“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

29, అక్టోబర్ 2018, సోమవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 29 (ఈ కలి - ఆకలి)

ఆదివారం ఉదయాన్నే టిఫిన్ శ్రీమన్నారాయణ గారి ఇంట్లో అని చెప్పడంతో అందరం అక్కడకు చేరుకున్నాం. అంత మారుమూల పల్లెటూళ్ళో కూడా మంచి టిఫిన్ ఏర్పాటు చేశారాయన. టిఫిన్ చేశాక అందరం కాసేపు మాట్లాడుతూ కూర్చున్నాం. అమ్మ గురించిన అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చారాయన.

మాటల మధ్యలో 'టిఫిన్ కాస్త ఆలస్యం అయినట్లుంది మీ కందరికీ' అన్నారాయన.

'అబ్బే. అదేమీ లేదండి. పెద్ద ఆకలిగా కూడా లేదు' అని నేనన్నాను.

నేనన్న ఈ మాట అమ్మ జీవితంలో జరిగిన ఒక సంఘటనను ఆయనకు గుర్తుకు తెచ్చినట్లుంది. దానిని చెప్పసాగారాయన.

'ఒక సందర్భంలో అమ్మ దగ్గరకు ఒక ప్రముఖ జ్యోతిష్కుడు వచ్చాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఏది ఎక్కడ జరుగుతున్నదో ఆయన చెప్పగలడు అన్న పేరున్నది. తన ప్రజ్ఞాపాటవాల గురించి అమ్మకు వివరించి చెప్పిన ఆయన, చివరకు అమ్మనే ఇలా ప్రశ్నించాడు.

'అమ్మా ! మీరేదన్నా ప్రశ్నను అడగండి. నేను జ్యోతిష్య పరంగా దానికి సమాధానం చెబుతాను'

'నాకేం ప్రశ్నలున్నాయి నాయనా అడగడానికి?' అంది అమ్మ.

'కాదమ్మా ! ఏదో ఒకటి అడగాలి మీరు' అని చాలాసేపు పట్టుబట్టాడు ఆ జ్యోతిష్కుడు.

అతని పోరు భరించలేక అమ్మ చివరకు ఇలా అడిగింది.

'సరే. ఈ ప్రశ్నకు జవాబు చెప్పు నాయనా ! ఈ కలిలో ఆకలి ఎప్పుడు లేకుండా పోతుంది?'

జ్యోతిష్కుడు బిత్తరపోయాడు.

'అదేంటమ్మా?' అడిగాడు అయోమయంగా.

'అవును నాయనా ! నా ప్రశ్న ఇదే. ఈ కలిలో ఆకలి లేకుండా పోతుందా? ఎప్పుడు పోతుంది? అందరికీ తినడానికి సమృద్ధిగా తిండి ఎప్పుడు దొరుకుతుంది? అందరూ ఆకలి తీరి సంతోషంగా ఎప్పుడు ఉంటారు? ఇదే నా ప్రశ్న. నీకు తెలిస్తే చెప్పు నాయనా' అంది అమ్మ.

ఈ ప్రశ్న తన స్థాయికి మించినదని గ్రహించిన ఆ జ్యోతిష్కుడు అమ్మ కాళ్ళకు ప్రణామం చేసి మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత తన జ్యోతిశ్శాస్త్ర పాండిత్యాన్ని గురించి ఏమీ గొప్పలు చెప్పుకోలేదు.' అన్నారు శ్రీమన్నారాయణ గారు.

అమ్మకు తన గురించి తన కుటుంబం గురించి ఆలోచనా చింతా ఎప్పుడూ లేదు. ఎప్పుడూ లోకం గురించీ లోకపు బాధల గురించే అమ్మ బాధపడేది. అన్నం దొరకక బాధపడుతున్న ఎందరి గురించో ఆలోచిస్తూ ఉండేది. వారి ఆకలి ఎప్పుడు తీరుతుందా అని బాధపడేది.

ఈ కలి ఆకలి అన్న పదాలతో అమ్మ మ్యాజిక్ చేసింది.

