“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

13, జూన్ 2018, బుధవారం

తీర్ధయాత్రా? విహారయాత్రా?

మనదేశం ఒక మినీ ప్రపంచం లాంటిది. మనకు ప్రస్తుతం 29 రాష్ట్రాలున్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సంస్కృతీ, సంప్రదాయమూ ఉన్నాయి. ఆఫ్ కోర్స్, మన ఆంధ్రాకు మాత్రం మిగతా రాష్ట్రాలను కాపీ కొట్టడం తప్ప మనకంటూ ఒక సంస్కృతి ఎక్కడా లేదనుకోండి !

మన దేశంలో ఒక్కో రాష్ట్రంలోనూ ఎన్నో చూడదగిన స్థలాలున్నాయి. సరిగా చెప్పాలంటే, మన దేశాన్ని పూర్తిగా చూచి ఇక్కడి సంస్కృతులనూ, సంప్రదాయాలనూ, క్షేత్రాలనూ సరిగ్గా చూచి జీర్ణించుకుంటే ఇంక ప్రపంచంలో చూడదగినవి చూడవలసినవి ఇంకేవీ ఉండవు. కానీ సర్వీస్ లొ ఉన్నప్పుడు అలా తిరిగి చూడగలిగే సెలవులూ ఉండవు. తీరికా ఉండదు. అందుకే చాలామంది, సర్వీస్ అయిపోయాక తీర్ధయాత్రలు చేస్తూ ఉంటారు, అప్పటికి ఆరోగ్యం సహకరిస్తే !

మా బంధువులలో అలా యాత్రలు చేస్తున్నవాళ్లు కొందరున్నారు. ఆయన రిటైరై ఇప్పటికి పదేళ్ళు అయింది. ఏడాదికి రెండుయాత్రలు చొప్పున దేశంలోని చాలా ప్రదేశాలు ఇప్పటికే చూడటం అయిపోయింది. ఆయా యాత్రల గురించీ ఆయా విశేషాల గురించీ వాళ్ళు మాకు చెబుతూ ఉంటారు.

కానీ యాత్రల గురించి నా అభిప్రాయాలు వాళ్ళకు చెప్పను. వాళ్ళు చెప్పేది మౌనంగా వినడమే నా పద్ధతిగాని, నా అభిప్రాయాలు చెప్పి వారిని బాధపెట్టడం ఎందుకని నేను మౌనంగా వింటూ ఉంటాను. కానీ ఒక్కొక్కసారి చెప్పక తప్పదు. అలాంటి సంఘటన మొన్నీ మధ్యనే ఒకటి జరిగింది.

యాక్సిడెంట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నా. కానీ ప్రయోగాలు చెయ్యనిదే మనకు తోచదు కదా. బైక్ స్టార్ట్ చెయ్యద్దని, కిక్ కొట్టవద్దని, అలా చేస్తే, ఇప్పుడిప్పుడే మానుతున్న మోకాలి ఫ్రాక్చర్ మళ్ళీ తిరగబెట్టే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పాడు. ఆయన చెప్పినది మనం వినం కదా ! అదీగాక, టెస్ట్ చెయ్యకపోతే, ఎంతవరకు ఫ్రాక్చర్ హీల్ అయిందో ఎలా తెలుస్తుంది?

అందుకని నిన్న మోటార్ సైకిల్ బయటకు తీసి, దానిమీద మా శ్రీమతిని ఎక్కించుకుని, చక్కగా కిక్ కొట్టి, స్టార్ట్ చేసి, మా అక్కా వాళ్ళింటికి బయల్దేరాం. సాహసకార్యాలు చెయ్యకపోతే మనకు తోచదు కదా మరి!  మేం వెళ్ళేసరికి ఇంటిబయట రోడ్డుమీదే నిలబడి మాకోసం ఎదురు చూస్తున్నారు మా అక్కా బావా ఇద్దరూను.

ఆయన రైల్వేలో గార్డుగా పనిచేసి వాలంటరీ తీసుకుని పదేళ్ళు అయింది. ప్రస్తుతం ఆయనకు దగ్గర దగ్గరగా డబ్బై ఏళ్ళు ఉంటాయి. ఆమెకు అరవై దాటాయి. ఏడాదికి రెండు మూడు సార్లు హాయిగా దేశమంతా యాత్రలు చేస్తూ చక్కగా వానప్రస్థ జీవితాన్ని గడుపుతూ ఆనందంగా ఉన్నారు వాళ్ళిద్దరూ.

