“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

11, ఆగస్టు 2018, శనివారం

'మా అబ్బాయి ఎక్కడున్నాడు?' - ప్రశ్నశాస్త్రం

పెరిచెర్లలో ఒక కాలేజీలో జరుగుతున్న స్టాఫ్ సెలక్షన్ ఎగ్జాంకు అబ్జర్వర్ గా మొన్న తొమ్మిదో తేదీన వెళ్ళవలసి వచ్చింది. ఆ సందర్భంగా జరిగిన సంఘటన ఇది.

టైము సాయంత్రం 4.00 అయ్యింది. పరీక్ష మూడో షిఫ్ట్ మొదలైంది. కాండిడేట్స్ అందరూ ఆన్లైన్ పరీక్ష రాస్తున్నారు. మాల్ ప్రాక్టీస్ ఏదీ జరక్కుండా మేము గమనిస్తున్నాము. టీ టైం కదా? ఇంతలో ఆ కాలేజీలో ఉండే సపోర్ట్ స్టాఫ్ అనుకుంటాను ఒకామె నాకు టీ తెచ్చి ఇచ్చింది. పల్లెటూరి మనిషిలాగా ఉంది.

టీ కప్పు నా టేబిల్ మీద పెడుతూ - 'సార్ మీరు రైల్వేనా?' అడిగింది.

'అవును' అన్నాను.

'మీరు పోలీసు అధికారా?' అడిగింది.

'కాదు' అన్నాను.

'మరి మీతో పోలీసులు వచ్చారు ఎందుకు?' అడిగింది.

'ఎగ్జాంకు సెక్యూరిటీగా మాతో వచ్చారు. ఏం కావాలి మీకు?' అన్నాను.

'మా అబ్బాయి ఇంట్లోనుంచి వెళ్ళిపోయాడు. రెండేళ్ళు అయింది. మీ రైల్వే పోలీసులకు ఏమైనా తెలుస్తుందా వాడెటు పోయాడో?' అడిగింది.

'వాళ్ళకెలా తెలుస్తుంది? సివిల్ పోలీసులకు కంప్లెయింట్ చెయ్యండి' అన్నాను.

'ఎక్కడికైనా పారిపోవాలంటే రైలెక్కుతాడు కదా? అప్పుడు చూసి ఉంటారేమో?' అడిగింది.

ఆమెది అమాయకత్వమో లేక అతితెలివో అర్ధం కాలేదు. కొంతమంది ఇలా అమాయకత్వం నటించి మనల్ని ఆడుకునేవాళ్ళను ఇంతకుముందు చూశాను. ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలని అనుకుంటూ - 'ఎంత వయసులో ఇంట్లోంచి పారిపోయాడు?' అడిగాను.

'పందొమ్మిది ఉంటాయి' చెప్పింది.

ఎగ్జాం అయిపోవడానికి ఇంకా గంట టైముంది. ఈమెను చూస్తే దిగాలుగా ఉంది. పేదరాలులాగా కనిపించింది. ప్రశ్నచార్ట్ చూచి ఈమెకు జవాబు చెబుదాం అని నాకే ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజు గ్రహస్థితి మనకు తెలుసు గనుక, లగ్నాన్ని గమనించాను. ధనుర్లగ్నం అయింది.

పంచమాధిపతి కుజుడు లగ్నంలోకి వచ్చి ఉన్నాడు. అతనే ద్వాదశాధిపతి కూడా అయ్యాడు. దూరప్రాంతాన్ని సూచిస్తూ సప్తమంలో ఉన్న చంద్రుని దృష్టి లగ్నంమీద ఉంది. కనుక కొడుకు తప్పిపోయాడని అడుగుతోంది. లగ్నంలో శనిదృష్టి చంద్రుడి మీద ఉంది, కనుక ఈమె అబద్దం చెప్పడం లేదు. నిజంగానే బాధపడుతోంది.

ఆమె ముఖంలోకి చూచాను. దిగాలుగా కళ్ళక్రింద వలయాలతో ఉంది. మనిషి నల్లగా ఉండి శనిని సూచిస్తోంది.

