“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

27, నవంబర్ 2018, మంగళవారం

నాందేడ్ యాత్ర - 12 (I am a Sikh at heart)

ఈ మధ్యన ఎవరిని చూచినా నాకు రెండే ఫీలింగ్స్ కలుగుతున్నాయి. అయితే నవ్వు, లేకపోతే జాలి. మనుషులు చేసే పిచ్చిచేష్టలు చూస్తుంటే నవ్వొస్తోంది. వాళ్ళ అజ్ఞానం ఏ స్థాయిలో ఉందో గమనిస్తుంటే జాలి కలుగుతోంది. మానవజన్మను ఏ విధంగా వీళ్ళు వేస్ట్ చేసుకుంటున్నారో చూస్తుంటే ఇంకా జాలి పెరిగిపోతోంది. కానీ ఏం చేస్తాం? లోకం మొత్తాన్నీ నేను ఉద్ధరించలేను కదా ! ఆ పనిని అవతార పురుషులే చెయ్యలేకపోయారు. మనమెంత? నా శిష్యుల వరకూ నేను వెలుగుదారిని చూపగలను. అందరికీ అంటే, మనవల్ల ఎక్కడౌతుంది?

మా కొలీగ్ ఎదురు బెర్త్ లో కూర్చున్నాను. ఆ 'బే' లో నేనూ ఆయనా తప్ప ఎవరూ లేరు. కూచున్న కాసేపటికే పెనం మీదనుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది నా పరిస్థితి.

ఇక వీడి సుత్తి మొదలైంది.

'ఆ ! ఏంటీ సంగతులు? నాందేడ్ లో మూడ్రోజులున్నారు కదా ! ఏమేం సినిమాలు చూశారు?' మొదలుపెట్టాడు.

నేను సినిమా అంటూ చూసి ఎన్ని నెలలైందో, ఎన్ని ఏళ్ళైందో నాకే గుర్తులేదు. కానీ అతన్ని డిసప్పాయింట్ చెయ్యడం ఎందుకని - 'ఒక సినిమా చూశాను' అన్నాను.

'ఏంటది?' అడిగాడు అతనూ కుతూహలంగా.

'Singh is King' అన్నాను.

'అదెక్కడుంది? అది పాత సినిమా కదా?' అన్నాడు తను.

'ఉంది. ఒకరోజు సెకండ్ షో కు వెళ్లాను. సినిమా చాలా బాగుంది. కానీ మర్నాడు వెళ్లి చూస్తె, ఆ ప్లేస్ లో సినిమా హాల్ లేదు.' అన్నాను.

అతను అయోమయంగా ముఖం పెట్టాడు.

'ఊరు కొత్తకదా ! రెండో రోజు మీరు మర్చిపోయి ఏదో వేరే ప్లేస్ లో వెదికి ఉంటారు.' అన్నాడు.

'కావచ్చు' అన్నా నేను వెనక్కు జారగిలి పడుకుంటూ.

'ఇంకేంటి సంగతులు?' అన్నాడు కొలీగ్ గాడు మళ్ళీ.

'ఇది వీడి ఊతపదం అన్నమాట' అనుకున్నా. 'అయ్యో' నుంచి  'ఇంకేంటి సంగతుల్లోకి' పడ్డానని అర్ధమైంది.

'ఈ ఊర్లో చూడదగినవేం ఉన్నాయి?' అడిగాను.

'ఏమీ లేవు. మహా బోర్. ఎప్పుడెప్పుడు నా టర్మ్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోదామా అని చూస్తున్నా' అన్నాడు.

'అవును. మూడ్రోజులకే నాకు మహా బోర్ కొట్టింది. మీరు మూడేళ్ళ నుంచీ ఎలా ఉంటున్నారో ఇక్కడ?' అన్నాను.

'అదే మరి ! ఎంత నరకంగా ఉందో నాకే తెలుసు. సర్లేగాని, ఇంకేంటి సంగతులు?' అన్నాడు మళ్ళీ.

'మరీ అంత నరకంలా ఏమీలేదు. మంచి రిచ్ టౌనేగా?' అన్నాను.

'అలా అంటారేంటండి? మన తిండి కాదు, మన కల్చర్ కాదు, మన భాష కాదు. దుమ్మూ ధూళీ. మనుషుల్లో మంచీ మర్యాదా తక్కువ. మనం భరించలేం' అన్నాడు విసుగ్గా.

'అవన్నీ ఉన్నవాళ్ళు మనల్ని చూచి అదే అనుకుంటారేమో?' అన్నాను.

'సర్లెండి ఆ గోల ఎందుగ్గాని, ఎలా కాలక్షేపం అయింది ఈ మూడ్రోజులూ?' అడిగాడు.

