“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

18, జులై 2018, బుధవారం

మాకు తెలిసి మేమే తప్పూ చెయ్యలేదు

జాతకం కోసం నా దగ్గరకు వచ్చేవారు గాని, ఫోన్లో మాట్లాడేవాళ్ళు గాని అందరూ ఒకేమాట చెబుతూ ఉంటారు. వాళ్ళ సమస్యలు వేర్వేరు కావచ్చు, వాళ్ళ మిగతా పరిస్థితులు వేర్వేరు కావచ్చుగాని వాళ్ళు చివరకు చెప్పే మాట ఒకటే ఉంటుంది. అదేమంటే - "మాకు తెలిసి మేమే తప్పూ చెయ్యలేదు. మాకే ఇలా ఎందుకు జరుగుతోంది?"

ఏ తప్పూ చెయ్యకపోతే ఏ ఇబ్బందీ జీవితంలో రాదు. మనకు ఇబ్బందులు వస్తున్నాయీ అంటే, మనం తప్పులు చేశామనే అర్ధం. అవి గత జన్మలలో అయి ఉండవచ్చు. లేదా ఈ జన్మలోవే అయి ఉండవచ్చు. గత జన్మలలోవి అయితే మామూలు మనుషులకు గుర్తుండవు. ఆధ్యాత్మిక సాధనలో లోతులు అందుకున్నవారికి మాత్రమే అవి గుర్తొస్తాయి. కానీ ఈ జన్మలో మనం చేసిన తప్పులు మనం గుర్తించలేనంత ఘోరమైన చీకట్లో ఉండటమే మనమందరం చేస్తున్న పెద్ద తప్పని నేనంటాను. దీనికి రెండు కారణాలుంటాయి.

ఒకటి - నేనేంటి? తప్పులు చెయ్యడమేంటి? అనే అహంకార ధోరణి.

రెండు - తప్పులు చేసినా, చేస్తున్నా, అవి తప్పులు కావని గుడ్డిగా నమ్ముతూ ఉండటం.

మనుషులు సాధారణంగా ఈ రెండు కోవలకే చెందుతూ ఉంటారు. అందుకే, నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇలా మాట్లాడితే నాకు నవ్వుతో బాటు, అయ్యోపాపం అని జాలీ కలుగుతూ ఉంటుంది.

సాధారణంగా ఇలా చెప్పేవాళ్ల దృష్టిలో తప్పులంటే మర్డర్ లేదా రేప్ ఈ రెండే ఉంటాయి. మేము ఈ రెండూ చెయ్యడం లేదు కదా కనుక మేమేం తప్పులూ చెయ్యడం లేదని వీళ్ళ లాజిక్ !

సాధారణ దృష్టితో చూస్తె ఈ రెండూ తప్పులే కావచ్చు. కానీ కొన్ని ప్రత్యెక పరిస్థితులలో ఇవి తప్పులు కావు. అలాగే, మామూలుగా నిత్యజీవితంలో మనం చేసేవి తప్పులు కావని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అవే తప్పులౌతూ ఉంటాయి.

అసలు మనిషి మనస్తత్వమే ఇంత ! తను చేసేది ఏదీ తప్పు కాదని, ఎదుటివాడు చేసేది మాత్రమే తప్పనీ ప్రతివాడూ అనుకోవడమే అతి పెద్ద తప్పంటాను నేను.

ఆ మధ్యలో ఒకాయన ఇలా ఫోన్ చేశాడు.

"మాది గుంటూరే. మీరు ఇక్కడే ఉన్నారని తెలుసు కానీ మిమ్మల్ని కలవాలంటే కుదరడం లేదు. గత నాలుగేళ్లనుంచీ ప్రయత్నిస్తున్నాను. కానీ వీలు కావడం లేదు."

నేను క్లుప్తంగా "అలాగా" అన్నాను.

ఆ తర్వాత తన సమస్యలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అన్నీ చెప్పి " కొంచం నా జాతకం చూడండి. మాది ఉమ్మడి కుటుంబం. మాకు తెలిసి మేమేమీ తప్పులు చేయలేదు. కానీ మాకే ఈ కష్టాలు ఎందుకో అర్ధం కావడం లేదు" అని అన్నాడు.

