“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

26, ఏప్రిల్ 2018, గురువారం

ఆశారాం బాపూ - రజనీష్ - ధనూరాశిలో శనికుజులు


ఆశారాం బాపూ
మొన్న 22 తేదీన ఒక పోస్ట్ వ్రాస్తూ ధనూరాశి సహజ నవమ స్థానంగా ధార్మిక సంస్థలకు. దేవాలయాలకు, గురువులకు సూచిక కాబట్టి అందులో శనికుజుల సంచారం వల్ల ఈ రంగాలకు దెబ్బలు తగులుతాయని వ్రాశాను. ఇది వ్రాసి మూడు రోజులు కూడా గడవక ముందే, వివాదాస్పద గురువు ఆశారాం బాపూ కు రేప్ కేసులో యావజ్జీవ జైలుశిక్ష విధిస్తూ తీర్పు వచ్చింది. ఇది స్పష్టంగా శనికుజయోగం ఇచ్చిన తీర్పే.

రజనీష్
ఆశారాం బాపూ యొక్క వివాదాస్పద చరిత్రలోకి నేను పోదలచుకోలేదు. అది నాకనవసరం. గురువులపైన శనికుజుల ప్రభావం ఎలా ఉంటుందనేది మాత్రమే నేనిక్కడ మాట్లాడదలచుకున్నాను.

శనీశ్వరుడు రాశిచక్రాన్ని చుట్టి రావడానికి 30 ఏళ్ళు పడుతుందనేది అందరికీ తెలిసినదే. శని కుజులు సరిగ్గా 30 ఏళ్ళ క్రితం ధనూరాశిలో ఇదే పరిస్థితిలో ఉన్నారు. సమాజం మీదా మనుషులమీదా గ్రహప్రభావం అనేది నిజమే అయితే, అప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఉండాలి. అవేమిటో గమనిస్తే మనుషులపైన గ్రహప్రభావం ఎంత స్పష్టంగా ఉంటుందో అర్ధమౌతుంది. ప్రపంచం చేత ఎంతో గౌరవించబడే సోకాల్డ్ మహనీయులు కూడా గ్రహశక్తుల ముందు కీలుబోమ్మలేనన్నది స్పష్టం. 

30 ఏళ్ళ క్రితం మార్చ్ - 1988
శనికుజులు ధనూరాశిలో
సరిగ్గా 30 ఏళ్ళ క్రితం 13-2-1988 నుంచి 28-3-1988 వరకూ శని కుజులు ధనూరాశిలో సంచరించారు. విచిత్రం !! ఇదే సమయంలో వివాదాస్పద గురువు ఓషో రజనీష్ జీవితంలో చివరి దశ జరిగింది. ఆయన 1990 జనవరిలొ చనిపోయాడు. విచిత్రంగా అప్పుడు కూడా ధనూరాశిలో శని కుజుల సంయోగం జరిగింది.

నిజానికి 30 ఏళ్ళ క్రితం ఇదే సమయంలో  పూనా ఓషో ఆశ్రమం అనేక లుకలుకలలో చిక్కుకుని ఉన్నది. అమెరికాలో ఆశ్రమం పెడదామని వెళ్ళిన ఆయన చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అయి, అమెరికా ప్రభుత్వం చేత వెనక్కు పంపబడ్డాడు. 1985 లొ వెనక్కు వచ్చిన ఆయన అప్పటినుంచీ పూనా ఆశ్రమంలోనే ఉంటూ వచ్చాడు. కానీ 1988 ఇదే సమయంలో పూనా ఆశ్రమంలో అనేక రాజకీయాలు, శిష్యుల మధ్యన గొడవలు, అధికారం కోసం కుట్రలు జరిగాయి. రజనీష్ ఆరోగ్యం అప్పటికే బాగా క్షీణించింది. ఇంక కొద్ది నెలలలో ఆయన చనిపోతాడని తెలుసుకున్న శిష్యులు వేల కోట్ల రూపాయల ఆయన ఆస్తులకోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో వారి మధ్యన ఎన్నో గొడవలు జరిగాయి. ఒక స్టేజిలో రజనీష్ ను పోలీసులు అరెస్ట్ చెయ్యబోయారు కూడా. ఇలాంటి గొడవలన్నీ సరిగ్గా 30 ఏళ్ళ క్రితం పూనాలో జరిగాయి. ఇవి కూడా స్పష్టంగా ధనూరాశిలో శనికుజుల ప్రభావమే.

అంతేకాదు. ఇంకా కొన్ని పోలికలున్నాయి. రజనీష్ ఆశ్రమంలో, ఇష్టపడిన వారి మధ్యన ఫ్రీ సెక్స్ అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉండేది. అంతేకాదు అక్కడ స్మగ్లింగ్, డ్రగ్స్ వంటి నేరాలు కూడా జరుగుతూ ఉండేవి. ప్రస్తుతం ఆశారాం బాపూ ఆశ్రమంలో జరిగినవి కూడా సెక్స్ నేరాలే. పూనా ఆశ్రమంలో రజనీష్ సన్నిహితులు ఇన్నర్ సర్కిల్ వారికి కూడా ఈ నేరాలతో సంబంధాలున్నాయి. ప్రస్తుతం కూడా ఆశారాం బాపూ కుమారుడు నారాయణ సాయి కూడా ఇంకో రేప్ కేసులో దోషిగా ఉన్నాడు. ఇంతకు ముందు కూడా ఇతని మీద ఇలాంటి ఆరోపణలున్నాయి. ఇంకా మిగిలిన కోణాలు దర్యాప్తులో బయటపడొచ్చు.

రజనీష్ ఆశ్రమం కూడా ఇండియాకు పశ్చిమ తీరంలోనే ఉంది. ఆశారాం బాపూ కూడా గుజరాత్ వాడే. పశ్చిమతీర రాష్ట్రాలలోనే ఆయనకు మంచి అనుచరగణం ఉన్నది. ఈ కోణం కూడా గమనించదగ్గదే. రజనీష్, ఆశారాం ఇద్దరూ కూడా గడ్డాలు పెంచుకుని దాదాపు ఒకలాగే కనిపిస్తారు. ఈ కోణాన్ని కూడా గమనించాలి.

జనవరి 1990 రజనీష్ మరణ సమయంలో
శని కుజులు ధనూరాశిలో
కనుక గ్రహప్రభావం అనేది, అది జరిగిన ప్రతిసారీ దాదాపుగా ఒకే రకమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది అనేది స్పష్టం. కాకపోతే మారిన పరిస్థితుల దృష్టా వ్యక్తులు మారవచ్చు, ప్రాంతాలు మారవచ్చు, సంఘటనలు మారవచ్చు. కానీ ట్రెండ్ అనేది మాత్రం ఒకలాగే ఉంటుంది. హ్యూమన్ డ్రామా చాలా విచిత్రంగా అవే సన్నివేశాలతో రకరకాల చోట్ల రకరకాలుగా జరుగుతూ ఉంటుంది.

ఇదంతా చూస్తున్న తర్వాత, మనుషుల మీద గ్రహప్రభావం ఏమాత్రమూ ఉండదని తెలివైనవాళ్ళు ఎవరైనా ఎలా అనగలరు?