మార్గశిర బహుళ సప్తమినాడు దివ్యజనని శారదామాత ఈ భూమ్మీద జన్మించింది. అది 28-12-2018 తేదీన వచ్చింది. ఆ పవిత్రదినాన, అమ్మ జన్మించిన పవిత్రభూమి బెంగాల్ రాష్ట్రంలోని జయరాంబాటిలో 'మహాసౌరమ్' పుస్తకాన్ని విడుదల చేశాను.
దివ్యజనని శారదామాత అప్పట్లో నివసించిన పూరిపాకను అలాగే ఉంచి జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు శ్రీరామకృష్ణమఠం వారు. అక్కడ, దాదాపు 40 మంది పంచవటి సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
'మేధాసి దేవి విదితాఖిల శాస్త్రసారా (అన్ని శాస్త్రములను ఆకళింపు చేసికొనే మేధస్సువు, ప్రజ్ఞవు నీవే)' అని దేవీభాగవతం కొనియాడిన రీతిలో, అజ్ఞానినైన నాచేత వేదమంత్రాలకు భాష్యాన్ని, 360 తెలుగు పద్యాలను వ్రాయించిన జగజ్జనని కృపను స్మరిస్తూ అమ్మ పాదాల దగ్గర ఈ పుస్తకాన్ని విడుదల చేశాం.
ఈ పుస్తకాన్ని వ్రాసింది నేనే అయినా 'వ్రాస్తున్నది నేను కాదన్న' స్పృహలో ఉంటూ వ్రాశాను గనుక, పంచవటి సభ్యులందరి చేతా ఈ గ్రంధాన్ని విడుదల చేయించడం జరిగింది.
ఆ సమయానికి అక్కడే ఉన్న కొంతమంది బెంగాలీ భక్తులు, వారికి తెలుగు రాకపోయినా కూడా, ఎంతో భక్తితో ఈ పుస్తకాన్ని అడిగి మరీ తీసుకుని ఆనందించారు. ఈ కార్యక్రమం జరిగినంతసేపూ ఒక బెంగాలీ మహిళ చక్కని కట్టూబొట్టుతో మాతోనే ఉండి, పుస్తకం విడుదల అయ్యాక ఒక కాపీని అడిగి మరీ తీసుకుని ఆ తర్వాత కనిపించకుండా ఎటో వెళ్ళిపోయింది. ఆ రూపంలో వచ్చి మమ్మల్ని కరుణించినది జగజ్జనని శారదాదేవియేనని భావించాము.
ఈ సందర్భంగా తీసిన ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.