మమ్మల్ని చూస్తూనే, 'ఏంటిరా బైక్ నడుపుతున్నావ్? ఆ కాలు అలా పెట్టుకుని? కార్లో రావచ్చుగా?' అంటూ ప్రేమగా మందలించింది మా అక్కయ్య.

'ఈ సందుల్లో కారెక్కడ పడుతుందిలే అక్కా? అదీగాక బైక్ నడిపి చూస్తేనే కదా మనకు తగ్గిందా లేదా తెలిసేది? డాక్టర్లు చెప్పినట్లు నేనెందుకు వింటాను? మన బ్లడ్ ఎలాంటిది అసలు?' అన్నా నేను నవ్వుతూ.

'ఏంటో నీ మూర్ఖత్వం? సరే రండి లోపలకి' అంటూ ఇంట్లోకి దారితీశారు వాళ్ళు. వాళ్ళింటికి వెళ్లి చక్కగా ఆసీనులమై అవీ ఇవీ మాట్లాడాక, వాళ్ళు చేసిన హిమాలయ యాత్ర గురించి మాకు చెప్పుకొచ్చారు. అందులో వాళ్ళు పడిన కష్టాలు చెబుతూ ఉంటే నాకు నవ్వాగలేదు.

ఆ హిమాలయాల్లో ఎక్కడో గుర్రంమీద పది కిలోమీటర్లు పోవాలట. ఆ గుర్రం నడుము కైవారానికీ దానిమీద కూచున్న బావగారి కాళ్ళ వెడల్పుకూ సరిపోక ఆ గుర్రం వీపు రాపిడికి తొడలన్నీ పుండ్లు పడిపోయాయనీ ఇంటికొచ్చాక అవి తగ్గడానికి మూడు నెలలు పట్టిందనీ, రోజూ ఆ గాయాలకు కొబ్బరి నూనె వ్రాయడం ఒక పెద్ద పననీ ఆయన చెబుతుంటే నాకు చచ్చే నవ్వొచ్చింది. ఆ మూడు నెలలూ ఏదో సుఖరోగం వచ్చినవాడిలాగా అడ్డకాళ్ళతో నడవవలసి వచ్చిందట. చూచిన ప్రతివాడూ 'ఏంటి ఈ వయసులో అలా నడుస్తున్నావ్?' అని అనుమానంగా అడుగుతుంటే మొత్తం యాత్రా క్యాసెట్ వాళ్లకు వినిపించలేక తలప్రాణం తోకకొచ్చిందని చెప్పాడాయన. ఆయన చెప్పినంత సేపూ పడీ పడీ నవ్వుతూనే ఉన్నాం మేం.

ఇదంతా విని, ఆయన్ను కాస్త కదిలిద్దామని నేనిలా అడిగాను.

'నేను కూడా అమర్ నాధ యాత్రకు వెళదామని అనుకుంటున్నాను'

ఆయన తల అడ్డంగా ఊపాడు.

'నీకు ఏభై దాటాయి కదా? ఇప్పుడు వెళ్ళడం కుదరదు. నువ్వు నలభై లోపైతే ఆ యాత్ర చెయ్యొచ్చు. ఇప్పుడు అంత ఫిట్నెస్ ఉండదు మనకు' అన్నాడు తనతోబాటు నన్నూ కలుపుకుంటూ.

నేను నీరసంగా ముఖం పెట్టి - 'అవున్నిజమే. బాత్రూం కెళ్ళి వచ్చేసరికే నీరసమూ ఆయాసమూ వస్తున్నాయి? ఇప్పుడేం చెయ్యగలం ఆ యాత్రను?' అన్నాను.

'అందుకే అప్పుడప్పుడూ కొంచం వ్యాయామం చేస్తూ ఉండాలి. యోగా నేర్చుకో ఎక్కడన్నా. ఈ వయసులో అదే మంచిది.' అన్నాడాయన.

