“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

20, జూన్ 2018, బుధవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 16 (సైతాన్ని సృష్టించింది ఎవరూ?)

నా శిష్యురాలు నాగమణి అమెరికా నుంచి రెండునెలల వెకేషన్ లో ఇండియాకు వచ్చింది. మొన్నీ మధ్యన మా ఇంటికొచ్చింది నన్ను చూడ్డానికి. సాయంత్రం మళ్ళీ విజయవాడకు వెళుతూ - 'మీతో కలసి జిల్లెళ్ళమూడికి వెళ్లాలని ఉంది' అన్నది.

'ఓకే. అలాగే. త్వరలోనే వెళదాం.' అన్నాను.

మొన్న సోమవారం సాయంత్రం చరణ్ కు ఫోన్ చేసి చెప్పాను "మంగళవారం జిల్లెళ్ళమూడి వెళదాం కారు తీసుకుని రా" అని.

"సరే అన్నగారు ఉదయం ఎనిమిదికల్లా మీ ఇంట్లో ఉంటా" అన్నాడు.

వెంటనే నాగమణికి ఫోన్ చేసి చెప్పాను. ఎనిమిదిలోపు గుంటూరుకు వస్తానని ఆమె కూడా చెప్పింది. నిన్న ఉదయం ఏడున్నరకు రామమూర్తికి ఫోన్ చేశాను 'అరగంటలో మా ఇంటికి వచ్చెయ్యి. మనం జిల్లెళ్లమూడికి వెళుతున్నాం అని'. తను పేరేచర్లలో ఉంటాడు. నేను చెబితే రెండో మాట ఉండదు తనకు. 'సరే. అరగంటలో మనింట్లో ఉంటా' అన్నాడు. తను పరిచయం అయ్యి కొన్నినెలలే అయినా అంతగా నాతో ఎటాచ్ మెంట్ పెంచుకున్నాడు.

అనుకున్నట్లే ఎనిమిది కొట్టేసరికి ముగ్గురూ వచ్చేశారు. నేను ఫోన్ చేసినప్పుడు రామమూర్తి స్నానానికి వెళ్ళబోతూ ఉన్నాట్ట. ఆ తర్వాత పూజకు కూచోవాలి. నేను చెప్పానని గబగబా స్నానం చేసి, టిఫిన్ కూడా చెయ్యకుండా, పూజ కూడా చేసుకోకుండా వెంటనే బయల్దేరి సరిగ్గా ఎనిమిది కల్లా గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు. అప్పటికే చరణ్ వచ్చేసి ఉన్నాడు కారుతో. చరణ్ కు వీరిద్దరినీ పరిచయం చేశాను. వెంకటరాజుగారు తెచ్చిచ్చిన సామలతో శ్రీమతి చేసిన ఉప్మాను తినేసి అమ్మను స్మరిస్తూ అందరం జిల్లెల్లమూడికి బయల్దేరాం.

కారు గుంటూరును వదలి పెదనందిపాడు రోడ్డులో జిల్లెళ్ళమూడి వైపుగా సాగిపోతోంది.

చాలాసేపు అందరం మౌనంగానే ఉన్నాం.

మౌనాన్ని ఛేదిస్తూ చరణ్ ఇలా అడిగాడు.

'అన్నగారు ! వేదాలలో అవతారతత్వం చెప్పబడిందా?'

కాసేపు మౌనంగా ఉండి 'లేదు' అన్నాను నెమ్మదిగా.

'మీరీ మాట అంటారని నాకు తెలుసు. ఒకవేళ మీరు 'చెప్పబడింది' అంటే కౌంటర్ గా ఇంకో ప్రశ్న నా దగ్గర సిద్ధంగా ఉంది' అన్నాడు.

'నీ ఇష్టం వచ్చినన్ని ప్రశ్నలు వేసుకో' అన్నా నవ్వుతూ.

'అస్తి నాస్తి అనే విచికిత్స ఎక్కడిదన్నగారు అసలు?' అడిగాడు.

వెంటనే నాకు యజుర్వేదంలోని కఠోపనిషత్తు లోని 'అస్తీత్యైకే నాయమస్తీతి చైకే' అనే మంత్రం గుర్తొచ్చింది.
  
'వేదాలలోదే తమ్ముడు. ఉపనిషత్తులలో ఉంది' అన్నాను.
  
