“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

27, అక్టోబర్ 2018, శనివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 25 (జంతువులకూ మోక్షం వస్తుంది)

గోశాల నుంచి తిరిగి వచ్చి రిఫ్రెష్ అయ్యి భోజనశాలకు బయలుదేరాం. అక్కడకు వెళ్లేసరికి ఒక బ్యాచ్ నడుస్తోంది. అందుకని మేము బయట వేచి ఉన్నాం. ఈ లోపల ఎవరో పలకరించారు. ఎవరా అని చూచాను. పోయినసారి వచ్చినపుడు వసుంధరక్కయ్య పరిచయం చేసిన ప్రసాద్ గారు నన్ను పిలుస్తూ కనిపించారు. ఇక్కడ ఇల్లు కొన్నామనీ ఆ గృహప్రవేశానికి అందరం వచ్చామనీ ఆయనతో చెప్పాను.

'సంతోషం. జిల్లెళ్ళమూడి వాస్తవ్యులు అయ్యారన్న మాట !' అన్నాడాయన.

మౌనంగా నవ్వాను.

'కొత్తగా అయ్యేదేముంది? అంతా అమ్మ ఒడిలో ఉన్నవాళ్ళమేగా? అక్కడనుంచి ఇంకెక్కడికి పోతాం?' అనుకున్నాను.

'పోయినసారి వచ్చినపుడు 'నీ మమతల పందిరి నీడలో...' అనే పాటను మీరు బాగా పాడారు. మీ శిష్యురాళ్ళు కూడా బాగా పాడారు. మీ స్వరం చాలా బాగుంది.' అన్నాను నేను.

'ఇప్పుడు పెద్దవయసు వచ్చి కొంచం మారింది. వయసులో ఇంకా బాగుండేది. అమ్మ ఎదురుగా ఎన్ని పాటలు పాడానో నాకే గుర్తు లేదు. ఒకసారి అమ్మ ఏలూరుకు వచ్చినపుడు లక్షమందికి దర్శనం ఇచ్చింది. అంతమంది ఎదురుగా పాడే అదృష్టం నాకు కలిగింది. ఇప్పుడు గొంతు కూడా అంతగా సహకరించడం లేదు. అందుకని పెద్దగా పాడటం లేదు. వచ్చే నెలలో హైమక్కయ్య జయంతి ఉత్సవాలు జరుగుతాయి. అప్పుడు నేను చేసిన DVD విడుదల చేస్తున్నాను. ఆ కార్యక్రమానికి రండి. బాగుంటుంది' అన్నాడాయన.

'వీలైతే వస్తాను' అన్నాను.

అన్నపూర్ణాలయం ఎదురుగా మేం నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాం. రెండు మూడు కుక్కలు మా చుట్టూ తిరుగుతూ ఆడుకుంటున్నాయి. వాటిని చూస్తూ ఆయన ఇలా అన్నాడు.

'అన్ని జన్మలలోకెల్లా మానవజన్మ ఉత్తమమైనదని మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం. కానీ అది నిజం కాదు. మనుషుల్లో పరమనీచులు చాలామంది ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా, జంతువులలో ఉత్తమ ఆత్మలు కూడా ఉంటాయి. అమ్మ కూడా ఇదే మాట అనేవారు. ఎవరో చెప్పినవి కాదు. మా కళ్ళతో మేమే చూచాము. నా చిన్నప్పటినుంచీ అమ్మ దగ్గరకు వస్తున్నాను. ఎన్నో సంఘటనలు అమ్మ సమక్షంలో నేను గమనించాను.' అంటూ అప్పటి విషయాలు చెప్పడం ప్రారంభించారాయన.

'అమ్మ దగ్గర కుక్కలు, పిల్లులు, ఎలుకలు, కోతులు, పాములు ఇలా ఎన్నో జంతువులు స్వతంత్రంగా తిరుగుతూ ఉండేవి. అమ్మ సమక్షంలో వాటి సహజ శత్రుత్వం సమసిపోయేది. ఇది మేం కళ్ళారా చూచాం.

