నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

25, డిసెంబర్ 2018, మంగళవారం

What is life? - 2

part - 1 చదివి ఒకాయన ఇలా మెయిల్ ఇచ్చాడు.

'మానవ ప్రయత్నం ఏమీ అవసరం లేదనీ, పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఎప్పటికీ ఉండాలనీ మీ ఉద్దేశ్యమా? అదే నిజమైతే, ఈ చదువులెందుకు? ఉద్యోగాలెందుకు? వ్యాపారాలెందుకు? ఇదంతా ఎందుకు?'

యధావిధిగా నాకు మళ్ళీ నవ్వొచ్చింది.

అతనికి ఇలా రిప్లై ఇచ్చాను.

'ఆ పోస్ట్ మీకు వర్తించదు. అది కొంతమందికోసం వ్రాసినది. మీకోసం కాదు. దాన్ని జనరలైజ్ చెయ్యకండి'

'మరి What is life అనేదాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు?' అని మళ్ళీ మెయిల్ వచ్చింది.

'నేనేమీ డిఫైన్ చెయ్యను. మీకు కావాలంటే జవాబు చెబుతాను, మీకు తగిన విధంగా' అన్నాను.

'సరే ! నాకైతే ఎలా చెబుతారు?' అడిగాడు.

'పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఎదుగూ బొదుగూ లేకుండా అన్నింటినీ accept చేస్తూ ఉండే పనైతే, మానవజన్మకు అర్ధమే లేదు. అలా ఉండకూడదు. మనకంటూ కొన్ని గమ్యాలు లక్ష్యాలు ఉండాలి. వాటిని సాధించడానికి ప్రయత్నించాలి. అలాంటి ప్రయత్నం లోనే మనిషిజన్మకు సార్ధకత వస్తుంది. జీవితమంటే నేనిచ్చే ఒక నిర్వచనం - 'జీవితమంటే, ఉన్నదానితో సంతృప్తి పడకూడదు, లేనిదానికోసం తీవ్రంగా ప్రయత్నం చెయ్యాలి' అన్నాను.

'ఈ నిర్వచనం మీరింతకు ముందు చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది కదా !' అని మళ్ళీ మెయిల్ వచ్చింది.

'ఉండొచ్చు. ఉండదని నేను చెప్పలేదు. ఎందుకంటే, ఆ వ్యక్తులు వేరు, మీరు వేరు. ఎవరి నిర్వచనం వారిదే. ఎక్కువ పరిగెత్తేవారికి పరుగు ఆపమని చెబుతాను. అసలు లేవలేనంత బద్ధకం ఉన్నవారికి లేచి పరిగెత్తమని చెబుతాను. రెండూ కరెక్టే అర్ధం చేసుకుంటే' అన్నాను.

'మీరు చెప్పేది అర్ధం కావడం చాలా కష్టం' అన్నాడాయన మళ్ళీ.

'నేను చెప్పేదీ అదే. దూరంగా నిలబడి పైపైన చూస్తే నాలాగే అర్ధం అయ్యీ కానట్లే ఉంటుంది. దగ్గరగా వచ్చి అర్ధం చేసుకుంటే చాలా తేలిక' అన్నాను.

'ఉన్నదానితో సంతృప్తి పడమని ఒకసారి చెబుతున్నారు. అలా సంతృప్తి పడి ఊరుకోవద్దని ఇంకోసారి చెబుతున్నారు. ఏంటి ఇదంతా?' అని మళ్ళీ మెయిల్ వచ్చింది.

ఊరకే విమర్శించడానికి కాకుండా, నిజంగా విషయం తెలుసుకుందామన్న తపనతో అడుగుతున్న ఫీల్ అతని మెయిల్స్ లో కనపడింది. అందుకే ఇలా జవాబిచ్చాను.

