కొంతకాలం క్రితం ఒక స్నేహితుడు నాతో ఇలా అన్నాడు.
'మా స్వామీజీ చాలా శక్తివంతుడు. ఒక్కసారి ఆయన దర్శనం చేసుకోరాదు?'
'ఆయన శక్తిని నేను తట్టుకోగలనో లేదో, ఎందుకొచ్చిన గోలలే, నాకొద్దు' అన్నాను.
'ప్రతిదీ అలా తీసిపారెయ్యకు. ఆయన్ను దర్శించుకుంటే నీకు నిజంగా మంచి జరుగుతుంది' అన్నాడు ఫ్రెండ్ గాడు.
'ఇప్పుడు కొత్తగా జరిగే మంచి ఇంకేముందిలే నాకు?' అన్నాను.
'నీదంతా వితండవాదమే. పోనీ ఆయన్ను మీ ఇంటికే తీసుకొస్తాను. అయితే ఇక్కడ ఒక చిన్న విషయముంది' అన్నాడు.
అతను చెప్పబోయేది అర్ధమైనా, అర్ధం కానట్లు, 'ఏంటది?' అంటూ అడిగాను.
'ఆయన ఎవరింటికి వచ్చినా లక్ష తీసుకుంటాడు. కాళ్ళు కడిగితే ఏభై వేలు తీసుకుంటాడు.' అన్నాడు.
'ఆయన కాళ్ళు మనం కడగడం ఎందుకు? ఆయన కడుక్కోలేడా?' అడిగాను నవ్వుతూ.
'జోకులెయ్యకు. అది మర్యాద. పెద్దవాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు అలా చెయ్యడం మన సాంప్రదాయం.' అన్నాడు.
'మరి ఆ మర్యాదకు వెలకట్టి డబ్బులు తీసుకోవడం ఏ సాంప్రదాయం?' అడిగాను.
వాడికి కోపం వచ్చింది.
'ఆయన ఎవరి ఇంటికి పడితే వారి ఇంటికి రాడు. నేను కాబట్టి, ప్రత్యేకంగా చెప్పి మీ ఇంటికి తీసుకొస్తాను. ఒక లక్షన్నరకే నువ్వు అలా అయిపోతున్నావేంటి?' అన్నాడు.
'ఇందులో నీ కమీషన్ ఎంత నాయనా?' అందామని నోటిదాకా వచ్చింది, ఎందుకులే పిచ్చోడు బాధపడతాడని మాటలు మింగేశా. వీడికి కొంచం అర్ధమయ్యేలా చెప్పాలని అనిపించింది.
'మా ఇంటికే ఆయన్ను తీసుకురావాలని నీకెందుకంత ఆత్రుత?' అడిగాను.
'అంటే, నువ్వు కూడా కొద్దో గొప్పో ఈ సబ్జెక్ట్ తెలిసినవాడివి కదా. అందుకని' అన్నాడు ఫ్రెండ్.
'సరే. మీ స్వామీజీ రేట్ నువ్వు చెప్పావు కదా ! మరి నా రేట్ కూడా చెప్తా విను' అన్నాను.
'అదేంటి?' అన్నాడు అయోమయంగా.
'విను. ఆయన మా ఇంటికి రానక్కరలేదు. పాపం పెద్దాయన్ని అంత కష్టపెట్టడం నాకిష్టం లేదు. ఒక ఉపాయం చెప్తా. నువ్వు చెప్పినట్టు నేనే ఆయన ఆశ్రమానికి వస్తా. కాకపోతే నా రేట్, ఆయన రేట్ కు రివర్స్ లో ఉంటుంది.' అన్నాను.
ఇంకా అయోమయంగా చూస్తున్నాడు.
'నేను ఆయన ఆశ్రమానికి రావాలంటే నాకు ఏభై వేలివ్వాలి. నా కాళ్ళు మీ స్వామీజీ కడగాలంటే మాత్రం అక్షరాలా లక్ష తీసుకుంటాను. అంతగా ఆశ్చర్యపోకు. ఎందుకంటే, ఆయన నా పాదాలు తాకినందుకు నేను పడే బాధలు పోవాలంటే ఈ లక్ష ఏ మూలకూ చాలదు గనుక. నిజానికి అయిదు లక్షలు తీసుకోవాలి. పోన్లే పాపం స్వామీజీకదా అని ఒక లక్షతో సరిపెట్టుకుంటున్నాను' అన్నాను.
వాడికి పిచ్చి కోపం వచ్చింది. నోట్లోంచి మాటలు రాక వణుకుతున్నాడు.
'అంతలా వణక్కు. నీకింత బీపీ ఉందని తెలిస్తే ఈ టాపిక్ అసలు తెచ్చేవాడినే కాను. శాంతంగా విను. కాషాయవస్త్రాలు కట్టుకున్నంత మాత్రానా, ఆశ్రమాలు పెట్టినంత మాత్రానా నేను స్వామీజీలను గౌరవించను. వారిలో నిజమైన ఆధ్యాత్మికశక్తి నాకు కనిపించాలి. అప్పుడే వారిని గుర్తిస్తాను. గౌరవిస్తాను. లేదంటే వాళ్లకు నమస్కారం కూడా చెయ్యను. మీ స్వామీజీ అయినా అంతే. ఆయన దగ్గర ప్రచారం తప్ప ఏమీ లేదని నాకు బాగా తెలుసు.' అన్నాను.
