నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

30, మే 2018, బుధవారం

దేవుడు కళ్ళూ చెవులూ ఇచ్చింది మూసుకోడానికా?

నన్ను ప్రశ్నలు అడిగేవారిలో భలేభలే వాళ్ళుంటారు. వాళ్ళ క్రియేటివిటీకి నాకు చాలా సరదాగా ఉంటుంది. వాళ్ళ అజ్ఞానానికి జాలికూడా వేస్తూ ఉంటుంది. ఈ ప్రశ్నలు అడిగేవారిలో చాలామంది అమ్మాయిలే ఉంటారు. మగవాళ్ళు తక్కువ. ఎందుకంటే, మగవాడికి అహం జాస్తిగా ఉంటుంది. ఇంకొకడిని ఏదైనా అడగాలంటే - 'నేనేంటి ఇంకొకడిని అడిగేదేంటి?' 'ఈయనేంటి నాకు చెప్పేది?' - అంటూ ముందుగా వాడి అహం అడ్డొస్తుంది.

పాపం ఆడవాళ్ళు అలా కాదు. వాళ్లకు తెలుసుకోవాలని జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. అందుకే వెంటనే ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. అయితే వాళ్ళ సమస్యలు వాళ్ళకూ ఉంటాయి. నాకు కొంచం దగ్గరైతే చాలు, వారిలో పొసేసివ్ నెస్సూ, జెలసీ ఇత్యాది దుర్గుణాలు తలెత్తుతూ ఉంటాయి. ఆ క్రమంలో నానా కంపు చేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా అలా చేసిన వాళ్ళ గురించి, వాళ్ళ గోల గురించి మరెప్పుడైనా సీరియల్ గా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మన టాపిక్ లోకి వద్దాం.

మొన్నామధ్యన ఒకమ్మాయి నాతో ఫోన్లో మాట్లాడుతూ ఇలా అడిగింది.

'నేను మీ బ్లాగ్ కు చాలావరకూ అడిక్ట్ అయిపోయాను. ప్రతిరోజూ నాలుగుసార్లు మీ బ్లాగ్ ఓపన్ చేస్తూ ఉంటాను. కొత్తవి ఏమైనా వ్రాశారేమో అని'

ఈ మాటను చాలాసార్లు చాలామంది నుంచి విని ఉండటంతో నాకు కొత్తగా ఏమీ అనిపించలేదు.

'అవునా. థాంక్స్' అన్నా సింపుల్ గా.

'నేను మీ పోస్టులు అన్నీ చదువుతాను గాని మీ పాటలు మాత్రం అస్సలు వినను. అవి నాకు నచ్చవు' అంది ఆ అమ్మాయి మళ్ళీ.

నాకు విషయం అర్ధమైనా అర్ధం కానట్లు నవ్వుతూ - 'అవునా? అవేం పాపం చేశాయి? నేనేమీ అసభ్యమైన పాటల్ని పాడటం లేదే?' అన్నాను.

'అది కాదు. ఎందుకో మీ ఆధ్యాత్మిక పోస్టులు మాత్రమే నాకు నచ్చుతాయి. అలాంటి హై లెవల్ పోస్టులు వ్రాసే మీరు, ఒక మామూలు సింగర్ లాగా సినిమా పాటలు పాడటం ఎందుకో నాకు నచ్చదు' అంది.

'అలాగా' అన్నాను మళ్ళీ సింపుల్ గా.

'అవును. నాదొక డౌట్. అడగమంటారా?' అంది తను.

'చెప్పండి' అన్నాను.

'మీరు ధ్యానం గురించి ఎక్కువగా చెబుతారు కదా'

'అవును'

'నా డౌటేంటంటే, దేవుడు మనకు కళ్ళూ ముక్కూ చెవులూ ఇచ్చింది వాటిని తెరిచి లోకాన్ని చూడమని గాని, వాటిని మూసుకుని ధ్యానంలో కూచోమని కాదుగా? మరి ధ్యానం అనేది దేవుడి ప్లాన్ కు వ్యతిరేకం కదా?' అంది అమాయకంగా.

నవ్వుతో నాకు పొలమారింది.

'మీ డౌట్ చాలా బాగుంది. దానికి ఆన్సర్ చెప్పేముందు నాదొక డౌట్ ఉంది. అడగమంటారా?' అన్నాను.

'మీకు డౌటా? సరే ఏంటో చెప్పండి'

'ఏం లేదు? మీరు ఒక్క నిముషం కూడా కాకముందే రెండు మాటలు మాట్లాడుతున్నారేంటి?' అన్నాను.

'నేనా? రెండుమాటలు మాట్లాడానా? ఎప్పుడు" అందా అమ్మాయి.

'ఇప్పుడే. ముందేమో, దేవుడు నోరిచ్చింది మూసుకొని కూచోడానికి కాదన్నారు. మళ్ళీ వెంటనే, నేను మీ పాటలు వినను అంటున్నారు. దేవుడు నోరిచ్చింది పాటలు పాడటానికి కూడా కదా ! మరి నేనదే చేస్తున్నాను. అవి వినడానికి మీకెందుకు అయిష్టం? అంటే, మీరు కూడా దేవుడి ప్లాన్ కు వ్యతిరేకంగా పోతున్నట్లే కదా?' అన్నాను.

ఆమెనుంచి సౌండు ఆగిపోయింది.

'అంటే అంటే అదీ అదీ....' అంటోంది.

'పోనీ ఇంకో డౌటు. దీనికి చెప్పండి. నిద్రలో మీరు కళ్ళు మూసుకుని నిద్రపోతారా తెరుచుకుని నిద్రపోతారా?' అడిగాను.

'అదేంటండి అలా అడుగుతారు? ఎవరైనా కళ్ళు మూసుకునే కదా నిద్రపోతారు?' అడిగింది ఆమె.

'లేదండి. కొంతమంది కళ్ళు తెరుచుకుని కూడా నిద్ర పోగలరు' అన్నాను.

'అలాంటి వారిని నేనింతవరకూ చూడలేదండి' అందామె.

'కరెక్టే. నేనూ ఇంతవరకూ చూడలేదు' అన్నాను.

ఆమె ఇంకా కన్ఫ్యూస్ అయిపొయింది.

'అదేంటి? మరి ఎలా చెప్పగలుగుతున్నారు చూడకుండా?' అంది.

'నన్ను నేను చూడలేను కదా' అన్నాను.

'అదేంటి? మీరు కళ్ళు తెరుచుకుని నిద్రపోతారా?' అడిగింది ఆమె.

'అవును. అప్పుడప్పుడూ అలా చేస్తాను' అన్నాను.

'ఎందుకలా?' అడిగింది.

'ఎందుకంటే, నేను ప్రతిరోజూ చేపల్ని బాగా తింటాను. అవి అలాగే కళ్ళు తెరుచుకునే నిద్రపోతాయి. వాటిని తినీ తినీ అదే అలవాటు నాకూ వచ్చేసింది' అన్నాను సీరియస్ గా.

అవతలనుంచి కాసేపు నిశ్శబ్దం.

'మీరు చేపలు తింటారా? చేపలు తినేవాళ్ళు అలా అవుతారా?' అంది అనుమానంగా.

పాపం ఇప్పటికి సృష్టించిన కన్ఫ్యూజన్ చాల్లే అనిపించి - 'అబ్బే అదేమీ కాదండి. పక్కనున్నవాళ్ళని సరదాగా భయపెట్టాలని అనుకున్నపుడు కొన్నిసార్లలా చేస్తూ ఉంటాను' అన్నాను.

'నిజంగానా?' అడిగింది భయంగా.

'మీమీదొట్టు. ధ్యానం బాగా చేతనైతే ఇలాంటి ట్రిక్స్ చెయ్యచ్చు.' అన్నాను.

'ఇలాంటి ట్రిక్స్ చెయ్యడానికి ధ్యానం చేస్తారా?' అంది.

'కాదనుకోండి. ఆ క్రమంలో ఇలాంటి శక్తులు వస్తూ ఉంటాయి. వాటిని సరదాగా అలా వాడుతూ ఉంటా అప్పుడప్పుడు. సరేగాని నా డౌటు క్లియర్ చెయ్యలేదు మీరు. నిద్రలో మీరు కళ్ళు మూసుకుంటారు కదా?' అన్నాను.

'అవును'

'మరి దేవుడేమో కళ్ళు తెరిచి లోకాన్ని చూడమని చెప్పాడని మీరే అంటుంటిరి. మళ్ళీ నిద్రలో కళ్ళు మూసుకుంటాను అంటుంటిరి? ఒక్క నిముషంలో మీరే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏంటిదంతా?' అడిగాను.

'అంటే, నిద్రకూడా పోకుండా ఎల్లకాలం పత్తికాయల్లా కళ్ళు తెరుచుకునే ఉండాలంటే ఎలా కుదురుతుంది?' అందామె.

'నేను చెప్పేది కూడా అదే. కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యకుండా ఎప్పుడూ కళ్ళు తెరుచుకునే ఉండటం కూడా తప్పే కదూ?' అన్నాను.

'ఏమో. మీ ఆన్సర్ తో నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నాను' అందామె. 

'అది మీ ఇష్టం. మిమ్మల్ని కన్విన్స్ చెయ్యాల్సిన పని నాకు లేదు' అన్నాను.

'మరి నా డౌటు తీరేదెలా?' అంది.

'సరే. ఇంకో మాట అడుగుతాను చెప్పండి. మీ జీవితంలో మీరెప్పుడూ పాటలు పాడలేదా. కనీసం కూనిరాగాలు తియ్యలేదా? ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండి. కనీసం బాత్రూంలో స్నానం చెసేటప్పుడైనా, కూనిరాగాలు తియ్యలేదా? ఏ పాటలూ హమ్ చెయ్యరా?' అడిగాను.

'చేస్తాను. అలా అందరూ చేస్తారు' అందామె.

'మరి నేను పాడుతున్న పాటల్ని వినడానికి మీకెందుకు అభ్యంతరం? దేవుడు చెప్పిన పనే నేను చేస్తున్నాను. నేను బాత్రూంలో దాక్కుని పాటలు హమ్ చెయ్యడం లేదు. బాత్రూం బయటే పాడుతున్నాను. నోరు బార్లా తెరిచి మరీ పాటలు పాడుతున్నాను. మరి మీరెందుకు వినడం లేదు?' అడిగాను.

'ఏమో తెలీదు' అందామె.

