కొంతకాలం క్రిందట ఒకాయన నన్నిలా ప్రశ్నించాడు.
'నాకొక ధర్మ సందేహం కలిగింది. తీరుస్తారా?'
నవ్వుతూ నేనిలా అన్నాను.
'నేను ధర్మసందేహాలు తీర్చను'
'మరి?' అన్నాడు.
'అధర్మ సందేహం అయితే తీరుస్తాను'
'అదేంటి? అర్ధం కాలేదు.' అన్నాడు.
'నీ సందేహంలో ధర్మాధర్మ విచికిత్స ఉందా లేదా?' అడిగాను.
'ఈ పదం కూడా నాకర్ధం కావడం లేదు' అన్నాడు.
'అంటే, కొంత ధర్మం కొంత అధర్మం కలగలసి నీ సందేహంలో ఉన్నాయి. అందుకే అది సందేహం అయింది. లేకపోతే దానిని సందేహం అనరు. అవునా కాదా?' అడిగాను.
కొంచం ఆలోచించాడు.
'అవుననే అనిపిస్తోంది' అన్నాడు.
'మరి రెండూ దానిలో ఉన్నప్పుడు, ధర్మసందేహం అని ఎందుకన్నావు?' అడిగాను.
'అంటే, మనం ఎప్పుడూ ధర్మం వైపే ఉంటాం కదా? అందుకని' అన్నాడు.
'నీ జీవితంలో అంతా ధర్మమే ఉందా? అధర్మం అస్సలు లేదా? ఆలోచించి చెప్పు' అన్నాను.
'వెంటనే చెప్పలేను. సమయం కావాలి'. అన్నాడు.
'తీసుకో' చెప్పాను.
తర్వాత కొన్ని వారాలకు మళ్ళీ అతను కలిశాడు.
'ఏమైంది? ఆలోచించి తేల్చుకున్నావా?' అడిగాను.
'ఆలోచించాను. నా జీవితంలో చాలా అధర్మం కనిపిస్తోంది' చెప్పాడు.
'కనిపించినదాన్ని వదిలెయ్యి. అప్పుడు ధర్మమే మిగులుతుంది. నీ సందేహం తీరిపోతుంది' అన్నాను.
'అలా వదలడం అంత తేలికగా కనిపించడం లేదు' అన్నాడు.
'నువ్వు వదల్లేకపోతే, వదిలే పరిస్థితులను ప్రకృతే కొంతకాలానికి కల్పిస్తుంది.' అన్నాను.
'ఏంటో మీరు చెప్పేది ఏమీ అర్ధం కావడం లేదు. అంతా అయోమయంగా ఉంది' అన్నాడు.
'అర్ధం కానివాడికి ఎంత చెప్పినా అర్ధంకాదులే. ఒదిలెయ్.' అన్నాను.
'అలా వదల్లేకే కదా ఈ బాధ!' అన్నాడు.
'వదల్లేకపోతే గట్టిగా పట్టుకో. కొన్నాళ్ళకు అదే నిన్ను వదిలిపోతుంది.' అన్నాను.
'ఇదంతా చెప్పకపోతే నేనడిగిన ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పచ్చుగా?' అడిగాడు కోపంగా.
'మూగవాడు కుంటివాడికి నడక ఎలా నేర్పించగలడు?' అడిగాను.
'అర్ధం కాలేదు.' అన్నాడు.
'నేను చెప్పలేను. నువ్వు నడవలేవు. మనిద్దరి మధ్యన మాటలెందుకు?' అన్నాను.
'అదేంటి? మీరు చక్కగా మాట్లాడుతున్నారు. నేను చక్కగా నడుస్తున్నాను. లేదంటారేంటి?' అన్నాడు.
'నేను చెబుతున్నది వీటి గురించి కాదు' అన్నాను.
'మళ్ళీ అర్ధం కాలేదు' అన్నాడు.
'అర్ధం కావాలంటే కూడా కొన్ని అర్హతలుండాలి మరి!' అంటూ నా దారిన నేనొచ్చేశాను.'నేను చెప్పలేను. నువ్వు నడవలేవు. మనిద్దరి మధ్యన మాటలెందుకు?' అన్నాను.
'అదేంటి? మీరు చక్కగా మాట్లాడుతున్నారు. నేను చక్కగా నడుస్తున్నాను. లేదంటారేంటి?' అన్నాడు.
'నేను చెబుతున్నది వీటి గురించి కాదు' అన్నాను.
'మళ్ళీ అర్ధం కాలేదు' అన్నాడు.