“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

2, ఆగస్టు 2018, గురువారం

Rajiv Dixit Birth Chart Analysis

నెట్ ప్రపంచంలో గాని, నార్త్ ఇండియాలో గాని, రాజీవ్ దీక్షిత్ పేరు తెలియని వారు చాలా అరుదు. ఇతను ప్రసిద్ధ సోషల్ యాక్టివిస్ట్. "ఆజాదీ బచావో ఆందోలన్" అనే మూమెంట్ ను ఇతను చాలా గట్టిగా నడిపాడు. ఆ క్రమంలో చాలా మంచి పేరు సంపాదించాడు. కానీ హటాత్తుగా 2010 లో తన 43 వ ఏట చనిపోయాడు. ఇది హత్య అని ఈనాటికీ పుకార్లున్నాయి. బడా వ్యాపార వేత్తలంతా కలసి ఇతన్ని చంపించారని అంటారు. దీనికి కారణం - MNC ల మీదా, కాస్మెటిక్ ఇండస్ట్రీ మీదా, విదేశీ వ్యాపారవేత్తల చేతుల్లో నడుస్తున్న భారతీయ ఆర్ధికవ్యవస్థ మీదా, మీడియా మీదా అతను చేసిన ఒంటరి పోరాటమే.

పెళ్లి చేసుకుంటే, తను చెయ్యాలనుకున్న ఉద్యమానికి పూర్తి న్యాయం చెయ్యలేనేమోనని భావించి ఇతను బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. అలాగే చనిపోయాడు.

ఇతని ప్రసంగాలు చాలా లాజికల్ గా ఉంటాయి. వినేవారిని వెంటనే హత్తుకుంటాయి. ఇతను కాన్పూర్ IIT లో పీజీ చేసి కొన్నాళ్ళు సైంటిస్ట్ గా పనిచేశాడని అంటారు. బాబా రాందేవ్, ఇతనూ మంచి స్నేహితులు. అయితే, ఇతను చాలా మంచి స్పీకర్. రాందేవ్ మాత్రం దీక్షిత్ అంత మంచి వక్త కాడు. కనుక, ఇతని పాపులారిటీని సహించలేని బాబా రాందేవ్ ఇతన్ని చంపడానికి ప్లాన్ చేశాడని కూడా పుకార్లున్నాయి. ఇతని ప్రచారం వల్ల కోట్లాది డాలర్ల తమ వ్యాపారాన్ని కోల్పోతున్న MNC లు ఇతన్ని చంపించి ఆ నేరాన్ని బాబా రాందేవ్ మీద తొయ్యాలని ప్రయత్నించాయనీ కొందరంటారు. వీటిల్లో నిజమెంతో ఎవ్వరికీ తెలీకపోయినా ఇతను మాత్రం, ఒక తోకచుక్కలా, తన 43 ఏట, 30-11-2010 న భిలాయ్ లో హటాత్తుగా రాలిపోయాడు.

చనిపోయిన ఇతని శరీరం నీలం రంగులోకి మారడాన్ని బట్టి, ఇతని మీద విషప్రయోగం జరిగిందని చాలామంది నమ్ముతున్నారు. కానీ అందరికీ ఉండే మామూలు కారణాలైన షుగర్, హై బీపీ, హార్ట్ ప్రాబ్లం వంటి వాటివల్ల ఇతను చనిపోయాడని రిపోర్ట్స్ అంటున్నాయి. లక్షలాది మంది ఇతని అభిమానులు మాత్రం దీనిని నమ్మడం లేదు.

ఇతని జాతకాన్ని గమనిద్దాం. నెట్లో ఇతని జననతేదీగా 30-11-1967 అలీఘర్ అంటూ కనిపిస్తోంది. ఇది నిజమో కాదో తెలియదు. కానీ ప్రస్తుతం మనకు దొరుకుతున్నది ఇదే గనుక దీనితోనే జాతకాన్ని చూద్దాం.

ఇతను విశాఖ నక్షత్రంలో జన్మించాడు. ఇది గురువుగారి నక్షత్రం గనుక, అందులోనూ శుక్ర రాశిలో ఉన్నది గనుక, సామాన్యంగా ఇందులో పుట్టినవాళ్ళు ఆచారాలకు, దేశభక్తి వంటి భావాలకు, పాతకాలపు తరానికి, ఆధ్యాత్మికతకు ప్రాతినిధ్యం వహిస్తారు.