ఇక్కడ 'ఆకలి' అంటే 'ఆకలి బాధ' అని మాత్రమే అర్ధం కాదు. ఈ కలిలో ఆ కలి ఎప్పుడు తీరుతుంది? అంటే, ఈ కలికాలంలో అధర్మం ఎప్పుడు పోతుంది? 'నేను నాది' అన్న మనిషి యొక్క స్వార్ధపూరితమైన అల్పమైన ఆలోచనావిధానం ఎప్పుడు మారుతుంది? సంకుచిత స్వార్ధపూరిత ఆలోచనలు వదలిపెట్టి మనిషి విశాలంగా ఉదారంగా ఆలోచించడం ఎప్పుడు నేర్చుకుంటాడు? తనవంటి వాడే ప్రక్క మనిషి కూడా అని ఎప్పుడు గ్రహిస్తాడు' - అమ్మ మాటలకు ఇవీ అసలైన అంతరికమైన అర్ధాలు.

శ్రీమన్నారాయణ గారు చెప్పడం సాగించారు.

'తన దగ్గరకు ఎప్పుడు ఎవరు వచ్చినా అన్నం పెట్టి బట్టలు పెట్టి పంపేది అమ్మ. 'ముందు అన్నం తిని రండి, తర్వాత మాట్లాడుకుందాం' అని తన దర్శనార్ధం వచ్చినవారిని ముందుగా అన్నపూర్ణాలయానికి పంపేది'.

ఈ మాటలు వింటుంటే - ' కాలే కడుపుకు వేదాంతం ఎలా ఎక్కుతుంది? ముందుగా మన దేశంలో పేదరికం పోవాలి. అందరికీ సరిపడా తిండి దొరకాలి. వాళ్ళ కడుపులు నిండాలి. ఆ తర్వాత దేవుడు, వేదాంతం, మతం మొదలైనవి మనిషికి ఎక్కుతాయి.' అన్న వివేకానందస్వామి మాటలు నాకు గుర్తొచ్చాయి. శ్రీరామకృష్ణులు, వివేకానందస్వామి వార్ల ఆశయాలనే వారి తర్వాత తరంలో అమ్మ కూడా ఆచరించి చూపించిందని నాకు అనిపించింది.

నా ఆలోచనలను త్రుంచుతూ శ్రీమన్నారాయణగారి గొంతు మళ్ళీ వినిపించింది.

ఒకసారి ఇలాగే పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది అమ్మ చుట్టూ కూర్చుని అమ్మను ఏదైనా కోరిక కోరుకోమన్నారు. మళ్ళీ అమ్మ అదే మాటంది. 'నాకేం కోరికలుంటాయి నాన్నా?' అని. కాదమ్మా, మేమంతా మంచి పొజిషన్స్ లో ఉన్నాం. నీవు ఏది కోరినా సరే తీరుస్తాం' అని వాళ్ళన్నారు.

'సరే వినండి. లక్షమంది ఒకేసారి భోజనం చేస్తే చూడాలని ఉందిరా' అంది అమ్మ.

వాళ్ళు బిత్తరపోయారు.

అనేక బ్యాచ్ లలో లక్షమంది తినడం కాదు. ఒకే బంతిలో ఒకేసారి లక్షమంది భోజనాలు చెయ్యాలి. అదీ అమ్మ కోరిక.

మాటిచ్చారు కదా చెయ్యక తప్పదు. అందుకని 'సరేనమ్మా తీరుస్తాం' అన్నారు. ఇది 1975 లో జరిగింది. ఇప్పటి లాగా మొబైల్ ఫోన్స్ లేవు. కార్లు లేవు. రవాణా సౌకర్యాలు లేవు. ఇది చూద్దామా అంటే రోడ్లు నీళ్ళు కరెంటు ఏదీ లేని కుగ్రామం. లక్షమందికి ఒకే బంతిలో ఎలా భోజనాలు పెట్టాలి? కానీ అమ్మ సంకల్పం చేసింది కదా, నెరవేరుతుంది అన్న విశ్వాసంతో పూనుకున్నారు.