'దేవుడు మీకు కూడా నోరిచ్చి పాటలు పాడమన్నాడు. మరి మీరెందుకు పాటలు పాడకుండా దేవుడికి అపచారం చేస్తున్నారు?' అడిగాను.

'అదీ తెలీదు' అందామె.

'ఏమీ తెలీకుండా మరి నాకెందుకు ఫోన్ చేశావమ్మా?' అనుకున్నా లోలోపల.

'సరే. ఒక పని చెయ్యండి. నేనిప్పటిదాకా 350 పైన హిందీ పాటలు పాడాను. తెలుగు, మలయాళం, కన్నడం ఇత్యాది ఇంకొన్ని పాడాను. ముందు అవన్నీ వినండి. ఆ తర్వాత మీ డౌట్లు అడగండి. అప్పుడు వాటిని క్లియర్ చేస్తాను' అని చెప్పాను.

'అలాగే చేస్తాను. ఈలోపల చిన్న క్లూ ఇవ్వండి' అందామె.

'ధ్యానం చెయ్యాలంటే కళ్ళు మూసుకునే చెయ్యనక్కరలేదు. తెరిచి కూడా చెయ్యవచ్చు. నేనలాగే చేస్తూ ఉంటాను' అన్నాను.

'అదేంటి? ఇదింకా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ధ్యానం కూడా కళ్ళు తెరిచే చేస్తారా?' అడిగిందామె.

'అవును. అలా ఎన్నో ఏళ్ళు చేసీ చేసీ, కళ్ళు తెరిచి నిద్రపోయే శక్తి సంపాదించాను' అన్నాను.

'దాన్ని శక్తి అంటారా? ఏంటో అంతా అయోమయంగా ఉంది. కాసేపేమో చేపలు తినీ తినీ అలా అయ్యానంటున్నారు. కాసేపేమో ధ్యానం వల్ల ఈ శక్తి వచ్చిందంటున్నారు. ఒక డౌట్ క్లియర్ చేసుకుందామని ఫోన్ చేస్తే మరిన్ని డౌట్స్ పట్టుకున్నాయి నన్ను.' అందా అమ్మాయి.

'నాతో ఇలాగే ఉంటుంది. నేను మీ డౌట్స్ క్లియర్ చెయ్యను. ఇంకా ఇంకా మీలో లేనిపోని డౌట్స్ క్రియేట్ చేస్తాను. నా మార్గం ఇంతే. ఈ హింసకి ఇష్టపడేవారే నాతో మాట్లాడాలి.' అన్నాను.

'మీరు చెబుతున్నవాటిల్లో ఏది నిజం? ఏదబద్ధం?' అందామె.

'అన్నీ అబద్దాలే. నేనొక్కటే నిజం' అన్నాను సీరియస్ గా గొంతు మార్చి.

'సరే ఫైనల్ గా చెప్పండి. దేవుడు మనకి కళ్ళూ చెవులూ ముక్కూ నోరూ ఇచ్చింది మూసుకోడానికా తెరుచుకోడానికా?' అందా అమ్మాయి విసుగ్గా.

'ఇలాంటి డౌట్స్ కూడా వస్తాయా దేవుడా?' - అని నాకు భలే నవ్వొచ్చింది.

'అప్పుడప్పుడూ మూసుకోడానికి, అప్పుడప్పుడూ తెరుచుకోడానికి. రెండూ చేసే శక్తి వాటికి ఉందిగా. ఆ శక్తికి హద్దులు పెట్టడం ఎందుకు?' అన్నాను.

'సరే. ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు?' అందామె చివరకు.

'ఏదో ఒకటి మీకు చేతనైంది చేసుకోండి' అందామని నోటిదాకా వచ్చింది కానీ బాగుండదని మింగేశాను.

'ముందు నా పాటలన్నీ మొత్తం విని ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చెయ్యండి. వినకుండా ఫోన్ చేస్తే ఊరుకోను. మధ్యమధ్యలో కొన్ని పాటల పేర్లు అడిగి మీకు టెస్ట్ పెడతాను. అందులో మీరు ఫెయిల్ అయితే నాకు చెడ్డ కోపం వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం.' అన్నాను కరుగ్గా.

'సరేనండి ఉంటా' అంటూ ఫోన్ పెట్టేసింది ఆ అమ్మాయి.

ఈ ఫోన్ కాల్ అయ్యేసరికి భలే విసుగొచ్చింది.

అంతా నా ఖర్మ ! సింపుల్ గా కళ్ళు తెరుచుకుని నిద్రపోవడం కూడా రానివారితో నేను మాట్లాడాల్సి రావడం నా ఖర్మ కాకుంటే మరేమిటి? ఛీ ! చవకబారు మనుషులు ! అంటూ భలే కోపం వచ్చేసింది.

అసలు నా బ్లాగులో ఫోన్ నంబర్ ను ఇవ్వనేల? ఇచ్చితిని పో, ఇలాంటివారు నాకు ఫోన్ చెయ్యనేల? చేసితిరి పో, నేను వారితో గంటలు గంటలు ఇలా వాగనేల? వాగితిని పో, చివరకు విసుగు పుట్టనేల? పుట్టినది పో, దాన్నంతా ఇలా బ్లాగులో పెట్టనేల?

అసలీ గోలంతా నాకేల?

అంతా కామెడీగా లేదూ?
read more " దేవుడు కళ్ళూ చెవులూ ఇచ్చింది మూసుకోడానికా? "

29, మే 2018, మంగళవారం

అన్ని మంత్రాలలోకీ గొప్ప మంత్రం ఏది?

మంత్రశాస్త్రంలో అనేక వేల మంత్రాలున్నాయి. వాటిల్లో దేనికదే గొప్ప అని ఆయా మంత్రాలు అనుష్టానం చేసేవారు అనుకుంటూ ఉంటారు. వైష్ణవులూ, శైవులూ, శాక్తేయులూ ఇలా ప్రతివారూ వారివారి మంత్రాలే గొప్ప అనుకుంటూ ఉంటారు. వీరిలో ఎవరికి వారే గొప్ప కావచ్చు. కానీ ఈ అన్నింటినీ మించిన చాలా సింపుల్ మంత్రం ఒకటుంది. అదేంటో చెప్పబోయే ముందు, ఈ మధ్యనే జరిగిన ఒక సంఘటన గురించి వినండి.

మొన్న ఒకరోజున మధ్యాన్నం పూట ఒక ఫోనొచ్చింది. ఏదో కొత్త నంబర్. సందేహిస్తూ 'హలో' అన్నాను.

'నాపేరు ఫలానా శర్మ అంటారు. నేను సంస్కృతంలోనూ తెలుగులోనూ పండితుణ్ణి' అన్నాడు ఒకాయన.

'సరే. నమస్తే.' అన్నాను.

'నమస్తే. మీరు వ్రాసిన 'శ్రీవిద్యా రహస్యం' చదివాను. ఒక్కసారి కాదు. చాలాసార్లు చదివాను. విషయం చాలా బాగుంది. అద్భుతంగా చెప్పారు. కానీ పద్యాలలో ఛందస్సు చాలాచోట్ల తప్పింది' అన్నాడాయన.

'అలాగా. సరే' అన్నాను.

నాకు వినపడలేదనుకున్నాడేమో, ఇంకా కొంచం గట్టిగా 'మీరు వ్రాసిన పద్యాలలో యతినియమమూ, చందస్సూ తప్పాయి చాలావాటికి' అన్నాడు.

'అవునా. సరే' అన్నాను మళ్ళీ.

'ఛందస్సు అంటే దేవతాస్వరూపం కదండీ? అలా వాటిని మార్చి వ్రాసేస్తే ఎలా?' అన్నాడాయన.

'అలాగా ! సరే' అన్నాను మళ్ళీ.

'ఒక ప్రముఖ వ్యక్తి గారున్నారు. ఆయన ఏకంగా రామాయణాన్నే తెలుగులో వ్రాశారు. కానీ పద్యాలలో అన్నీ ఛందోదోషాలే. ఏం చేస్తాం ! ఆయన పెద్దవాడు కాబట్టి చెలామణీ అయిపోయింది' అన్నాడు బాధగా.

'అవునా. అయ్యో పాపం' అన్నా నేనుకూడా బాధగానే.

'మీరు కూడా అలాగే వ్రాశారు. అన్ని తప్పులుంటే ఎలాగండి?' అంది స్వరం బాధనూ విసుగునూ కలిపి.

పాటలు పాడీ పాడీ మనకూ కొద్దో గొప్పో మిమిక్రీ వచ్చు గనుక, నేను కూడా అదే పాళ్ళలో బాధనూ విసుగునూ నా స్వరంలో ధ్వనింపజేస్తూ - 'అంతే కదండీ మరి?' అన్నాను.

అవతలవైపునుంచి కొంచం సేపు నిశ్శబ్దం ధ్వనించింది.

'నేను చెప్పేది మీకు వినిపిస్తోందా అసలు?' అడిగాడాయన కొంచం అనుమానంగా.

'చక్కగా వినిపిస్తోంది. చెప్పండి' అన్నాను నేను పెద్దగా అరుస్తూ.

'ఆ ! అదే ! మీ పుస్తకం చాలా బాగుంది. విషయ గాంభీర్యంలో అద్భుతంగా ఉంది గానీ పద్యాలలో ఛందస్సు అక్కడక్కడా తప్పింది ఇదే కాస్త లోపం' అన్నాడాయన మళ్ళీ.

'అలాగా. సరే' అన్నా నేను మళ్ళీ.

నాకు సరిగా వినిపించడం లేదని ఆయనకు గట్టిగా అనుమానం వచ్చేసింది. మళ్ళీ మొదట్నించీ మొదలుపెట్టి ' నాపేరు ఫలానా శర్మ' అని మొత్తం మళ్ళీ చెప్పిందే చెప్పుకుంటూ వచ్చాడు.

ఆయన చెప్పిన ప్రతిమాటనూ మళ్ళీ ఓపికగా వింటూ నేను, ప్రతిమాటకీ ' సరే, సరే ', 'అలాగా' 'అయ్యో పాపం' అంటూ వచ్చా యధావిధిగా.

రికార్దంతా మళ్ళీ వేశాక నాకు ఖచ్చితంగా చెవుడని ఆయనకు పెద్ద అనుమానం వచ్చినట్లుంది. ఇక వీడితో మనకెందుకులే కంఠశోష  అనుకున్నాడో ఏమో 'సరేనండి ఉంటా' అంటూ ఫోన్ పెట్టేశాడు.