మధ్యాన్నం వరకూ అయితే శుక్రుడు ఆత్మకారకుడౌతున్నాడు. కానీ ఆ తర్వాత బుధుడు ఆత్మకారకుడౌతాడు. ఇతన్ని చూస్తే, బుధుడు, గురువుల పోలికలు కనిపిస్తాయి గనుక ఇతను మధ్యాన్నం తర్వాత పుట్టాడని అనుకోవాలి. అలా అయితే, ఇతనిది మీనలగ్నం కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే, ఇతనొక పవర్ ఫుల్ స్పీకర్. మీనలగ్నం నుంచి ఇతనికి వాక్ స్థానంలో ఉన్న రాహువు కుజుడిని సూచిస్తూ బలంగా ఉన్నాడు గనుక. ఇదే నిజమైతే ఇతను మధ్యాన్నం 1-24 నుంచి 2-49 లోపు పుట్టి ఉండాలి. ప్రస్తుతానికి ఆ సంగతి అలా ఉంచుదాం.

సప్తమంనుంచి లగ్నాన్నీ, కారకాంశ నుంచి చతుర్దంలో ఉంటూ దశమాన్నీ చూస్తున్న నీచశుక్రుడు, ఇతనికి తన జన్మభూమిలోనే గ్లామర్ (కాస్మెటిక్) వరల్డ్ నుంచి ప్రమాదం పొంచి ఉన్నదని స్పష్టంగా సూచిస్తున్నాడు. నవమాధిపతిగా లాభస్థానంలో ఉచ్ఛస్థితిలో ఉన్న కుజుడు, బలమైన మతగురువును (బాబా రాందేవ్) ఇతని ఫ్రెండ్ గా సూచిస్తున్నాడు.

రాశిచక్రంలో సింహరాశిలో (రాజకీయనాయకులు, అధికారులను సూచిస్తూ) శత్రుస్థానంలో ఉన్న లగ్నాధిపతి గురువు, తన చర్యలతో ఇలాంటి వారితో వచ్చే శత్రుత్వాన్ని సూచిస్తున్నాడు.

నవాంశలో ఉచ్చస్థితిలో ఉన్న గురువు మంచి మనస్తత్వాన్నీ, జీవితంలో సక్సెస్ నూ సూచిస్తున్నాడు. శత్రుస్థానాధిపతిగా నవమంలో ఉన్న సూర్యుడు మతపరంగా బలమైన పొజిషన్ లో ఉన్న వారితో శత్రుత్వాన్ని సూచిస్తున్నాడు.

ఇవన్నీ ఇతని జీవితంలో జరిగాయి. 

ఇతను చనిపోయిన తేది 30-11-2010 న గ్రహస్థితి ఇలా ఉన్నది. నీచస్థితిలో ఉన్న రాహుకేతువులు ఇతని కారకాంశ లగ్నం అయిన మిధునాన్ని చూస్తూ, అసహజ మరణాన్ని సూచిస్తున్నారు. ఆత్మకారకుడైన బుధుడు కారకాంశ రాశికి సప్తమంలో బాధక మారకస్తానంలో రాహువుకు చాలా దగ్గరగా ఉన్నాడు. ఈ రాహువు, గురువును సూచిస్తూ నీచస్థితిలో ఉండటం చూస్తే, బడా వ్యాపారస్తులు (బుధుడు), మత గురువుల (రాహు+గురువు) కుట్రకు ఇతను బలై పోయాడని స్పష్టంగా తెలుస్తున్నది. ఈ విధంగా ఆ రోజు ఉన్న గ్రహస్థితి, ఇతని మరణం వెనుక ఉన్న రహస్య కారణాలను స్పష్టంగా చూపిస్తున్నది.

పైగా ఇతను, బుధదశలో గురు అంతర్దశలో చనిపోయాడు. బుధుడు ఈ లగ్నానికి బాధకుడు. లగ్నం నుంచి అష్టమంలో కేతువుతో కలసి ఉంటూ రహస్య మరణాన్ని సూచిస్తున్నాడు. కేతువు శుక్రునికి సూచకుడు. బుధ శుక్రులిద్దరూ మీనలగ్నానికి చాలా చెడు చేస్తారు. బుధుడు వ్యాపారస్తులకు సూచకుడు కూడా. గురువు లగ్నాధిపతిగా, శత్రుస్థానంలో ఉన్నాడు. దీని ఫలితం పైన వ్రాశాను. ఇవన్నీ కలుపుకుని చూడండి, ఇతను ఎలా చంపబడ్డాడో క్లియర్ గా అర్ధమౌతుంది.