కుటుంబ స్థానాధిపతి శని ద్వాదశంలోకి పోతున్నాడు. బుధుడు చంద్రునితో కలిసి సప్తమంలో ఉంటూ లగ్నాన్ని చూస్తున్నాడు. ఆ సప్తమం సహజ తృతీయం అవుతూ మాటామాటా పెరగడాన్నీ, గొడవలనూ సూచిస్తోంది. కనుక వీళ్ళ కుటుంబంలో గొడవలు తారాస్థాయిలో జరిగి ఉండాలి.

నా ఆలోచనకు నాకే నవ్వొచ్చింది. గొడవలు జరగకపోతే ఇంట్లోనుంచి ఎవరైనా ఎందుకు పారిపోతారు?

'అదలా ఉంచుదాం. వీళ్ళ కుటుంబంలో ఏం గొడవలు జరిగి ఉంటాయి?' అని ఆలోచిస్తూ దశమం వైపు దృష్టి సారించాను. ఏ జాతకంలోనైనా దశమం బలమైన స్థానం. అక్కడ నీచ శుక్రుడున్నాడు. పైగా హోరాధిపతి కూడా శుక్రుడే అయ్యాడు. కనుక ఆయన హోరలో మనకు ఇలాంటి సంఘటనలే ఎదురవ్వాలి. ద్వితీయంలో బలంగా ఉన్న కుజునితో కోణదృష్టిలో శుక్రుడున్నాడు. పంచమాధిపతిగా కుజుడు ఈమె కొడుకును సూచిస్తున్నాడు. అంటే అమ్మాయిల వ్యవహారాలన్న మాట ! లేబర్ కుటుంబాలలో ఇలాంటివి మామూలుగా జరుగుతాయి. పైగా అబ్బాయికి 19 అంటోంది. వాడి వయసు కూడా సరిపోయింది. లవ్వు ముదిరి చంపుకునే వరకూ వచ్చి ఉంటుంది. అందుకని వీడు ఇంట్లోంచి జంప్ అయి ఉంటాడు.

'మీ వాడికి ఆ వయసులోనే అమ్మాయిల వ్యవహారాలెందుకమ్మా?' అడిగాను టీ సిప్ చేస్తూ.

ఆమె ఏడ్చినంత పని చేసింది.

'మా ఖర్మ సార్ ! ఏం చెప్పమంటారు?' అంది ఎవరైనా వింటున్నారేమో అని చుట్టూ చూస్తూ.

'మీకు తెలిసిన అమ్మాయే కదా? ఆ అమ్మాయి ప్రస్తుతం బాగానే ఉంది. మీవాడు మాత్రం ఇంట్లోనుంచి వెళ్ళిపోయాడు' అన్నాను టీని ఇంకో గుక్క త్రాగి, చతుర్ధం మీద ఉన్న శుక్రుని దృష్టిని, నవాంశలో అతని ఉచ్చస్థితిని గమనిస్తూ.

'అవును సార్ ! మాకు తెలిసిన వాళ్ళే! ఆ అమ్మాయి అంత మంచిది కాదు. ఇప్పుడు ఇంకోడితో హాయిగా ఉంది. ఈ గొడవ జరిగాక మావాడు మాత్రం ఎటో వెళ్ళిపోయాడు.' అంది.

'అలాగా!' అన్నాను నీచలో ఉన్న శుక్రుడిని, ఉచ్చలో ఉన్న కుజుడిని వాళ్ళమధ్యన కోణదృష్టినీ మనోనేత్రంతో గమనిస్తూ.

ఇన్ని గొడవలు జరుగుతుంటే వీళ్ళాయన అనబడే శాల్తీ ఏమయ్యాడా అని అనుమానం వచ్చింది. అటువైపు దృష్టి సారించాను.

సప్తమాధిపతి బుధుడు అష్టమంలో సూర్యునికి చాలా దగ్గరగా ఉండి పూర్తిగా అస్తంగతుడయ్యాడు. అంటే వీళ్ళాయన చనిపోయి ఉండాలి. లేదా అతని వల్ల వీళ్ళకు ఏమీ ఉపయోగం లేదని అర్ధం. అష్టమాధిపతి చంద్రుడు సప్తమంలో ఉన్నాడు. అమావాస్యకు చాలా దగ్గరలో ఉన్నాం. చంద్రుడు జలగ్రహం. అంటే వీళ్ళాయన ఏదో జలప్రమాదంలో చనిపోయి ఉండాలి.