'ఎప్పుడు ఎందులో సంతృప్తిపడాలో, ఎందులో పడకూడదో తెలుసుకోవడమే నిజమైన జీవనకళ. లౌకికమైన విషయాలలో ఒక లెవల్ దాటిన తర్వాత సంతృప్తిపడాలి. 'ఇక చాలు' అనుకోవాలి. ఆ హద్దు గీసుకోవడం తెలీకపోతే నీ జీవితం గానుగెద్దు జీవితం అయిపోతుంది. చివరకు పూర్తిగా వేస్ట్ అయిపోతుంది. అలా కొన్ని కోట్లమంది జీవితాలు అయ్యాయి. నీదీ అలాగే అవుతుంది. ఎందుకంటే, నీతో రానివాటికోసం, నీతో ఉండని వాటికోసం నువ్వు అతిగా ప్రాకులాడుతున్నావు కాబట్టి. కానీ పారమార్ధిక విషయాలలో నీకా సంతృప్తి ఉండకూడదు. ఎందుకంటే నీతో చివరకు మిగిలేదీ, నీతో వచ్చేదీ అదే. దానిలో నీకు సంతృప్తి పనికిరాదు. దానికోసం ఇంకా ఇంకా తపించాలి. ఇంకా ఇంకా వెదకాలి. ప్రతిక్షణం నిన్ను నీవు అధిగమించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కొత్తకొత్త శిఖరాలను అందుకుంటూ ఉండాలి. అక్కడ ఎలాంటి హద్దూ పనికిరాదు. దానికి అడ్డు వచ్చే మనుషులనూ, పరిస్థితులనూ ఏమాత్రం సంకోచించకుండా పక్కన పెట్టెయ్యాలి.

కానీ మనుషులు ఎక్కడ చూచినా దీనికి రివర్స్ లో పోతున్నారు. లౌకికంగా అపరిమితమైన ఆరాటంతో విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అనవసరమైన మనుషులనూ వస్తువులనూ తెగ పోగేసుకుంటున్నారు. పారమార్దికంగా విపరీతమైన బద్ధకం, సోమరితనాలలో కూరుకుపోయి ఉన్నారు. ఆ దారిలో ఏమాత్రమూ ప్రయత్నం చెయ్యడం లేదు. అంటే - ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేనినైతే 'ఇక చాలు' అనుకోవాలో దానిని అనుకోవడం లేదు. దేనికోసమైతే నిజంగా తపన పడాలో, విపరీతమైన ప్రయత్నం చెయ్యాలో, అది చెయ్యడం లేదు.

కనుకనే ఈలోకంలో ఎవడికీ నిజమైన సంతృప్తి లేదు. అదెప్పటికీ రాదు కూడా! వస్తుందని భ్రమిస్తూ ఉంటారంతే! అందుకే, మనం గనుక సరిగ్గా గమనిస్తే, ప్రతి ఇంట్లోనూ గొడవలే, అసంతృప్తే, చికాకులే, మనస్పర్ధలే. ప్రతివాడూ ఏడుస్తూనే బ్రతుకుతున్నాడు. కోట్లు మూలుగుతున్నవాడూ ఆనందంగా లేడు. అడుక్కుండేవాడూ ఆనందంగా లేడు. కానీ ఇద్దరికీ సుఖం ఉంది. ఎవరి స్థాయికి తగిన సుఖం వారికి ఉంది. ఆనందం మాత్రం లేదు. ఆనందంగా ఉన్నామన్న భ్రమ మాత్రం ఉంది.

దీనికి ఒకటే కారణం !

దేనికి ఎక్కడ హద్దు గీసుకోవాలి? దేనిలో హద్దు లేకుండా దూసుకుపోవాలి? ఎవరిని దగ్గరగా తీసుకోవాలి? ఎవరిని దూరంగా ఉంచాలి? అన్న తెలివి మనుషులకు పూర్తిగా లోపించడమే దీనికి కారణం. జీవితంలో మీ ప్రయారిటీస్ సరిగ్గా లేకపోవడమే దీనికంతా కారణం. ఈ చిన్నవిషయం మీకు అర్ధం కాలేదు. అందుకే ఇలా మళ్ళీమళ్ళీ అడుగుతున్నారు.' అని మెయిల్ ఇచ్చాను.