'అవునా! వేదాలు కూడా భగవత్తత్వాన్ని పూర్తిగా చెప్పలేక పోయాయని అంటారు కదా. వేదాలు కూడా అక్కడవరకూ వెళ్లి ఆయన్ను దర్శించలేక వెనక్కు వచ్చాయని విన్నాను' అన్నాడు.

'ఏమో మరి ! అది జరిగినప్పుడు నేనక్కడ లేను' అందామని నోటిదాకా వచ్చిందిగాని బాగుండదని ఊరుకున్నాను.

ఆ తర్వాత చాలా సంభాషణ జరిగింది. అదంతా పాతకాలంలో జిల్లెళ్ళమూడి ఎలా ఉండేది? ఎంతమంది పెద్దపెద్ద వాళ్ళు అక్కడకు వచ్చారు? నాస్తికులు, నక్సలైట్లు ఎలా వచ్చారు? వాళ్ళందరికీ అమ్మ ఎలా సరియైన దారిని చూపించింది? మొదలైన వివరాలతో సాగింది. అవన్నీ ఇంతకు ముందు వ్రాశాను గనుక మళ్ళీ వ్రాయబోవడం లేదు.

కొంత ప్రయాణం అలా సాగాక, మళ్ళీ చరణే - 'అన్నగారు. సంస్కారం అంటే ఏమిటి? ఆ పదాన్ని రకరకాలుగా వాడుతూ ఉంటారు కదా? అసలు దానర్ధం ఏమిటి? అది ఇవ్వబడిందా? మనం సంపాదించుకున్నదా? లేక అంటించుకున్నదా?' అన్నాడు.

చాలా లోతైన ప్రశ్న గనుక కాసేపు మౌనంగా ఉండి ఇలా చెప్పాను.

' మూడూ నిజాలే'

'అదేంటి?' అన్నాడు చరణ్.

'మొదట్లో నిన్ను సృష్టి చేసినప్పుడు దైవం నీకు కొంత ఇస్తుంది. ఆ తర్వాత నీ ప్రయాణంలో నువ్వు కొంత సంపాదిస్తావు. ఆ క్రమంలో ఇంకొంత పక్కనించి అంటించుకుంటావు. ఇవన్నీ కలిస్తే ఏర్పడేదే నీ సంస్కారం' అన్నాను.

'ఏమో నాకు మీ జవాబు అంతగా రుచించడం లేదు. కరెక్ట్ కాదేమో?' అన్నాడు చరణ్.

నవ్వొచ్చింది.

చరణ్ కు చాలాసార్లు జవాబులు తెలిసినా ఊరకే చర్చ కోసమని ప్రశ్నలు సంధిస్తూ ఉంటాడు. ఆ విషయం నాకూ తెలిసినా కాలక్షేపం కోసమని నేనూ తనను ఉడికిస్తూ ఉంటాను. ప్రయాణం బోరు కొట్టకుండా ఉండాలి కదా మరి, మనతో కలసి వస్తున్నవారికి.

వెనక సీట్లో కూచున్న శ్రీమతీ, రామ్మూర్తీ, నాగమణీ ఇదంతా మౌనంగా వింటున్నారు.

'నీకు జవాబు తెలిసి అడిగావా ప్రశ్నను, తెలీకుండా అడిగావా?' అన్నాను.

'తెలీకే అడిగాను' అన్నాడు.

'మరి తెలీనప్పుడు నా జవాబు కరెక్ట్ కాదని ఎలా తెలిసింది?' అడిగాను.

'ఏమో? నాకు జవాబు తెలీదు కాని అది కరెక్ట్ జవాబో కాదో చెప్పగలను' అన్నాడు.

'అదెలా కుదురుతుంది? నీకు నచ్చినట్లు జవాబు వస్తే అది కరెక్ట్ అయినట్లా? లేకుంటే తప్పైనట్లా? అలా అయితే, నీకు జవాబు ముందే తెలిసినట్లే కదా! తెలిస్తే ప్రశ్న ఎందుకు అడిగావు? తెలిసినా తెలీదని ఎందుకు చెప్తున్నావు?' అడిగాను.

'ఏమో! అదొక ఫీల్ ! నాకనిపించింది నేను చెబుతున్నాను' అన్నాడు.