నేను నవ్వుకుంటూ ఉండిపోయాను.

ఇప్పుడర్ధమైందా అన్ని మంత్రాలలోకీ గొప్ప మంత్రం ఏంటో?

'సరే' మంత్రం.

ఇది నేను చెప్పిన మాట కాదు. జిల్లెళ్ళమూడి అమ్మగారు చెప్పిన మాట. ఈ విధంగా అన్నింటికీ 'సరే'నంటే ఏ బాధా ఉండదు మనకు. ఇలా కాకుండా, 'నన్నూ నా పద్యాలనూ అంటాడా?' అని రోషం తెచ్చేసుకుని 'ఎక్కడ తప్పులున్నాయి? అవి ఎలా తప్పులయ్యాయి?' అంటూ ఆయనతో వాదన పెట్టుకుంటే ఇద్దరికీ బీపీలు పెరగడం తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. ఆయన అంటోంది మనల్ని కాదు, మన పద్యాలను కాదు అనుకుంటే ఏ సమస్యా లేదు. అసలాయన చెబుతోంది నాగురించి కాదు ఎవరో థర్డ్ పర్సన్ గురించి - అనుకుంటూ అన్నీ ఓపికగా విన్నా. 'సరే సరే' అనేవాడితో ఆయన మాత్రం చెప్పిందే ఎన్నిసార్లు చెబుతాడు? విసుగు రాదూ మరి !

ఈ ప్రపంచంలో ఎవరూ వారి పధ్ధతి మార్చుకోరు. ఎవడి గోల వాడిది. కాసేపు 'సరే' అంటే పోలా? ఆ తర్వాత ఎలాగూ ఎవరి దారిలోనే వారు పోతూ ఉంటారు కదా !

కొంచం కష్టమే ! కానీ అసాధ్యం మాత్రం కాదు. జీవితాన్నే కామెడీగా చూస్తే అంతా తేలికే. ఏమంటారు?
read more " అన్ని మంత్రాలలోకీ గొప్ప మంత్రం ఏది? "

వివేకానందుడూ బుద్ధుడూ జ్యోతిష్యాన్ని నమ్మలేదా? ఎవరా మాటంది?

ఈ మధ్య టీవీలోనూ నెట్లోనూ ఒక విచిత్రమైన వాదన షికార్లు చేస్తోందట. కొందరు నా చెవిని వేశారు. అదేంటంటే - 'వివేకానందస్వామి జ్యోతిష్యాన్ని నమ్మొద్దన్నాడు. బుద్ధుడు కూడా జ్యోతిష్యాన్ని నమ్మద్దని చెప్పాడు. కనుక జ్యోతిష్యశాస్త్రం అబద్దం.' అని కొందరు హేతువాదులు పనికట్టుకుని ప్రచారం సాగిస్తున్నారట. దానికి కొన్ని టీవీ చానల్స్ తమ వంతు సాయం తాము చేస్తూ టీ ఆర్పీ రేటింగులు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాయట. ఇదంతా నాకు కొందరు చెప్పారు.

నాకు నవ్వొచ్చింది.

ఈలోకంలో అసత్యం సత్యంగా సత్యం అసత్యంగా ప్రచారం కాబడటం వింతేమీ కాదు. అలాంటి వింతల్లో ఇదొకటి. పిచ్చిజనం ! పిచ్చిలోకం !!

నిజమేమంటే - వివేకానందస్వామీ బుద్ధుడూ ఇద్దరూ జ్యోతిష్యాన్ని నమ్మారు. ఇది సత్యం. కానీ వాళ్ళు కొన్ని సందర్భాలలో జ్యోతిష్యం మీద అతిగా ఆధారపడవద్దని చెప్పారు. తీవ్రంగా సాధన చేస్తున్న సాధకులకు జోస్యంతో అవసరం లేదని, గ్రహప్రభావాలకు వారు అతీతులు అవుతారని వాళ్ళు చెప్పారు. అంతేగాని మామూలు మనుషులకు అది పనికిరాదని వాళ్ళు ఎక్కడా చెప్పలేదు.

ఆయా సందర్భాలలో, కొందరు శిష్యులకో, లేదా కొన్ని ఉపన్యాసాలు ఇస్తూనో వాళ్ళు చెప్పిన మాటలను జనరలైజ్ చేసి నేడు కొందరు హేతువాదులూ కమ్యూనిస్టులూ ఈ విధంగా ప్రచారాలు సాగిస్తున్నారు. ఇది తప్పు ధోరణి.

వివేకానందస్వామి తన మరణానికి కొన్ని వారాల ముందుగా ఒక విచిత్రమైన పని చేశాడు. పంచాంగాన్ని తెచ్చి వరుసగా తిథి వార నక్షత్రాలను చదివి తనకు వినిపించమని తన శిష్యునికి ఆయన చెప్తారు. ఆ శిష్యుడు అలాగే చేశాడు. జూలై నాలుగో తేదీవరకూ పంచాంగాన్ని మౌనంగా విన్న స్వామి, 'ఇక చాలు' అని శిష్యునితో అంటారు. అలా ఎందుకు చేశారో ఆ శిష్యులకు అర్ధం కాలేదు. కానీ సరిగ్గా అదే జూలై నాలుగో తేదీన ఆయన స్వచ్చందంగా దేహత్యాగం చేసిన తర్వాత వారికి అర్ధమౌతుంది - ఆయన ఆ తేదీని కావాలనే ఎంచుకున్నారని. జ్యోతిష్యం మీద నమ్మకం లేకపోతే తన మరణానికి తానే ముహూర్తం ఎందుకు పెట్టుకున్నారు వివేకానందస్వామి? అదికూడా పంచాంగం చదివి మరీ??

ఇదంతా వివరిస్తూ ఇంతకు ముందు నేనొక పోస్ట్ వ్రాశాను. ఇప్పుడు అవసరం వచ్చింది గనుక మళ్ళీ వ్రాస్తున్నాను.

అలాగే, సిద్దార్ధుడు పుట్టినపుడే రాజజ్యోతిష్కులు చెబుతారు, ఇతను అయితే మహాచక్రవర్తి అవుతాడు, లేకపోతే భిక్షువు అవుతాడు అని. వాళ్ళు పదిరకాల చాయిస్ లు ఇవ్వలేదు. అయితే ఇంజనీరు అవుతాడు, లేకపోతే డాక్టరు అవుతాడు. లేకపోతే సైంటిస్టు అవుతాడు, ఉంటే ఇండియాలో ఉంటాడు, లేకపోతే అమెరికా వెళతాడు అని పది రకాలుగా చెప్పలేదు. రెండే చాయిస్ లు ఇచ్చారు. ఆ రకంగా, జరగబోయేదాన్ని వాళ్ళు చాలా కరెక్టుగా నేరోడౌన్ చేసి చెప్పినట్లే లెక్క.

గౌతముడు తన నలభయ్యవ ఏట జ్ఞానాన్ని పొంది బుద్ధుడు అయ్యాడు. అంటే, నలభై ఏళ్ళ ముందే రాజజ్యోతిష్కులు కరెక్టుగా చెప్పగలిగారు భవిష్యత్తులో ఆయన ఏమి అవుతాడో? మరి జ్యోతిష్య శాస్త్రం అబద్దం ఎలా అవుతుంది?

అయితే పిడి హేతువాదులు ఇలా అంటారు - 'అదేంటి? అయితే చక్రవర్తి, లేదా భిక్షువు అవుతాడని ఎవరైనా చెప్తారు. ఒక్కదాన్నే కరెక్ట్ గా చెప్పాలికదా? రెండుగా చెప్పడంలోనే జ్యోతిష్కులు ఫెయిల్ అయ్యారు' - అని.

రెండు చెప్పినందువల్ల వాళ్ళు ఫెయిల్ అవ్వలేదు. వాళ్ళు కరెక్ట్ గానే చెప్పారు. ఎందుకంటే, రాజూ భిక్షువూ ఈ రెండే కాదు. ఎన్నో ఛాయిసెస్ వాళ్ళకున్నాయి. అవన్నీ ఒదిలి అయితే రాజు, లేదా భిక్షువు అవుతాడని ఎలా చెప్పారు? రాజు కొడుకు రాజే అవుతాడు. ఆ రోజుల్లో ఇంకేమీ కాడు. కానీ ఆల్టర్నేటివ్ గా 'భిక్షువు' అనే దాన్నే వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు చాలా కరెక్ట్ గా చెప్పినట్లే !!

ఒక చిన్న ఉదాహరణతో నేటి హేతువాదుల లాజిక్ ఎంత డొల్లగా ఉందో నిరూపిస్తాను.

ఈరోజుల్లో మెడికల్ సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. అపోలోలు, యశోదాలు, నిమ్స్ లు, ఏ ఐ ఎమ్మెస్ లు ఇలా ఎన్నో పేరుగాంచిన ఆస్పత్రులు రీసెర్చి సెంటర్లు ఉన్నాయి. మరి మనిషి ప్రాణం ఎందుకు పోతోంది? వాటిల్లో ఎవరూ చావకూడదు కదా? మోస్ట్ మోడరన్ ఎక్విప్ మెంట్ వాళ్ళ దగ్గర ఉంది కదా? మరి పేషంట్ ఎందుకు చనిపోతున్నాడు?

ఈ పేరుగాంచిన ఆస్పత్రులలో డాక్టర్లు కూడా చివరకు ఇలా అంటారు - 'మేము చెయ్యగలిగింది అంతా చేశాం. కానీ కుదరలేదు. ఓల్డ్ ఏజ్ ప్రాబ్లంస్ కి మేం ఏం చెయ్యలేం. మేం వైద్యం చెయ్యగలం అంతే. ప్రాణం పొయ్యడం మా చేతుల్లో లేదు'. 

మరి ఇదే నిజమైతే, అన్నెన్నెళ్ళు రాత్రింబగళ్ళు కష్టపడి మెడిసిన్ చదవడం ఎందుకు? ఏ పల్లెటూరి బైతును కదిలించినా ఇంతకంటే గొప్ప వేదాంతం చాలా సులువుగా చెబుతాడు. ఈ మాత్రం మాటలు చెప్పడానికి మెడిసిన్ చదవాలా?క్రిటికల్ కండిషన్ లో ఉన్న పేషంట్ ఎన్ని గంటలు బ్రతుకుతాడో ఈ డాక్టర్లు ఖచ్చితంగా ఎందుకు చెప్పలేరు?

