“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

25, అక్టోబర్ 2018, గురువారం

జిల్లెళ్లమూడి స్మృతులు - 24 (గోశాల)






అదే రోజు సాయంత్రం జిల్లెళ్లమూడిలో మేం కొనాలనుకున్న పొలాలను చూద్దామని అందరం కలసి నడుచుకుంటూ ఓరియంటల్ కాలేజి దగ్గరకు వెళ్లి అక్కడి సాధ్యాసాధ్యాలను పరిశీలించి వచ్చాం. దారి పొడుగునా శ్రీమన్నారాయణగారు అమ్మగురించి అనేక విషయాలు చెబుతూనే ఉన్నారు.

అమ్మ చాలా తేలికమాటల్లో అత్యున్నతమైన వేదాంతాన్ని ఇమిడ్చి చెప్పేవారు. ఈ విషయంలో శ్రీరామకృష్ణులు, శారదామాత పాటించిన పద్ధతినే అమ్మ కూడా పాటించారు. మచ్చుకు ఒక విషయం !

ఒక రోజున అమ్మను ఎవరో ఇలా అడిగారట.

'అమ్మా ! మనిషికి ప్రాణం పోయిన  తర్వాత అది ఎక్కడికి పోతుంది?'

స్వర్గానికో నరకానికో లేదా ఇంకా ఎక్కడికో పోతుందని, లేదా మళ్ళీ జన్మ ఎత్తుతుందని అమ్మ చెబుతుందని అడిగినవారు భావించి ఉండవచ్చు. కానీ అమ్మ ఇలా చెప్పింది.

'ఎక్కడికీ పోదు. చుట్టూ ఉన్నదాంట్లో కలుస్తుంది'

'అదేంటమ్మా? అర్ధం కాలేదు' అన్నారు అడిగినవారు.

'ఒక టైరులోనుంచి గాలి పోయిందనుకో నాన్నా. అది ఎక్కడికి పోతుంది? చుట్టూ ఉన్న గాలిలో కలుస్తుంది కదా ! ఇదీ అంతే' అని అమ్మ తేలికగా చెప్పేసింది.

ప్రాణానికి ఆధారం గాలే. మన లోపలి గాలీ బయట గాలీ రీసైకిల్ అవుతూ ఉండటం వల్లనే మనం బ్రతుకుతూ ఉన్నాం. చనిపోయినప్పుడు ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. అప్పుడు లోపలిగాలి బయట గాలిలో కలుస్తుంది. అంతే ! దీనికి స్వర్గమనీ నరకమనీ పునర్జన్మనీ ఇంత గోల ఎందుకు?

కానీ, మనిషికి ఇంత సింపుల్ ఆన్సర్ నచ్చదు. ఏదో అర్ధంకాని భాష ఉపయోగించి, వేదాంతం రంగరించి, స్వర్గనరకాలను మధ్యలోకి తెచ్చి, గంటలు గంటలు పురాణం చెబితే  మనకు నచ్చుతుంది. ఇదే మన ఖర్మ ! ప్రకృతి చాలా సింపుల్ గా ఉంది. ప్రపంచం కూడా చాలా సింపుల్ గానే ఉంది. మన మనస్సులు మాత్రం చాలా  బూజు పట్టి ఉన్నాయి. అందుకనే దేన్నైనా సరే సింపుల్ గా, ఏ పటాటోపమూ లేకుండా, ఉన్నదున్నట్లుగా చెబితే మనకు నచ్చదు.

మాటల్లో ఉండగానే గోశాల  దగ్గరకు వచ్చాం.

'ఈ గోశాల కూడా అమ్మ మొదలుపెట్టినదే.  అమ్మ దగ్గర మనుషులే కాదు, పశుపక్ష్యాదులు కూడా ఎంతో  ప్రేమగా లాలింపును పొందేవి. అమ్మ  పోయిన ఇన్నేళ్ళకు దీన్ని ఒక ఆకారానికి తేగలిగాం.' అంటూ శ్రీమన్నారాయణగారు మమ్మల్ని గోశాల లోపలకు తీసుకువెళ్ళారు.

అక్కడ ఒక ఏభైదాకా గోవులున్నట్లు నాకనిపించింది. గుంటూర్ లో గోశాల నాకు తెలుసు. కొద్ది స్థలంలో ఎక్కువ ఆవుల్ని కుక్కేసి ఉంచుతారు. వాటికి మూవింగ్ స్పేస్ ఉండదు. సరియైన పోషణ ఉండదు. తిండి ఉండదు. రాత్రిళ్ళు దోమలు కుడుతూ ఉంటాయి. చలినుంచీ ఎండనుంచీ వాటికి రక్షణ ఉండదు. కొందరు జైన సోదరులు మాత్రం వాటికి రెగ్యులర్  గా గడ్డి పంపుతూ ఉంటారు.

కానీ ఇక్కడ గోశాలను చూస్తె, ముచ్చటేసింది. మేం అక్కడకు వెళ్లేసరికి చీకటి పడింది. దోమలు కుట్టకుండా గోశాల మొత్తం దోమతెరతో కప్పేసి ఉన్నది. ఒక్కొక్క ఆవుకూ గాలికోసం విడివిడిగా ఫ్యాన్లు ఉన్నాయి. దోమతెరలలో ఆవులు హాయిగా నిలబడి ఉన్నాయి.