నేనూ నిరాశగా ముఖం పెట్టి - 'ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే ఈ శరీరం చెప్పినమాట వినేటట్లు లేదు. ఈ రెండునెలల్లో ఎంత పొట్ట పెరిగిందో చూడండి. అయినా ఈ వయసులో యోగా నా వల్ల అవుతుందంటారా?' అన్నా.

'పోనీ వీరమాచనేని డైట్ ట్రై చెయ్యకపోయావా?' అడిగాడాయన.

'చేస్తున్నా గా' అన్నా నేను.

'చేస్తున్నావా ఎలా చేస్తున్నావ్? రోజూ కొబ్బరి నూనె త్రాగుతున్నావా?' అడిగాడు.

'లేదు. దానిబదులు రోజుకు 100 ml ఆముదం తాగుతున్నా' అన్నా నేను ఆముదం త్రాగినవాడిలా ముఖం పెట్టి.

ఆయన బిత్తర పోయాడు.

'అదేంటి? ఆముదం త్రాగుతున్నావా? మోషన్స్ అవుతాయేమో జాగ్రత్త?' అన్నాడు నా వైపు అనుమానంగా చూస్తూ.

'కొబ్బరి నూనె త్రాగినప్పుడు మోషన్స్ పట్టుకున్నాయి. ఇప్పుడు ఆముదం మొదలు పెట్టాక అన్నీ ఆగిపోయాయి' అన్నా నేను సీరియస్ గా, 'అన్నీ' అన్న పదాన్ని వత్తి పలుకుతూ.

ఆయనకు విషయం అర్ధం కాలేదు. సర్లే వీడితో ఎందుకులే అనుకున్నాడో ఏమో ఆ టాపిక్ వదిలేసి తమ యాత్రల గురించి చెప్పడం మొదలు పెట్టాడు.

'పోయినేడాది మేము అమరనాధ యాత్ర చేసొచ్చాం. ఎంత బాగుందో? చాలా కష్టపడ్డాం. కానీ ఒక విషయం మాత్రం గ్రేట్. ప్రపంచంలో అంత ఎత్తులో ఉన్న శివలింగం అదొక్కటే.' అన్నాడు తన్మయత్వంలో ఎవరెస్ట్ శిఖరం తానొక్కడే ఎక్కినట్లు ఫీలైపోతూ.

'మరి ఏదన్నా జెండా పాతారా అక్కడ?' అడిగాను నవ్వుతూ.

ఆయనకర్ధం కాలేదు.

'జెండానా? అదేంటి?' అన్నాడు అనుమానంగా.

'అవును. అలా శిఖరాలు ఎక్కినవాళ్ళు అక్కడ జెండాలు పాతుతారు కదా? మీరు కూడా ఒక జెండా అక్కడ పాతి, ఒక ఫోటో దిగి మాకందరికీ వాట్సప్ లో పంపించి, ఫేస్ బుక్ లొ షేర్ చేసి ఉంటే ఎంత బాగుండేది? ప్రపంచం అంతా చూచేది కదా మీ సాహసాన్ని?' అన్నాను ఆయనకు అనుమానం రాకుండా నా ముఖంలో ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా జాగ్రత్త పడుతూ.

ఇదంతా వింటున్న మా అక్క - ' ఆ ! జెండా ఒక్కటే తక్కువ ! అక్కడకు చేరేసరికి విపరీతమైన నీరసంతో కూలబడి పోయాడు ఈయన. కింద కూలబడిన వాడు లేవడానికి అరగంట పట్టింది. ఇక జెండా ఏం పాతుతాడు? ఆయనకు ఏదైనా అయితే నేనూ ఆ కొండమీద నుంచి దూకవలసి వచ్చేది.' అంది కోపంగా.

'అంతకంటే ఇంకేం కావాలి అదృష్టం? ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్న శివలింగం అది.' అన్నాడాయన తన్మయత్వంలో గుడ్లు తేలేసి.

ఈ మాట నన్ను కాస్త ఆలోచనలోకి నెట్టింది.

'శివలింగం ఎన్ని వేల అడుగుల ఎత్తులో ఉంటే మనకేంటి? మన మనస్సు పాతాళంలోనే ఉంటుంది కదా? దానికేమీ ఔన్నత్యం రాదు. చాంచల్యం పోదు. రాగద్వేషాలు వదలవు. కోపతాపాలు తగ్గవు. ప్రపంచంలోని ఎంత ఎత్తైన కొండెక్కినా, చివరకు చంద్రుడి మీద కాలుమోపినా కూడా మనం మనంగానే ఉంటాము. మన మనస్సు మనతోనే ఉంటుంది. దాని కుళ్ళు దానిలోనే ఉంటుంది. ఇంకేమిటి ఈ యాత్రల ప్రయోజనం?' - అనిపించింది.