'చెప్పలేమండి ! ఉంటే రెండు రోజులు ఉండవచ్చు. లేదా రెండు నెలలు కూడా బ్రతకొచ్చు. ఎలా చెప్పగలం? మా ప్రయత్నం మేం చేస్తున్నాం' అంటారు. వీళ్ళ మాటలు జ్యోతిష్కుల మాటల్లా ఉన్నాయా లేక డాక్టర్ల మాటల్లా ఉన్నాయా? వీటిల్లో ఒక నిర్దుష్టమైన ఖచ్చితత్వం ఎందుకు ఉండదు? పేషంట్ ఎన్నాళ్ళు బ్రతుకుతాడు? ఏ రోజు, ఎన్ని గంటలా ఎన్ని నిముషాలకు చనిపోతాడు? ఎందుకు చెప్పలేరు? వాళ్ళదగ్గర అన్నిరకాల ఎక్విప్ మెంట్స్ ఉన్నాయిగా?

ఎందుకంటే, ప్రతిదాన్నీ ఖచ్చితంగా చెప్పడం సైన్స్ కి కూడా సాధ్యం కాదు. కొంతవరకూ నేరో డౌన్ చేసి చెప్పగలం అంతేగాని ఇలాగే జరుగుతుంది. ఇంతే జరుగుతుంది అని ఎవరూ చెప్పలేరు. జ్యోతిష్యశాస్త్రం కూడా అదే చెబుతుంది. అదే చెప్పింది.

అయితే, కొన్నికొన్ని రోగాలలో, మెడికల్ సైన్స్ 'ఇది ఇంతే' అంటూ చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతుంది. కానీ కొన్ని కొన్ని రోగాలలో అలా చెప్పలేదు. జ్యోతిష్యశాస్త్రం కూడా అంతే. కొన్ని కొన్ని జాతకాలలో చాలా స్పష్టంగా 'ఇది ఇంతే' అంటూ చెప్పే యోగాలుంటాయి. కొన్నింటిలో అలా ఉండవు. వాటిల్లో చాయిస్ కు చాలా స్కోప్ ఉంటుంది. కనుక జాతకంలో రెండు లేదా మూడు రకాల ఆల్టర్నేటివ్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా నిజం అవుతుంది.

బుద్ధుడు పుట్టి ఉయ్యాలలో ఉన్నప్పుడే జ్యోతిష్కులు చెప్పారు, ఇతను ముందుముందు బుద్ధుడు అవుతాడు అని. ఆమాట నలభై ఏళ్ళ తర్వాత నిజం అయింది. ఈ సంగతి బుద్దుడికి కూడా తెలుసు. అలాంటిది, జ్య్తోతిష్యశాస్త్రం అబద్దం అని ఆయనెలా చెబుతాడు? నవ్వులాటగా లేదూ?

అలాగే, వివేకానందస్వామి చిన్నప్పుడు కూడా జ్యోతిష్కులు చెప్పారు, ఇతను సన్యాసి అవుతాడు అని. వారి వంశంలో ప్రతి తరంలోనూ ఒకరు అలా సన్యాసం తీసుకుని ఇంట్లోనుంచి వెళ్ళిపోయిన వాళ్ళున్నారు. వివేకానందస్వామి తాతగారు అదే పని చేశారు. కనుక ఈ జోస్యం విన్న తల్లిదండ్రులు భయపడ్డారు. ఈ పిల్లవాడు కూడా అలాగే అవుతాడేమో అని. ఖచ్చితంగా అలాగే జరిగింది. ఇరవై మూడేళ్ళ వయస్సులో నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందస్వామి అయ్యాడు. మరి జ్యోతిష్యం నిజమైందా లేదా?

ఈ సంగతి వివేకానంద స్వామికి కూడా తెలుసు. స్వయానా ఆయన మరణతేదీకి ఆయనే ముహూర్తం పెట్టుకున్నారు. మరి జ్యోతిష్యం అబద్దం అని ఆయనెలా చెప్పగలరు?

కొన్ని ఉపన్యాసాలలో ఆయన 'జ్యోతిష్యం మీద ఎక్కువగా ఆధారపడవద్దు. మీ స్వశక్తిని నమ్మండి' అని చెప్పిన మాట నిజమే. అది ఎందుకు చెప్పారో తెలుసా? ఆ రోజుల్లోని సొసైటీని చూచి ఆయనలా చెప్పారు.

అప్పటికి ఇంకా మనం బ్రిటిష్ బానిసత్వంలోనే ఉన్నాం. సమాజంలో ఎక్కడ చూచినా నిరాశా నిస్పృహలు, ఏడుపు, చేతగానితనం, దోపిడీని సహిస్తూ బ్రతకడం వంటి నెగటివ్ పోకడలు ఉండేవి. అలాంటి పరిస్థితిలో జ్యోతిష్యాన్ని నమ్మి ' నా ఖర్మ ఇంతే. ఏం చేసినా నేను బాగుపడను' వంటి నెగటివ్ ధోరణులు పెంచుకోవడం మంచిది కాదన్న ఉద్దేశ్యంతో ఆయనలా చెప్పారుగాని అసలు జ్యోతిష్య శాస్త్రమే అబద్దం అని ఆయన ఎక్కడా చెప్పలేదు. స్వయానా ఆయనొక మహాయోగి అని మహాజ్ఞాని అని గుర్తుంటే ఆయన ఈ మాటలు అనరు అని మనకు తేలికగా అర్ధమై పోతుంది.

'ఏ భిక్షువూ, భిక్షుణీ జోతిష్యవిద్యనూ కానీ, నక్షత్రవిద్యనూ కానీ చెప్పకూడదు' అని బుద్దుడే శాసించినట్లుగా బుద్ధగ్రంధమైన 'దీర్ఘనికాయం' లో ఉన్నది. అంతమాత్రం చేత జ్యోతిష్యశాస్త్రమే లేదనీ, అది తప్పనీ బుద్ధుడు చెప్పలేదు. తాను చూపిన మార్గంలో సాధన చేసే జ్ఞానసాధకులకు దాని అవసరం లేదని మాత్రమే ఆయన చెప్పాడు. దీనిని స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే బుద్దుడు పుట్టేనాటికి అనేక వేల సంవత్సరాల ముందునుంచే జ్యోతిష్యజ్ఞానం ఒక శాస్త్రంగా మారి ఈ దేశంలో వేళ్ళూనుకొని ఉన్నది.

ఒకవేళ భిక్షువులు గనుక జ్యోతిష్య శాస్త్రాన్ని చెప్పడం మొదలు పెడితే, జనులు చూపించే కుహనా గౌరవానికి వాళ్ళు క్రమేణా బానిసలైపోయి, అదొక వ్యాపారంగా మారుతుందనీ, ఆ క్రమంలో వాళ్ళు సాధనలో భ్రష్టులై తామెందుకు భిక్షువులమైనామో ఆ గమ్యాన్ని మరచిపోతారనీ ఆయన భావించాడు. కనుకనే జ్యోతిష్యశాస్త్రాన్ని వారు అభ్యసించకూడదని ఆయన నిబంధన పెట్టాడు. అంతేగాని అసలు జ్యోతిష్య్కులే ఉండకూడదని ఆయన చెప్పలేదు. ఆయన అలా చెప్పినా అప్పటి రాజులు వినేవారు కారు. ఎందుకంటే అదొక శాస్త్రమని వారికి బాగా తెలుసు. వారి ఆస్థానాలలోనే మంచి మంచి రాజజ్యోతిష్కులు ఉండేవారు.

నేటి బౌద్ధభిక్షువులే స్వయానా అనేకమంది జ్యోతిష్యాన్ని నమ్ముతారు. అంతేగాక దానిలో వాళ్ళు మంచి పండితులై ఉంటున్నారు. మరి వాళ్లకు తెలీదా ఏ సందర్భంలో బుద్ధుడు అలా చెప్పాడో?

ఇకపోతే, బుద్ధుడు అలా మాట్లాడటానికి వేరే ఇంకొన్ని కారణాలున్నాయి.

బుద్ధుడూ జైన మహావీరుడూ సమకాలికులు. బుద్దుడికీ మహావీరుడికీ ఎప్పుడూ పడేది కాదు. ద్వేషం పనికిరాదని చెప్పిన బుద్ధుడే మహావీరుడిని తెగ విమర్శించేవాడు. ఆయన మీద జోకులు కూడా వేసేవాడు. వారిద్దరూ బాహాటంగానే ఒకరినొకరు విమర్శించుకునేవారు. ఆయన శిష్యులకూ ఈయన శిష్యులకూ మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. జైనసాధువులు జ్యోతిష్యశాస్త్రానికి చాలా సేవ చేసారు. వారెన్నో జ్యోతిష్య గ్రంధాలు కూడా వ్రాశారు. జైన సాధువులు జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రజ్ఞ కలిగిన వారు. కనుక వారంటే తనకు సహజంగా ఉన్న చులకన భావంతో, బుద్దుడు జ్యోతిష్యాన్ని కొన్ని సార్లు విమర్శించిన మాట వాస్తవమే. అయితే, ఆ విమర్శ అనేది తన ప్రత్యర్ధులైన జైనమత సాధువులకు గురిపెట్టబడిందే గాని జ్యోతిష్య శాస్త్రానికి గురిపెట్టినది కాదు.

గ్రహప్రభావాన్ని దాటిపోవాలనే బుద్ధుడు తరచూ చెప్పేవాడు. బుద్ధుడే కాదు, ఏ నిజమైన గురువైనా ఇదే చెబుతాడు. నిజంగా ఆధ్యాత్మిక సాధనలో జరిగేది అదే. సాధకుడైన వాడు గ్రహప్రభావానికి అతీతంగా ఎలా పోవాలో తన సాధనా మార్గంలో క్రమేణా నేర్చుకుంటాడు. అంతమాత్రం చేత, గ్రహప్రభావం అబద్దం అవ్వదు. అది సత్యమే.

అసలు బుద్ధుని జీవితంలోనే గ్రహాలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఆయన పుట్టినదీ, జ్ఞానోదయాన్ని పొందినదీ, మరణించినదీ మూడూ కూడా పౌర్ణిమ రోజునే కావడం కాకతాళీయం ఎలా అవుతుంది?

