part - 1 చదివి ఒకాయన ఇలా మెయిల్ ఇచ్చాడు.
'మానవ ప్రయత్నం ఏమీ అవసరం లేదనీ, పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఎప్పటికీ ఉండాలనీ మీ ఉద్దేశ్యమా? అదే నిజమైతే, ఈ చదువులెందుకు? ఉద్యోగాలెందుకు? వ్యాపారాలెందుకు? ఇదంతా ఎందుకు?'
యధావిధిగా నాకు మళ్ళీ నవ్వొచ్చింది.
అతనికి ఇలా రిప్లై ఇచ్చాను.
'ఆ పోస్ట్ మీకు వర్తించదు. అది కొంతమందికోసం వ్రాసినది. మీకోసం కాదు. దాన్ని జనరలైజ్ చెయ్యకండి'
'మరి What is life అనేదాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు?' అని మళ్ళీ మెయిల్ వచ్చింది.
'నేనేమీ డిఫైన్ చెయ్యను. మీకు కావాలంటే జవాబు చెబుతాను, మీకు తగిన విధంగా' అన్నాను.
'సరే ! నాకైతే ఎలా చెబుతారు?' అడిగాడు.
'పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఎదుగూ బొదుగూ లేకుండా అన్నింటినీ accept చేస్తూ ఉండే పనైతే, మానవజన్మకు అర్ధమే లేదు. అలా ఉండకూడదు. మనకంటూ కొన్ని గమ్యాలు లక్ష్యాలు ఉండాలి. వాటిని సాధించడానికి ప్రయత్నించాలి. అలాంటి ప్రయత్నం లోనే మనిషిజన్మకు సార్ధకత వస్తుంది. జీవితమంటే నేనిచ్చే ఒక నిర్వచనం - 'జీవితమంటే, ఉన్నదానితో సంతృప్తి పడకూడదు, లేనిదానికోసం తీవ్రంగా ప్రయత్నం చెయ్యాలి' అన్నాను.
'ఈ నిర్వచనం మీరింతకు ముందు చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది కదా !' అని మళ్ళీ మెయిల్ వచ్చింది.
'ఉండొచ్చు. ఉండదని నేను చెప్పలేదు. ఎందుకంటే, ఆ వ్యక్తులు వేరు, మీరు వేరు. ఎవరి నిర్వచనం వారిదే. ఎక్కువ పరిగెత్తేవారికి పరుగు ఆపమని చెబుతాను. అసలు లేవలేనంత బద్ధకం ఉన్నవారికి లేచి పరిగెత్తమని చెబుతాను. రెండూ కరెక్టే అర్ధం చేసుకుంటే' అన్నాను.
'మీరు చెప్పేది అర్ధం కావడం చాలా కష్టం' అన్నాడాయన మళ్ళీ.
'నేను చెప్పేదీ అదే. దూరంగా నిలబడి పైపైన చూస్తే నాలాగే అర్ధం అయ్యీ కానట్లే ఉంటుంది. దగ్గరగా వచ్చి అర్ధం చేసుకుంటే చాలా తేలిక' అన్నాను.
'ఉన్నదానితో సంతృప్తి పడమని ఒకసారి చెబుతున్నారు. అలా సంతృప్తి పడి ఊరుకోవద్దని ఇంకోసారి చెబుతున్నారు. ఏంటి ఇదంతా?' అని మళ్ళీ మెయిల్ వచ్చింది.
ఊరకే విమర్శించడానికి కాకుండా, నిజంగా విషయం తెలుసుకుందామన్న తపనతో అడుగుతున్న ఫీల్ అతని మెయిల్స్ లో కనపడింది. అందుకే ఇలా జవాబిచ్చాను.
'ఎప్పుడు ఎందులో సంతృప్తిపడాలో, ఎందులో పడకూడదో తెలుసుకోవడమే నిజమైన జీవనకళ. లౌకికమైన విషయాలలో ఒక లెవల్ దాటిన తర్వాత సంతృప్తిపడాలి. 'ఇక చాలు' అనుకోవాలి. ఆ హద్దు గీసుకోవడం తెలీకపోతే నీ జీవితం గానుగెద్దు జీవితం అయిపోతుంది. చివరకు పూర్తిగా వేస్ట్ అయిపోతుంది. అలా కొన్ని కోట్లమంది జీవితాలు అయ్యాయి. నీదీ అలాగే అవుతుంది. ఎందుకంటే, నీతో రానివాటికోసం, నీతో ఉండని వాటికోసం నువ్వు అతిగా ప్రాకులాడుతున్నావు కాబట్టి. కానీ పారమార్ధిక విషయాలలో నీకా సంతృప్తి ఉండకూడదు. ఎందుకంటే నీతో చివరకు మిగిలేదీ, నీతో వచ్చేదీ అదే. దానిలో నీకు సంతృప్తి పనికిరాదు. దానికోసం ఇంకా ఇంకా తపించాలి. ఇంకా ఇంకా వెదకాలి. ప్రతిక్షణం నిన్ను నీవు అధిగమించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కొత్తకొత్త శిఖరాలను అందుకుంటూ ఉండాలి. అక్కడ ఎలాంటి హద్దూ పనికిరాదు. దానికి అడ్డు వచ్చే మనుషులనూ, పరిస్థితులనూ ఏమాత్రం సంకోచించకుండా పక్కన పెట్టెయ్యాలి.
