నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

26, మార్చి 2019, మంగళవారం

గుడ్డి గురువులు - 3

ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో ఫంక్షన్ జరుగుతూ ఉండగా, ఇంకొకాయన్ని తీసుకొచ్చి 'ఈయన మా ఇంకో గురువుగారు' అంటూ మళ్ళీ పరిచయం చేశాడు మొదటాయన.

'ఈయన మూడో కృష్ణుడన్నమాట' అనుకుంటూ ఆయనవైపు నిర్లిప్తంగా చూస్తూ జీవం లేని చిరునవ్వొకటి నవ్వాను.

ఆయనకూడా నావైపు అలాగే చూస్తూ 'నమస్కారం' అన్నాడు ఏదో అనాలి అన్నట్టు.

నేనుకూడా ఏడిచినట్టు ముఖం పెట్టి 'నమస్కారం' అన్నాను. కానీ లోలోపల మాత్రం నవ్వు ఉబికి వస్తోంది.

ఇక మూడో గురువుగారి పరిచయం మొదలైంది.

'ఈయన ఫలానా గుళ్ళో ఉంటారు. ఒకరోజున ఈయన నన్ను రమ్మని పిలిచారు. ఏంటా అని వెళ్లాను. నువ్వు ఈ రోజంతా ఎక్కడికీ వెళ్లొద్దు. ఈ గుళ్లోనే ఉండు' అన్నారు. 'ఎందుకు?' అనడిగాను. 'భూమిలోనుంచి అమ్మవారు వస్తుంది' అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే మధ్యాన్నానికి నేలలోంచి అమ్మవారు వచ్చింది' అన్నాడు పరిచయం చేసినాయన.

హటాత్తుగా నా బ్రతుకు మీద నాకే విపరీతమైన అసహ్యం వేసింది. 'చూసేవాళ్ళకి మరీ ఇంత వెర్రి వెంగళప్పలాగా కనిపిస్తున్నానా?' అని అనుమానం వచ్చి ఒక్కసారి నన్ను నేనే తాట ఊడేలా గట్టిగా గిచ్చుకున్నా.

'ఏంటండీ అలా గోక్కుంటున్నారు?' అన్నాడు గురువుగారు.

'గిచ్చుకోదానికీ గోక్కోడానికీ తేడా తెలియదు వీడికి' అని మనసులో అనుకుంటూ, మళ్ళీ జవాబు సరిగా చెప్పకపోతే, 'గుడికి రండి, తీర్ధం ఇస్తా' అంటాడేమో అని భయం వేసి, ' అబ్బే అలాంటిదేం లేదండి. ఊరకే జస్ట్ ఏదో పాకినట్టుంటేనూ' అన్నా మొహమాటంగా నవ్వుతూ.

నేను సరిగా వినలేదేమో అని అనుమానం వచ్చినట్టుంది. మళ్ళీ అమ్మవారు నేలలోనుంచి బయటకు రావడం సీనంతా వివరించాడు మొదటాయన.

నేను అనుమానంగా గురువుగారి ముఖంలోకి చూచాను.

ఆయన నేలచూపులు చూస్తూ 'ఏదోలెండి అమ్మవారి దయ' అన్నాడు వినయంగా.

'ఏ అమ్మవారు నాయనా. ఇంట్లో అమ్మవారా? లేక బయట అమ్మగారా?' అందామని నోటిదాకా వచ్చిన మాట నోట్లోనే ఆగిపోయింది.

'అంత చెప్పినా కూడా నా దగ్గర నుంచి ఆశ్చర్యం గాని, ఇంకోటి గాని రాకపోయే సరికి వాళ్ళకూ నేనంటే చిరాకు వేసినట్టుంది, 'సరే ఉంటానండి' అన్నాడు మర్యాదగా చేతులు జోడిస్తూ. 'మంచిదండి' అన్నా నేనూ అదే రాగంలో.

ఇది చాలా ప్రిమిటివ్ ట్రిక్. ఆటవిక సమాజాలు ఉన్నప్పటినుంచీ ఈ ట్రిక్ భూమ్మీద ఉంది. నేలలో విగ్రహాలు పాతిపెట్టి అక్కడ తవ్వించి, 'స్వామి బయటకు వచ్చాడు. అమ్మవారు బయటకు వచ్చింది' అని జనాన్ని నమ్మించే దొంగపూజారులు దొంగస్వాములు పాతకాలంలో ఉండేవారు. ఇప్పుడూ ఉన్నారన్నమాట అని మళ్ళీ రుజువైంది. కొంతకాలం క్రితంవరకూ జనం వేలం వెర్రిగా పూజించిన ఒక బాబాగారు ఈ ట్రిక్ చెయ్యడంలో సిద్ధహస్తులు. నది ఒడ్డున ఇసకలో కృష్ణుడి విగ్రహం పాతిపెట్టి, మళ్ళీ దాన్నే తవ్వి బయటకు తీసి, పెద్ద పెద్ద సైంటిస్టులను కూడా బోల్తా కొట్టించిన ఘనుడాయన.