ఆ తర్వాత అతని నుండి మెయిల్ రాలేదు. బహుశా అతనిలో కొంచమైనా ఆలోచన తలెత్తిందనీ, జిజ్ఞాస పుట్టిందనీ, ఆత్మపరిశీలన మొదలైందనీ అనుకున్నాను.

ఇది చదివాక మీకూ అలాగే అనిపిస్తోందా? అనిపిస్తే మంచిదే. అనిపించకపోతే మాత్రం మీ జీవితంలో నిజమైన ఆనందాన్ని మీరు ఎన్నటికీ పొందలేరని నేను గట్టిగా చెప్పగలను.

ఎక్కడ ఒదగాలో, ఎక్కడ ఎదగాలో తెలుసుకోవడమే మనిషి జీవితంలో అతి ముఖ్యమైన విషయం అని నేనంటాను. ఇది తెలీకపోవడమే మనిషి జీవితంలోని అసంతృప్తికీ, అసహనానికీ, అశాంతికీ ప్రధాన కారణమని కూడా అంటాను.

కాదంటారా?
read more " What is life? - 2 "

23, డిసెంబర్ 2018, ఆదివారం

What is life? - 1

ఈ ప్రశ్నను చాలామంది నన్ను అడిగారు. చాలా సందర్భాలలో అడిగారు. అడిగిన ప్రతివారికీ ఒక్కొక్క జవాబు చెప్పాను. ఒకరికి చెప్పింది ఇంకొకరికి చెప్పలేదు. 'ఎందుకలా ఒక్కొక్కరికి ఒక్కొక్క జవాబు చెబుతున్నావు?' - అని నాకు బాగా దగ్గరవాళ్ళూ, నన్ను దగ్గరగా గమనించే వాళ్ళూ అడిగారు.

'ఎందుకంటే - ఎవరి జీవితం వారిది కాబట్టి, ఎవరి జవాబు వారిదే అవుతుంది' అని వారికి చెప్పాను.

జీవితాన్ని నేను అనేక రకాలుగా నిర్వచిస్తూ ఉంటాను. వాటిలో ఒకటి ఇప్పుడు చెబుతున్న నిర్వచనం.

'జీవితమంటే - లేనిదానికోసం వెదకడం. ఎదురుగా ఉన్నదాని విలువను గుర్తించలేకపోవడం' అని కొందరికి చెప్పాను. ఎందుకంటే, వాళ్ళు చేస్తున్నది అదే కాబట్టి.

కొద్దిగా ఆలోచిస్తే ఇది నిజమని మీలో చాలామందికి అనిపిస్తుంది. మీకు నిజంగా ఆలోచనాశక్తి ఉంటే !

మనలో చాలామంది ఇదే చేస్తూ ఉంటాం. ఎదురుగా ఉన్నదాని విలువను గుర్తించాలంటే చాలా తేలికని మనం అనుకుంటాం. కానీ అసలైన కష్టం అదే. మన ఎదురుగా ఉన్నప్పుడు ఏదైనా సరే, అదంత విలువైనదిగా మనకు అనిపించదు. ఒకవేళ మొదటి రోజున అనిపించినా రెండో రోజుకు ఆ విలువ తగ్గిపోతుంది. మూడో రోజుకు మరీ తగ్గిపోతుంది. చివరకు అదొక విలువలేనిదిగా మనకనిపిస్తుంది. అది మానవ నైజం.