ఆమె ముఖంలోకి మళ్ళీ ఒకసారి చూచాను. బొట్టు లేదు. కానీ, క్రిష్టియన్స్ కూడా బొట్టు పెట్టుకోరు. ఈమెను చూస్తే క్రిస్టియన్ లాగే కనిపిస్తోంది. పైగా ఈ కాలేజీ కూడా కేథలిక్ మిషన్ వాళ్ళదే. ఈ సెన్సిటివ్ విషయాన్ని ఎలా అడగాలా అని కొంచం సంశయించి - 'మీ ఆయన?' అని అర్ధోక్తిలో ఆపేశాను.

'ఈ గొడవ జరగక ముందు ఇక్కడ దగ్గరలోనే క్వారీలో పడి చనిపోయాడు సార్ ! వానలు పడి బాగా నీళ్ళు నిండి ఉన్నాయి వాటిల్లో. అందులో దూకి చనిపోయాడు.' అంది.

నాకనుమానం వచ్చింది.

లగ్నాధిపతి గురువు లాభస్థానంలో ఉన్నాడు. అంటే ఈమె ఫ్రెండ్స్ ని సూచిస్తున్నాడు. అతని దృష్టి సప్తమంలో ఉన్న చంద్రునిపైన ఉన్నది. కుటుంబస్థానాధిపతి అయిన శని దృష్టి కూడా సప్తమంలో ఉన్న చంద్రుని పైన ఉన్నది. చంద్రుడు అమావాస్యకు దగ్గరలో ఉన్నాడు. చంద్రస్థానంలో రాహువున్నాడు. అంటే, ఏవో కుటుంబ గొడవలలో ఈమె భర్త చంపబడి ఉండాలి. చంపినవాళ్లు ఎవరో ఈమెకు బాగా తెలిసే ఉండాలి.

'తనే దూకి చనిపోయాడా? లేక ఏవైనా గొడవలు జరిగాయా?' అడిగాను.

ఆమె కొంచం తటపటాయించింది.

'ఏదో అంటారు సార్ ! నాకూ ఎక్కువగా తెలీదు. సావాసగాళ్ళతో తాగిన గొడవల్లో వాళ్ళే ఏదో చేశారని అంటారు. ఏం జరిగిందో మాకూ తెలీదు' అంది నేలచూపులు చూస్తూ చిన్న గొంతుతో.

ఆమె బాడీ లాంగ్వేజి చూశాక నా అనుమానం బలపడింది.

'తెలిసినా నువ్వెందుకు చెబుతావులే?' అనుకున్నా లోలోపల. మామూలుగా లేబర్ కుటుంబాలలో ఇలాంటి కధలు జరుగుతూనే ఉంటాయి.

'సర్లే అదంతా మనకెందుకులే' అనుకుని - 'మీవాడు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడు. బాధపడకు. ఎంతో దూరం పోలేదు. దక్షిణాన ఇక్కడికి దగ్గర ఊర్లోనే ఉన్నాడు. త్వరలోనే ఇంటికి తిరిగి వస్తాడు.' అని ఆమెతో చెప్పాను లగ్నంలోకి వస్తున్న కుజుని వక్రత్వాన్ని గమనిస్తూ.

'మీరు చల్లగా ఉండాలి సార్ ! మీ మాటే నిజమైతే మీ కాళ్ళకి మొక్కుతాను' అందామె పల్లెటూరి సహజమైన యాసతో.

'అంతపని చెయ్యకు తల్లీ ! సాటి మనిషిగా ఏదో నాకు తోచినమాట చెప్పాను. అంతే !' అన్నాను.

టీకప్పు తీసుకుని ఆమె వెళ్ళిపోయింది.

సాయంత్రానికి పరీక్ష ముగించుకుని అక్కడనుంచి వచ్చేశాము. ఆ విధంగా ప్రశ్నశాస్త్రం ఉపయోగించి, మనకు ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తి కుటుంబం గురించి వివరాలను తెలుసుకొని, ఆమెకు కొంత ఓదార్పును ఇవ్వడం జరిగింది.