కనుక, బుద్దుడు గాని, వివేకానందుడు గాని, కొన్ని సందర్భాలలో కొంతమందిలో మాట్లాడుతూ అన్న మాటలను జనరలైజ్ చేసి అది వారి భావజాలపు మొత్తం విధానంగా చిత్రీకరించడం చాలా పొరపాటు. ఇలా చెయ్యడం అనేది. ఈ ఇద్దరు మహనీయులనూ సరిగ్గా అర్ధం చేసుకోలేనితనం వల్ల మాత్రమే వస్తుంది. సరిగ్గా అర్ధం చేసుకుంటే వాళ్ళు అలా అనలేదని మనకు తేలికగా అర్ధమౌతుంది.

గ్రహ ప్రభావానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పనా?

ఈరోజున మనం పౌర్ణమిఛాయలో ఉన్నాం. ప్రతి పౌర్ణమికీ ఒకే ప్రభావం ఉండదు. తేడాలుంటాయి. ఈ పౌర్ణమి ప్రభావం ఏంటో చెప్పనా?

చాలామంది ఈ సమయంలో డిప్రెషన్ కు గురౌతారు. ఏదో ఒక విధమైన భయం, చింత వారిని వెంబడిస్తాయి. కావాలంటే మీ జీవితాలలో మీరే పరీక్ష చేసి చూసుకోండి. మీకే అర్ధమౌతుంది. ఇంత చిన్న విషయం మనకే అర్ధమౌతుండగా లేనిది మహామహులైన బుద్ధుడు. వివేకానందులకు అర్ధం కాదా?

కుహనా జ్యోతిష్కులు మన సొసైటీలో ఎక్కడ చూచినా ఉండవచ్చు. మాయగాళ్ళు ఉండవచ్చు. అంతమాత్రం చేత శాస్త్రమే తప్పు ఎలా అవుతుంది? సమాజంలో దొంగ డాక్టర్లున్నారని వైద్య శాస్త్రమే తప్పంటామా?

పిచ్చి జనం ! పిచ్చి సోసైటీ అంతే ! ఈ సొసైటీలో నిజాలెవడిక్కావాలి? ప్రతిదాన్నీ ఒక వివాదంగా మార్చి కాలక్షేపానికి టీవీల్లో అరుచుకోవడం జనాలకు కావాలి. మీరొక తమాషా ఎప్పుడైనా గమనించారా? రోడ్డుమీద ఎవరైనా అరుచుకుంటుంటే, చుట్టూ వందలాది మంది పనులన్నీ మానుకొని నిలబడి చూస్తూ ఉంటారు. ఇప్పుడు రోడ్లమీద తిరిగే ఓపికా సమయమూ ఎవరికీ లేవుగనుక ఇంట్లో కూచుని టీవీల్లో అరుచుకుంటుంటే చూచి ఆనందిస్తున్నారు. అంతే తప్ప ఈ చర్చల్లో తేలేది ఏమీ ఉండదు ! ఇదొక నేలబారు వినోదం అంతే !

అద్భుతమైన ఒక జీవితసత్యం చెప్పనా?

ఈలోకంలో మీకు తగినవే మీకు దొరుకుతాయి. అది తల్లిదండ్రులు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, సంతానం కావచ్చు, గురువు కావచ్చు, శిష్యుడు కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అంతిమంగా మీకు తగినదే మీకు దొరుకుతుంది, ఒకవేళ అత్యుత్తమమైనది మీ ఎదురుగానే ఉన్నా కూడా, దానిని పొందే అర్హత మీకు లేకపోతే దానిని మీరు పొందలేరు, నిలబెట్టుకోలేరు.

అందుకే, అబద్దం ఎక్కినట్లు నిజం ఎక్కదు. నకిలీని నమ్మినట్లు అసలైనదాన్ని ఎవరూ నమ్మరు. అదంతే !
read more " వివేకానందుడూ బుద్ధుడూ జ్యోతిష్యాన్ని నమ్మలేదా? ఎవరా మాటంది? "

'Hidden meanings of Lalita Sahasranama' - E Book ఈరోజు రిలీజైంది

మార్చి 22 న యాక్సిడెంట్ ఐనప్పటినుంచీ మెడికల్ రెస్ట్ లో ఉన్న నేను ఈ రెండు నెలలలో చేసిన పనులు చాలా ఉన్నాయి. వాటిల్లో 'శ్రీవిద్యా రహస్యం' తెలుగు పుస్తకాన్నీ అలాగే దాని ఇంగ్లీషు అనువాదం 'The Secret of Sri Vidya' అనే పుస్తకాన్నీ ఆమూలాగ్రం అనేకసార్లు పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పులు చేసి రెండో ఎడిషన్స్ గా వాటిని విడుదల చెయ్యడం జరిగింది.

ఈ పనులతో బాటు సమాంతరంగా 'లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక' ను 'Hidden meanings of Lalita Sahasranama' అనే పేరుతో ఇంగ్లీష్ లోకి అనువాదం చెయ్యడం జరిగిపోయింది. ఈరోజు ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను.

ఇంతటి లోతైన రహస్యాలున్న ఇలాంటి పుస్తకం లలితా సహస్రనామాలపైన ఇప్పటివరకూ రాలేదని ఘంటాపధంగా నేను చెప్పగలను. అసలీ పనులన్నీ చెయ్యడానికే నాకీ యాక్సిడెంట్ అయిందేమో అని నాకిప్పుడనిపిస్తోంది. మామూలుగా అన్నిపనులూ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నట్లయితే ఇవి చెయ్యడానికి నాకు రెండేళ్ళు పట్టి ఉండేది. అలాంటిది రెండు నెలల్లో చెయ్యగలిగాను.

ఈ పుస్తకాన్ని వ్రాయడంలో నాకెంతో సహకరించిన నా శ్రీమతికీ, అలాగే నా అమెరికా శిష్యురాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

యధావిధిగా, ఈ పుస్తకం ఆన్ లైన్ లో google play books సైట్ నుంచి, అలాగే  Amazon.com నుంచి కూడా లభ్యమౌతుంది.

ఈ ఇంగ్లీషు పుస్తకంతో అంతర్జాతీయ పాఠకులు కూడా లలితా సహస్రనామాల మహత్యాన్నీ, దానిలోని అసలైన లోతైన అర్ధాలనూ తెలుసుకోగలుగుతారు. ఇది చదివిన ఇంగ్లీషు పాఠకులకు ఖచ్చితంగా మనదేశపు ఆధ్యాత్మిక ఔన్నత్యం పట్ల మంచి అవగాహన కలుగుతుందని, అది తప్పకుండా సరియైన ఆధ్యాత్మిక మార్గంలో వారిచేత అడుగులు వేయిస్తుందనీ నా నమ్మకం.


ఆ తర్వాత - ఖాళీగా ఉండటం మనకస్సలు ఇష్టం ఉండదు కాబట్టి, ఈరోజునుంచీ మా తర్వాతి పుస్తకం - 'Medical Astrology - Part I (With examples of 100 live Astro charts)' పని మొదలుపెడుతున్నాం అని చెప్పడానికి ఇంకా సంతోషిస్తున్నాను.
read more " 'Hidden meanings of Lalita Sahasranama' - E Book ఈరోజు రిలీజైంది "

28, మే 2018, సోమవారం

Kayi Bar Yubhi Dekha Hai - Mukesh


Kayi Bar Yubhi Dekha Hai

అంటూ ముకేష్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1974 లో వచ్చిన Rajnigandha అనే సినిమాలోది. ఇది 1970 తర్వాత వచ్చినప్పటికీ ఆపాతమధురగీతాలలో ఒకటే. ఎందుకంటే, ఈ చిత్రానికి సంగీతం సమకూర్చింది మధుర సంగీత దర్శకుడు సలీల్ చౌధురీ కనుక. ఈయన పాటలు ఎంత మధురంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి తక్కువ వాయిద్యాలతో అతి చక్కటి మాధుర్యాన్ని సృష్టించడం ఈయన ప్రత్యేకత.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి !

Moviez:- Rajnigandha (1974)
Lyrics :-- Yogesh
Music:-- Salil Chowdhury
Singer:-- Mukesh
Karaoke Singer:- Satya Narayana Sarma
Enjoy
--------------------------------

[Kayi baar yubhi dekha hai – Yejo manki seema rekha hai
Man todne lagtaa hai
Anjaani pyas ke peeche – Anjaan aaske peeche
Man doudne lagtaa hai] - 2

Raahon me raaho me – Jeevan kee raahon me
Jo khile - hai phool - phool muskuraake
Kounsa phool churake - Rakhu manmesajake
Kayi baar yubhi dekha hai – Yejo manki seema rekha hai
Man todne lagtaa hai
Anjaani pyas ke peeche – Anjaan aaske peeche
Man doudne lagtaa hai

Jaanoonaa janoona – Uljhan ye jaanoo na
Suljhavu kaise – kuch Samajhna paavoo
Kisko meet banavu – Kiskee preet bhulavu
[Kayi baar yubhi dekha hai – Yejo manki seema rekha hai
Man todne lagtaa hai
Anjaan pyas ke peeche – Anjaan aaske peeche
Man doudne lagtaa hai] - 2

Meaning

I have seen this many times
that mind has a boundary line
which it wants to break
Behind some unknown thirst
behind some unknown desires
the mind wants to rush

On the highways of life
Bloom many flowers
with a smiling face
which one to take?
and which one to keep in my heart?

I know not, I know not
this dilemma I know not
How to solve this?
Whose love should I accept?
and whom should I forget?

I have seen this many times
that mind has a boundary line
which it wants to break
Behind some unknown thirst
behind some unknown desires
the mind wants to rush

తెలుగు స్వేచ్చానువాదం

చాలా సార్లు గమనించాను
మనస్సుకి ఒక హద్దు అనేది ఉందని
కానీ దానిని దాటిపోవాలనే అదెప్పుడూ
ప్రయత్నిస్తుందని
ఏదో తెలియని దాహంతో
ఏవో తెలియని కోరికల వెనుక
అది పరిగెత్తి పోతుందని

జీవితపు రహదారులలో
ఎన్నో పూలు నవ్వుతూ కనిపిస్తాయి
కానీ వాటిల్లో దేనిని స్వీకరించాలి?
దేనిని నా హృదయంలో నిలుపుకోవాలి?

నాకర్ధం కావడం లేదు
ఈ సమస్యను ఎలా దాటాలో
అస్సలు తెలియడం లేదు
ఎవరి స్నేహాన్ని నేను స్వీకరించాలి?
ఎవర్ని మర్చిపోవాలి?

