'లలితా సహస్రనామాలమీద మీ లేటెస్ట్ బుక్ చదివాను. బాగానే వ్రాశారు. కానీ మీ వ్యాఖ్యానం అందరికీ నచ్చదు. జనాలకి మీ భావాలు ఎక్కడం కష్టం.' అన్నాడొకాయన.
'అందరికీ అన్నీ ఎలా నచ్చుతాయి? అలా నచ్చేపనైతే ఇన్ని అవతారాలెందుకు? ఇంతమంది గురువులెందుకు? ఇన్ని దేవుళ్ళెందుకు? ఇన్ని గ్రంధాలెందుకు? అందరి సంగతీ అలా ఉంచండి. మీకు నచ్చిందా లేదా?' అన్నా నేను.
'బానే ఉంది. మీరు హైయెస్ట్ లెవల్లో వ్రాశారు. కానీ..ఏయే మంత్రాలు ఎలా చదివితే ఏయే పనులౌతాయో చెబితే ఇంకా బాగుండేది.' అన్నాడు.
నవ్వొచ్చింది.
'మీలాంటివాడు రామాయణం అంతా విని వాల్మీకికి శూర్పణఖ ఏమౌతుందని అడిగాట్ట చివరికి' అన్నా నేను.
'అదేంటి?' అన్నాడాయన.
'లలితా సహస్రనామాల అసలు ప్రయోజనం పనులు కావడం కాదని ముందుమాటలో వ్రాశాను. అది చదవలేదా?' అడిగాను.
'అవుననుకోండి. కానీ...కాస్త మామూలు మనుషులను కూడా దృష్టిలో పెట్టుకుని మీరు వ్రాయాలి కదా?' అన్నాడు.
'అవసరం లేదు. మామూలు మనుషులతో నాకు పని లేదు. నా స్థాయిలో ఆలోచించి నాతో ట్యూన్ అయ్యేవారికోసమే ఈ పుస్తకం గాని పనులు కావడం కోసం పారాయణాలు చేసే వారి కోసం కాదు.' అన్నాను.
'అంటే పనులు కావడం కోసం దేవుణ్ణి వేడుకోవడం తప్పంటారా?' అన్నాడు.
'తప్పు కాదు. కానీ జీవితమంతా అలా వేడుకుంటూనే ఉండకూడదని నేను చెబుతున్నాను. అడుక్కోవడం తప్పనిసరైనప్పుడు ఈరోజు ఉండి రేపు మాయమయ్యే చెత్తకోసం కాకుండా విలువైన వాటికోసం అడుక్కోమని చెబుతున్నాను. అంతే' అన్నాను నవ్వుతూ.
'కష్టం అండి. సామాన్యులకు ఎక్కదు' అన్నాడు.
'సామాన్యులను ఉద్ధరించడం కోసం, వారి కోరికలు తీరే మార్గాలు చెప్పడం కోసం నేను పుట్టలేదు. సామాన్యులకు అన్నీ అర్ధమయ్యేలా చెయ్యాలని నాకేమీ తపన లేదు. సామాన్యుడు ఎప్పటికీ సామాన్యుడు గానే ఉండాలని కోరుకుంటే అది వాడి ఖర్మ. నాకేంటి? ఎక్కడైనా ఒకరో ఇద్దరో అసామాన్యులుగా ఎదగాలని అనుకుంటే అలాంటివారికి మాత్రమే నా పుస్తకాలు నచ్చుతాయి. నేను వ్రాసేది కూడా అలాంటి వారికోసమే' అన్నాను.
అతనికి ఇంకా ఇలా చెప్పాను.
'చూడు. వివేకానందస్వామి ఒక మాటన్నారు. నువ్వు చదివావో లేదో? సత్యాన్ని సత్యంగానే మనం ఉంచాలి. దానిని దిగజార్చాలని చూడకూడదు. మనం దానిని అందుకోలేకపోవచ్చు. అది మనకు అందనంత ఎత్తులో ఉండవచ్చు. దానిని చేరుకునే శక్తి మనకు లేకపోవచ్చు. కానీ ఆ సత్యాన్ని దిగజార్చి మన స్థాయికి దించాలని మనం ప్రయత్నించరాదు. అలా చెయ్యడం వల్లే హిందూమతం భ్రష్టత్వానికి గురౌతోంది.
సత్యం అంటే ఏమిటి? దైవమే సత్యం. దైవాన్ని మనం చేరుకునే ప్రయత్నం చెయ్యాలిగాని, మనం ఉన్న బురదలోకి దానిని కూడా దించాలని చూడకూడదు. లలితా సహస్రనామాలకు ఉన్నట్టి అసలైన అర్ధాలను నేను వివరించాను. అవి అలా ఉంటే మాకిష్టం లేదు, మాక్కావాల్సినట్టు ఉండాలి అని మీరంటే అది మీ ఖర్మ. అది మీ ఎదగలేనితనానికి నిదర్శనం.' అన్నాను.
ఆయన ఇంకా అయిష్టంగానే ముఖం పెట్టాడు.
ఈ మాట చెప్పి ముగించాను.
'మీరు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో అలా ఉండటానికి ప్రయత్నం చెయ్యాలి. అంతేగాని మీరెలా ఉండాలని కోరుకుంటున్నారో అలా ఉండటం గొప్ప కాదు. అది ఎవరైనా చేస్తారు. జంతువులు కూడా అదే పని చేస్తాయి. ఏ విధంగా ఉంటే, పరిణామ క్రమంలో మనం అత్యున్నత స్థాయికి ఎదగగలమో ఆ విధంగా ఉండాలి. కనీసం ప్రయత్నం చెయ్యాలి. అంతేగాని, మన కోరికలు తీర్చే పనివాడుగా దైవాన్ని వాడుకోకూడదు.
పరిణామక్రమంలో అత్యున్నత స్థాయికి మనిషిని చేర్చే మార్గాలను నేను నా పుస్తకంలో వివరించాను. అవి మీకు నచ్చకపోతే మీకు దైవికంగా ఎదిగే సమయం ఇంకా రాలేదని అర్ధం. మళ్ళీ చెబుతున్నాను. సత్యాన్ని మనం అందుకునే ప్రయత్నం చెయ్యాలిగాని దానిని మన స్థాయికి దిగలాగే ప్రయత్నం చెయ్యకూడదు. కానీ దురదృష్టవశాత్తూ మన గుళ్ళల్లో, మన పూజల్లో, మన పారాయణాలలో మనం చేస్తున్నది అదే. దేనిని చెయ్యాలో దానిని చెయ్యకుండా దేనిని చెయ్యకూడదో దానిని చెయ్యడమే మన పతనావస్థకు కారణం.
నా పుస్తకం లోకంలో అందరికీ నచ్చాలనీ నచ్చుతుందనీ నేను భావించడం లేదు. నన్ను సరిగ్గా అర్ధం చేసుకునే కొందరికి నచ్చితే చాలనేదే నా నమ్మకం. ఆ కొందరికైనా అది సక్రమమైన దారిని చూపగలిగితే అంతే చాలని నా విశ్వాసం.' అంటూ ముగించాను.