తీర్ధయాత్రలంటూ కాలక్షేపం చేసే అనేక వందలమందిని నేను చూస్తూ ఉంటాను. వారిని చూస్తుంటే నాకు లోలోపల విపరీతమైన నవ్వొస్తూ ఉంటుంది. 'అయ్యో పాపం' అని జాలేస్తూ ఉంటుంది.

నా శిష్యులలో కూడా కొందరున్నారు. అయిదారేళ్ళుగా నేను ఎంతగా చెవిలో జోరీగలా పోరుతున్నా ఈనాటికీ తత్త్వం ఇసుమంతైనా ఎక్కించుకోరు. అలాంటి వారిని చూచి చాలా జాలిపడుతూ ఉంటాను నేను. ఎప్పటికి వీళ్ళకు తత్త్వం అర్ధమౌతుందా? ఎప్పటికి వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుతారా? అని ఆశగా ఎదురుచూస్తూ ఉంటాను. కానీ నా శిష్యులలో చాలామంది నన్ను చాలా నిరాశకు గురిచేస్తూనే ఉంటారు. నేను ఆశించిన స్థాయి వాళ్ళలో నాకు ఎక్కడా కనిపించదు. సర్లే, మనిషి జన్మ ఇంతేలే అని సర్దిచెప్పుకుని ఊరుకుంటూ ఉంటాను.

మనిషి చెయ్యవలసిన యాత్ర నిజానికి తనలోనికి గాని తన బైటకు కాదు. లోపలి యాత్ర తెలిసినవాడికి బయట యాత్ర అవసరం లేదు. కానీ, కావాలనుకుంటే, అలాంటివాడు మాత్రమే ఇలాంటి యాత్రలు చెయ్యాలి. లోపలి యాత్రలు చెయ్యడం తెలియనివారు బయట యాత్రలు ఎన్ని చేసినా అవన్నీ వృధానే. అవి విహారయాత్రలే అవుతాయిగాని తీర్ధయాత్రలు కాబోవు. "మేము కూడా అవన్నీ తిరిగి వచ్చాము" అని ఒక డొల్ల ఆత్మతృప్తి తప్ప ఈ యాత్రలవల్ల ఒరిగేది ఏమీ ఉండదు. మహా అయితే, పత్రికలలోనో, బ్లాగులోనో, ఫేస్ బుక్ లోనో ట్రావెలాగ్ వ్రాసుకోడానికి పనికొస్తాయి. అంతేతప్ప వీటి ఉపయోగం నా దృష్టిలో గుండుసున్నానే.

ఎటువంటి యాత్రలూ చెయ్యవద్దనే నేను నా శిష్యులకు ఎప్పుడూ చెబుతూ ఉంటాను. "ముందు అసలైన లోపలి యాత్రను చెయ్యడం నేర్చుకోండి. ఆ తర్వాత ఈ బయట తిరిగే యాత్రలు చెయ్యవచ్చనే" నేనెప్పుడూ చెబుతాను. కానీ మనమాట ఎవరు వింటారు, నా పిచ్చిగాక పోతే?

శ్రీ రామకృష్ణులు తరచూ ఇలా అనేవారు.

'ఇక్కడుంటే అక్కడుంటుంది. ఇక్కడ లేకుంటే అక్కడా ఏమీ ఉండదు.'

ఇది చాలా లోతైన మాట. దీనర్ధం ఏంటో తెలుసా?