ఎందుకంటే, మనలో ప్రతివారికీ మనమేంటో తెలుసు. మనలో ఉన్న తక్కువతనం ఏంటో తెలుసు. మనమెంత పనికిరానివాళ్ళమో తెలుసు. కనుక, మనలాంటి వాళ్లకు ఇంత ఉన్నతమైనవి దొరుకుతాయా అని మన సందేహం ! కాబట్టి మనకు దొరికినవీ, మన ఎదురుగా ఉన్నవీ, మనలాగే పనికిరానివని మనలో ప్రతివాడూ లోలోపల అనుకుంటూ ఉంటాడు !

అందుకే పక్కింటి పుల్లకూర రుచిగా అనిపిస్తుంది ! కానీ అది పుల్లకూరే అన్నది నిదానంగా అర్ధమౌతుంది. అసలైన పుల్లయ్యలమూ పుల్లమ్మలమూ మనమేనన్నది ఇంకా నిదానంగా అర్ధమౌతుంది !

మనలో ప్రతివారి దృష్టీ ఎక్కడో చుక్కలలో ఉంటుంది. కనుక మన పక్కనే ఉన్నదాని విలువ మనకు అర్ధం కాదు. అది భార్యైనా, భర్తైనా, స్నేహితులైనా, గురువైనా ఎవరైనా ఇంతే ! అయితే, అందరూ ఇలాగే ఉంటారా? అంటే, ఉండరనే చెప్పాలి. అందరూ అలా ఎందుకుంటారు? జీవితం మనకిచ్చిన వాటి విలువను గుర్తించేవాళ్ళు కూడా అక్కడక్కడా ఉంటుంటారు. కానీ చాలామంది ఆ విలువను గుర్తించలేనివాళ్ళే అయి ఉంటారు. అలా గుర్తించిన కొద్దిమందినీ తమ చెత్త లాజిక్స్ తో చెడగొట్టాలని చూసేవాళ్ళే అయి ఉంటారు.

ఈ రోజుల్లో మీరొక విచిత్రాన్ని గమనించవచ్చు. అరవై ఏళ్ళు వచ్చినా మూడు జేబుల్లో మూడు మొబైల్ ఫోన్స్ పెట్టుకుని క్షణం తీరిక లేకుండా వాటిలో మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నవాళ్ళు మీకీరోజున ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. వాళ్ళేదో పెద్ద బాధ్యతాపరులని, ఆ వయసులో కూడా ఇంకాఇంకా కుటుంబం కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారని మీరనుకుంటే పప్పులో కాలేసినట్లే.  నా దృష్టిలో అలాంటివాళ్ళు బుర్రలేనివాళ్ళు. అలాంటి వారిని చూస్తే నాకు చాలా జాలి కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే - అరవైఏళ్ళుగా సాధించలేనిది ఇక ఆపైన సాధించడానికి ఏముంటుంది గనుక?

ఆ రకంగా అరవై డబ్భైలలో కూడా క్షణం తీరిక లేకుండా నిరంతరం 'డబ్బు డబ్బు' అంటూ కలవరించే వారిని మీరొక మాట అడిగి చూడండి. నేను చెప్పేదానిలో నిజం మీకే అర్ధమౌతుంది.

'జీవితంలో మీరు కోరుకున్నది మీరు నిజంగా పొందగలిగారా? మీరు నిజంగా శాంతిగా సంతృప్తిగా ఉన్నారా?'

'లేదు' అనే జవాబు వస్తుంది. 'పొందాను, ఉన్నాను' అని వస్తేమాత్రం ఆ వ్యక్తికి జీవితమంటే సరియైన అవగాహన లేదని అర్ధం. లేదా అది అబద్ధమని అర్ధం. ఈ రెండూ తప్ప మూడో చాయిస్ ఉండదు.

ఎందుకంటే - కనీసం వాళ్ళు కట్టుకున్న ఇంట్లో వాళ్ళే హాయిగా ఉండే యోగ్యత ఈరోజుల్లో ఎంతమందికుంది? తమ సంపాదనను చక్కగా అనుభవించే యోగ్యత ఎంతమందికుంది? ఇల్లు కట్టించేది ఒకరైతే, దాంట్లో ఉండేది మరొకరు, సంపాదన ఒకరిదైతే, దాన్ని ఎంజాయ్ చేసేది మరొకరు ! ఈ రెండు ఉదాహరణలు చాలు, మనిషి బ్రతుకుతున్నాడేగాని జీవించడం లేదని చెప్పడానికి !

