“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

6, జులై 2018, శుక్రవారం

చెడిపోతున్న వివాహజీవితాలు - జ్యోతిష్య శాస్త్రం

వివాహం అనేది పాతకాలంలో అయినా ఈ రోజుల్లో అయినా ఒకటే. సంసారం అనేది కూడా ఒకటే. అప్పటికీ ఇప్పటికీ సౌకర్యాలు మారి ఉండవచ్చు. జీవన విధానాలు మారి ఉండవచ్చు. కానీ వివాహబంధం అనేది ఒకటే.

పాతకాలంలో అయితే, ఆర్ధిక కారణాల వల్ల కావచ్చు, సమాజం హర్షించదన్న కారణం వల్ల కావచ్చు, భద్రత కోసం కావచ్చు, ఇలా రకరకాల కారణాల వల్ల ఇష్టంలేని పెళ్లి చేసుకున్నా అలాగే కలసి కాపురం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రయారిటీస్ మారిపోయాయి. అందుకే ఇప్పుడు ఎవరికి నచ్చకపోయినా వెంటనే విడిపోతున్నారు.

అదలా ఉంచితే, మోడరన్ లైఫ్ లోని పరిస్థితుల వల్ల, జీవిత భాగస్వామిని ఎంచుకునే ప్రక్రియలోనే లోపాలు తలెత్తుతూ ఉన్నాయి. ఆర్ధికభద్రత ఉంది గనుక, మన జీవితాన్ని మనమెందుకు పాడు చేసుకోవాలి అన్న ఆలోచనతో చాలామంది అమ్మాయిలే నేడు ధైర్యంగా విడిపోతున్నారు.

ఈ పరిణామాలకు తగినట్లే నేడు జాతకాలలో కూడా అలాంటి గ్రహస్థితులు కనిపిస్తున్నాయి. పేదవారి కుటుంబాలలో మాత్రమే ఇలాంటి జాతకాలు ఉంటాయని, ఇలాంటి పరిస్థితులు ఎదురౌతాయని, డబ్బున్నవారి కుటుంబాలలో వివాహజీవితాలు చెడిపోవని అనుకుంటే తప్పే. ధనిక కుటుంబాలలో కూడా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్మకు గొప్పా బీదా తారతమ్యం లేదు. అది ఎవరినైనా ఒకే విధంగా పీడిస్తుంది.

అలాంటి ప్రాక్టికల్ కేసు నొకదాన్ని ఈ పోస్టులో గమనిద్దాం. ఈమె 12-1-1991 న జన్మించింది. ఈమె జాతకాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈమె జ్యేష్టా నక్షత్రంలో జన్మించింది. సామాన్యంగా అయితే, మనలో ఒక నమ్మకం ఉన్నది. జ్యేష్ట, ఆశ్లేష, మూల నక్షత్రాలలో పుట్టిన అమ్మాయిలకు వివాహదోషం ఉంటుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అది పూర్తిగా అబద్దమూ కాదు, పూర్తిగా నిజమూ కాదు. దోషం అంటే అసలు వివాహం కాకపోవడం కాదు. అయ్యాక ఒచ్చే సమస్యలు కూడా వివాహదోషాలు గానే పరిగణింపబడతాయి. ఈ మూడు నక్షత్రాలలో పుట్టిన అమ్మాయిలకు వివాహజీవితాలలో ఒడిదుడుకులు సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి. అయితే, మంచి సంబంధాలు చెడిపోతాయి. మంచివాటిని ఒదులుకుని, ఒకప్పుడు తాము వద్దనుకున్న సంబంధాలనే చేసుకోవలసి వస్తుంది. లేదా చేసుకున్న తర్వాత అనేక సమస్యలతో వివాహ జీవితం గందరగోళం అవుతుంది. దీనికి లక్షా తొంభై కారణాలుంటాయి.

