“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

21, జూన్ 2018, గురువారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 19 (వాళ్ళ గురువు ఒక వేస్ట్ ఫెలో)












వెనక్కు తిరిగి మెల్లిగా నడుచుకుంటూ అక్కయ్య దగ్గరకు వచ్చి, ఆమె దగ్గర సెలవు తీసుకుని కారెక్కి తిరుగు ప్రయాణం మొదలు పెట్టాం.

చాలాసేపు కార్లో అందరం మౌనంగా ఉన్నాం. కారు ఏడో మైలురాయిని దాటి రోడ్డెక్కి పెదనందిపాడు వైపు సాగిపోతోంది.

'అక్కణ్ణించి బయల్దేరి వస్తుంటే మీకేమైనా అనిపించిందా అన్నగారు?' అని చరణ్ అడిగాడు.

'ఎందుకనిపించదు? అనిపించింది' అన్నాను.

'ఏమనిపించింది' అడిగాడు.

'అక్కణ్ణించి బయల్దేరి వస్తున్నామనిపించింది' చెప్పాను.

వింటున్నవారంతా నవ్వారు.

'మీకేమనిపించింది మూర్తిగారు' అడిగాడు చరణ్.

'మీరే చెప్పారు కదా ! నాది అన్నప్రాశన స్టేజి అని. నాకు రుచి చూడటమే గాని దాన్ని బయటకు చెప్పడం ఇంకా రాదు' అని మూర్తి జవాబిచ్చాడు.

'నాకు మాత్రం, ఇక్కడ నేనెందుకు శాశ్వతంగా ఉండలేకపోతున్నాను? అనిపించింది' - అన్నాడు చరణ్.

మేమెవరం మాట్లాడలేదు.

'మీకేమనిపించిది నాగమణి గారు?' అడిగాడు చరణ్.

'మా గురువుగారు తరచుగా ఒక మాట చెప్తారండి' అంది నాగమణి.

'ఏమిటి?' అన్నాడు చరణ్.

'దూరంతో పని లేదు. ఎక్కడైనా ఒక్కటే ఉంటుంది. మనం ఫీల్ కాగలిగితే' అని చెప్తూ ఉంటారు" - అన్నది.

'అది ఆయన స్థాయి మాట. మనకు వర్తించదు. మీకేమనిపించిందో చెప్పండి' అన్నాడు.

'మా గురువుగారి మాటే నా మాట' అంది నాగమణి.

వింటున్న నేను కల్పించుకుని ఇలా అన్నాను.

'మీ గురువుగారు చెప్పినది నాక్కూడా నచ్చలేదు నాగమణి ! ఆయన స్థాయిలో ఆయన మాట్లాడితే ఎలా? మనలాంటి సామాన్యులను దృష్టిలో ఉంచుకుని ఆయన చెప్పాలిగాని ఎంతసేపూ తనకోణం లోనుంచే అన్నీ చెబితే ఎలా?' అన్నాను.

అందరం నవ్వుకున్నాం.

ఇదంతా వింటున్న మా శ్రీమతి ఇలా అడిగింది.

'నాగమణి గురువుగారి గురించి నీ అభిప్రాయం ఏమిటి చరణ్?'

చరణ్ ఏదో చెప్పే ముందే నేనందుకుని - 'ఆ ! ఏముంది? వాడొక వేస్ట్ ఫెలో' అన్నాను.

మళ్ళీ నవ్వులు విరబూశాయి. వెంటనే నిశ్శబ్దం అలముకుంది. అందరూ మౌనంగా ఉండిపోయారు.

ఆలోచనలు మొదలయ్యాయి.

'మనకు ఇష్టమైన ప్రదేశం నుంచో, ఇష్టమైన మనుషుల నుంచో దూరం అయ్యేటప్పుడు బాధగానే ఉంటుంది. కానీ ఆ బాధనేది ఒక మాయ. ఎందుకంటే అదికూడా క్షణికమే. ఆ తర్వాత క్రమేణా అదీ సర్దుకుంటుంది. మనం జిల్లెల్లమూడిలోనే ఉండిపోయినప్పటికీ ఆ తృప్తి కూడా శాశ్వతం కాదు. ఏదో ఒకరోజున జిల్లెల్లమూడిని కూడా వదలిపెట్టి, ఈ శరీరాన్నే వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తుంది. అమ్మ వెళ్లిపోలేదా? ఆ తర్వాత ఎందరు వెళ్ళిపోలేదు? మనకు ఇష్టమైన మనుషులైనా సరే, ఎంతకాలం మనం వారితో ఉంటాం? వారు మనతో ఉంటారు? ఏదైనా కొంతకాలమే. ఆ తర్వాత ఏంటి? మన శాశ్వత గమ్యస్థానం ఏమిటి? అదెక్కడుంది? అసలంటూ అదొకటి ఉందా? ఈరోజు ఉన్న ఇష్టం రేపుంటుందా? ఈరోజు మనల్ని ఇష్టపడినవాళ్ళు రేపు కూడా అదే రకంగా ఇష్టపడతారా? ఎప్పటికీ అలాగే ఉంటారా? మనంకూడా వాళ్ళతో అలాగే ఉండగలమా? ఇవన్నీ జరిగే పనులేనా? చెదిరిపోని శాంతి, తరిగిపోని ప్రేమ అనేవి ఈలోకంలో ఉన్నాయా? మనకు దొరుకుతాయా?

వసుంధరక్కయ్య చెప్పిన మాట గుర్తొచ్చింది.

'ఈ క్షణానికి ఇది సత్యం. అంతే. మరుక్షణం అది గతం.'

అంటే, ఈ సృష్టిలోగాని, మన జీవితంలోగాని శాశ్వతత్వం ఏదీ లేదు. ఏదీ ఎల్లకాలం మనతో ఉండదు. ఎవరూ మనవాళ్ళు కారు. మనమూ ఎవరి వాళ్ళమూ కాము. ఈ క్షణానికి ఇక్కడున్నాం. రేపెక్కడో ఎవరికీ తెలీదు. ప్రతి ప్రయాణమూ ఒక జీవితమే. ప్రతి ప్రయాణానికీ మనం పెట్టుకున్న ఒక గమ్యం ఉంటుంది. మరి ఈ జీవిత పయనంలో చివరికి మనం చేరేది ఎక్కడికి? ఈ పయనంలో చివరకు మిగిలేది ఏమిటి?

మనస్సు లోలోపలకు వెళ్ళిపోతోంది. ఆలోచనలు ఆగిపోయాయి.

ఏదో ఒక స్థితి ఉవ్వెత్తున లేచి మనసంతా నిండిపోయినట్లు అయింది. అది నిరాశా కాదు. నిస్సత్తువా కాదు. వేదనా కాదు. బాధా కాదు. అందులో ఎదురుచూపూ లేదు. భగ్నత్వమూ లేదు. గతం ఏమీ గుర్తురావడం లేదు. ముందుముందు ఏమౌతుందో అన్న చింతనా లేదు. పోనీ అది శూన్యమా అంటే అదీ కాదు. పోనీ అందులో ఏదో ఉందా అంటే ఏమీ లేదు.

ఆ స్థితిలో, కిటికీలోనుంచి బయట కనిపిస్తున్న చీకటిని చూస్తూ ఉండిపోయాను.

కారు పోతోంది. ఎక్కడికో తెలీని అనంతత్వంలోకి అన్నట్లు ప్రయాణం సాగుతోంది. అందరం అలా ఉన్నాం అంతే.

ఈ క్షణానికి ఇదే సత్యం.

(అయిపోయింది)