'నీ ఇంటిలో ఉంటూ నీలో నువ్వు దైవాన్ని చూడగలిగే స్థాయిని పొందితే, అప్పుడు మాత్రమే నీవు తీర్ధయాత్రలకు అర్హుడవు అవుతావు. అప్పుడు మాత్రమే నీవు పోయిన క్షేత్రంలో ఉన్న దైవత్వాన్ని నువ్వు దర్శించగలుగుతావు. అక్కడ ఉన్న దివ్యశక్తులతో నీవు సంభాషించగలుగుతావు. అక్కడ 'ఆరా' ను నువ్వు ఫీల్ కాగలుగుతావు. అలా చెయ్యాలంటే నీకు ధ్యానశక్తి ఉండాలి. ఆ శక్తి రావాలంటే నువ్వు కొన్నేళ్ళ పాటు నియమాలు పాటిస్తూ దీక్షగా సాధన చెయ్యాలి. అప్పుడు నీలో కొంత పరిణతి వస్తుంది. అప్పుడు నువ్వు యాత్ర చేస్తే, ఆ క్షేత్రాలలో ఏముందో నీకు కనిపిస్తుంది. లేకపోతే ఇక్కడున్నదే అక్కడా నీకు కనిపిస్తుంది. ఇవే కొండలు, ఇవే చెట్లు, ఇవే జంతువులు, ఇదే మనుషులు, కాకుంటే కొంచం డిఫరెంట్ గా ఉంటాయి. అంతకంటే ఏమీ తేడా ఉండదు.' - అని ఈ మాటల అర్ధం.

ఇది పరమసత్యం. కానీ సత్యం ఎవడికి కావాలి? అందరూ మాయలో పడి ఉన్నవాళ్ళే గాని, వెలుగులోకి వచ్చేవారు ఎవరున్నారు?

నవ్వొచ్చింది.

ఆలోచనల్లో ఉన్న నన్ను మా బావగారి స్వరం బయటకు లాక్కొచ్చింది.

'ఏదో యాత్రలు చెయ్యడమే గాని అక్కడ కష్టాలు అక్కడా ఉన్నాయండి. మేము హిమాలయాలలో గుర్రాల మీద ప్రయాణం చేశాం. ఆ దారినిండా యాత్రికులు పారేసిన సంచులూ, గార్బెజీ, గుర్రాల యూరిన్ వాసనా, వాటి పెంటా - చాలా దారుణంగా ఉంది ఆ దారంతా. 'ఒకసారైతే ఎందుకొచ్చాంరా బాబూ ఈ దారిలో అని విసుగేసింది. అక్కడ గంగోత్రిలో నీళ్ళు చాలా స్వచ్చంగా ఉంటాయని బాటిల్లో పట్టుకుని తెగ త్రాగాం ఆ నీళ్ళను. చూట్టానికి తెల్లగా స్వచ్చంగానే ఉన్నాయి. కానీ ఆ దెబ్బకు నోరంతా చేదు అయిపోయి ఏం తిన్నా రుచీపచీ లేకుండా ఒక నెలరోజులు నానా నరకం పడ్డాం తిరిగొచ్చాక కూడా. గంగాజలం చాలా ప్యూర్ అనుకుని అలా త్రాగి ఇలా తయారయ్యాం. దానికి తోడు మా తోటి యాత్రికుల కబుర్లూ గోలా అరుపులూ, ఏదో సంతలో ఉన్నట్లు ఉంది గాని , ప్రశాంతత లేదు. అక్కడకొచ్చినా ఏదో వాగుతూనే ఉంటారు మనుషులు. ప్రశాంతంగా ఉండరు.' అన్నాడు.

ఊళ్లు తిరిగితే ప్రశాంతత వస్తుందా? ఎలా వస్తుందో నాకెప్పటికీ అర్ధం కాదు.

ఇంతకుముందు నాకు పరిచయం ఉన్న ఒకమ్మాయి ఉండేది. ఆమె అమెరికాలో ఉంటుంది. నామీద కోపంతో అలిగి ఇప్పుడు నాకు దూరంగా ఉంటోంది. ఆమెకూడా ఇలాగే క్షేత్రాలని, కొండలు గుట్టలని తిరుగుతూ ఉండేది. 'అవన్నీ వద్దు. ఉపయోగం ఉండదు' అని నేను ఎంతో చెప్పేవాడిని. కానీ తను వినేది కాదు. తిరగాలని లోపల దురద ఉన్నప్పుడు మనం ఎంత చెప్పినా ఎలా ఆగుతారు? కనుక నేనూ తనకు చెప్పడం మానేశాను. తనిప్పుడేం  చేస్తోందో నాకు తెలీదు. తర్వాత్తర్వాత నాతో మాట్లాడటం పూర్తిగా మానేసింది. బహుశా ఎవడో ఒక దొంగగురువు ఆమెకు దొరికి ఉంటాడు. ఆయన సలహా మేరకు అలా ఏడాదికి ఒక యాత్ర చొప్పున చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ ఉందేమో తెలీదు మరి?