ద్వితీయస్థానం కుటుంబాన్ని సూచిస్తుంది. చతుర్ధస్థానం సుఖస్థానాన్ని సూచిస్తుంది. సప్తమస్థానం వివాహభావాన్ని సూచిస్తుంది. ద్వాదశభావం దాంపత్య సౌఖ్యాన్ని సూచిస్తుంది. వీటిల్లో ఏయే భావం ఎక్కువగా చెడిపోయి ఉంటే, ఆయా భావాలు సూచిస్తున్న విషయాలలో సమస్యలు తప్పకుండా ఉంటాయి. ఇది స్థూల పరిశీలన. సూక్ష్మంగా చూచినపుడు ఇంకా అనేక విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి.

ఈ అమ్మాయి జాతకాన్ని గమనిద్దాం.

రాహువుగానీ కేతువుగానీ లగ్నంలో ఉన్న జాతకాలలో సామాన్యంగా వివాహజీవితం బాగుండదు. కానీ కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రం వీరిద్దరే యోగకారకులౌతూ ఉంటారు. ఆ తేడాలు జాతకపరిశీలనలో అనుభవం మీద అర్ధమౌతాయి. సాధారణంగా అయితే, కేతువు లగ్నంలో ఉన్నప్పుడు జీవితభాగస్వామి నుంచి అణచివేతను, హింసను, ఆ జాతకుడు లేదా జాతకురాలు అనుభవించవలసి వస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి జాతకంలో సరిగ్గా అదే జరిగింది.

ఈ అమ్మాయికి సప్తమభావంలో మూడు గ్రహాలున్నాయి. వీటిలో శని, రాహువులు బాగా దగ్గరగా ఉన్నాయి. ఇది శపితయోగం. కనుక ఈ అమ్మాయి వివాహ జీవితంలో శాపం ఉన్నదని తెలిసిపోతున్నది. కానీ ఈ అమ్మాయి బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టింది. డిల్లీలో చదువుకున్నది. కనుక జ్యోతిష్యాన్ని నమ్మేది కాదు. ఈమె నాన్న డిల్లీలో మంచి వ్యాపారి కావడంతో ఆయన కూడా నమ్మేవాడు కాదు. నమ్మకపోగా జ్యోతిష్యాన్ని గురించి ఎగతాళిగా హేళనగా మాట్లాడుతూ ఉండేవారు. చాలామంది ఇంతే ! అన్నీ బాగా జరుగుతూ ఉన్నప్పుడు అహంకారంతో కన్నూమిన్నూ గానకుండా మాట్లాడుతూ ఉంటారు. కాలం కొద్దిగా ఎదురు తిరిగేసరికి బోర్లా పడిపోయి ఏడుస్తారు.

జీవితం చాలా విచిత్రమైనది. చాలాసార్లు మనం తీసుకునే చిన్నచిన్న నిర్ణయాలు తర్వాత కాలంలో మన జీవితాలలో పెద్దపెద్ద మార్పులకు కారణాలౌతాయి. అయితే, ఆ నిర్ణయాలు తీసుకునే సమయంలో మన తలకాయ పనిచెయ్యదు. భవిష్యత్తు కనిపించదు. అంతా బాగుంటుందిలే అనే అనిపిస్తుంది. కానీ అలా జరగదు. అదే కర్మ రహస్యం !

ఇదిలా ఉండగా ఈ అమ్మాయి ఇండియాలో ఇంజనీరింగ్ పూర్తి చేసి లండన్లో ఎమ్మెస్ చదివింది. ఆ క్రమంలో అక్కడ ఒక బ్రిటిష్ అబ్బాయితో ప్రేమలో పడింది. అతన్నే పెళ్లి చేసుకుంటాననీ లేకుంటే సూయిసైడ్ చేసుకుంటాననీ బెదిరించడంతో తల్లిదండ్రులు ఆ అబ్బాయినిచ్చి 2016 లో పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయికి కొన్ని భయంకరమైన నిజాలు తెలిశాయి. అవేంటంటే, ఆ అబ్బాయి డ్రగ్స్ కు బానిస. ఇంట్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయిని తిట్టి కొట్టి నానా హింసా పెట్టేవాడు. కానీ బయట సొసైటీలో మాత్రం చాలా మంచివాడుగా నటించేవాడు. ఒకవిధమైన సైకో అని చెప్పాలి. ఇవి చాలవన్నట్లు ఇతనికి ఇంకొంతమంది ఇంగ్లీషు అమ్మాయిలతో సంబంధాలున్నాయి. ఈ అమ్మాయి జాతకంలో చంద్రుడినుంచి సప్తమంలో శుక్రరాశిలో ఉన్న కుజుడు దీనినే స్పష్టంగా సూచిస్తున్నాడు.