కానీ మనుషులు ఎక్కడ చూచినా దీనికి రివర్స్ లో పోతున్నారు. లౌకికంగా అపరిమితమైన ఆరాటంతో విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అనవసరమైన మనుషులనూ వస్తువులనూ తెగ పోగేసుకుంటున్నారు. పారమార్దికంగా విపరీతమైన బద్ధకం, సోమరితనాలలో కూరుకుపోయి ఉన్నారు. ఆ దారిలో ఏమాత్రమూ ప్రయత్నం చెయ్యడం లేదు. అంటే - ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేనినైతే 'ఇక చాలు' అనుకోవాలో దానిని అనుకోవడం లేదు. దేనికోసమైతే నిజంగా తపన పడాలో, విపరీతమైన ప్రయత్నం చెయ్యాలో, అది చెయ్యడం లేదు.
కనుకనే ఈలోకంలో ఎవడికీ నిజమైన సంతృప్తి లేదు. అదెప్పటికీ రాదు కూడా! వస్తుందని భ్రమిస్తూ ఉంటారంతే! అందుకే, మనం గనుక సరిగ్గా గమనిస్తే, ప్రతి ఇంట్లోనూ గొడవలే, అసంతృప్తే, చికాకులే, మనస్పర్ధలే. ప్రతివాడూ ఏడుస్తూనే బ్రతుకుతున్నాడు. కోట్లు మూలుగుతున్నవాడూ ఆనందంగా లేడు. అడుక్కుండేవాడూ ఆనందంగా లేడు. కానీ ఇద్దరికీ సుఖం ఉంది. ఎవరి స్థాయికి తగిన సుఖం వారికి ఉంది. ఆనందం మాత్రం లేదు. ఆనందంగా ఉన్నామన్న భ్రమ మాత్రం ఉంది.
కనుకనే ఈలోకంలో ఎవడికీ నిజమైన సంతృప్తి లేదు. అదెప్పటికీ రాదు కూడా! వస్తుందని భ్రమిస్తూ ఉంటారంతే! అందుకే, మనం గనుక సరిగ్గా గమనిస్తే, ప్రతి ఇంట్లోనూ గొడవలే, అసంతృప్తే, చికాకులే, మనస్పర్ధలే. ప్రతివాడూ ఏడుస్తూనే బ్రతుకుతున్నాడు. కోట్లు మూలుగుతున్నవాడూ ఆనందంగా లేడు. అడుక్కుండేవాడూ ఆనందంగా లేడు. కానీ ఇద్దరికీ సుఖం ఉంది. ఎవరి స్థాయికి తగిన సుఖం వారికి ఉంది. ఆనందం మాత్రం లేదు. ఆనందంగా ఉన్నామన్న భ్రమ మాత్రం ఉంది.
దీనికి ఒకటే కారణం !
దేనికి ఎక్కడ హద్దు గీసుకోవాలి? దేనిలో హద్దు లేకుండా దూసుకుపోవాలి? ఎవరిని దగ్గరగా తీసుకోవాలి? ఎవరిని దూరంగా ఉంచాలి? అన్న తెలివి మనుషులకు పూర్తిగా లోపించడమే దీనికి కారణం. జీవితంలో మీ ప్రయారిటీస్ సరిగ్గా లేకపోవడమే దీనికంతా కారణం. ఈ చిన్నవిషయం మీకు అర్ధం కాలేదు. అందుకే ఇలా మళ్ళీమళ్ళీ అడుగుతున్నారు.' అని మెయిల్ ఇచ్చాను.
ఆ తర్వాత అతని నుండి మెయిల్ రాలేదు. బహుశా అతనిలో కొంచమైనా ఆలోచన తలెత్తిందనీ, జిజ్ఞాస పుట్టిందనీ, ఆత్మపరిశీలన మొదలైందనీ అనుకున్నాను.
ఇది చదివాక మీకూ అలాగే అనిపిస్తోందా? అనిపిస్తే మంచిదే. అనిపించకపోతే మాత్రం మీ జీవితంలో నిజమైన ఆనందాన్ని మీరు ఎన్నటికీ పొందలేరని నేను గట్టిగా చెప్పగలను.
ఎక్కడ ఒదగాలో, ఎక్కడ ఎదగాలో తెలుసుకోవడమే మనిషి జీవితంలో అతి ముఖ్యమైన విషయం అని నేనంటాను. ఇది తెలీకపోవడమే మనిషి జీవితంలోని అసంతృప్తికీ, అసహనానికీ, అశాంతికీ ప్రధాన కారణమని కూడా అంటాను.
కాదంటారా?