అమ్మ భక్తులలో ఒకాయన మంచి ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. ఆయన అమ్మ ఫోటోలు తీస్తూ ఉండేవాడు. సాయంత్రం పూట ఆరుబయట మంచం వేసుకుని అమ్మ కూచునేవారు. మేమందరం అమ్మ చుట్టూ నేలమీద కూచునే వాళ్ళం. ఒకసారి ఇలాంటి సందర్భంలో ఆ ఫోటోగ్రాఫర్ పొటోలు తీస్తున్నాడు. అతనికి కూడా మానవజన్మ చాలా ఉత్తమమైనదని నమ్మకం ఉండేది. కానీ అప్పుడొక విచిత్రం జరిగింది.

ఒక కుక్క అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ వైపు చూస్తూ కూచున్నది. HMV రికార్డ్స్ మీద ఒక కుక్క బొమ్మ ఉంటుంది. అమ్మకు కొద్దిదూరంలో అట్లా కూచుని ఆ కుక్క అమ్మను చూస్తున్నది. మేమందరం ఎలా చూస్తున్నామో అదీ అలాగే చూస్తోంది. ఈయన కెమేరాలోనుంచి చూస్తున్నాడు. కదలిక లేకుండా ఆ కుక్క, ఒక బొమ్మలాగా బిగుసుకుపోయి ఉండటం ఆయనకు కనిపించింది. చాలాసేపు గమనించినా అదే అలాగే నీలుక్కోని ఉంది. ఈయనకు అనుమానం వచ్చి కెమెరా పక్కన పెట్టి, కుక్క దగ్గరకు వెళ్లి కదిలించి చూచాడు. అది బొమ్మలాగా బిగుసుకుని ఉంది. కదలడం లేదు. దృష్టి మాత్రం అమ్మ మీదే ఉంది. ఆయనకు అనుమానం వచ్చి కుక్క ముక్కు దగ్గర వేలు ఉంచి చూచాడు. దానికి ఊపిరి ఆడటం లేదు. ఆయన బిత్తరపోయి అమ్మవైపు చూచాడు. అమ్మ మౌనంగా చిరునవ్వుతో ఈయన్ను, ఈయన చేస్తున్న పనులను చూస్తున్నది. అప్పుడు ఈయనకు అర్ధం అయింది. అమ్మ అనుకుంటే మనుషులకే కాదు జంతువులకు కూడా సమాధిస్థితిని ఇవ్వగలదని.

ఎప్పుడైతే ఈయన మనస్సులో ఈ ఆలోచన వచ్చిందో, అమ్మ తన ఎడమపాదాన్ని ఒక విధంగా విచిత్రంగా కదిలించింది. వెంటనే ఆ కుక్కకు స్పృహ వచ్చి మామూలుగా అయిపోయింది. గాలి పీల్చడం, మామూలుగా తిరగడం మొదలుపెట్టింది.

ఇదే విధంగా ఒక పిల్లి ఉండేది. అప్పుడప్పుడూ అది అమ్మ ఎదురుగా వచ్చి కూర్చుని 'ఓ....' అని దీర్ఘంగా అరుస్తూ ఉండేది. 'ఏంటమ్మా అది అలా అరుస్తోంది నీ ఎదుట?' అని అడిగితే ' చెయ్యనివ్వండిరా! అది ఓంకార నాదం చేస్తోంది' అనేది అమ్మ. ఆ పిల్లి కూత కూడా ఓంకారం లాగే ఉండేది. ఆ పిల్లి ఆహారం తినేది కాదు. అప్పట్లో ఇక్కడ అంతా తుప్పలు పొదలు చెట్లు ఉండేవి. ఆ దూరంగా ఉన్న పొదల్లో ఆ పిల్లి ఉంటూ ఉండేది. అది పదిహేను రోజులకు ఒకసారి మాత్రమె మేము పెట్టిన ఆహారం తీసుకునేది. మిగతా రోజులు ఆ పొదల్లో కూచుని ఉపవాస దీక్షలో, తపస్సులో ఉండేది. అప్పుడప్పుడూ వచ్చి అమ్మ దగ్గర ఓంకారం చెప్పి మళ్ళీ పొదల్లోకి వెళ్ళిపోతూ ఉండేది.

