి 27 తేదీన శుక్రుడు మేషరాశిలోకి అడుగుపెట్టినప్పటినుంచీ కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. అవే - లైంగిక నేరాలు లేదా లుకలుకలు.

ఈ యోగం వల్ల దాదాపు ప్రతిరోజూ కనిపిస్తున్న రేప్ కేసుల్లో జమ్మూలో జరిగిన ఆసిఫా రేప్ కేసు తలమానికం. అలాగే తెలుగు సినిమా రంగంలో 'కాస్టింగ్ కౌచ్' ఉందా లేదా అని యూట్యూబ్ లో రచ్చరచ్చగా జరుగుతున్న అనవసరమైన చర్చ కూడా ఇందులో భాగమే. చిలికి చిలికి గాలివాన అయినట్లుగా, ఇది సినిమా రంగంలోని ప్రముఖుల మెడలకూ, రాజకీయ నాయకుల మెడలకూ కూడా చుట్టుకుని ప్రెస్ మీట్లూ, యూట్యూబ్ వీడియోలతో, చాలా అసహ్యకరమైన గోలగా తయారైంది. ఎవరి వెనుక ఎవరున్నారో, ఎవరికి డబ్బులిచ్చి ఎవరు మాట్లాడిస్తున్నారో, ఎవరు ఎవర్ని ఎగదోస్తున్నారో తెలియనంతగా ఈ గోల జరుగుతున్నది. ప్రతిరోజూ వెల్లువెత్తుతున్న ఈ ఛండాలపు గోల చూడలేక అసలు యూట్యూబ్ ఓపన్ చెయ్యడమే ఎంతోమంది మానేశారు.

మనుషులమీదా లోకంమీదా గ్రహప్రభావం ఖచ్చితంగా ఉంటుందనీ, జరిగే ఈవెంట్స్ ఆ గ్రహప్రభావం వల్లే ప్రేరేపించబడతాయనీ, జరుగుతాయనీ, వెలుగులోకి వస్తాయనీ ఇవన్నీ మళ్ళీ నిరూపిస్తున్నాయి.