'పెద్ద పెద్ద వాళ్ళు ఆయన కాళ్ళకు మొక్కుతున్నారు' అన్నాడు కోపంగా.
'అలా అయితే అతను ఇంకా వరస్ట్ అన్నమాట ! సోకాల్డ్ పెద్ద పెద్ద వాళ్ళంతా అవినీతిపరులే అని నీకూ తెలుసు నాకూ తెలుసు. అలాంటి వాళ్ళను రానిస్తున్నాడంటే, ఇక మీ స్వామీజీ ఎలాంటివాడో నువ్వు చెప్పనక్కర్లేదు. ఇది విన్న తర్వాత, నా రేట్లు డబల్ చేస్తున్నాను. నేను ఆయన ఆశ్రమానికి రావాలంటే లక్ష ఇవ్వాలి. నా కాళ్ళు ఆయన కడగాలంటే రెండు లక్షలివ్వాలి. ఆ తర్వాత వాటిని టవల్ తో తుడవడానికి మూడు లక్షలివ్వాలి. అప్పుడే మీ స్వామీజీ ఆశ్రమానికి వస్తాను. వెళ్లి నా మాటగా ఆయనతో చెప్పు. ఇంకో సంగతి ! మధ్యవర్తులను ఎవరినీ ఆ డబ్బులు తాకనివ్వను. మొత్తం నేనే తీసుకుంటాను. కమీషన్ ఏజంట్ల మీద నాకు నమ్మకం లేదు. ఏదో నువ్వు కాబట్టి ఈ డీల్ కి వప్పుకున్నాను. వేరేవాళ్ళకైతే ఈ రేటుకి అస్సలొప్పుకోను. ఇక మీ స్వామీజీ అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోమను!' అన్నాను నవ్వుతూ.
చాలా కోపంగా చూస్తూ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు.
విపరీతమైన నవ్వొచ్చింది నాకు !
విపరీతమైన నవ్వొచ్చింది నాకు !
ఈ పాదపూజలేంటో, కాళ్ళు కడగడం ఏంటో, వాటికి రేట్లు ఏంటో, ఇదంతా చూచి ఈ సాంప్రదాయాలను మొదటగా మొదలుపెట్టిన మహనీయుల ఆత్మలు ఎంతగా క్షోభిస్తున్నాయో ఆ దేవుడికే తెలియాలి. ఇలాగేగా, హిందూధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు కొందరు ! సత్యం, ధర్మం, త్యాగం, ప్రేమ, దైవత్వాలను బోధించేవారికి ఈ రేట్లేంటో, అవి ఇవ్వగలిగిన వారిళ్ళకే వాళ్ళు రావడం ఏంటో? మామూలు మనుషులను పట్టించుకోకపోవడం ఏంటో? అంతా అయోమయంగా ఉంది !! ఇదా దైవత్వం అంటే? ఇదా వేదాంతం చెప్పింది? ఇదా అసలైన హిందూధర్మం??
మధ్యలో ఇంకొంతమంది మా ఫ్రెండ్ లాంటి బ్రోకర్ గాళ్లుంటారు. ఎవరికైనా కాస్త మతపిచ్చి ఉన్నట్లు పసిగడితే, వెంటనే వాడిని రెలిజియస్ బ్లాక్ మెయిల్ చేసేసి, ఇలాంటి స్వామీజీలకు పాదపూజలు అరేంజ్ చేసేసి, మధ్యలో కమీషన్ నొక్కేస్తూ ఉంటారు. వీళ్ళూ వీళ్ళూ తోడుదొంగలు. ఇదొక సింబియాసిస్ అన్నమాట !
మధ్యలో ఇంకొంతమంది మా ఫ్రెండ్ లాంటి బ్రోకర్ గాళ్లుంటారు. ఎవరికైనా కాస్త మతపిచ్చి ఉన్నట్లు పసిగడితే, వెంటనే వాడిని రెలిజియస్ బ్లాక్ మెయిల్ చేసేసి, ఇలాంటి స్వామీజీలకు పాదపూజలు అరేంజ్ చేసేసి, మధ్యలో కమీషన్ నొక్కేస్తూ ఉంటారు. వీళ్ళూ వీళ్ళూ తోడుదొంగలు. ఇదొక సింబియాసిస్ అన్నమాట !
సరే ఆ గోలంతా మనకెందుకు గాని, మీరు మాత్రం బాగా గుర్తుంచుకోండి. నేను రావాలంటే లక్ష, కాళ్ళు కడిగించుకోవాలంటే రెండు లక్షలు, ఆ తర్వాత టవల్ తో తుడిపించుకోవాలంటే మూడు లక్షలు - మొత్తం ఆరు లక్షలు. ఎక్కువని సందేహిస్తున్నారా? ఎవరుబడితే వాళ్ళ ఇళ్ళకు నేనస్సలు రాను. మీ అదృష్టం పండినప్పుడే మీ ఇంటికి వస్తాను.
ఓకేనా? ఇక మీమీ అదృష్టాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకోండి మరి !