ఆ తర్వాత అందరూ చందాలేసుకుని ఆ విగ్రహానికి గుడి కట్టడమూ, ఆ గుడిమీద పడి ఈ మెజీషియన్ బ్రతికెయ్యడమూ జరుగుతూ ఉంటుంది.

పనీపాటా చెయ్యకుండా లోకంలో ఇతరుల మీద పడి ఊరకే బ్రతికేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. వీళ్ళనే పారాసైట్స్ అనవచ్చు. వీళ్ళలో రెలిజియస్ పారాసైట్స్ మరీ నీచులు. ఇలాంటి వారంటే నాకు చెప్పరానంత అసహ్యం. ఏదో ఒక గుడినో స్వామీజీనో ఆశ్రయించి ఇలా బ్రతికేస్తూ ఉండేవారికంటే, కూలీ నాలీ చేసుకుంటూ బ్రతికేవారికే నేను ఎక్కువ విలువనిస్తాను.

19 ఏళ్ళ వయసులో ఉన్నపుడు స్వామీజీ అయ్యే అవకాశం నాకొచ్చింది. కానీ అది పారాసైట్ బ్రతుకని నేను దాన్ని తిరస్కరించాను. ఎప్పుడో ముప్పై అయిదేళ్ళ క్రితం జరిగిన ఆ సంఘటన ఒక్కసారి నా కళ్ళముందు మళ్ళీ మెదిలింది.

ఏంటో ఈ మాయ లోకం? అసలైన దానికి విలువ ఉండదు. నకిలీకి విపరీతమైన విలువ ఉంటుంది. ఈ ప్రపంచం తీరు ఇంతేనేమో? ఎప్పటికీ ఇది మారదేమో? అన్న ఆలోచనలు నాలో కలిగాయి.

'బుద్ధుడికి మర్రిచెట్టు కింద జ్ఞానోదయం అయింది. నీకు మామిడిచెట్టు పక్కనే అయిందన్నమాట' అంటూ నవ్వుతున్న కర్ణపిశాచి స్వరం స్టేజిమీద నుంచి హటాత్తుగా వినిపించి నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.

తలతిప్పి అటువైపు చూసిన నాకు, పురోహితుడి పక్కనే కూచుని మంత్రాలు చదువుతున్నట్టు పోజు కొడుతున్న కర్ణపిశాచి కనిపించింది.

నవ్వుతూ దానివైపు చెయ్యి ఊపాను. అదీ నన్ను చూస్తూ చెయ్యి ఊపింది.

తనకు చెయ్యి ఊపుతున్నాననుకుని పురోహితుడు నావైపు కోపంగా చూస్తున్నాడు.

'చూశావా నిన్నెలా బోల్తా కొట్టించానో?' అన్నట్లుగా కర్ణపిశాచి పగలబడి నవ్వుతోంది.

(అయిపోయింది)
read more " గుడ్డి గురువులు - 3 "

గుడ్డి గురువులు - 2

ఇలా కాసేపు ఆలోచించి, 'ఇక చాల్లే' అనుకుంటూ పక్కనే ఉన్న వాళ్ళతో మాట్లాడటం మొదలుపెట్టాను. మేము మాట్లాడుకుంటూ ఉండగా ఏనుగులా ఉన్న ఒక పిలకశాల్తీ ఉన్నట్టుండి మా గుంపులో జొరబడి - 'ఏంటి బాగున్నావా?' అంటూ మాలో ఒకరిని పలకరించి మా మాటలకు అడ్డు తగిలింది.

ఆ శాల్తీ వైపు తేరిపార చూచాను. ఏదో గుళ్ళో పూజారిలా అనిపించింది.

లోకంలో ఎవరన్నా సరే, నాలో ద్వేషభావం లేకుండా ఉండటానికి ఎప్పుడూ నేను ప్రయత్నిస్తూ ఉంటాను. కానీ ఇద్దరు వ్యక్తులను మాత్రం నేనస్సలు భరించలేను. ఒకటి పురోహితులు, రెండు గుళ్ళో ఉండే పూజారులు. దీనికి కారణాలున్నాయి.

మొదటి కారణం - వీళ్ళలో అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండో కారణం - లేకి ప్రవర్తన కూడా వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండూ నన్ను ఆమడదూరం తోసేస్తూ ఉంటాయి. మంచివారినీ, క్లాస్ గా ఉండేవారినే నేను ఇష్టపడతాను గాని ఇలాంటి అహంకార. లేకి ధోరణులు ఉండేవారితో ఒక్క క్షణం కూడా ఇమడలేను. ఈ పిలకేనుగు కూడా అలాంటి బాపతే అని, అతని సంస్కారరహిత ప్రవర్తనను బట్టి క్షణంలో అర్ధమైంది.

'ఆ బాగున్నాను' అన్నాడు మా గుంపులో ఉన్న వ్యక్తి.

'కార్యక్రమం బాగా జరిగింది. నేను పెట్టిన ముహూర్తం అలాంటిది మరి !' అన్నాడు పిలకేనుగు ఏమాత్రం సిగ్గులేకుండా డప్పు కొట్టుకుంటూ.

నాకు చచ్చే నవ్వొచ్చింది.