చాలా సార్లు గమనించాను
మనస్సుకి ఒక హద్దు అనేది ఉందని
కానీ దానిని దాటిపోవాలనే అదెప్పుడూ
ప్రయత్నిస్తుందని
ఏదో తెలియని దాహంతో
ఏవో తెలియని కోరికల వెనుక
అది పరిగెత్తి పోతుందని
read more " Kayi Bar Yubhi Dekha Hai - Mukesh "

పూజ గొప్పదా స్తోత్రం గొప్పదా?

నా పుస్తకాలు చదివిన చాలామంది నన్ను ఆధ్యాత్మిక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మొన్నొకాయన ఫోన్లో అలాంటిదే ఒక ప్రశ్న అడిగాడు. ఆయన నాకు పరిచయస్తుడే. అందుకే కొంచం చనువుగా మాట్లాడాడు.

'పూజ గొప్పదా? స్తోత్రం గొప్పదా?'

నేనేదో జవాబు చెప్పేలోపే ఆయనిలా అన్నాడు ' స్తోత్రంతో కలిపి చేసే పూజ గొప్పదని మీరు చెప్పబోతున్నారు. నాకు తెలుసు.'

నేను నవ్వి ఇలా చెప్పాను.

'నువ్వీ మాట అనకపోతే అలాగే చెప్పేవాడినేమో తెలీదు. కానీ ఇప్పుడలా చెప్పను.'

'మరెలా చెప్తారు?'

'రెండూ వేస్టే' అన్నాను.

'అదేంటి మీరు ఆస్తికులై ఉండి అలా అంటున్నారు?'

'నేను ఆస్తికుడినని నువ్వు అనుకుంటున్నావా? లేక అది నిజమేనా?' అన్నాను నవ్వుతూ.

'అదేంటి? మీరు ఆధ్యాత్మిక పుస్తకాలు వ్రాశారు కదా? మరి ఆస్తికులేగా'

'ఆస్తికుడంటే నా నిర్వచనం వేరు' అన్నా నవ్వుతూ. 

'ఓ అవును కదా ! మీరు మీ నిర్వచనాలు ఫాలో అవుతారుగాని లోకం నిర్వచనాలు ఫాలో అవ్వరు కదా. మర్చిపోయాను. సారీ ! పోనీ మీ నిర్వచనం ఏంటో చెప్పండి?' అడిగాడు.

'ఆస్తి ఉన్నవాడే ఆస్తికుడు. నాదగ్గరేమీ కోట్లకు కోట్లు లేవు. కనుక నేను ఆస్తికుడిని కాను. ప్రస్తుతానికి నాస్తికుడినే. భవిష్యత్తులో ఆస్తికుడిని అవుతానేమో చెప్పలేను.' అన్నా ఈసారి సీరియస్ గా.

అతనూ నవ్వుతూ - 'పోనీలెండి ఏదో ఒకటి అనుకుందాం. ఇంతకీ చెప్పండి ఎందుకలా 'వేస్ట్' అన్నారు' అన్నాడు.

'చెప్తా. నువ్వు పూజైనా స్తోత్రమైనా ఎందుకు చదువుతున్నావు?' అడిగాను.

'అదేంటి అందరూ ఎందుకు చదూతున్నారో అందుకే' అన్నాడు.

'అందరి సంగతి ఒదిలెయ్. నీ సంగతి చెప్పు' అన్నా.

'మంచి జరగాలని' అన్నాడు.

'ఏం మీరు పూజా స్తోత్రం చెయ్యకపోతే మంచి జరగదా?' అడిగాను.

'ఏమో తెలీదు' అన్నాడు.

'కొన్నేళ్ళు ఏ పూజలూ చెయ్యకుండా మానేసి చూడు. నీ లైఫ్ లో ఎటువంటి తేడా రాదు. నువ్వు చెబుతున్న లాజిక్ నిజమైతే, సో కాల్డ్ నాస్తికులూ కమ్యూనిస్టులూ దరిద్రంలో ఉండాలి. బాధలతో ఉండాలి, కానీ అలా లేరు. కనుక మీ లాజిక్ నిజం కాదు' అన్నాను.

'మరెందుకు చేస్తున్నాం?' అన్నాడు.

'చేస్తున్నాం అంటూ నన్ను కలపద్దు. నీ సంగతి చెప్పు. ఎందుకు చేస్తున్నావో తెలీకుండానే నువ్వు చేస్తున్నావా?' అడిగాను.

కాసేపు ఆలోచించాడు.

'ప్రస్తుతానికి నాకేం తట్టట్లా. ఇంకా ఆలోచించి సాయంత్రం ఫోన్ చేస్తా.' అన్నాడు.

'సరే' అని ఫోన్ పెట్టేశాను.

సాయంత్రం మళ్ళీ ఫోనొచ్చింది.

'ఏంటి? బాగా చించావా ఆలోచనల్ని?' అడిగా నవ్వుతూ.

'ఆ ! చించాను. ఒక విషయం అర్ధమైంది' అన్నాడు.

'ఏంటి?' అడిగాను.

'భయంతో పూజలు చేస్తున్నాను. నేను చేసిన తప్పుల చిట్టా మొత్తం గిల్టీ ఫీలింగ్ గా మారి నాలోలోపల ఉంది. దానిని కౌంటర్ చెయ్యడానికి ఈ పూజలు చేస్తున్నాను' అన్నాడు.

'ఓకే ! కొంచం అర్ధం చేసుకున్నావ్ ! అంటే, నీ పూజల వెనుకా స్తోత్రాల వెనుకా ఉన్నది 'భయం' అన్నమాట' అంతేనా'? అడిగాను.

'అంతే అనిపిస్తోంది'

'మరి 'అవి కావాలి' 'ఇవి కావాలి' అని దేవుడిని నువ్వేమీ కోరుకోవా?' అడిగాను.

'ఎందుకు కోరుకోను? అసలు అందుకేగా పూజలు చేసేది?' అన్నాడు.

'ఇప్పుడు ఇంకా దగ్గరకు వస్తున్నావు. అంటే, 'స్వార్ధపు కోరికలు కోరుతూ పూజలు చేస్తున్నావు.' అవునా?' అడిగాను.

'అలాగే అనిపిస్తోంది' అన్నాడు.

'అంటే, నిన్ను నడిపిస్తున్నది 'భయం', 'స్వార్ధం' ఇవి రెండే. భక్తిమాత్రం కాదు. అంతేగా?' అన్నాను.

'అవును' అన్నాడు అయిష్టంగా.

'మరి ఈ రెంటి పట్టులో నువ్వున్నంతవరకూ నీ పూజలుగాని స్తోత్రాలుగాని వేస్ట్ గాక మరేమౌతాయి?' అడిగాను.

'చేసేవాళ్ళంతా ఇంకెందుకు చేస్తున్నట్లు?' అడిగాడు.

'ఏమో నాకు తెలీదు. ఈ రెండూ కాకుండా ఇంకేవో వాళ్ళ మనస్సులలో ఉన్నాయని నేననుకోను. అందరూ ఈ రెండు పడవలలో ఉన్నవాళ్ళే' అన్నాను.

'మరి ఈ రెండు పడవలలో కాకుండా మరెలా ఉండాలి?' అడిగాడు.

'రెండు పడవల ప్రయాణం మంచిది కాదని సామెత నీకు తెలీదా?' అడిగాను నవ్వుతూ.

'అబ్బా ! చంపకుండా విషయం సూటిగా చెప్పండి. ప్లీజ్' బ్రతిమాలాడు.

'విషయం ఏమీ లేదు. పడవలు రెంటినీ ఒదిలేసి నీళ్ళలోకి దూకు.' చెప్పా ఇంకా నవ్వుతూ.

'అంటే ఏం చెయ్యమంటారు?' అడిగాడు అనుమానంగా.

'ఏం లేదు. సింపుల్. భయాన్నీ స్వార్దాన్నీ వదలిపెట్టి మామూలుగా బ్రతకడం నేర్చుకో. అప్పుడు ఏ పూజలూ చెయ్యనక్కరలేదు. ఏ స్తోత్రాలూ చదవనక్కరలేదు.' అన్నాను.

'అదేంటి? ఆధ్యాత్మికం మీద పుస్తకాలు వ్రాసిన మీరేనా ఇలా మాట్లాడుతున్నది?' అన్నాడు.

'అవును. ఇదే అసలైన ఆధ్యాత్మికత' చెప్పాను.

'మీకేం తేలికగా చెప్తారు. ఎలా ఆ రెంటినీ వదలడం?' అడిగాడు.

'దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి' చెప్పాను నవ్వుతూ.

'ఏంటో అవి చెప్పచ్చు కదా?' అన్నాడు ఆత్రుతగా.

'అబ్బా. అంత తేలికగా చెప్తారేంటి? ముందు నీ బ్లాక్ మనీలోనుంచి ఒక పది లక్షలు నా ఎకౌంట్ కి ట్రాన్స్ఫర్ చెయ్యి. అప్పుడాలోచిస్తా' అన్నా మళ్ళీ నవ్వుతూ.

'ఓహో. ఈ విధంగా ఆస్తికుడిగా మారిపోదామని ప్లానేస్తున్నారన్నమాట' అన్నాడు తనూ నవ్వుతూ.

'ఎగ్జాక్ట్ లీ' అన్నా చాలా సీరియస్ గా.

'అంత డబ్బులు నా దగ్గర లేవు. ఉన్నా తేరగా మీకెందుకిస్తాను? అలా ఇచ్చుకుంటూ పోతే రేపేదైనా అవసరం వస్తే నాకెవరిస్తారు?' అన్నాడు.

'ఇప్పుడు కరెక్ట్ గా పాయింటుకొచ్చావు. దీన్నే స్వార్ధం, భయం అంటారు. నేను ఇప్పటిదాకా చెప్పినవి ఈ రెండే.' అన్నాను.

'వీటిని వదలడం నా వల్ల కాదు' అన్నాడు చివరికి ఓటమిని ఒప్పుకుంటూ.

'కనుకనే పూజలని స్తోత్రాలని వదలడం కూడా నీ వల్లకాదు. కనుక, నీకు తోచిన పూజలు చేసుకుంటూ స్తోత్రాలు చదువుకుంటూ కాలక్షేపం చెయ్యి. నీలాంటి వాళ్ళు అంతకంటే ఇంకేమీ చెయ్యలేరులేగాని ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు అడిగి నా టైం వేస్ట్ చెయ్యకు' అన్నాను.