నాకు తెలిసిన ఇంకొక అమెరికా ఆమె ఉంది. ఆమె జీవితాశయం టిబెట్ వెళ్లి అక్కడ కొన్నాళ్ళు ఉండాలని. ఎప్పుడూ ప్రపంచంలో ఎక్కడెక్కడో తిరగాలని అంటూ ఉండేది. ఆమెకిలా చెప్పేవాడిని.

'ఎక్కడకూ తిరగొద్దు. మనస్సును నీ అదుపులోకి తెచ్చుకోవడం నేర్చుకో. ఎందుకు  టిబెట్ కు వెళ్లి ఆ బౌద్ధ భిక్షువులను చెడగొడతావ్? నీ మెంటల్ నీలోనే ఉంచుకో. పక్కవాళ్ళకు అంటించకు. అందులోనూ అన్నీ వదిలేసిన భిక్షువులను ఎందుకు నీ బురద అంటించి నాశనం చేస్తావ్? వద్దు ఆపని చెయ్యకు. ఏ టిబెట్టూ వద్దు. నేను చెప్పిన సాధనను త్రికరణ శుద్ధిగా చెయ్యి. చాలు. నీ మనస్సు చాంచల్యం ముందు వదిలించుకో. ఎక్కడకూ తిరగొద్దు.' అని అయిదేళ్ళ పాటు ఓపికగా ఆమెకు చెబుతూ వచ్చాను. కానీ తనకు ఏమాత్రం ఎక్కలేదు. తను కూడా చివరకు నామీద అలిగి మా గ్రూప్ లోనుంచి వెళ్ళిపోయింది గాని, నేను చెప్పిన సత్యాలను ఇసుమంతైనా బుర్రలోకి ఎక్కించుకోలేదు. ఆచరణలోకి తీసుకురాలేదు.

ఇలాంటి వాళ్ళు ఇంతే ! అనుభవించే ఖర్మ బలంగా ఉన్నప్పుడు మంచి దారిని మనం చూపించినా వాళ్లకు ఎక్కదు. మాయ కళ్ళకు కమ్మినప్పుడు అసత్యం సత్యంగా సత్యం అసత్యంగా కన్పించడం సహజమే కదా మరి !

మళ్ళీ నవ్వొచ్చింది.

'ప్రశాంతత మనసులో ఉంటే బయట కూడా ఉంటుంది. లోపల లేనిది బయట ఎక్కడనుంచి వస్తుంది?' అనుకున్నాను.

మళ్ళీ ఆలోచనలకు అడ్డు వస్తూ - ' ఇప్పుడే కొంచంకొంచం యాత్రలు చేస్తూ ఉండండి. రిటైర్ అయ్యాక ఓపిక ఉండదు. నేనంటే ఏదో డబ్బై ఏళ్ళోచ్చినా ఇలా తిరుగుతూ ఉన్నాగానీ అందరికీ ఈ ఆరోగ్యం ఉండదు' అన్న ఆయన స్వరం వినిపించింది.

మన గోల ఈయనకెందుకులే చెప్పడం అని - 'అదే ఆలోచిస్తున్నా. ఏదో ఒకటి చెయ్యాలి.' అన్నాను.

'చెయ్యాలి చెయ్యాలి అనుకుంటూ ఉంటే కాలం మనకోసం ఆగదు. అది ముందుకు పోతూనే ఉంటుంది. చివరకు మీరు ఏ క్షేత్రాలూ చూడలేరు. ఇప్పుడే మొదలుపెట్టి ఒకటీ అరా దగ్గర్లోవి చూస్తూ ఉండండి.' అన్నాడాయన.

'ఓకే. అలాగే బావగారు' అన్నాను బుద్ధిగా తలాడిస్తూ.

వచ్చే నెలలో కర్నాటక వెళుతున్నాం. 'ఉడిపి, ధర్మస్థలం, మొత్తం వెస్ట్ కోస్ట్ అంతా తిరిగి క్షేత్రాలు చూచి వస్తాం. మీ ప్లాన్ ఏంటి?' అన్నాడాయన.