అది అందరూ చెప్పే స్టాక్ డైలాగే కావడంతో నాకేమీ కొత్త అనిపించలేదు.

"చూడు బాబు. తప్పులు అందరూ చేస్తారు. కానీ అవి తప్పులని గ్రహించగలిగే స్థితిలో అందరూ ఉండరు" అన్నాను.

"అలా ఎలా కుదురుతుందండి? మనమేమన్నా చదువుకోని వాళ్ళమా, తెలివితేటలు లేని వాళ్ళమా? అంత అజ్ఞానంగా ఎలా ఉంటాం? పైగా మేము ప్రతి ఏడాదీ తిరుపతి, షిర్డీ వెళ్లి హుండీలో భారీగా ముడుపులు వేసి వస్తుంటాం కూడా" అన్నాడు.

"ఓహో ఇదా నీ వ్యవహారం?" అని, అతనితో ఇలా అడిగాను.

"నువ్వేం చేస్తుంటావు?"

"మా అన్నయ్యకు వ్యాపారంలో సాయం చేస్తూ ఉంటాను" అన్నాడు.

"ఏం వ్యాపారం మీది?" అడిగాను.

"మాకొక హోటలుంది. అదికాక వైన్ బిజినెస్ లో మా అన్నయ్యకు వాటా ఉంది" అన్నాడు.

"అంటే, బారా?" అడిగాను.

"బార్లో వాటా ఉంది. వెజ్ హోటలు వేరేగా ఉంది" అన్నాడు.

"ఏ హోటలు మీది" అడిగాను.

"ఫలానా హోటల్" అని పేరు చెప్పాడు.

నవ్వొచ్చింది.

"మరి ఇంతకంటే ఇంకేం తప్పులు కావాలి?' అన్నాను.

"అదేంటండి? వ్యాపారం చెయ్యడం తప్పెలా అవుతుంది?' అడిగాడు.

"విను నాయనా. వ్యాపారం చెయ్యడం తప్పుకాదు. సరిగా చెయ్యకపోవడం తప్పు. మీ హోటల్లో అన్నంలో సున్నం నీళ్ళు కలుపుతారా లేదా? కూరల్లో కారం ఎక్కువగా వేస్తారా లేదా?" అడిగాను.

నిశ్శబ్దం.

కాసేపయ్యాక " బిజినెస్ అన్నాక అవన్నీ తప్పవండి. అయినా మీకెలా తెలుసు?" అడిగాడు.

"సింపుల్ అబ్జర్వేషన్ ! అంతే ! నేను మీ హోటల్ మీద నుంచే రోజూ పోతూ ఉంటాను. అక్కడ స్టూడెంట్స్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. అవునా?" అడిగాను.

"అవునండి, మా బిజినెస్ అంతా స్టూడెంట్స్ తోనే" అన్నాడు.

"తెలుసు. మీ హోటల్ ఏరియా అంతా కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి కదూ?" అడిగాను.

"అవునండి. అందుకే ఆ సెంటర్లో మేము హోటల్ పెట్టాము" అన్నాడు.

"మరి అంతమంది స్టూడెంట్స్ వస్తున్నపుడు వాళ్లకు కార్డ్ సిస్టం పెడతారు. కార్డ్ అంటే ఫుల్ మీల్స్ ఉంటుంది. రైస్ కానీ, కూరలు కానీ అన్ లిమిటెడ్ గా వడ్డించాలి. ఈ గుంటూరు వేడికి, ఈ నీళ్ళ కల్తీకీ సూడో ఆకలి పుట్టి అందరూ బాగానే తింటారు. వాళ్ళలా తింటే మీ లాభం గూబల్లోకి వస్తుంది. అందుకని వాళ్ళను ఎక్కువగా తినకుండా చెయ్యాలి. అలా చెయ్యాలంటే అన్నంలో సున్నం నీళ్ళు కలపాలి. కూరల్లో కారం ఎక్కువగా వెయ్యాలి. అప్పుడు తినేవాడు ఎక్కువ తినలేక మంచినీళ్ళు ఎక్కువగా త్రాగి లేచిపోతాడు. అవునా కాదా నిజం చెప్పు?" అడిగాను.