కాదా?

అందుకే ఏ మాత్రం నిజాయితీ ఉన్న ఏ మనిషైనా ఇదే చెబుతాడు.

'నేను నా జీవితమంతా ఎన్నింటి కోసమో పరిగెత్తాను. కానీ చివరకు అవన్నీ వృధా అని తెలిసింది. నేను వేటి వెనుక పరిగెత్తానో అవన్నీఎండమావులే అని అర్ధమైంది. కానీ ఈ విషయం తెలిసేలోపు జీవితం అయిపోతోంది. ఏడవడం తప్ప ఇప్పుడేమీ చెయ్యలేను. సంపాదించాను. కానీ జీవించలేకపోయాను. ఎన్నో పొందాను. కానీ ముఖ్యమైనవి మాత్రం పోగొట్టుకున్నాను. నా జీవితం వేస్ట్ చేసుకున్నాను. ఎందుకిలా బ్రతికానో అర్ధం కావడం లేదు' - అనే ప్రతివాడూ అంటాడు. అతనికి ఏమాత్రమైనా ఆలోచనా శక్తీ, పరిశీలనా శక్తీ, నిజాయితీ గట్రాలు ఉన్నట్లయితే !

అవి లేని మామూలు మనుషుల గురించి, చవకబారు మనుషుల గురించి, ఆ వయసులో కూడా ఇంకా డబ్బనీ, షేర్ మార్కెట్లనీ, రియల్ ఎస్టేటనీ ప్రాకులాడే క్షుద్రజీవుల గురించి అసలు మనం మాట్లాడుకోవడమే అక్కర్లేదు. వాళ్ళు మన చర్చకు ఏమాత్రమూ తగరు.

జీవితమంటే - అనవసరమైన వాటికోసం, సిల్లీ విషయాల కోసం, జీవితమంతా పరిగెత్తి పరిగెత్తి చివరకు అసంతృప్తితో జీవితాన్ని చాలించడం తప్ప ఇంకేమీ లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది పరమసత్యం ! ఎందుకంటే, మహామహా వాళ్ళకే ఈ అసంతృప్తి తప్పలేదు, ఇక జీవితమంతా డబ్బుకోసం, ఆస్తులకోసం, సుఖాలకోసం ప్రాకులాడే అల్పజీవుల సంగతి ప్రత్యేకంగా చెప్పాలా?

దీనికల్లా కారణం ఒక్కటే - ఎదురుగా ఉన్నదాని విలువను గుర్తించలేక పోవడం. ఎక్కడో ఏదో ఉన్నదని పరిగెత్తి పరిగెత్తి చివరకు చతికిల బడటం. ఈలోపల జీవితం కాస్తా చేతుల్లోంచి జారిపోవడం. చివరికి ఎందుకు బ్రతికామో అర్ధంకాక ఏడుస్తూ చావడం. ఎవరి జీవితమైనా ఇంతే !

అయితే ఇక్కడొక విచిత్రం ఉంది.

పరిగెట్టుతున్నంత సేపూ పరుగు నిజమే అనిపిస్తుంది. ఆపిన తర్వాతే అదెంత అసంబద్ధమైన పనో అర్ధమౌతుంది. కానీ అప్పుడు చేసేదేమీ ఉండదు. ఇదే జీవితంలో అసలైన కామెడీ !

కనుక నిజంగా తెలివైనవాడు ఏం చెయ్యాలి?