'వీటికి ఆహారం కూడా  చాలా మంచిగా పెడతాం. పురుగు మందులు వేసిన ఆకుకూరలు వీటికి పెట్టం. ఒక సోదరుడు వీటికోసం తన రెండెకరాల పొలంలో పురుగుమందులు వాడకుండా తోటకూర  మొదలైన కూరలు పెంచుతున్నాడు. ఆ కూరల్నే రోజూ వీటికి పెడతాం. మంచి తవుడు, ధాన్యాలు, పచ్చి గడ్డి, ఇలా మంచి తిండి వీటికి పెడుతూ ఉంటాం. పశువుల లాగా కాకుండా వీటిని మా పిల్లలలాగా చూసుకుంటాం. వీటి యూరిన్, పేడలను సేకరించి ఎరువుగా మార్చే ప్లాంట్ ఇక్కడ ఉంది. ఆ కనిపించే కాలువల గుండా వీటి యూరిన్ ఆ ప్లాంట్ లోకి పోతుంది. అక్కడ ఎరువుగా మారుతుంది. ఇవి ఉండేచోట కూడా ఎప్పటి కప్పుడు క్లీన్ చేసి చాలా శుభ్రంగా ఉంచుతాం.   ఈ పనిని కూడా అందరూ చెయ్యలేరు. శ్రద్దగా చేసే పనివాళ్ళు మాకున్నారు. అందుకని వీటిని ఇంత మంచిగా సంరక్షణ చెయ్యగలుగుతున్నాం.

నూట ఎనిమిది మంది ఏడాదికి  ఒక్కొక్కరు 6000/- ఇవ్వగలిగితే వీటిని, మేము అనుకున్నట్లుగా సాకగలుగుతాం. ప్రస్తుతానికి డెబ్భైమంది అయ్యారు. మిగతా వాళ్ళు కలిస్తే బాగుంటుంది. నెలకు అయిదొందలు అయితే ఎవరికీ కష్టం ఉండదని ఇలా పెట్టాం' - అన్నాడాయన.

"ఒకరి దగ్గర లక్షరూపాయలు తీసుకోకండి. లక్షమంది దగ్గర ఒక్కొక్క రూపాయి తీసుకోండి. అప్పుడు  ఎవరికీ ఇబ్బంది ఉండదు. పని జరుగుతుంది. అందరికోసం అందరూ కలసి మంచిపనులు చెయ్యండి" - అని అమ్మ అనేవారు.

ఈ గోశాలలో సేవ చెయ్యడానికి ఒక భర్తా భార్యా ముందుకొచ్చారు. వారికి పెళ్లై ఏడేళ్ళు అయినా పిల్లలు లేరు. కానీ ఈ ఆవులను చక్కగా చూసుకోవడం మొదలు పెట్టిన ఏడాదిలో వారికి సంతానం కలిగింది.' అన్నారు శ్రీమన్నారాయణ గారు.

అంటే వారికున్న గురుదోషం పోయి ఉంటుంది అనుకున్నాను నేను. గురువు సంతాన కారకుడు. సంతాన దోషాలున్నాయంటే ఆ జాతకంలో గురుదోషం తప్పకుండా ఉంటుంది. గోసేవ వల్ల అది పోయి ఉంటుంది. అందుకని వీళ్ళకు సంతానం కలిగింది. జీతం తీసుకుంటూ చేసినా కూడా శ్రద్దగా ఆవులను చూసుకోవడం వాళ్ళ జాతకాన్ని బాగుచేసింది.

గోశాలను నడుపుతున్న విధానం మాకెంతగానో నచ్చేసింది.

మా సంస్థనుంచి మిగతాది మేము పూర్తి చేస్తామని ఆయనతో చెప్పాను. గోవును సంరక్షించడం అనేది జాతకంలోని గురుదోషాలను సమూలంగా పోగొడుతుంది. అంతేకాదు, రాహుకేతు దోషాలను కూడా నిర్మూలిస్తుంది. ఈ విషయం చాలామందికి తెలీదు. ప్రస్తుతం ఈ రెండు దోషాలు లేని మనుషులు ఈ భూమ్మీద ఎవ్వరూ లేరు. వారికి ఈ రెమేడీని మించిన రెమెడీ కూడా ఇంకేమీ లేదు.  కనుక 'పంచవటి' నుంచి ఈ ప్రాజెక్ట్ కు మేము తప్పకుండా ఉడతాభక్తిగా తోడ్పడతామని ఆయనతో చెప్పాను. దీనికి విరాళం అందించమని నా శిష్యులందరికీ అక్కడే చెప్పేశాను.

తిరిగి వచ్చేస్తూ ఉండగా ఆయన్ను ఒక మాట అడిగాను.

'ముసలి గోవులను  ఏం చేస్తారు?'

నా ప్రశ్నను ఆయన అర్ధం  చేసుకున్నాడు.

'మాకు ఆ భేదం లేదన్నయ్యా ! పాలిచ్చేటప్పుడు బాగా చూసుకుని వట్టిపోయినప్పుడు వాటి ఖర్మకు వాటిని ఎప్పటికీ వదిలెయ్యము. ముసలి ఆవులను కూడా ఏ లోటూ లేకుండా చక్కగా చూసుకుంటాము. అవి పోయేంతవరకూ వాటి బాధ్యత మాదే. ఎందుకంటే, మా దృష్టిలో అవి ఆవులు కావు. మా పిల్లలే.' అన్నాడాయన.

వింటున్న మాకందరికీ కళ్ళు  చెమర్చాయి. అమ్మ ఆశయాలను ఎంత చక్కగా నెరవేరుస్తున్నారో కదా వీళ్ళు ! అనిపించింది.

(ఇంకా ఉంది)