'ప్రస్తుతం మెడికల్ లీవ్ లోనే ఉన్నారు కదా? అంత రాచకార్యాలేమున్నాయి మీకు?' అన్నాడు చనువుగా.

'ఎందుకు లేవు? చాలారోజులనుంచీ అనుకుంటున్న చాలా స్తోత్రాలను కంఠతా పట్టాలి. రోజూ నాలుగు పూటలా పూజ చేసుకోవాలి. టైం సరిపోవడం లేదు' అన్నాను నవ్వుతూ.

'అదేంటి? నన్ను వద్దని మీరు చేస్తోంది ఇదా?' అన్నాడు అనుమానంగా.

'నిన్ను చెయ్యొద్దన్నాను గాని నేను చెయ్యనని చెప్పలేదు కదా?' అన్నాను.

'అదేంటి? గొప్పగొప్ప వాళ్ళందరూ తాము చేసేదే ఇతరులకు చెబుతారని విన్నాను. మరి మీరేంటి ఇలా చేస్తున్నారు?' అడిగాడు అయోమయంగా.

'వెరీ సింపుల్. నేను గొప్పవాణ్ణి కాను. మామూలు మనిషిని. కాబట్టే నీకేది అవసరమో అది చెబుతాను గాని నేను చేసేది నిన్ను చెయ్యమని చెప్పను. ఎందుకంటే నేను చేసేవి నువ్వు ఒక్కరోజు కూడా చెయ్యలేవు. తట్టుకోలేవు. కనుక నన్ను చూచి నువ్వు వాత పెట్టుకోకు. నేను చెప్పినవి నీకు చేతనైతే చెయ్యి. లేకుంటే ఫోన్ పెట్టెయ్యి. మళ్ళీ చెబుతున్నా నా టైం వేస్ట్ చెయ్యకు. అవతల పూజకు టైమౌతోంది' అన్నాను.

తను ఇంకేదో చెప్పబోతున్నాడు.

సైలెంట్ గా ఫోన్ కట్ చేసి పూజ మొదలు పెట్టాను.
read more " పూజ గొప్పదా స్తోత్రం గొప్పదా? "

19, మే 2018, శనివారం

మీరెలా చెయ్యమంటే అలా చేస్తాను

మొన్నా మధ్యన ఒకాయన నుంచి ఫోనొచ్చింది. నా నెంబర్ నా బ్లాగులో బాహాటంగానే లభిస్తుంది గనుక దానిని చూచి చాలామంది ఫోనులు చేసి అనేక సందేహాలు అడుగుతూ ఉంటారు. నాకు తోచినవి చెబుతూ ఉంటాను. అందులో చాలా జవాబులు వాళ్లకు నచ్చవని నాకు తెలుసు.  కానీ వారికి నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పేది చెబుతూ ఉంటాను. దానిని ఆచరిస్తారో లేదో నాకనవసరం.

'ఏమండి? మా అబ్బాయి మీ బ్లాగులు చదివి మొండిగా తయారౌతున్నాడు. పెళ్లి చేసుకోనంటున్నాడు. మీతో మాట్లాడాలట. ఎప్పుడు రమ్మంటారు?' అడిగిందొక స్వరం చాలా విసుగ్గా.

ఏ ఫోన్ కాలైనా సరే, నేను వెంటనే ఎవరినీ నమ్మను. ఈ అలవాటొకటి రెండు మూడేళ్ళ నుంచీ మొదలైంది. అంతకు ముందు అమాయకంగా అందరినీ నమ్మేవాడిని. కొన్ని ఎదురుదెబ్బలు తగిలాక ఇలా మారాను. ఇప్పుడెవరైనా సరే, ఒకటికి రెండు సార్లు నన్ను కలిసి మాట్లాడితే, వాళ్ళను బాగా పరీక్షించిన తర్వాతే నమ్ముతున్నాను.

'మీ అబ్బాయి పెళ్లి చేసుకోనంటే నేనేం చెయ్యను? డాక్టర్ సమరానికి చూపించండి' అన్నా నేనూ విసుగ్గానే.

'ఎందుకు? మావాడు నిక్షేపంలా ఉన్నాడు. అలాంటి ప్రాబ్లంస్ ఏమీ లేవు. మీ బ్లాగులు చదివి చెడిపోతున్నాడంతే.' అంది కంఠం.

'బ్లాగులు చదివీ, న్యూస్ పేపర్ చదివీ చెడిపోయేవాడిని ఎవరూ బాగు చెయ్యలేరు. అతను చెడిపోవాలనే ఆశపడుతున్నాడేమో? మీరాపితే ఆగుతాడా?' అన్నాను.

అతను కొంచెం తగ్గాడు.

'అది కాదండి. ఎక్కువ సమయం తీసుకోము. మిమ్మల్ని కలిసి మాట్లాడాలని ఉంది మావాడికి. కొంచం టైం ఇవ్వండి' అన్నాడు.

'అలా అయితే సరే. వచ్చే శనివారం సాయంత్రం అయిదుకు మా ఇంటికి రండి' అని చెప్పాను.

అనుకున్నట్లుగానే శనివారం సాయంత్రం నాలుగున్నరకే నేను రెడీ అయి కూచుని ఉన్నాను. కానీ వాళ్ళు అయిదున్నరకు కూడా రాలేదు. ఎవరైనా సరే, చెప్పిన టైంకు రాకపోతే నాకు మహా చిరాగ్గా ఉంటుంది. నేను ఎవరికైనా మాటిస్తే ఖచ్చితమైన టైంను పాటిస్తాను. ఎదుటివారు కూడా అలా పాటించాలని కోరుకుంటాను.

చివరకు వాళ్ళు అయిదూ నలభైకి వచ్చారు. లేటైనందుకు కనీసం 'సారీ' కూడా చెప్పకుండా డైరెక్టుగా విషయంలోకి వచ్చాడాయన. అక్కడే వాళ్ళు ఎంత స్వార్ధపరులో నాకు అర్ధమైపోయింది.

'వీడేనండి మావాడు. ఏదో అడుగుతానన్నవుగా అడుగు' అన్నాడాయన మా ఇంటి నిరాడంబరతను నిర్లక్ష్యంగా చూస్తూ. ఆ అబ్బాయికి పాతికేళ్ళు ఉంటాయి. కొంచం బిత్తర బిత్తరగా ఉన్నాడు.

నేను వాళ్ళిద్దర్నీ మౌనంగా గమనిస్తూ కూచుని ఉన్నాను.

'సార్. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు.' అన్నాడా అబ్బాయి.

'చేసుకోబోకు. దానికి నన్నేం చెయ్యమంటావు?' అడిగాను.

వింటున్న వాళ్ళ నాన్న కల్పించుకుని 'అదేంటండి అలా చెప్తారు? చేసుకోమని చెప్పండి' అన్నాడు గదుముతున్నట్లు.

'మీ మాటలు నేను చెప్పే పనైతే, మీరిక్కడి దాకా రావడం ఎందుకు? ఆ మాటలేవో మీరే చెప్పి ఉండవచ్చు కదా? అంటూ ఆ అబ్బాయి వైపు తిరిగి 'ఎందుకు నాయనా పెళ్లి వద్దంటున్నావు?' అన్నాను.

'నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంది. అందుకని సన్యాసం తీసుకుందామని అనుకుంటున్నాను' అన్నాడు.

'రెండింట్లో నీకిష్టమైంది నువ్వు చేసుకో బాబు. మధ్యలో నాదగ్గరకు ఎందుకు వచ్చావ్?' అడిగాను.

'నేను మీ బ్లాగులు చదువుతూ ఉంటాను. మీ భావాలు నాకు నచ్చుతాయి. మీరెలా చెయ్యమంటే అలా చేస్తాను' అన్నాడు.

'అదేంటి? పెళ్లి చేసుకున్నాక సంసారం కూడా నేను చెప్పినట్లు చేస్తావా? లేక నీ ఇష్టం వచ్చినట్లు చేస్తావా?' అడిగాను.

అతను పిచ్చి చూపులు చూస్తున్నాడు.

ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అనిపించి నవ్వొచ్చింది.

'పెళ్లి చేసుకో నాయనా. తప్పేముంది?' అన్నాను.

'అలా కాదండి. నాకు వైరాగ్యం బాగా ఎక్కువగా ఉంది. అందుకని చేసుకోలేను. సన్యాసం తీసుకుంటాను.' అన్నాడు మళ్ళీ.

'పోనీ అలాగే తీసుకో. నీకు సన్యాసం ఇవ్వడానికి సిద్ధంగా ఎవరున్నారు?' అన్నాను.

'స్వామీ క్విక్కానంద గారని ఒక స్వామీజీ ఉన్నారు. ఈరోజు ఆశ్రమంలో చేరితే రేప్పొద్దున్నే సన్యాసం ఇస్తారు. రమ్మన్నారు.' అన్నాడు.

'ఎంతేంటి ప్యాకేజీ?' అందామని నోటిదాకా వచ్చి ఆగిపోయింది.

'అలా ఫాస్ట్ ఫుడ్ లాగా ఫాస్ట్ సన్యాసం తీసుకుని ఏం చేద్దామని అనుకుంటున్నావు?' అడిగాను.

'అదే భయంగా ఉంది. అసలు నేను సన్యాసిగా నిలబడగలనా? లేదా? నా జాతకం చూచి మీరు చెప్పండి' అన్నాడు.

'భయమా? ఎందుకు? అయినా దీనికి జాతకం చూడటం ఎందుకు? జాతకంతో పని లేకుండానే చెబుతాను.' అన్నా.

'సరే చెప్పండి'

'నువ్వొక పని చెయ్యి బాబు. పెళ్లి చేసుకో. కానీ సంసారం చెయ్యకు. బ్రహ్మచారిగా ఉండు'. అన్నాను.

వాళ్ళ నాన్న అసహనంగా కదులుతున్నాడు.

'అదేంటండి?' అన్నాడు యువకుడు.

'అవును. నాయనా. నువ్వు ఏదీ తెల్చుకోలేకపోతున్నావు గనుక. ఈ పద్ధతి ఫాలో అవ్వు. అప్పుడు రెండు కోరికలూ తీరుతాయి. నువ్వు పెళ్లిచేసుకోవాలన్న మీ నాన్నగారి కోరిక కూడా తీరుతుంది.' అన్నాను.

'ఆ తర్వాత ఆ అమ్మాయి ఊరుకోకపోతే అప్పుడు నేనేం చెయ్యాలి?' అడిగాడు భయంగా.

'తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టు' అందామని నోటిదాకా వచ్చింది. 