ఒక కోతి కూడా ఇక్కడ ఉండేది. అది పెద్ద కోతి. దాదాపు మనిషి ఎత్తులో ఉండేది. రోజూ ఉదయం అమ్మ సమక్షంలో సంధ్యావందనం జరిగేది. ఆ సమయానికి ఆ కోతి కూడా వచ్చి అందరితో బాటు ఓపికగా కూచునేది. సంధ్యావందనం అయ్యాక తను కూడా అందరితో బాటు లైన్లో వచ్చి అమ్మ పాదాలు తాకి ప్రసాదం తిని వెళ్ళిపోతూ ఉండేది. మనిషిలాగే దాని ప్రవర్తన అంతా ఉండేది. చివరకు ఆ కోతి చనిపోయినప్పుడు అమ్మే దానికి అంత్యక్రియలు చేసింది. అదుగో ఇదే వీధి చివర్లో దాన్ని ఖననం చేసి అమ్మ ఇలా అన్నది ' ముందు ముందు ఇక్కడ ఒక ఆంజనేయస్వామి ఆలయం వస్తుంది'.

అమ్మ గతించిన చాలా ఏళ్ళకు ఒకరోజున పొద్దున్న చూస్తే ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం ఒకటి కనిపించింది. ఎవరో దానిని తెచ్చి ఇక్కడ పెట్టి వెళ్ళిపోయారు. ఆ విగ్రహాన్ని అక్కడ ఉంచి ఒక చిన్నగుడి కట్టాం. ఇప్పుడు చీకటి పడింది కదా. రేపు పొద్దున్న వెళ్లి చూడండి.' అన్నాడాయన.

ఈ రోజుల్లో మనుషులే ఎక్కడా క్యూలో రావడం లేదు. అలాంటిది, కోతి అంత డిసిప్లిన్ గా క్యూలో వచ్చి అమ్మ దర్శనం చేసుకునేదనీ, రోజూ సంధ్యావందనంలో మౌనంగా కూర్చునేదనీ వింటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. మా కళ్ళలోని ఆశ్చర్యాన్ని గమనించి ఆయన ఇలా అన్నాడు.

'నేను నిజాలే చెబుతున్నాను. ఇవన్నీ మేము మా కళ్ళతో చూచిన విషయాలు. అబద్దాలు కావు'.

ఇంకో విషయం వినండి. ఇక్కడ ఒక ఆంబోతు కూడా తిరుగుతూ ఉండేది. అది అమ్మకు కాపలాగా ఉంటూ ఉండేది. అప్పట్లో ఈ ఊరు ఒక అడవి. రోడ్లూ, నీళ్ళూ, కరెంటూ, ఏవీ ఈ ఊళ్ళో ఉండేవి కావు. పగలంతా ఎక్కడెక్కడ తిరిగేదో కాని, చీకటిపడేసరికి అమ్మ ఇంటికి వచ్చి అమ్మ మంచానికి కొంచం దూరంగా పడుకుని రాత్రంతా అమ్మకు రక్షణగా కాపలా కాసి పొద్దున్నే తిరగడానికి వెళ్ళిపోతూ ఉండేది. చాలాసార్లు మేమంతా అమ్మ మంచం చుట్టూ నేలమీదే ఏదో గుడ్డ పరుచుకుని రాత్రంతా పడుకునేవాళ్ళం. అప్పట్లో పాములు కూడా ఇక్కడ ఎక్కువగానే తిరుగుతూ ఉండేవి. కానీ అలాగే నేలమీద ఆ చీకట్లోనే పడుకునేవాళ్ళం. అవి మమ్మల్ని ఏమీ చేసేవి కావు. మాకూ భయం వేసేది కాదు. ఎప్పుడో అర్ధరాత్రి ప్రాంతంలో ఆంబోతు వచ్చి జాగ్రత్తగా ఎవరినీ తొక్కకుండా అడుగులు వేసుకుంటూ అమ్మ దగ్గరకు వచ్చి అమ్మను కాసేపు దర్శించుకుని మళ్ళీ దూరంగా వెళ్లి మాతోబాటే మా ప్రక్కనే నేలమీద పడుకుంటూ ఉండేది. ఇది కూడా మేము కళ్ళతో చూచిన విచిత్రం.