ఇక్కడ నుంచి ఏడో మైలురాయి దాకా పొలాలలో పందిళ్ళు వేశారు. ఎలా వచ్చాయో, ఎక్కడనుంచి వచ్చాయో బియ్యం, కూరలు, పప్పులు, విస్తళ్ళు అన్నీ వచ్చాయి. ఇప్పటి లాగా అప్పుడు డిస్పోసబుల్ గ్లాసులు లేవు. లక్ష స్టీలు గ్లాసులు సేకరించారు. అన్నీ సిద్ధం అయ్యాయి. రావేమో అనుకున్నవన్నీ వచ్చి చేరాయి. కానీ తినే మనుషులు లేరు. అప్పటికీ టెలిఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా అందరికీ ముందే తెలియజేశారు. కానీ ఉదయం పది గంటలకు అక్కడ ఉన్నవారి సంఖ్య పాతిక వేలే.

ఆర్గనైజర్స్ కి దడ పుట్టింది. అమ్మ దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్ళారు. 'అమ్మా ! నువ్వేమో లక్షమందికి వండమన్నావు. అక్కడ చూస్తె పాతికవేలమంది కూడా లేరు. ఎలాగమ్మా?  అన్నారు. 'మనుషుల్ని చూచి వంట మొదలు పెడతారట్రా? పదండి. మీరు వండండి. మనుషులు వస్తారు' అని అమ్మ అన్నది. అనడమే కాదు తనే వచ్చి స్వయంగా ఎసరు పెట్టింది. వంట ప్రారంభం అయింది.

ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ ఒక షెడ్యూల్ ప్రకారం ఏదీ జరగదు. అనుకోకుండా వందమంది వచ్చేస్తారు అమ్మ దర్శనానికి. వంటశాలలో కావలసినన్ని సరుకులు ఉండవు. ఎలాగా అని భయపడుతూ అమ్మ దగ్గరకు వెళితే 'ఏం పరవాలేదు' అని చెప్పి అమ్మ తనే వచ్చి తన చేతిని వంటకాలకు తాకించేది. లేదా ఎసట్లో బియ్యం తనే వేసేది. ఆశ్చర్యం ! పాతిక మందికి కూడా చాలదని అనుకున్న వంట వందమందికి సరిపోయి ఇంకా మిగిలేది. ఇలా చాలాసార్లు జరిగింది ! అమ్మది అమృత హస్తం !

సరే మన అసలు కధలోకి వద్దాం. పదిగంటలకు పాతికవేల మంది కూడా లేరని అన్నాను కదా. పన్నెండున్నర కల్లా ఎక్కడనుంచి వచ్చారో లక్షా పాతికవేల మంది వచ్చి చేరుకున్నారు. ఈ పొలాలన్నింటినీ ఆరుపందిళ్ళు, ఆరు వంటశాలలుగా విభజించి ఒక్కో పందిట్లో 17,000 మంది చొప్పున కూచోబెట్టి ఒకేసారి వారికి వడ్డించారు. ఒక జీపులో అమ్మ ప్రతి పందిరికీ వెళ్లి అందరినీ చూచి పలకరించింది. ఆ విధంగా ఒకేసారి లక్షమంది పైగానే ఈ పొలాలలో భోజనం చేశారు. అమ్మ కోరిక తీరింది.

కానీ, ఇంకా బోలెడంత వంటలు మిగిలిపోయాయి. వాటిని ఏం చెయ్యాలమ్మా అని అడిగారు. 'మనుషులు ఒక్కరే కాదు నాన్నా. ఆ వాగులో ఎన్నో చేపలు, మిగతా జీవాలు ఆహారం కోసం వేచి చూస్తున్నాయి. ఆ వంటకాలు తీసికెళ్ళి ఆ వాగులో కలపండి' అని అమ్మ చెప్పింది. అలాగే చేశారు.