" అంతేననుకోండి. మీరు మరీ అంత డైరెక్ట్ గా అడిగితే ఇంకేం చెప్పగలం?" అన్నాడు అదో రకంగా నవ్వుతూ.

"మరి ఇది తప్పా కాదా?" అడిగాను.

"భలేవారు సార్ ! అన్ని బిజినెస్ లూ ఇలాగే ఉంటాయి. ఇందులో మేము ప్రత్యేకంగా చేస్తున్న తప్పేమీ లేదు" అన్నాడు.

"అన్నీ అలా ఉంటే, ఫలితాలు కూడా అందరికీ అలాగే ఉంటాయి. అందుకే కదా ఇప్పుడు ఏ ఆస్పత్రి చూచినా కళకళలాడుతోంది. ఏ ఇంట్లో చూచినా మనశ్శాంతి ఎవరికీ ఉండటం లేదు. సమస్య లేనివాడు ఎక్కడా లేడు" అన్నాను.

"ఇది తప్పని నేననుకోవడం లేదు" అన్నాడు చివరకు.

"నేను చెబుతున్నది కూడా అదే ! తప్పు చేసేవాడు దానిని తప్పని గ్రహించే స్థితిలోనూ లేడు, ఒప్పుకునే స్థితిలోనూ లేడు. అదే ప్రస్తుత పరిస్థితి. మీరు నలుగురికీ అన్నం పెట్టే వ్యాపారంలో ఉన్నారు. అదెంత మంచి వ్యాపారమో మీకర్ధం కావడం లేదు. అందరికీ ఇలాంటి అవకాశం రాదు. కానీ మీరేం చేస్తున్నారు? నమ్మించి మోసం చేస్తున్నారు. అన్నంలో కారమూ సున్నం నీళ్ళూ కలపడం అంటే, విషం కలిపినట్లే. వాడు నమ్మకంగా మీ హోటలుకి తినడానికి వస్తుంటే మీరు వాడికి విషం కలిపిన అన్నం పెడుతున్నారన్నమాట. ప్రకృతిదృష్టిలో ఇది ఘోరమైన నమ్మక ద్రోహం అవుతుంది. అదలా ఉంచుదాం. వైన్ బిజినెస్ లో మీరు చేస్తున్నదేమిటి? మనుషులకు త్రాగుడు అలవాటు చేస్తున్నారు. ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని మీరనవచ్చు. ప్రజలు త్రాగుతున్నారు గనుక మేం త్రాగిస్తున్నాం అని ప్రభుత్వ పెద్దలంటారు. ఈ రెంటిలో ఏది రైటైనా, అసలా వ్యాపారమే తప్పు. పైగా దానిలో కూడా కల్తీ చెయ్యడం ఎలాగూ ఉంటుంది. లూజ్ బాటిల్లో నీళ్ళు కలపడం మీ బార్లో ఉందా లేదా?" అడిగాను.

"ఇవన్నీ మీకెలా తెలుసు సార్ మీకు అలవాటు లేకపోతే?" ఎదురుదాడి ప్రారంభించాడు మన పతివ్రత గాడు.

"నాకలవాటు లేదని ఎవరన్నారు?" ఎదురు ప్రశ్న వేశాను.

"అదేంటి? మీరు త్రాగుతారా?" అడిగాడు.

"ఏం? ఎందుకు త్రాగకూడదు? మీకు వైన్ షాపు ఉండగా లేనిది, నేను త్రాగితే తప్పేముంది?" అడిగాను.

"అలా కాదు. మీరు నిష్టగా ఉంటారని అనుకున్నాను" అన్నాడు.