'ఏంటి వేస్ట్ కోస్ట్ వెళుతున్నారా?' అన్నా నేను అమాయకంగా.

'వేస్ట్ కోస్ట్ కాదు. వెస్ట్ కోస్ట్'  అన్నాడాయన కించిత్ కోపంగా.

'వచ్చే నెలలో నేను అమెరికా వెళదామని ప్లాన్ చేస్తున్నా' అన్నా కూల్ గా ఆయన ముఖంలోకి చూస్తూ.

నా వైపు జాలిగా - ' ఓరి భ్రష్టుడా !' అన్నట్లు చూచాడాయన. ఇంక వీడితో మాటలనవసరం అనుకున్నాడో ఏమో టీవీవైపు దృష్టి సారించాడు. అందులో మేమొచ్చినప్పటి నుంచీ భక్తి చానల్ తెంపు లేకుండా వస్తూనే ఉంది. 'లలితా సహస్ర నామం' వస్తోంది అందులో. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క స్క్రీన్ మారుతోంది. మా ఇంట్లో టీవీ పెట్టి ఏడాదో ఏమో అయింది. అందువల్ల అలా భక్తి చానల్లో స్తోత్రాలకు స్తోత్రాలే వస్తూ ఉంటాయన్న విషయం నాకిప్పటిదాకా తెలీదు. ఫస్ట్ టైం ఇక్కడే చూశా. దానివైపు తన్మయత్వంగా చూస్తూ - 'ఇలాంటి స్తోత్రాలు అప్పుడప్పుడన్నా వింటూ ఉండు. మంచిది.' అన్నాడాయన నా వైపు నిరాశగా చూస్తూ.

'మొదట్నించీ లేనిది ఇప్పుడేం వస్తుందిలెండి బావగారు !' అన్నా నేను ఒక నేరస్తుడిలాగా ముఖం పెట్టి.

ఇంతలో మా అక్కయ్య ప్లేట్ లో పూరీలు, బంగాళాదుంప కూరా తెచ్చి నా చేతిలో పెట్టింది. వాటిని తినేలోపు వేడి వేడి 'టీ' తెచ్చి ఇచ్చింది. మౌనంగా అవన్నీ లాగించి - ' సరే. వెళ్లి వస్తాం. మీ కర్నాటక యాత్ర అయ్యాక మళ్ళీ వస్తాం. ఆ విశేషాలు వినడానికి' అన్నా నేను భక్తిగా.

'అలాగే' అన్నారు వాళ్ళు నవ్వుతూ.

బయటకు వస్తూ వస్తూ 'లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక' పుస్తకాన్ని వారి చేతిలో పెట్టి - 'ఈ పుస్తకం ఈ మధ్యనే వ్రాశాను. వీలైనప్పుడు చదవండి' అని చెప్పి మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాను.

'నువ్వు వ్రాశావా? ఎలా?' అన్నారు వాళ్ళిద్దరూ ఒకేసారి అనుమానంగా ఆ పుస్తకాన్ని అటూ ఇటూ తిప్పి చూస్తూ.

'ఆ ! ఏముంది? పీ హెచ్ డీ ఎలా వస్తుంది. ఇదీ అంతే. నాలుగు పుస్తకాలు కాపీ కొట్టి మన పుస్తకం వ్రాయడమే. చాలా సింపుల్. ఈ రెండు నెలలు ఇంట్లోనే ఉన్నా కదా. నాలుగు పుస్తకాలు గిన్నెలో వేసి నీళ్ళు పోసి సాంబార్ వండితే మన పుస్తకం వచ్చింది. ఏదో తోచక అప్పుడప్పుడూ ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను. పెద్ద వయసు వచ్చేసింది. ఎలాగూ తీర్ధయాత్రలూ విహారయాత్రలూ చెయ్యలేను. ఇలా ఏదో చెత్త వ్రాస్తూ ఉంటాను. చదవండి. మీకు నచ్చుతుందని నాకనిపిస్తోంది' - అని బైక్ ని ముందుకు దూకించాను.

వాళ్ళు మావైపు అలా చూస్తూ ఉండిపోయారు.