ఆ తర్వాత కొన్నేళ్ళకు అమ్మ ఇక్కడ ఇంకో అద్భుతం చేసింది. మనుషులకు ఎలాగైతే విందు ఏర్పాటు చేసిందో అలాగే పశుపక్ష్యాదులకు కూడా ఒకరోజున విందు ఏర్పాటు చేసింది. ఆ రోజున ఈ చుట్టూ పక్కల ఉన్న అన్ని పల్లెల నుంచీ ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు అన్నింటినీ ఇక్కడకు రప్పించింది. కుక్కలు, పిల్లులు, పక్షులు కూడా వచ్చాయి. అన్నింటినీ అమ్మ ఆహారం పెట్టింది.

ఇంతమందికి అన్నం పెట్టి, ఎప్పుడూ ఇతరుల ఆకలి గురించే ఆలోచించిన అమ్మ తను మాత్రం ప్రతిరోజూ మనం తిన్నట్లుగా అన్నం తినేది కాదు. కాఫీ మాత్రం మూడు నాలుగు సార్లు త్రాగేది. అన్నపూర్ణాలయంలో వంట చేసి ఆ పదార్ధాలన్నీ ఒక ప్లేటులో పెట్టి అమ్మ దగ్గరకు తెస్తే అందులోనుంచి ఒక రెండు ముద్దలు తిని మిగతాది ప్రసాదంగా ఇచ్చేసేది. అంతే ! తన జీవితమంతా అమ్మ అలాగే బ్రతికింది. ఇది మరొక అద్భుతమనే చెప్పాలి !

అమ్మ దగ్గర బీదా గొప్పా అని భేదం లేదు. అందరినీ సమానంగా చూచేది. సమానంగానే ఆశీర్వదించేది. మరో సంఘటన వినండి.

P.V.R.K Prasad IAS గారు TTD లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆయనొకసారి అమ్మ దర్శనానికి వచ్చారు. అప్పట్లో తిరుమలలో అన్నదానం లేదు. అమ్మ ఆయనతో ఇలా అన్నది. 'తిరుమలకు వచ్చేవారికందరికీ అన్నదానం చెయ్యండి నాన్నా! వాడికి చేసే స్తోమత ఉన్నది కదా. అందరికీ ఉచితంగా అన్నం పెట్టండి'. వెంకటేశ్వర స్వామిని అమ్మ 'వాడు' అనేది. 'వాడు నా పెద్దకొడుకు' అని చాలాసార్లు అన్నది.

అమ్మ చెప్పిన ఈ మాటలతో స్ఫూర్తి పొందిన ప్రసాద్ గారు ఆ తర్వాత తిరుమలలో అన్నదానం ప్రారంభించారు. మరి ఆ స్కీం లో ఎన్ని కోట్లమంది అక్కడ ఉచిత అన్నప్రసాదాన్ని తీసుకుంటున్నారో చూస్తున్నాం కదా ! నిజానికి దీని వెనుక ఉన్నది అమ్మయొక్క ఆనాటి సంకల్పమే !

ఇంకో సంఘటన వినండి !

విజయవాడలో కోనేరు లక్ష్మయ్యగారి పేరు తెలియని వారుండరు. ఆయన మంచి ధనవంతుడు. ఆ రోజులలో అమ్మ దర్శనం కోసం ఆయన వచ్చారు. అమ్మ దగ్గరకు వస్తూ తన స్నేహితుడైన ప్రసాదరావు గారిని తనతో తోడుగా రమ్మన్నారు. ప్రసాదరావు గారు ప్రముఖ కమ్యూనిస్టు.

'ఈ అమ్మలూ బాబాలూ అంటే నాకు గిట్టదు. నేను రాను' అని ఆయన అన్నాడు.

'ఒక భక్తుడిగా రమ్మని నేను చెప్పడం లేదు. ఊరకే నాకు తోడుగా రా' అని ఆయన్ను కూడా తీసుకొచ్చారు కోనేరు లక్ష్మయ్య గారు.