మన దేశం ఒక కుళ్ళుగుంట. ఇక్కడ అందరూ నీతులు చెబుతారు గాని ఎవరూ వాటిని పాటించరు. ఈ దేశంలో అవినీతీ, రాజకీయమూ, అధికారమూ, సామాజిక జీవనమూ, వ్యాపారమూ, మతమూ పడుగుపేకలలాగా కలసి పోయాయి. వీటిని విడదియ్యడం దేవుడితరం కూడా కాదు. ఈ దేశాన్ని బాగుచెయ్యడం కూడా ఎవరి తరమూ కాదు. అలా బాగుచెయ్యగలమని ఎవరైనా అనుకుంటే అది పిచ్చి భ్రమ మాత్రమే. ఈ దేశాన్ని దోచుకోవడం మాత్రం ఎవరైనా ఈజీగా చెయ్యగలరు. కానీ బాగుచెయ్యడం ఎవరివల్లా కానంతగా ఈ దేశం పాడైపోయిందనేది పచ్చి వాస్తవం.

మన దేశం ఒక మేడిపండు కూడా. ఇక్కడ బయటకు అంతా బాగానే కనిపిస్తుంది కానీ లోలోపల త్రవ్వి చూస్తే అన్నీ పురుగులే ఉంటాయి. ఇక్కడ, దేవుడు కూడా వ్యాపార వస్తువే. మతం ఒక పెట్టుబడి లేని వ్యాపారం. మన దేశంలో డబ్బొక్కటే మాట్లాడుతుంది. ఇంక దేనికీ ఇక్కడ వాయిస్ లేదు.

స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినా ఇంకా మన దేశం విదేశాల చేతుల్లో తొత్తుగానే బ్రతుకుతోంది. దాదాపు మనలాంటిదే అయిన చైనా ఈనాడు ప్రపంచ వ్యాపారాన్ని శాసిస్తోంది. కానీ మనం ఇంకా విదేశీ తొత్తులుగానే బ్రతుకుతున్నాం. దానికి ఎన్నో కారణాలు. పనికిరాని ప్రజాస్వామ్య వ్యవస్థ మొదటి కారణం, లా అనేదాన్ని అందరూ ఇష్టానుసారం బ్రేక్ చెయ్యడం, అందులో రాజకీయ జోక్యం మరో కారణం, పాలకులూ ప్రజలూ ఇద్దరూ అవినీతితో కుళ్ళిపోవడం ఇంకో కారణం. కులాల పరంగా, మతాల పరంగా మనల్ని చీల్చి, నిర్వీర్యం చెయ్యాలని ప్రయత్నిస్తున్న విదేశీ మతాలకు, వాళ్ళ విషపూరిత ప్రాడక్ట్స్ ను మన మీద రుద్దుతున్న విదేశీ వ్యాపార సంస్థలకు మనం నిస్సిగ్గుగా దాసోహం అనడం మరో కారణం. మనదేశ పౌరుల్లో ప్రతివాడికీ స్వార్ధం తప్ప, నిజంగా మన దేశం మీద ప్రేమ లేకపోవడం ఇంకో కారణం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో కారణాలున్నాయి.

ఈ దేశాన్ని నిజంగా సంస్కరించాలని ఎవరైనా భావిస్తే, వ్యతిరేక శక్తుల చేతిలో అలాంటివారు బలైపోతారు గాని, ఈ దేశంలో ఎలాంటి మంచి మార్పూ రాదనీ, మన సమాజం రోజురోజుకూ విలువల పరంగా పతనావస్థలోకి పోవడం తప్ప ఉన్నతంగా ఎదగడం జరగదనడానికి రాజీవ్ దీక్షిత్ వంటి నిస్వార్ధ సంఘసంస్కర్తల విషాద జీవితమూ, ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయిన ఇతని అకస్మాత్ మరణమే ఒక ఉదాహరణ.

ఇతని ప్రసంగాలను వినాలంటే www.rajivdixitji.com అనేచోట వినవచ్చు.