Once you stop learning, you start dying

18, సెప్టెంబర్ 2018, మంగళవారం

మానవుడు

ఒక మానవుడు....

మట్టిలో పుట్టి
మట్టికోసం కొట్టుకుని
మట్టిలో కలసి
మట్టికొట్టుకు పోతున్నాడు

తప్పని తెలిసీ
తప్పించుకునే మార్గం తెలియక
చేసిన తప్పులనే మళ్ళీ చేస్తూ
తప్పుల కుప్ప అవుతున్నాడు

ఒప్పులివీ అంటూ
ఒప్పించేవాళ్ళు చెప్పినా
ఒప్పుకోలేక
ఒప్పులకుప్పలా వగలేస్తున్నాడు

తనతో ఏదీ రాదనీ తెలిసినా
తమాయించుకోలేక
తనివి తీరకుండానే
తనువు చాలిస్తున్నాడు

ఇంకో మానవుడు

మట్టిలో పుట్టినా
మత్తులో జోగకుండా
మనసునధిగమిస్తూ
మహనీయుడౌతున్నాడు

దానవత్వాన్ని దాటిపోతూ
మానవత్వాన్ని పోగు చేస్తూ
దైవతత్వాన్ని అందుకుంటూ
ధన్యజీవిగా మారుతున్నాడు

రహదారిలో తాను నడుస్తూ
తనవారిని తనతో నడిపిస్తూ
పరతత్వపు పందిళ్ళలో
పరవశించి పోతున్నాడు

చావు పుట్టుకల ఆటలో
పావుగా ఇక్కడ పుట్టినా
ఆట నియమాలను దాటి
అనంతంలోకి అడుగేస్తున్నాడు

మానవుడు....