'మన ఫీల్ కూ జవాబులోని ఖచ్చితత్వానికీ సంబంధం ఏమీ ఉండకపోవచ్చు. అన్నీ మన ఫీల్ కు అనుగుణంగానే ఉండాలని రూలేమీ లేదు' అన్నాను.

తను మౌనం వహించాడు.

కొద్దిగా వివరిద్దామనిపించి ఇలా చెప్పాను.

'ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విను చరణ్. నువ్వు ఒక యాత్ర మొదలు పెట్టావు. ఏదో దూరదేశమో ఎక్కడికో పోతున్నావు. దారిఖర్చులకు నీకు కొంత డబ్బులిస్తాడు మీ నాన్న. అది, నువ్వు ఒక ఆత్మగా సృష్టి చెయ్యబడినప్పుడు నీకు వచ్చిన మూలధనం. ఆ తర్వాత, నీ ప్రయాణం మొదలు పెడతావు. అంటే, ఆత్మ ఎన్నో జన్మలు ఎత్తుతూ పోతూ ఉంటుంది. ఆ క్రమంలో, ఎన్నో అనుభవాలూ ఎంతో మంచీ చెడూ, సుగంధమూ, మురికీ అన్నీ నువ్వు పోగేసుకుంటూ ఉంటావు. అది నీ సంపాదన. ఈ పయనంలో నీతో ఎందఱో కలుస్తూ విడిపోతూ ఉంటారు. వాళ్ళనుంచి నీకు కొంత మురికి అంటుకుంటూ ఉంటుంది. అది మూడోరకంగా వచ్చే రొచ్చు. ఒకటి మూలధనం. రెండు నీ సంపాదన. మూడు నువ్వు అంటించుకునే రొచ్చు. ఈ మూడూ నీతో ఉంటాయి. ఈ మొత్తం కలిసిందే నీ సంస్కారం అంటే.' అన్నాను.

చరణ్ కు నా సమాధానం నచ్చలేదు. అతన్ని చూస్తుంటే నాకేమో నవ్వాగడం లేదు.

చూస్తూ ఉండగానే, నాగులపాడు వచ్చింది. అందరూ దిగి గుళ్ళోకి వెళ్లి దర్శనం చేసుకుని ప్రదక్షిణాలు చేసి వచ్చారు. నేను కార్లోనే కూచుని ఉన్నాను.

మళ్ళీ బయల్దేరి ప్రయాణం సాగించాం.

చర్చ మళ్ళీ మొదలైంది.

'సంస్కారం అంటే నీ స్వభావమే తమ్ముడూ. కానీ మనం ఈ మాటను అనేక అర్ధాలలో వాడుతూ ఉంటాం. 'అతను సంస్కారవంతుడు' అంటాం. అంటే, మంచివాడు అనే అర్ధంలో వాడతాం. అతను గుణవంతుడు అంటాం. అంటే, మంచివాడని అర్ధం. కానీ గుణం అనేది సుగుణం కావచ్చు. దుర్గుణం కావచ్చు. మనం మాత్రం గుణవంతుడు అంటే మంచివాడనే అర్ధంలోనే వాడుతూ ఉంటాం. అలాంటిదే సంస్కారం అంటే కూడా. అది మంచి సంస్కారం కావచ్చు. దుష్ట సంస్కారం కావచ్చు. 'వాడికి సంస్కారం లేదు' అంటే 'బుద్ధి లేదు' అని వాడుతూ ఉంటాం. ఇలా రకరకాలుగా వాడినప్పటికీ దానర్ధం మాత్రం ఒకటే. సంస్కారం అంటే స్వభావం. పైన చెప్పిన మూడు సంపాదనల నుంచే నీ సంస్కారంగానీ స్వభావంగానీ ఏర్పడుతుంది.' అన్నాను.

'ఇది కొంచం బాగానే ఉంది అన్నగారు' అంటూ ఒప్పుకున్నాడు చరణ్.

చర్చ అంతటితో అయిపోతే మనకు నచ్చదుకదా మరి? ఏదో ఒక రకంగా ఎవరినో ఒకరిని వెర్రెక్కించి తమాషా చెయ్యకపోతే నాకు తోచదు. అందుకని చర్చను ఇలా పొడిగించాను.

'ఇక్కడే అసలు సమస్య వస్తుంది చరణ్'

'ఏంటది అన్నగారు?' అన్నాడు.