సరియైన పరుగు పరిగెత్తాలి. దానికంటే ముందుగా, ఆ సరియైన పరుగు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత సరిగ్గా పరుగెత్తాలి. పరుగెత్తుతున్నప్పుడు కూడా 'ఈ పరుగు నిజంకాదు' అన్న స్పృహలో ఉంటూ పరిగెత్తాలి. 'నేను పరిగెత్తడం లేదు' అన్నది ఫీలౌతూ పరిగెత్తాలి.

జీవితం నిజం కాదన్న స్పృహలో ఉన్నప్పుడు మాత్రమే జీవితం నిజం అవుతుంది ! తాను పరుగెట్టడం లేదన్న స్పృహలో ఉన్నప్పుడే అది నిజమైన పరుగు అవుతుంది ! జీవితం విలువను సరిగా గుర్తించి సరిగా బ్రతికినప్పుడే అది జీవితం అవుతుంది. లేకపోతే మామూలు బ్రతుకు అవుతుంది !

కానీ ఇంత సింపుల్ గా కనిపిస్తున్న ఈ పనిని ఎవ్వరూ చెయ్యలేరు. ఇన్ని వందలకోట్ల ప్రపంచజనాభాలో కూడా ఈ పనిని నిజంగా చెయ్యగలిగేవాళ్ళు ఒక పదిమంది ఉంటారో లేదా వాళ్ళు కూడా ఉండరో? అదే మాయంటే ! అదే universal illusion అంటే !

ఈ మాయకు ఎవరూ అతీతులు కారు. దీనికి ఎవరూ మినహాయింపు కారు. ఎవరూ దీనికి భిన్నంగా లేరు.

మీరున్నారా?

గుండెల మీద చెయ్యేసుకుని, నిజాయితీగా చెప్పండి చూద్దాం !
read more " What is life? - 1 "

18, డిసెంబర్ 2018, మంగళవారం

Warangal Retreat- 2018

ముందే ప్లాన్ చేసినట్లుగా వరంగల్ స్పిరిట్యువల్ రిట్రీట్ 16-12-2018 న గ్రాండ్ కాకతీయ హోటల్ లో జయప్రదంగా జరిగింది. పంచవటి ఇండియా సభ్యులు, కొంతమంది ఇదే సమయానికి ఇండియాలో ఉన్న పంచవటి అమెరికా సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే రిట్రీట్లో మా లేటెస్ట్ 'ఈ - బుక్' 'మహా సౌరమ్' ను విడుదల చేశాం.

నా మార్గంలో మొదటి, రెండు లెవల్స్ సాధన, ప్రశ్నోత్తరాల కార్యక్రమం, సభ్యుల ఆధ్యాత్మిక జీవన సందేహాలకు సమాధానాలు, వారి వారి అనుభవాల కలబోత, చిన్నారుల పాటలు, కలసి భోజనాలు, ఆనందపు సంబరాలు, ఆత్మీయాతానురాగాల మధ్యన ఈ రిట్రీట్ జరిగింది. విడిపోయే సమయంలో వెళ్ళలేక వెళ్ళలేక కన్నీళ్లు పెట్టుకున్న సభ్యుల ప్రేమానురాగాలు అమూల్యాలు. ఇవి భగవంతుడు మాకిచ్చిన అద్భుతమైన వరాలు.

ఈ రిట్రీట్ ను చక్కగా నిర్వహించి దీనిని జయప్రదం చేసిన నా శిష్యుడు తాటికొండ రామారావ్ కు, అతని శ్రీమతికి,  నా కృతజ్ఞతలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ రిట్రీట్ ను సక్సెస్ చెయ్యడంలో తోడ్పడిన రాజు సైకం, శ్రీరామ్మూర్తిలకు, నా మిగతా శిష్యులందరికీ ఆశీస్సులు.

రిట్రీట్ తర్వాత గ్రామాధిదేవత అయిన భద్రకాళి అమ్మవారి దర్శనంతో కార్యక్రమం ముగిసింది.

రిట్రీట్ ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.




















































































read more " Warangal Retreat- 2018 "