“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

6, సెప్టెంబర్ 2018, గురువారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 20 (అమ్మ నన్ను మందలించింది)

గుంటూరులో సాధనా సమ్మేళనం రెండవ రోజున అందరం కలసి బస్సు ఒకటి మాట్లాడుకుని జిల్లెళ్ళమూడికి వెళ్లామని ఇంతకుముందే వ్రాశాను. అప్పుడు జరిగిన మూడు ముఖ్యమైన సంగతులు ఈ పోస్టులో వ్రాస్తాను.

ఆశ్రమం ఆఫీసులో ఒకన్నయ్య మమ్మల్ని  ఇలా అడిగారు.

'మీ ప్రోగ్రాం ఏమిటి? ఇక్కడనుంచి ఇంకా ఏయే చోట్లకు మీరు వెళ్ళాలి?'

సామాన్యంగా ఇలా బస్సులు వేసుకుని వచ్చేవారు, నాలుగైదు పుణ్యక్షేతాలు తిరుగుతూ,  ఆ  క్రమంలో భాగంగా జిల్లెళ్ళమూడి కూడా వస్తూ ఉంటారు. అందుకని ఆయనలా అడిగారు.

నేనిలా చెప్పాను.

'మేము ఇంకెక్కడికీ వెళ్ళము. ఇక్కడనుంచి సరాసరి గుంటూరు వెళతాము.  దీనిని మించిన పుణ్యక్షేత్రం  మా దృష్టిలో ఇంకేదీ లేదు.'

ఆయన తృప్తిగా తల పంకించారు.

ఆలయంలో అమ్మ దర్శనం చేసుకుని అందరం వసుంధరక్కయ్య దగ్గరకు చేరుకున్నాం. గదిలో అందరం పట్టకపోతే,   చాలామందిమి  బయట అరుగు మీదా, చెట్టు కిందా కూచున్నాం. ఆడవాళ్ళు కొందరు మాత్రం అక్కయ్య దగ్గరగా కూచుని అమ్మ గురించి ఆమె చెప్పిన మాటలు విన్నారు.

అక్కడనుంచి బయల్దేరి వచ్చేటప్పుడు చరణ్ ఇలా అడిగాడు.

'అక్కయ్యా ! నాలుగైదు వందల సంవత్సరాల క్రితం, ఇదే ప్రాంతంలో ఎవరో ఒక నగ్నయోగిని జుట్టు విరబోసుకుని తిరుగుతూ ఉండేదని, ఆమెను కాపలాగా ఎప్పుడూ ఒక మహాసర్పం ఆమెతోబాటే తిరుగుతూ  ఉండేదని విన్నాను. ఆమే తర్వాత జన్మలో అమ్మగా పుట్టిందని కొందరు అంటుంటే విన్నాను. ఇది నిజమేనా?'

అక్కయ్య ఇలా చెప్పింది.

'ఈ కధను నేను వినలేదు. అమ్మకూడా ఎప్పుడూ చెప్పలేదు. బహుశా ఇది వారివారి ఊహ అయి ఉండవచ్చు. లేదా వారికి అలా దర్శనం కలిగి ఉండవచ్చు. అంతేగాని ఇందులో నిజం లేదు. కానీ ఒక విషయం నాకు గుర్తుకు  వస్తున్నది. ఒకసారి అమ్మను ఎవరో ఇలా అడిగారు. అప్పుడు నేను పక్కనే ఉన్నాను. "అమ్మా ! చాలా ఏళ్ళ క్రితం మంగళగిరి అన్నసత్రంలో నువ్వు వడ్డిస్తూ ఉండగా మేము చూచాము. నువ్వు అక్కడకు వచ్చావా? అని". అది అమ్మ పుట్టకముందో లేదా అమ్మ చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడో జరిగిన విషయం. కానీ అమ్మ మంగళగిరి వెళ్లి అక్కడ అన్నదాన సత్రంలో వడ్డించిన దాఖలాలు  లేవు. తను పుట్టకముందే తనెలా అక్కడ కనిపిస్తుంది? అది వారివారి ఊహో లేదా దర్శనమో అయి ఉండవచ్చు. అంతే !'