'ఏముంది? రాత్రుళ్ళు డ్యూటీలు. పగలు ఊర్లో తిరగడం. ఈ ఊళ్ళో గురుద్వారాలన్నీ చూచాను.' అన్నాను.

'నైట్ డ్యూటీలు చేస్తూ సెకండ్ షో ఎలా చూచారు?' అని అతనికి డౌట్ వస్తుందని ఆశించాను. కానీ అతనంత సెన్స్ లో లేడు.

'ఆ ! వాటిల్లో ఏముందండి చూడ్డానికి? అదంతా సిక్కుల ప్రపంచం. మన కల్చర్ కాదు. ఇంకేంటి సంగతులు?' అన్నాడు మళ్ళీ.

'అసలు మన కల్చరంటే ఏంటో కాస్త చెప్పు నాయనా?' అని అడుగుదామనిపించింది. ఆ మాట అడిగితే హైదరాబాద్ దాకా 'ఇంకేంటి సంగతులు?' అని ఎన్నిసార్లు వినవలసి వస్తుందోనని ఆ మాటను మింగేశాను.

మనం ఎక్కడున్నా సరే, చూచేదృష్టితో చూస్తే అక్కడున్న విషయాలు కనిపిస్తాయి. ఎంతసేపూ మన గోలలో మనముంటే మన గోలే మనకు కనిపిస్తుంది. అప్పుడు అన్నీ బోరుగానే ఉంటాయి.

'సరేగాని, మీరు బ్రాహ్మిన్స్ కదా ! గురుద్వారాలు మీకు నచ్చాయా? అదేంటి? ఈ ఊర్లో కొన్ని మంచిమంచి దేవాలయాలున్నాయి. చూచారా మరి !' అడిగాడు.

'లేదు. నేను వాటిని చూడలేదు' అన్నాను.

'అదేంటి మన గుళ్ళు ఒదిలేసి గురుద్వారాలు తిరిగారా మూడ్రోజులు?' అన్నాడు ఆశ్చర్యంగా.

'అవును. I am a Sikh at heart' అన్నాను నవ్వుతూ.

'భలేవారు సార్, మీరూ మీ జోకులూ?' అన్నాడు.

'Yes. I am not sick at heart, but a Sikh at heart' అన్నాను మళ్ళీ.

అది వినిపించుకోకుండా, తను ఏదేదో వాగడం మొదలుపెట్టాడు. వాటిలో రాజకీయాలూ, రైల్వే సంగతులూ, సినిమాలూ, కరెంట్ ఎఫైర్సూ అన్నీ దొర్లుతున్నాయి. వాటిల్లో ఒక్కటీ నేను వినలేదు. కానీ అన్నింటికీ 'ఊ' కొడుతూ కళ్ళు మూసుకున్నాను.

ఎప్పుడు నిద్రపట్టిందో నాకే తెలీదు. లేచేసరికి ట్రెయిన్ సికింద్రాబాద్ ప్లాట్ ఫాం మీదకు వస్తోంది. పక్కన చూస్తె ఆ శాల్తీ కూడా మంచి నిద్రలో ఉంది.

'హైదరాబాద్ వచ్చింది. లేవండి' అంటూ అతన్ని లేపాను.

'అబ్బ. మళ్ళీ రెండ్రోజుల్లో నాందేడ్ నరకంలోకి వెళ్ళాలి.' అని తిట్టుకుంటూ అతను నిద్ర లేచాడు.

'నరకం అని మనం అనుకుంటున్నది స్వర్గం కావచ్చు. కానీ దానిని చూచే దృష్టి మనకు లేకపోతే, అప్పుడది నిజంగా నరకంలాగే కనిపిస్తుంది మరి !' అనుకున్నాను.

'మీరు ఎక్కువగా మాట్లాడరు లాగుంది' అన్నాడు కొలీగ్ తన బ్యాగ్ తీసుకుంటూ.

'అవును. మాట్లాడటం కంటే, వినడమే నాకిష్టం. ఎందుకంటే, వింటూవింటూ నిద్రలోకి జారుకోవచ్చు కదా!' అన్నాను నవ్వుతూ.

'సరే సార్, ఉంటా మరి' అంటూ బ్యాగ్ తీసుకుని దిగిపోయాడు తను.

నేనూ నా బ్యాగ్ తీసుకుని సికింద్రాబాద్ ప్లాట్ ఫాం మీద అడుగుపెట్టాను. దిగుతూ చూస్తే, నాకంటే ముందు దిగిన కర్ణపిశాచి నన్ను కోపంగా చూస్తోంది. నేను చూపు తిప్పుకుని, రాజుకోసం చూశాను. తను దూరంగా నన్ను వెతుక్కుంటూ వస్తూ కనిపించాడు.

కర్ణపిశాచి వైపు ఒకసారి చూచి, నా దారిన నేను నడక మొదలుపెట్టాను.

(అయిపోయింది)