“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

23, జులై 2018, సోమవారం

నర - హరి

మనుషుల మనస్తత్వాలను గమనిస్తూ ఉంటె నాకు భలే నవ్వొస్తూ ఉంటుంది. అదే సమయంలో విపరీతమైన జాలీ కలుగుతూ ఉంటుంది 'వీళ్ళెప్పటికి ఎదుగుతారా?' అని.

మొన్నొకాయన ఫోన్ చేశాడు.

'ఏమండి? నా పేరు నరహరి. మీరు చెప్పిన దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ఫైల్స్ నేను విన్నాను.' అన్నాడు ఎత్తుకుంటూనే, అదేదో నన్ను ఉద్ధరిస్తున్నట్టు !

అతని గొంతు వింటే, ఏదో వాదన పెట్టుకునేలా అనిపించింది.

'సరే ఏంటో చెప్పండి' అన్నాను.

'విషయం బాగానే ఉందిగాని మీరు చెప్పిన తీరు నాకు నచ్చలేదు.' అన్నాడు.

విషయం నాకర్ధమై పోయింది.

'అంటే, దక్షిణామూర్తి స్తోత్రం అంటే మీకు ఇష్టమే గాని, నేను మీకు నచ్చలేదు అంతేకదా?' అన్నాను.

'అవును' అన్నాడు.

'పోనీలెండి ఇంకో సంబంధం వెతుక్కుంటాను. నన్ను మెచ్చే పిల్ల ఎక్కడో పుట్టే ఉంటుంది' అన్నాను నవ్వుతూ.

నేను జోక్ చేస్తున్నానని అతనికి అర్ధమైంది.

'అదే ! ఈ జోకులే మాకు నచ్చంది.' అన్నాడు.

'దానికి నేనేం చేసేది? అది నా స్వభావం. మీరూ నాకు నచ్చలేదు. కొత్తవాళ్ళతో ఇంత రూడ్ గా మాట్లాడుతున్న మీ పద్ధతి కూడా నాకు నచ్చలేదు. ఏం చేద్దాం?' అన్నాను.

'అంత సీరియస్ సబ్జెక్ట్ ని సరదాగా, జోకులేస్తూ చెబుతున్నారు. పైగా, మీ ఉపన్యాసం వింటున్నవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతున్నారు. అది తప్పు కదా?' అడిగాడు సీరియస్ గా.

'నవ్వడం తప్పా? ఇదేంటి కొత్తగా వింటున్నానే? నవ్వమనీ, మనస్ఫూర్తిగా నవ్వితే ఆరోగ్యానికి మంచిదనీ అందరూ చెబుతున్నారు. మీకేంటి నవ్వు నచ్చడం లేదు. మీకేదైనా సీరియస్ మానసిక రోగం ఉందేమో చెక్ చేయించుకోండి' అన్నాను.

'ఆధ్యాత్మిక విషయాలు చెప్పేటప్పుడు సీరియస్ గా చెప్పాలి. మీరేదో కామెడీగా చెబుతున్నారు.' అన్నాడు మళ్ళీ.

'ఏం కొంపలు మునిగాయని అంత సీరియస్ గా ఉండాలి? ఆధ్యాత్మికమంటే సీరియస్ అని మీకెవరు చెప్పారు?' అడిగాను.

'మాకు తెలుసు. మా గురువుగారు చెప్పారు' అన్నాడు.

'మీ గురువుగారికి నవ్వడం అంటే పడదా?' అడిగాను.

'ఆయన నవ్వగా నేనెప్పుడూ చూడలేదు. మేం నవ్వినా కూడా ఆయన ఒప్పుకోడు.' అన్నాడు.

'ఓహో. ఒక పని చెయ్యండి. మీ గురువూ, మీ బృందమూ అందరూ కలసి ఒక సైకియాట్రిస్ట్ ని కలవండి. ఇదొక మానసిక రోగం. ఇతరులు నవ్వితే భరించలేకపోవడం చాలా పెద్ద రోగం. మీకు తెలీడం లేదు. ముందు మంచి ట్రీట్మెంట్ తీసుకోండి. ఆ తర్వాత నాకు ఫోన్ చేద్దురుగాని' అన్నాను ఫోన్ పెట్టెయ్యబోతూ.

'ఆగండి. ఫోన్ పెట్టకండి. ఇంకా మాట్లాడాలి.' అన్నాడు సీరియస్ గా.

'చెప్పండి' అన్నాను.

'సీరియస్ సబ్జెక్ట్ ని సీరియస్ గా చెప్పకపోతే ఎలా? మీకసలు ఆ సబ్జెక్ట్ ఎంత అర్ధమైంది?' అన్నాడు ఇంకా సీరియస్ గా.

విషయం ముదురుతోందని, ఏదో విధంగా నన్ను ఇన్సల్ట్ చెయ్యడమే ఇతని ఉద్దేశమని నాకర్ధమైంది.

'అంతా విన్నానని మీరే చెప్పారు కదా ! అవన్నీ విన్న తర్వాత కూడా నాకెంత అర్ధమైందో మీకర్ధం కాలేదా?' అడిగాను.

'దీన్నే దురహంకారం అంటారు' అన్నాడు ఎగతాళిగా.

'అవునా? మరి ఫ్రీ గా ఒకరు పెట్టిన ఆడియో ఫైల్స్ అన్నీ చక్కగా విని, అతనికి ఫోన్ చేసి, కనీస కృతజ్ఞతలు చెప్పకుండా, డైరెక్ట్ గా 'మీరు చెప్పినది మాకు నచ్చలేదు' అనేవాళ్ళను ఏమంటారు? అది దురహంకారం కాదా?' అన్నాను.