ఇప్పుడు కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. అమ్మ కనిపించింది. హైమ కనిపించింది అని.  తెల్లచీర కట్టుకుని జుట్టు  విరబోసుకుని  రాత్రిళ్ళు  అమ్మ ఇక్కడ పొలాలలో తిరుగుతూ ఉంటుందని. నిజానిజాలు నాకూ తెలీదు. అమ్మ శరీరంతో ఉన్న రోజులలో కూడా ఇలాగే జరిగేది. అమ్మ నడుస్తుంటే అస్సలు శబ్దం అయ్యేది కాదు.  అంత సుతారంగా నడిచేది అమ్మ. నేను వంటగదిలో కాఫీకాస్తూ ఉంటే, ఎప్పుడొచ్చేదో వచ్చి నా వెనుక నిలబడి నేను కాఫీ ఎలా కాస్తున్నానో చూస్తో ఉండేది అమ్మ. చప్పుడు  చేసేది కాదు. నేను ఎందుకో వెనక్కు తిరిగితే అమ్మ నిలబడి చూస్తూ ఉండేది.

ఈ విధంగా ఇప్పుడు  కూడా ఇక్కడ ఉన్న విద్యార్ధులకు కొందరికి అమ్మ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళను నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటుందని అంటారు. అమ్మ అడుగుల చప్పుడు వినపడదు. కానీ హైమ అలా కాదు. గజ్జెలు కట్టుకుని చిన్నపిల్లలా గెంతుతూ తను నడుస్తుంది. ఇప్పుడు కూడా ఇక్కడ కొంతమందికి రాత్రిపూట గజ్జెల చప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అది హైమ అడుగుల చప్పుడు. హైమ మన దగ్గరగా నడుస్తుంటే గజ్జెల చప్పుడు వినిపిస్తుంది. తను కనిపించదు. కానీ ఈ ధ్వని మాత్రం వినిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఈ ప్రదేశాన్ని రక్షిస్తూ ఇక్కడే   ఉన్నారు. లేకపోతే ఇక్కడ మాకేముంది రక్షణ?' అంటూ అక్కయ్య చెప్పింది.

మాకేదో బట్టలు పెడదామని అక్కయ్య గూట్లో వెదుకుతుంటే నేనిలా చెప్పాను.

'బట్టలు వద్దక్కయ్యా ! నేనీ పంచెలూ అవీ కట్టుకోను.  నాలుగు జతలు బట్టలుంటే నాకు చాలు. నా జీవితమంతా అలాగే బ్రతికాను. మినిమంలో బ్రతకడమే నాకిష్టం. అందుకని నాకవి వద్దు. అమ్మ కాళ్ళదగ్గరున్న పువ్వును ఇవ్వు చాలు.'

అక్కయ్య నవ్వేసి, ఆ  పువ్వుతో బాటు కొన్ని పండ్లను నా చేతిలో పెట్టి ఆశీర్వచనం చేసింది.

అక్కడ నుంచి అందరం బయల్దేరి అప్పారావన్నయ్య దగ్గరకు వచ్చిన సంగతీ అక్కడ జరిగిన సంగతులూ కూడా ఇంతకు ముందే వ్రాశాను.

ఆయనతో మాట్లాడుతూ ఉండగా మాటల మధ్యలో ఆయనిలా అన్నారు.

'పోయినసారి మీరు వచ్చి వెళ్ళాక -- "వాడు యాక్సిడెంట్ అయి క్రిందపడి లేచి ఇక్కడకు వచ్చాడు. వాడికేమీ ఇవ్వకుండా పంపించావు నువ్వు?" అంటూ అమ్మ నన్ను మందలించింది. అప్పటినుంచీ, ఇవి మీకోసం తీసి ఉంచి, మీరెప్పుడొస్తారా అని ఎదురుచూస్తున్నాను. కాబట్టి ఇప్పుడీ బట్టలు మీరు తీసుకోవాలి.' అంటూ పంచెల చాపు నా చేతిలో పెట్టారాయన.

నాకొద్దని సుతారంగా  చెప్పబోయినా ఆయన వినిపించుకోలేదు.

"అమ్మ స్వయానా అలా  చెప్పాకకూడా నేను చెయ్యకపోతే ఎలా? అమ్మకు నేను జవాబు చెప్పవలసి వస్తుంది' అంటూ  నా నోరు నొక్కేశారాయన. 

అమ్మను స్మరిస్తూ నీళ్ళు నిండిన కళ్ళతో ఆ బట్టలు స్వీకరించాను.

అమ్మ ప్రస్తుతం ఏ రూపంలో ఉన్నదో ఆమెను చూచే శక్తి మనబోటి సామాన్యులకు లేకపోవచ్చు. కానీ మనలాంటి అల్పులను కూడా అమ్మ చూస్తూనే ఉన్నది. నిత్యం గమనిస్తూనే ఉన్నదన్న నిజం ఇలా అప్పుడప్పుడూ, అమ్మకు అతిదగ్గరగా ఎన్నోఏళ్ళు బ్రతికినవారి ద్వారా మనకు అర్ధమౌతూ ఉంటుంది.  మనలో నూతనశక్తిని నింపుతూ ఉంటుంది.

(సశేషం)