'కొంతమంది కవులు కూడా ఉన్నత సాధకులకు దగ్గరగా వస్తూ ఉంటారు. సాధకులకున్నట్లు కవులకు అనుభవం ఉండదు. కానీ వారి ఊహాశక్తితో కొన్ని ఆధ్యాత్మిక విషయాలను కూడా వారు ఊహిస్తారు. అలాంటి వారిలో కొందరు ప్రాచీన కవులు ఈ ప్రశ్నను లేవనెత్తారు. అదే సృష్టిలో అసలైన సమస్య!' అన్నాను.

'ఏంటది?' అన్నాడు చరణ్.

'ఏంటంటే - వాళ్ళు దైవాన్ని ఇలా అడిగారు. 'అసలు తప్పు నీదే. నాది కాదు. నువ్వు చేసిన సృష్టిలో పడి నేను చెడిపోయానని నన్ను నిందిస్తున్నావు. కానీ అసలు తప్పు నీదే. నన్నెందుకు ఇలా సృష్టించావు? సృష్టిలో ఈ ఆకర్షణలనెందుకు ఇలా సృష్టించావు? మళ్ళీ వాటి ఆకర్షణలలో నేను పడితే, 'నువ్వు చెడిపోయావు' అంటున్నావు. ఇదేం వింత? అలాంటి ఆకర్షణలను అసలు ఎందుకు సృష్టించావు? కనుక నీదే అసలైన తప్పు.' అని వారన్నారు' అన్నాను.

చరణ్ కు బాగా కోపం వచ్చేసింది.

'ఎవరన్నగారు ఆ కవులు?' అన్నాడు కోపంగా.

'ఎవరో ఉన్నార్లే! మొత్తం మీద వాళ్ళు ఇలా అన్నారు' అన్నా నేను పేర్లు దాటవేస్తూ.

'వాళ్ళ మొఖం ! అంటే సృష్టికర్తనే వాళ్ళు ధిక్కరిస్తున్నారన్న మాట.' అన్నాడు కోపంగా.

'సృష్టికర్తను ధిక్కరించడం లేదు. సృష్టి చేసిన తీరును ప్రశ్నిస్తున్నారు' అన్నా నేను నిదానంగా.

'వాళ్ళెవరన్నగారు అలా ప్రశ్నించడానికి? ఆఫ్టరాల్ ఒక జీవుడు, దేవుణ్ణి ప్రశ్నిస్తాడా? కుమ్మరి కుండలను చేస్తాడు. వాటిల్లో కొన్ని పగిలిపోతాయి. కొన్ని ఓటివి అవుతాయి. వాటిని పక్కన ఉంచుతాడు కుమ్మరి. అంతమాత్రం చేత, కుమ్మరే తప్పు అంటే ఎలా?' అన్నాడు చరణ్ ఆవేశంగా.

'ఆవేశ పడకు తమ్ముడూ ! అసలే డ్రైవింగ్ చేస్తున్నావ్! శాంతంగా విను. కుమ్మరితో నువ్వు దైవాన్ని పోల్చలేవు. కొంతవరకూ నీ పోలిక సరియైనదే. కానీ పూర్తిగా కాదు. ఎందుకంటే, కుమ్మరి సర్వస్వతంత్రుడు కాదు. మట్టి అతని చేతుల్లో లేదు. ఇంకా చాలా విషయాలు అతని చేతుల్లో లేవు. కనుక అతను అన్ని కుండలనూ మంచిగా చెయ్యలేకపోవచ్చు. అతను కొంచం ఏమరుపాటుగా ఉన్నా సరే, కుండ పాడైపోతుంది. కానీ దైవానికి ఈ అవలక్షణాలు లేవు. అన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఆయనకు ఏమరుపాటు ఉండదు. నిద్ర రాదు. మరి ఆయన సృష్టిలో ఈ ఆకర్షణలు, ప్రలోభాలు, మాయలు ఎందుకున్నాయి? అందరి ప్రయాణం మొదట్లోనూ ఆయన దారిబత్తెం సమానంగా ఇస్తే, ఈ జీవుల్లో ఇన్ని విభేదాలు ఎందుకొచ్చాయి? కనుక ఆయన అందరికీ సమానంగా దారిబత్తెం ఇవ్వలేదన్నమాట ! అంతేనా?' అన్నాను.