వాళ్ళు జిల్లెళ్ళమూడి వచ్చి కూర్చున్నారు. ప్రసాదరావు గారు క్రింద కూర్చోనని అంటే, ఆయనకొక కుర్చీ వేశారు. అమ్మ వచ్చి వాళ్ళ ఎదురుగా ఇంకో కుర్చీలో కూచుంది. అమ్మ ఎప్పుడూ కూడా నిండుగా చీరను కప్పుకుని ఉంటుంది. అమ్మకు చీరలు పెట్టే భక్తులు ఎనిమిది గజాలు, పది గజాల చీరలు తెచ్చేవాళ్ళు. అందుకని అమ్మ చీర కొంగు చాలా పొడవుగా ఉండి నేలమీద జీరాడుతూ ఉండేది. అమ్మ కుర్చీలో కూచుంటే అమ్మ కొంగు నేలమీద పరుచుకుని ఉన్నది. దానిమీద ఒక పిల్లీ ఎలకా వచ్చి  ఆడుకుంటున్నాయి.

సామాన్యంగా పిల్లి ఉంటె, ఎలుక తన కలుగులోనుంచి బయటకు రాదు. కానీ అమ్మ సమక్షంలో ఎలుక బయటకు వచ్చి పిల్లితో ఆడుకునేది. పిల్లి కూడా దానిని ఏమీ చేసేది కాదు. ఆ విధంగా నేలమీద పరచి ఉన్న అమ్మ కొంగు మీద అవి రెండూ ఆడుకుంటూ ఉన్నాయి. ఈ దృశ్యాన్ని ప్రసాదరావు గారు చూచారు.

అప్పటిదాకా కుర్చీలో దర్పంగా కూర్చుని ఉన్న ఆయన గభాల్న నేలమీదకు దిగి అమ్మ పాదాలకు నమస్కారం చేశారు. ఆ ఒక్క సీన్ తో అమ్మంటే ఏంటో ఆయనకు అర్ధమై పోయింది.

ఆ తర్వాత కాసేపు వారితో మాట్లాడిన అమ్మ వారికి భోజనం పెట్టి, బట్టలు పెట్టి, ఆశీస్సులిచ్చి పంపింది.

వెళ్లబోయేముందు కోనేరు లక్ష్యయ్యగారు ఇలా అన్నారు.

'నాకే బోలెడంత ఉంది. ఇవన్నీ నాకెందుకమ్మా?'

అప్పుడు అమ్మ ఒక గొప్ప మాటను అన్నది.

'నీకు పెడుతున్నది, నీచేత ఇతరులకు పెట్టించడానికి నాన్నా'

ఆ మాటతో ఆయనకు కళ్ళు తిరిగాయి.

అమ్మ ఒకరికి పెట్టింది అంటే, అది వారికోసం మాత్రమె కాదు, వాళ్ళను తన ఉపకరణంగా చేసుకుని వారిద్వారా ఇతరులకు పెట్టిస్తుంది. అదే ఆయనతో చెప్పింది అమ్మ.

'మనకు ఉంటె చాలదు. అది నలుగురికీ ఉపయోగపడాలి. అలాంటి మంచిపనులు మనం చెయ్యాలి. నలుగురికోసం నలుగురూ బ్రతకాలి. అదే మానవజన్మకు సార్ధకత' అన్నదే అమ్మ ఆలోచన. ఉన్నవాళ్ళు అంతా తామే అనుభవించడం కాదు, లేనివాళ్ళకు కూడా కొంత పెట్టాలి. వాళ్ళకోసం కూడా కొంత చెయ్యాలి అని అమ్మ ఎప్పుడూ అనేది.

ఆ తర్వాత ఆయన విజయవాడ దగ్గర గ్రీన్ ఫీల్డ్స్ లో KL Engineering College పెట్టారు. ఇప్పుడది KL University అయింది. అక్కడనుంచి వేలాది మంది ప్రతి ఏడాదీ పట్టాలు తీసుకుని బయటకు వస్తున్నారు. దీని వెనుక ఉన్నది కూడా అమ్మ సంకల్పమే !