ఇదిలా ఉండగా, మూడే మూడు నెలలు తిరిగేసరికల్లా ఒక రోజున ఈ అమ్మాయిని బాగా కొట్టి ఇంట్లోనించి బయటకు నెట్టేశాడు. తను బయట ఒక ఫ్రెండ్ ఇంట్లో తలదాచుకుని డైవర్స్ కు అప్లై చేసుకుంది. 2018 లో డైవర్స్ అయిపొయింది. ఇంతా చేస్తే ఇప్పుడామెకు 26 ఏళ్ళు మాత్రమే.

2016 లో పెళ్లి జరిగినప్పుడు ఈ అమ్మాయి జాతకంలో శుక్ర - చంద్ర దశ జరిగింది. శుక్రుడు సప్తమంలో సప్తమాధిపతి అయిన శనితో కలసి ఉంటూ వివాహాన్ని సూచిస్తున్నాడు. శని దారాకారకుడు కూడా అయ్యాడు. చంద్రుడు లగ్నాదిపతిగా పంచమంలో ఉంటూ ప్రేమ వివాహాన్ని సూచిస్తున్నాడు. కనుక వీరిద్దరి దశలలో వివాహం అయింది.

కానీ శుక్రుడు శపితయోగ పరిధిలో ఉన్నాడు. కనుక వివాహం మీద శాపం ఉన్నది. లగ్నాధిపతి చంద్రుడు ప్రేమను సూచించే పంచమస్థానంలో నీచస్థితిలో ఉన్నాడు. కనుక ఈ జాతకురాలు ఒక నీచుడిని ప్రేమిస్తుంది అని తెలుస్తోంది. సరిగ్గా అలాగే జరిగింది కూడా !

తెల్లతోలుతో ఉండి, మూడు రెస్టారెంట్లకు తిప్పి, నాలుగు మాయమాటలు చెప్పేసరికి ఆ అబ్బాయి మంచివాడని జాతకురాలు అనుకుంది. పడిపోయింది. కానీ అతని నిజస్వరూపం ఏమిటో పెళ్లి తర్వాత నెలలోపే ఈ అమ్మాయికి అర్ధమైపోయింది. కానీ అప్పుడు చేసేదేమీ లేదు. చేతులు కాలిపోయాయి.

ఖచ్చితంగా చెప్పాలంటే ఈ అమ్మాయి వివాహం శుక్ర - చంద్ర - శని దశలో జరిగింది. శుక్ర - చంద్ర - బుధ దశలో విడాకులకు అప్లై చెయ్యడం జరిగింది. విదశానాధుడైన బుధుడు శత్రుక్షేత్రంలో కుటుంబస్థానాధిపతి అయిన సూర్యునితో కలసి ఉండటం గమనించాలి. కనుక కుటుంబంలో గొడవలు వచ్చాయి. సూర్యుడు పిత్రుకారకుడు గనుక తండ్రితో కూడా మనస్పర్ధలు వచ్చాయి. "మేము చెబితే వినకుండా తెల్లవాడి ప్రేమలో పడి జీవితం పాడు చేసుకున్నావ్. ఇప్పుడేమైందో చూడు" అని తండ్రి అన్నాడని ఈ అమ్మాయి అలిగి తండ్రితో తల్లితో మాట్లాడటం మానేసింది. ఇటు తల్లిదండ్రులకూ దూరమైంది. అటు భర్తకూ దూరమైంది. స్నేహితురాలి ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటుంది? కనుక లండన్లో ఒక ఇల్లు తీసుకుని ఉద్యోగం చేసుకుంటూ నివసిస్తోంది.