'నా అభిప్రాయం నేను చెప్పాను ' అన్నాడు దురుసుగా.

'సరే. నా అభిప్రాయం కూడా చెప్పమంటారా మరి?' అన్నాను.

'చెప్పండి' అన్నాడు.

'చింపాంజీలకు దక్షిణామూర్తి స్తోత్రం ఎలా అర్ధమౌతుంది?' అన్నాను.

'అదేంటి?' అన్నాడు అయోమయంగా.

'మీరు చింపాంజీ కదా? మీకు వేదాంతం అర్ధం కాదని అంటున్నాను' అన్నాను.

'ఏంటి మీరు మాట్లాడేది?' అన్నాడు కోపంగా.

'కోపం తెచ్చుకోకండి. మీ పేరు నరహరేగా?' అడిగాను.

'అవును' అన్నాడు.

'మీ పేరు అర్ధమే మీకు తెలీదు. ఇక దక్షిణామూర్తి స్తోత్రం ఎలా అర్ధమౌతుంది మీలాంటి మట్టిబుర్రలకు?' అన్నాను.

'ఏం మాట్లాడుతున్నారు మీరు?' అన్నాడు అరుస్తూ.

'తగ్గండి. చెప్తా వినండి. నరహరి అంటే ఏమిటి?' అన్నాను.

'నరసింహస్వామి' అన్నాడు.

'పోనీ అలా అనుకున్నా కూడా, మీలో మృగం లక్షణాలు కొన్ని ఉన్నాయని అర్ధం. మృగాలకు వేదాంతం ఎలా అర్ధమౌతుంది? ఎంతో రిఫైండ్ మైండ్స్ కి కాని అది అర్ధం కాదు. ఇంకో అర్ధం చెబుతా వినండి. నర అంటే మనిషి. హరి అంటే కోతి అని సంస్కృతంలో అర్ధం. అంటే మనిషికి తక్కువ కోతికి ఎక్కువ అనర్ధం. అంటే చింపాంజీ అనే కదా? ఇక మీకు దక్షిణామూర్తి స్తోత్రం ఎలా అర్ధమౌతుంది? దానిని ఎలా చెప్పాలో ఎలా అర్ధం చేసుకోవాలో ఎలా తెలుస్తుంది?

సీరియస్ సబ్జెక్ట్ ని సరదాగా చెప్పడమే అసలైన టాలెంట్. సామాన్యంగా ఇలాంటి ఉపన్యాసాలు వినేవాళ్ళు నిద్రపోతూ ఉంటారు. కానీ ఇక్కడ, వినేవాళ్ళు నవ్వుతున్నారంటే వాళ్ళు సబ్జెక్ట్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. అంటే, వాళ్లకు బాగా అర్ధమౌతోందన్న మాట. ఇంత సింపుల్ విషయం అర్ధం కాని మీరేమో అదేదో తప్పుగా అనుకుంటూన్నారు. అది చాలక నాకు ఫోన్ చేసి మీ అజ్ఞాన ప్రదర్శన చేస్తున్నారు. పైగా నాది తప్పంటున్నారు. నవ్వడం తప్పంటున్నారు. మీరు అర్జెంటుగా పేరైనా మార్చుకోండి, లేదా మీ అభిప్రాయమైనా మార్చుకోండి. లేదా ఎవడో ఒక పిచ్చి డాక్టరు దగ్గర మంచి ట్రీట్మెంట్ అయినా తీసుకోండి. ఏదో ఒకటి త్వరగా చెయ్యండి. అంతేగాని నాకిలా ఫోన్ చేసి నా టైం వెస్ట్ చెయ్యకండి.' అన్నాను.

'మీరు తెలివైనవారనీ, నా మాటకు ఒప్పుకోరనీ మాకు తెలుసు. ఈ విషయంలో ముఖాముఖీ వాదనకు మీరు సిద్ధమేనా?' అడిగాడు.

'ఇందులో వాదనతో తేలేది ఏముంది?' అడిగాను.

'మీరు చెప్పేది తప్పని రుజువు చేస్తాను. అంతేకాదు. మీ శిష్యులను మీరు తప్పుదారి పట్టిస్తున్నారు. ఇంతకీ మీరు వాదనకు సిద్ధమేనా?' అడిగాడు.

'ముఖాముఖీ వాదనకే కాదు, హాండ్ టు హాండ్ ఫైటింగ్ కైనా నేను సిద్ధమే. డేట్, వెన్యూ మీ ఇష్టం. నిర్ణయించుకుని నాకు చెప్పండి. నా మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ గుర్తున్నాయో మర్చిపోయానో ఒకసారి ప్రాక్టికల్ గా టెస్ట్ చేసుకోవాలని నాకు మహా దురదగా ఉంది. ఎప్పుడు ఫోన్ చేస్తారు మరి?' అడిగాను.

అవతల నుంచి నిశ్శబ్దం.

నవ్వుకుంటూ ఫోన్ కట్ చేశాను.

ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా జెలసీ, ఈగోలే ఎక్కువగా ఉంటాయని, ఓపన్ మైండ్ అనేది ఎక్కడో తప్ప ఉండదనీ, ఇలాంటి మనుషులను చూస్తుంటే అర్ధం కావడం లేదూ?