చరణ్ కు ఇంకా ఆవేశం పెరిగిపోయింది.

'ఆయన సరిగ్గానే ఇచ్చాడు. వీడు దారిలో ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టేసి పాపర్ అయిపోతే ఆయనదా తప్పు? ఆయన ఎగ్జాం పెట్టాడు. నువ్వు సరిగ్గా చదివి పరీక్ష పాసవ్వాలి. నువ్వు ఫెయిలయితే ఆయనదా తప్పు?' అన్నాడు తన కోపాన్ని యాక్సిలేటర్ మీద చూపిస్తూ.

నాకు లోలోపల చచ్చే నవ్వొచ్చింది.

'ఆ విధంగా ఖర్చు పెట్టాలనే బుద్ధిని ఇచ్చింది కూడా ఆయనే కదా? దారిలో ఐస్ క్రీం పార్లర్లనూ, బార్లనూ, కాసినోలనూ, షాపుల్నీ సృష్టించింది ఎవరు? అసలీ పరీక్ష పెట్టడం ఏమిటి? కొంతమందికి తెలివి ఇవ్వడం, కొంతమందికి తెలివిని ఇవ్వకపోవడం, కొంతమందికి పేపర్ లీక్ చెయ్యడం, కొంతమందికి చెయ్యకపోవడం ఇదంతా ఏంటి తమ్ముడూ? ఇది పక్షపాతం కాదా?' దీనినే కవి ప్రశ్నించాడు - అన్నాను.

'అదంతే అన్నగారు ! ఆయన పరీక్ష పెడతాడు. మనం బాగా చదివి పాసవ్వాలి. అంతే ' అన్నాడు కోపంగా.

'అలా అంటే, అది నిరంకుశత్వం అవుతుంది తమ్ముడూ. దేవుడు ఒక క్రూరుడైన నిరంకుశుడు అవుతాడు. అది నీకిష్టమేనా?' అడిగాను. 

'దారిలో ప్రలోభాలకు వాడు లోనైపోయి దారి తప్పితే దైవానిదా తప్పు?' అన్నాడు మళ్ళీ.

'ఆ ప్రలోభాలను దైవం ఎందుకు సృష్టించాలి? ప్రలోభపడే మనసును ఎందుకు నీకివ్వాలి?మళ్ళీ నువ్వు దారి తప్పితే 'అదుగో దారి తప్పావు?' అని ఎందుకడగాలి?' అదీ కవి ప్రశ్న -- అన్నాను నవ్వుతూ.

కాసేపు మౌనంగా ఆలోచించాడు. జవాబు తట్టలేదు.

'మరి ఆ కవి ఏం సమాధానం చెప్పాడు?' అన్నాడు చివరికి.

'ఆయన సమాధానం ఏమీ చెప్పలేదు. ప్రశ్న వేశాడు. జవాబును మాత్రం రికార్డ్ చెయ్యలేదు' అన్నాను.

'ఆ ప్రశ్నకు జవాబు లేదు గనుక జవాబు రికార్డ్ అవలేదేమో? ఉంటే, దానినీ చెప్పేవాడేగా? కనుక ఇది జవాబు లేని ప్రశ్న!' అన్నాడు చివరకు.

'అదెలా కుదురుతుంది చరణ్? జవాబు లేని ప్రశ్న అంటూ ఎక్కడా ఉండదు. ప్రశ్న ఉందీ అంటే, జవాబు కూడా దాని పక్కనే ఉంటుంది. అవి వెలుగూ నీడల్లాంటివి. రెండూ కలిసే ఉంటాయి' అన్నాను నవ్వుతూ.

'మరి జవాబు ఉంటే, ఆయన ఎందుకు చెప్పలేదు? జవాబును మనం వెదకాలని ఆయన ఉద్దేశ్యమేమో?' అన్నాడు చరణ్ సాలోచనగా.

'కరెక్ట్. దీనికి జవాబును ఎవడికి వాడే వెదుక్కోవాలి. అంతే ! అదే దీనికి పరిష్కారం ! ఇది తప్ప దీనికి తార్కికంగా ఏ పరిష్కారమూ లేదు. ఎండ్ ఆఫ్ ది డిస్కషన్' అన్నాను.