"ఓహో. మీరనుకున్నట్లు నేనుండాలా? అయినా, సందుకొక మందుకొట్టు మీరు పెడుతూ ఉంటే మేము నిష్టగా ఎలా ఉండగలం? అయినా నిష్టకూ దీనికీ సంబంధం ఏముంది? ప్రతిరోజూ నాలుగు పెగ్గులు నిష్టగా పుచ్చుకుని ఆ తర్వాత నిష్టగా పూజకు కూచుంటూ ఉంటాను. నిష్టగా త్రాగి జాతకాలు చూస్తాను. నేను అమెరికా వెళ్ళినపుడు కూడా బార్లో తాగి పడిపోతే కార్లో వేసుకుని ఇంటికి మోసుకొచ్చారు నా శిష్యులు. అందుకే మూడోసారి అమెరికా వస్తానంటే "నువ్వు రావద్దు బాబోయ్" అంటున్నారు " అన్నాను.

"మీరు చెప్పేది నిజమేనా?" అడిగాడు అనుమానంగా.

"నువ్వు నీ పాపాన్ని డబ్బుగా మార్చి కొంత వాటాను తిరుపతి, షిర్డీ హుండీలలో వేసినంత నిజం. లేకపోతే మీ బార్లో మందులో నీళ్ళు కలుపుతారని నాకెలా తెలుస్తుంది? నేను అమెరికాలో త్రాగి పడిపోయానో లేదో నీకు నమ్మకం లేకపోతే నా అమెరికా శిష్యుల ఫోన్ నంబర్ ఇస్తా, ఫోన్ చేసి కనుక్కో." అన్నాను.

"ఇంతకుముందు కూడా తెనాలిలో ఒక ప్రముఖ జ్యోతిష్కుడు ఉండేవాడు. ఆయనకూడా మందు పడితే గాని జాతకం చూసేవాడు కాదు. మీరూ అంతేనా?" అన్నాడు.

"నేనంత కాదు. ఆయన నిత్యామృత సేవకుడు. ఆయనతో నాకు పోటీ ఏంటి?" అన్నాను.

"సరే ఇప్పుడు మమ్మల్నేం చెయ్యమంటారు? మా ఇంటిల్లిపాదికీ రోగాలున్నాయి. హాస్పిటల్స్ కు తిరగడం మందులు మింగడమే సరిపోతోంది. మా రెండో అన్నయ్య సంసారం చట్టుబండలై పోయింది. వాడిని ఒదిలేసి మా వదిన పుట్టింటికి వెళ్ళిపోయింది. నాకేమో 38 వచ్చాయి. ఇంకా పెళ్లి కాలేదు. డబ్బుంది కాని సుఖం లేదు. మా ఇంట్లో ఎవరికీ శాంతి లేదు. ఏంటో అర్ధం కావడం లేదు" అన్నాడు.

"నేను చెబుతున్నాగా మీరు చేస్తున్న తప్పులేంటో? ముందవి మానుకోండి. మీ హోటల్లో మంచిగా భోజనం పెట్టడం మొదలు పెట్టండి. సున్నం నీళ్ళు కలపడం కూరల్లో కారం వెయ్యడం మానుకోండి. బారు షాపులో మీ వాటా వెనక్కు తీసుకోండి. ఇంకో వ్యాపారం ఏదైనా చేసుకోండి. అది కూడా శుద్ధంగా చెయ్యండి. అంతేగాని చేసేవన్నీ చేస్తూ -  "మేమేం తప్పులు చెయ్యడం లేదు మాకే ఎందుకిలా జరుగుతోంది?" - అని చెత్తకబుర్లు నా దగ్గర చెప్పకండి. మీలాంటి వాళ్ళ జాతకాలు నేను చూడను. చూసినా రెమెడీలు చెప్పను" అన్నాను.

"అలా అయితే మీరీ లోకంలో ఎవరికీ జాతకం చెప్పలేరు" అన్నాడు తగ్గకుండా.

"అందరికీ జాతకాలు చెప్పాలని నాకేమీ దురద లేదు. అది నా వృత్తీ కాదు. మీలాంటి వారికోసం దొంగ జ్యోతిష్కులు చాలామంది బోర్డులు పెట్టుకుని మరీ రెడీగా కూచుని ఉన్నారు. వారిని కలవండి. మీ పాపంలో వాళ్లకు కూడా వాటా పంచండి" అన్నాను.

ఫోన్ కట్ అయిపోయింది.

కధ కంచికి మనం ఇంటికి.