1950 ల కంటే ముందు అమ్మ ఒక పూరిపాకలో ఉండేది. అదే స్థలంలో ఇప్పుడు మనం చూస్తున్న శివాలయం వచ్చింది. అప్పుడు అమ్మతోబాటు ఆ పూరిపాకలో ఒక పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఒక తెల్లని త్రాచుపాము ఉండేది. అది అమ్మతో బాటే అదే గుడిసెలో నివసిస్తూ ఉండేది. అమ్మ వంట చేసుకుంటూ ఉంటే అది కూడా అక్కడే పడుకుని ఉండేది. అమ్మతో బాటు తిరుగుతూ ఉండేది. దానిని కూడా చూచినవాళ్ళు ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. అప్పట్లో అమ్మను చూద్దామని వచ్చినవాళ్ళకు ఆ పుట్టమట్టినే ప్రసాదంగా తీసి అమ్మ ఇస్తూ ఉండేది. ఆ మట్టి మంచి సువాసనగా ఉండటమే కాక, ఎన్నో రోగాలను ఈతిబాధలను పోగొడుతూ ఉండేది.

ఈ విధంగా జంతువులు కూడా అమ్మను దర్శిస్తూ ఉండేవి. జంతువులైనా కూడా అవి ఎంతో పద్దతిగా మనకంటే మంచి ప్రవర్తనతో ఉండేవి. ఆ ఆత్మలు ఎవరో? ఎందుకు అలా జంతువుల లాగా పుట్టారో? ఎందుకు అలా అమ్మ చుట్టూ తిరిగేవారో? ఆ సంగతులు అమ్మకే తెలుసు. కానీ వాటి గురించి అమ్మ ఎవరికీ ఏమీ చెప్పేది కాదు. 'మీలాగే వాళ్ళూ వచ్చారు నాన్నా' అనేది అంతే ! మాకు పంచిన ప్రేమనే వాటికీ పంచేది. వాటిని కూడా మనతో సమానంగానే చూచేది.' అన్నాడాయన.

సాధనామార్గంలో చాలా దూరం నడిచి, ఉత్తమ మానవులైనవాళ్ళు కూడా, వారికి మిగిలిపోయిన కొంత చెడుకర్మను తీర్చుకోవడం కోసం అలా జంతువుల లాగా పుడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి పెద్దపెద్ద యోగులు కూడా జంతుజన్మలు ఎత్తుతారు. వారికి కొంత కర్మ మిగిలి ఉంటుంది. కనుక అలా పుడతారు. అది సహజమే. అందుకనే, జంతువులను, క్రిమికీటకాలను కూడా మనం చిన్నచూపు చూడకూడదు. వాటిల్లో కొన్ని ఉన్నతమైన ఆత్మలు కూడా ఉంటాయి.

మేం ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే భోజన సమయం అయింది. తింటున్న బ్యాచ్ లేచి బయటకు వస్తున్నారు. ప్రసాద్ గారు సెలవు తీసుకుని తన దారిన తను వెళ్ళిపోయారు. మేము భోజనశాలలోకి అడుగుపెట్టాము.

(ఇంకా ఉంది)