నిజానికి ఇది ఈనాటి ప్రశ్న కాదు. చరిత్ర మొదలైనప్పటి నుంచీ ఈ ప్రశ్నకు జవాబు లేదు. అల్లాహ్ కరుణామయుడని ఇస్లాం అంటుంది. కానీ మరి, కరుణామయుని సృష్టిలో ఇంత ద్వేషం ఎలా ఉందీ? అంటే అది జవాబు చెప్పలేదు. అది మనిషి సృష్టి అంటుంది. ద్వేషించే తత్వాన్ని మనిషి మనసులో మొదటగా ఇచ్చింది అల్లా కాదా? అల్లా ఇవ్వకపోతే ఆ స్వభావం మనిషికి ఎలా వచ్చింది? అని అడిగితే జవాబు ఉండదు.

యెహోవా మంచిగానే సృష్టిని చేశాడు గానీ సైతాన్ దాన్ని చెడగొడుతున్నాడు అని క్రైస్తవం అంటుంది. తను ముద్దుగా చేసుకున్న సృష్టిని సైతాన్ చెడిపేస్తూ ఉంటే శక్తివంతుడైన యెహోవా చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నాడు? అలాంటి సైతాన్ని ఎవరు సృష్టి చేశాడు? దేవుడు కాదా? అంటే, దేవుడిదేగా అసలు తప్పు? - అని అడిగితే దానిదగ్గర జవాబు ఉండదు.

ఒక మనిషికి మంచి సంస్కారమైనా చెడు సంస్కారమైనా ఎలా ఏర్పడుతుంది? చెడిపోయే స్వభావాన్ని మనిషిలో సృష్టించింది ఎవరు? అసలు 'చెడు' అంటే ఏమిటి? 'చెడిపోవడం' అంటే ఏమిటి? దానికి కావలసిన పరిస్థితులు సృష్టిలో అసలెందుకు సృష్టించబడ్డాయి? అంటే, అలాంటి సృష్టిని చేస్తున్నప్పుడు ఆ సృష్టిలో ఇన్ని బలహీనతలతో తను సృష్టిస్తున్న జీవుడు చెడిపోతాడని దేవుడికి తెలీదా? తెలిసే ఈ క్రూయెల్  గేంను ఆడుతున్నాడా? ఎందుకు ఆడుతున్నాడు? ఈ ఆట గమ్యం ఏంటి? అసలొక గమ్యమంటూ ఈ ఆటకు ఉందా? లేక ఇదంతా నిరంతరంగా జరుగుతూ ఉండే ఒక ప్రక్రియా? ఈ ప్రక్రియ పరమార్ధం ఏమిటి?'- ఈ మౌలిక ప్రశ్నలకు ఏ మతంలోనూ జవాబులు లేవు.

అమ్మ కూడా ఇదే మాటను అన్నది.

'మంచిని ఇస్తున్నది దేవుడైతే మరి చెడును ఇస్తున్నది ఎవరూ?'

సృష్టిలో 'చెడు' ఎందుకుంది? సైతాన్ ఎందుకుంది? ఆకర్షణలు ఎందుకున్నాయి? ప్రలోభాలు ఎందుకున్నాయి? లోపాలెందుకున్నాయి? మాయ ఎందుకుంది?' ఈ ఆట ఏమిటసలు? ఇదంతా ఎందుకు? జీవునిలో మౌలికమైన లోపాలు ఎందుకున్నాయి?

ఈ ప్రశ్నలకు జవాబులు లేవేమో? ఒకవేళ ఉంటే, ఎవరికి వారికే వారి పరిపక్వతను బట్టి, జీవపరిణామంలో వారి స్థాయిని బట్టి జవాబులు స్ఫురిస్తాయేమో? అలా జరగడమే సృష్టి నియమమేమో? అసలీ సృష్టిలో మంచీ చెడూ అనేవి ఉన్నట్లా లేనట్లా? అసలు ఏది మంచి? ఏది చెడు? వాటిమధ్యన విభజన రేఖ ఎలా ఉంటుంది? ఎక్కడుంటుంది? ఎందుకుంటుంది? అసలవి ఎందుకు సృష్టింపబడ్డాయి? ఈ గేం అంతా ఏమిటి?

ఆలోచనల్లో ఉండగానే, జిల్లెళ్ళమూడి వచ్చేసింది.

(ఇంకా ఉంది)