బాగుండదని సంభాళించుకుని 'అప్పుడు తనే నిన్నొదిలేసి సన్యాసం తీసుకుంటుంది. లేదా తనకు నచ్చిన ఇంకొకడిని చేసుకుని వెళ్ళిపోతుంది. మరీ మంచిదే కదా. నీ మీద నింద ఉండదు. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ముగ్గులేసుకుంటూ స్వెట్టర్లు అల్లుకుంటూ పేరంటాలకెళుతూ హాయిగా ఉండొచ్చు' అన్నా.

'అలా కాదండి. జాతకం ఏం చెబుతోంది?' అన్నారు ఇద్దరూ.

సరే ఉండమని, వాళ్ళ తృప్తి కోసం, జాతకం వేసి చూచాను. అపుడు వాళ్ళతో ఇల్లా చెప్పాను.

'నీ ప్రస్తుత మానసిక పరిస్థితినే నీ జాతకం చూపిస్తోంది. నువ్వు ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నావు. అంతే. ' అన్నాను.

'మరి నన్నేం చెయ్యమంటారు?' అడిగాడు.

'చెప్పా కదా నా సలహా ఏమిటో. నువ్వేం చెయ్యాలో నువ్వు తేల్చుకోవాలి. నేను చెప్పను. నీ జీవితం నీ చేతుల్లో ఉంది నా చేతుల్లో లేదు.' అన్నాను.

'మీ మీద నాకు చాలా నమ్మకం. మిమ్మల్ని నా గురువుగా భావిస్తున్నాను' అన్నాడా అబ్బాయి.

'నిజంగా?' అడిగాను.

'నిజ్జం' అన్నాడు నమ్మకంగా.

మళ్ళీ నవ్వొచ్చింది. ఎందుకంటే, ఇదొక బిస్కెట్ అని నాకు బాగా తెలుసు. ఇలాంటి బిస్కేట్లకు పడటం మానేసి చాలా కాలమైంది.

'మీరు నా గురువు' అని చెబుతూ వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నవారిని ఎంతోమందిని నేను చూస్తున్నాను. వాళ్ళ మనసు చెప్పే పనులు చేసుకోడానికి నన్ను ఒక సపోర్ట్ గా వాడుకునేవారే గాని నిజంగా నేను చెప్పినవి ఆచరించేవారు నాకింతవరకూ తారసపడలేదు. అసలు గురుత్వం అనేదే ఒక పెద్ద ఫార్స్ ! నిజమైన గురువులూ ఎక్కడా లేరు. శిష్యులు అంతకంటే లేరు. అంతా పెద్ద మాయ !

'అలాగా ! సరే ఒక పని చేద్దాం. ఈ రోజునుంచీ మా ఇంట్లో నా శిష్యుడిగా ఉండిపో. ముందుగా నీ సెల్ ఫోన్ నేను లాగేసుకుంటాను. నా దగ్గరున్నంత వరకూ దానిని నువ్వు వాడటానికి వీల్లేదు. ఆ తర్వాత మా ఇంటిపనీ, వంట పనీ, బజారుపనీ అన్నీ నువ్వే చూసుకోవాలి. నేను కనీసం మంచంనుంచి క్రిందకు కూడా దిగను. అన్నీ అక్కడికే అందించాలి. నా బట్టలు ఉతకడం, ఇస్త్రీ చెయ్యడం మాత్రమే గాక, నేను ఏ పని చెబితే ఆ పని ఏ మాత్రం సంకోచించకుండా చెయ్యాలి. మా ఇంట్లో పనిమనిషి కూడా లేదు. అంతా నువ్వే. కానీ జీతం మాత్రం రూపాయి కూడా ఇవ్వను.

మధ్యమధ్యలో నాకు కోపం వస్తే నిన్ను తిడతాను, కొడతాను, తంతాను కూడా. అయినా నువ్వు ఏమీ అనకూడదు. కనీసం నీ ముఖంలో ఫీలింగ్స్ కూడా మార్చకూడదు. నేనేమో నా శిష్యురాళ్ళతో వీడియో చాట్ చేసుకుంటూ ఏసీ రూములో హాయిగా పడుకుంటాను. నువ్వు రాత్రి పన్నెండు వరకూ నా కాళ్ళు పట్టి ఆ తర్వాత క్రింద పార్కింగ్ లో కార్ల మధ్యన చాపేసుకుని పడుకోవాలి. మళ్ళీ పొద్దున్న నాలుక్కే లేచి చన్నీళ్ళు స్నానం చేసి నాలుగున్నర కల్లా నా ఆర్డర్స్ కోసం నా రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉండాలి. నువ్వు తిన్నా తినకపోయినా, నీకు వొంట్లో బాగా లేకపోయినా నేను పట్టించుకోను. కనీసం నువ్వు తిన్నావా లేదా అనేది కూడా అడగను. నాకు మాత్రం టైం తప్పకుండా అన్నీ అమర్చి పెడుతూ ఉండాలి. నువ్వు మీ వాళ్ళను ఎవరినీ కలవడానికి వీల్లేదు. మీ నాన్నగారు మా ఇంటి చాయలకు కూడా రావడానికి ఒప్పుకోను. వస్తే ఆయనకు కూడా దేహశుద్ధి జరుగుతుంది. నాకు మార్షల్ ఆర్ట్స్ బాగా వచ్చని నువ్వు గుర్తుంచుకోవాలి. అప్పుడప్పుడు నా పంచింగ్ బ్యాగ్ పాడైపోయినప్పుడు నిన్నే పంచింగ్ బ్యాగ్ గా వాడుతాను. నువ్వు కిమ్మనకూడదు. ఆ విధంగా కొన్నాళ్ళు నా దగ్గర ఉన్నావంటే అప్పుడు నాకు నీ మాటమీద నమ్మకం కుదురుతుంది. అప్పుడు నీ బాధ్యత పూర్తిగా నేను వహిస్తాను.' చెప్పాను.

వాళ్ళ నాన్న బుసలు కొడుతూ పేలిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు.

'అలా ఎన్నాల్లుండాలి?' అడిగాడు అబ్బాయి.

'చెప్పలేను. కనీసం ఒక ముప్పై ఏళ్ళు పట్టచ్చు. లేదా ఇంకా ఎక్కువే పట్టచ్చు. ఎన్నేళ్ళైనా సరే నువ్వు ఎదురు చెప్పకూడదు. అలా ఉంటే, అప్పుడు నేనంటే నీకు గురుభావం ఉందని నమ్ముతాను. అలా కొన్నేళ్ళు పోయాక నాకు బుద్ధి పుట్టినపుడు నువ్వు పెళ్లి చేసుకోవాలా లేదా సన్యాసం తీసుకోవాలా అనేది చెబుతాను. అంతవరకూ నువ్వు బుద్ధిగా వెయిట్ చెయ్యాలి. అదీ శిష్యత్వం అంటే.' అన్నాను.

'అదేంటి సార్. శిష్యుడంటే అలా ఉండాలా? నేనెక్కడా చదవలేదే?' అన్నాడు.

'చదవకపోతే పోనీలే. నేను చెబుతున్నాను కదా. ఇప్పుడు విను.'

ఆ అబ్బాయి అయోమయంగా చూస్తున్నాడు.

అప్పటిదాకా అసహనంగా కదుల్తున్న వాళ్ళ నాన్న నోరు విప్పాడు.

'ఏంటండి ఇదంతా? మావాడు అడిగేదేంటి మీరు చెప్పేదేంటి? మమ్మల్ని చూస్తె తమాషాగా ఉందా?'

ఇక ఇలా కాదని, నేనూ విషయం లోకి వచ్చాను.

'చూడండి. మీ ప్రశ్నకు నా జవాబులు రెండే. ఒకటి. మీ వాడికి ఏది అనిపిస్తే అది చేసుకోనివ్వండి. రెండు. నన్ను గురువుగా స్వీకరిస్తే నేను చెప్పినట్టు వినమనండి. అంతే. మూడో మాట ఇందులో ఉండదు.

అసలు విషయం ఏమంటే, మీవాడు సన్యాసానికీ పనికి రాడు సంసారానికీ పనికిరాడు. రెండూ కష్టమైనవే. ఏదీ తేలికైనది కాదు. సన్యాసం అంటే బజారుకెళ్ళి కూరగాయలు కొనుక్కోవడం కాదు. దాని నియమనిష్టలను మీవాడు ఒక్కరోజు కూడా తట్టుకోలేడు. కనుక సన్యాసిగా మీవాడు ఉండలేడు. పోతే, సంసారిగా కూడా మీవాడు పనికిరాడని నా ఉద్దేశ్యం. ఎందుకంటే మీవాడు ఏదో బిత్తర బిత్తరగా ఆడపిల్లలాగా కులుకుతున్నాడు. ఈ రోజుల్లో ఎవరో టీవీ యాంకర్లు తప్ప ఆడపిల్లలే అలా కులకడం లేదు. అతనికి ఏదో హార్మోన్ లోపాలున్నాయని నా నమ్మకం. మీవాడు నా బ్లాగు చదివి చెడిపోవడం లేదు. చెడిపోవడానికి ఒంట్లో హార్మోన్స్ అన్నీ నార్మల్ కంటే ఎక్కువగా పనిచేస్తూ ఉండాలి. చెడిపోవడం అందరి వల్లా కాదు. మీవాడి వల్ల అసలే కాదు. ముందు మీ వాడిని మంచి డాక్టర్ కి చూపించండి. అంతా సర్దుకుంటుంది.

ఇంకోమాట. అయిదుకు వస్తానని మీరు చెప్పి అయిదూ నలభైకి వచ్చారు. అంటే మీకు సమయం విలువ తెలీదన్నమాట. అది తెలీనప్పుడు సంసారమూ కుదరదు సన్యాసమూ కుదరదు. నాతో అస్సలే కుదరదు. మీకోసం ఈ రెండు గంటలు నా జీవితంలో వెచ్చించినదే చాలా ఎక్కువ. ముందు మీరెళ్ళి ఒక మంచి డాక్టర్ని కలవండి. అంతవరకు ఇతనికి పెళ్లి చేసి ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యకండి.' చెప్పాను.

ఆయన కోపంగా చూస్తూ 'పదరా పోదాం!' అని వాళ్ళబ్బాయిని తీసుకుని అదే పోత పోయాడు.

కధ కంచికి మనం ఇంట్లోకి !
read more " మీరెలా చెయ్యమంటే అలా చేస్తాను "