ఈ విధంగా నేడు మనం చూస్తున్న ఎన్నో సంస్థలకు ప్రేరణ అమ్మ సంకల్పంలో ఉన్నది. ఈ విషయాలు నేటి తరంలో చాలామందికి తెలియవు.

ఏభై ఏళ్ళ క్రితం ఉచిత విద్య, ఉచిత భోజనం అన్న పధకాలను అమ్మ ఈ కుగ్రామంలో పారంభం చేసింది. ఇప్పటికీ అవి ఆగకుండా సాగుతున్నాయి. అమ్మ ధనవంతురాలేమీ కాదు. గ్రామకరణం గారి భార్య అంతే. నాన్నగారికి పెద్దగా ఆస్తిపాస్తులేమీ లేవు. అయినా సరే, అర్ధరాత్రి అపరాత్రి ఎవరొచ్చినా లేదనకుండా వారికి అన్నం పెట్టేది అమ్మ. ఒకసారి సరుకులు కొనడానికి తన దగ్గర డబ్బులు లేకపోతే తన నగలు అమ్మి సరుకులు తెప్పించింది అమ్మ. అలాంటి మనుషులు అసలు భూమ్మీద ఉంటారా?

పదో తరగతి అయిపోయి ఇక్కడ కాలేజీలో చేరితే ఇంటర్, డిగ్రీ చదివి డిగ్రీ తీసుకుని బయట ప్రపంచంలో అడుగు పెడతారు ఇక్కడ పిల్లలు. ఈ అయిదేళ్ళూ ఉచిత భోజనం, ఉచిత విద్య. వాళ్ళ కులమేంటో, వాళ్ళ మతమేంటో మేము అడగం. ఈ కుగ్రామంలో ఇలాంటి సేవ జరుగుతున్నది అంటే ఎవరు నమ్ముతారు? ఇక్కడ ఉన్న పిల్లల్లో చాలామంది వేసవి సెలవల్లో కూడా వాళ్ళ ఇళ్ళకు పోరు. ఎందుకమ్మా? అనడిగితే, ఇంటి దగ్గర ఈ మాత్రం తిండి కూడా ఉండదు అన్నయ్యా అని చెబుతారు. అలాంటి పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ ఉన్నారు.' అని అంటున్న శ్రీమన్నారాయణ గారి స్వరం బాధతో గద్గదం అయిపోయింది.

ఇదంతా వింటున్న మాలో చాలామందికి కన్నీళ్లు ధారలుగా కారిపోతున్నాయి. "ఎంత మంచి మనసమ్మా నీది? ఎలాంటి మనిషివమ్మా నువ్వు? అసలు నువ్వు మనిషివేనా? లేక ఈ భూమ్మీద కొంతకాలం ఉండిపోవడానికి ఎక్కడనుండో దిగివచ్చిన దేవతవా?" అని మాలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.

చాలాసేపు మౌనం రాజ్యం ఏలింది.

ఆ మౌనంలోనుంచి తేరుకుని, లేచి, శ్రీమన్నారాయణగారికీ వారి సతీమణికీ నమస్కరించి మా ఇంటికి బయల్దేరాము. భోజనాలు అయిన తర్వాత అమ్మకు నమస్కరించి అందరం ఎవరి ఊర్లకు వారు బయలుదేరాము. కొందరు బాపట్ల వెళ్లి అక్కడ రైలెక్కారు. కొందరు విజయవాడకు వెళ్ళారు. కొందరు గుంటూరు వచ్చి రైలెక్కారు.

నేనూ, నా కారులో ఉన్న మిగతా వారూ, సాయంత్రం అయిదు ప్రాంతంలో గుంటూరుకు చేరుకున్నాము. మరుసటిరోజున నాకు నాందేడ్ లో స్పెషల్ డ్యూటీ ఉన్నది. అందుకని కాసేపు ఇంట్లో కూచుని ఫ్రెష్ అయ్యి, సాయంత్రం ఆరున్నరకున్న ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ఎక్కి హైదరాబాద్ బయల్దేరాను.

(ఇంకా ఉంది)