"కారకో భావనాశక:" అనే సూత్రం ప్రకారం దారాకారకుడూ, సప్తమాదిపతీ అయిన శని సప్తమంలోనే ఉండటం వల్ల ఈ అమ్మాయి జాతకంలో వివాహభావం దెబ్బ తిన్నది.

శని - రాహు దశలో ఈ అమ్మాయికి డైవర్స్ గ్రాంట్ అయింది. వీరిద్దరూ శపితయోగంలో వివాహాన్ని సూచించే సప్తమభావంలో ఉండటం గమనిస్తే వారి దశలోనే ఎందుకు డైవర్స్ గ్రాంట్ అయిందో అర్ధమౌతుంది. వీరి దశ 2021 వరకూ ఇంకా మూడేళ్ళున్నది. ప్రస్తుతం ఈ అమ్మాయికి కసి మొదలైంది. అబ్బాయిలమీద ద్వేషం పెంచుకున్నది. కానీ వయసు ప్రభావం వల్ల మళ్ళీ అబ్బాయిల వేటలో పడింది. ఇలాంటి ద్వంద్వమనస్తత్వం కూడా శపితయోగ ప్రభావమే. ఒకవేళ రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ ఈమె వివాహ జీవితం ఏమంత బాగా ఉండదని అదే శనికి అష్టమాధిపత్యం పట్టడం చెబుతున్నది.

ఒకవేళ ఈ అమ్మాయీ, ఈమె తండ్రీ, ఈ పెళ్ళికి ముందే జాతక ప్రకారం దోషపరిహారాలు చేసుకుని ఉంటే ఈమె జాతకం ఇంకో విధంగా ఉండేదా? అనేది ఒకాయన నన్నడిగిన ప్రశ్న.

ఖచ్చితంగా వేరే విధంగా ఉండేది. కానీ ఆ దోషాన్ని నిజంగా తొలగించగలిగే పరిహారాలు చెప్పే మంచి జ్యోతిష్కుడు వాళ్లకు దొరకాలి. సగం అదే జరగదు. ఆ జ్యోతిష్కుడినీ ఆ పరిహారాలనూ వాళ్ళు నమ్మి అవి చెయ్యాలి. ఈ సగం అసలే జరగదు. ఈ రెండూ జరిగినప్పుడుకదా ఆ దోషం పోవడమో లేదో తెలియడం? ఇవన్నీ జరక్కుండా ఎన్నో అడ్డు పడుతూ ఉంటాయి.

మనకు డబ్బుంది, మనకేంటి? అని కొందరు అహంకారంలో ఉంటారు. మనం చదువుకున్నాం, తెలివితేటలున్నాయ్ మనకేంటి? అని ఇంకొందరు అనుకుంటారు. జ్యోతిష్యం ఏంటి?  నాన్సెన్స్ అని ఇద్దరూ అనుకుంటారు. ఎవరు ఏ రకంగా అనుకున్నా, కర్మ అనేది వీటన్నిటినీ అధిగమించి వారికి ఇవ్వాల్సింది ఇస్తూనే ఉంటుంది. అదే సృష్టి రహస్యం అంటే.

జీవితంలో ఎన్ని ఉన్నప్పటికీ, జాతకం ప్రకారం ఉన్న చెడుయోగాలను అనుభవించక తప్పదనడానికి, ధనిక కుటుంబంలో పుట్టి, విదేశాలలో చదువుకుని, ఉద్యోగం చేస్తూ, విలాసాలలో బ్రతుకుతూ, 24 ఏళ్ళకే భర్తతో విడిపోయి, 26 ఏళ్ళకే డైవోర్స్ తీసుకున్న ఈ అమ్మాయి జాతకమే ఒక ఉదాహరణ.

కాదంటారా?