అతను ముహూర్తం పెట్టిందేమో ఉదయం ఆరుకి. జరిగిందేమో ఏడుంబావుకి. మరి ముహూర్తంలో అంత బలం ఉంటే, పెట్టిన టైముకి ఎందుకు జరగలేదు? అని అడుగుదామని నోటిదాకా వచ్చిందిగాని, ప్రతివారితో గొడవలు ఎందుకులే అని మౌనంగా ఉండిపోయాను.

'పెట్టింది ముహూర్తం కాదు, జరిగినదే ముహూర్తం' అన్న జిల్లెళ్ళమూడి అమ్మగారి మహావాక్యం గుర్తొచ్చి మౌనంగా నవ్వుకున్నా.

గురువారం గురుహోర అని ఉదయం ఆరుకి ముహూర్తం పెట్టాట్ట ఆ పిలకేనుగు. ఇలాంటి మిడిమిడిజ్ఞానం గాళ్ళని చూస్తుంటే తన్నాలని అనిపిస్తుంది నాకు. ఇలాంటివాళ్ళ వల్లే జ్యోతిష్యశాస్త్రం భ్రష్టు పడుతోంది. 'కామన్ సెన్స్ లేకుండా ఉదయం ఆరుకి ముహూర్తం ఏంట్రా నీ బొంద? నువ్వు ముహూర్తం పెడుతున్నది కార్యక్రమానికా? లేక టాయిలెట్ కి వెళ్ళడానికా? పైగా హైదరాబాద్ లో సూర్యోదయం 6-21 కి అవుతుంటే, నువ్వు ఆరుకి గురుహోర అని ఎలా చెప్పావురా? నువ్వు ముహూర్తం పెట్టింది గురుహోరలోనా లేక శనిహోరలోనా అప్రాచ్యుడా?' అందామని నోటిదాకా వచ్చింది. ఇలాంటి వెధవలతో మనకెందుకులే అని మళ్ళీ మింగేశాను.

నేటి పనికిమాలిన జ్యోతిష్కులలో చాలామంది 'హోరలు' అంటూ, చాలా ఇబ్బందిగా ఉండే సమయంలో ముహూర్తాలు పెడుతున్నారు. ఇది చాలా తప్పు. అసలు హోరలు అనేవి మనవి కావు. అవి గ్రీక్ జ్యోతిష్యం నుంచి మనం కాపీ కొట్టినవి. 'హోర' అనే గ్రీక్ పదం నుంచే 'హవర్' లేదా 'అవర్' అనే ఇంగ్లీషు పదం పుట్టింది. మన భారతీయ జ్యోతిష్యశాస్త్రంలోని ముహూర్తభాగంలో హోరాసిద్ధాంతం లేనేలేదు. కానీ నేటి మిడిమిడి జ్యోతిష్కులూ, గుళ్ళలో ఉండే పురోహితులూ హోరల్ని ఆధారం చేసుకుని ముహూర్తాలు పెడుతున్నారు. తెలిసీ తెలియని అజ్ఞానులు పెట్టించుకుంటున్నారు.

అసలు, పెళ్లి ముహూర్తాలూ, నిశ్చితార్ధముహూర్తాలూ గురుహోరలో పెట్టకూడదు. గురుహోర అనేది పూజలకు, మంత్రసాధనకు, తీర్ధయాత్రలకు మంచిది గాని పెళ్ళికి సంబంధించిన పనులకు మంచిది కాదు. అలాంటివాటికి శుక్రహోరను వాడాలి. ఇంతచిన్న విషయం కూడా తెలియనివాళ్ళు జ్యోతిష్కులని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇదంతా చెప్పి అక్కడ మన విజ్ఞానప్రదర్శన చెయ్యడం ఎందుకని మౌనంగా చూస్తున్నాను.

'మీకు రేపు ఆగస్ట్ లోపల ఉద్యోగంలో మార్పు ఉంటుంది.' అంది పిలకేనుగు మా గ్రూపులో ఉన్న ఒకాయన్ని చూస్తూ.

'ఓహో. మార్కెటింగ్ మొదలు పెట్టావట్రా చీప్ వెధవా' అనుకున్నా లోలోపల. చాలామంది పూజారులూ పురోహితులూ ఇంతే. నలుగురు కన్పిస్తే చాలు, ఇక వాళ్ళ బిజినెస్ మొదలుపెడతారు.

'అవునా. చాలా ధాంక్స్ అండి' అన్నాడీయన భక్తిగా పిలకేనుగుకి నమస్కారం పెడుతూ.

'నేను చెప్పినది జరిగితే మన గుడికి వచ్చి స్పెషల్ పూజ చేయించుకోండి' అన్నాడు పిలకేనుగు.

నాకు నవ్వుతో పొట్ట చెక్కలయ్యేలా ఉంది.

'ఏంట్రా! స్పెషల్ పూజ చేయించుకోవాలా? ఎవరు? దేవుడా ఇతనా?' అనుకున్నా లోలోపల.

'ఆయ్ ! అలాగేనండి. తప్పకుండా వస్తానండి' అన్నాడు వింటున్నాయన.

ఇంతగా మార్కెటింగ్ చేసినా మేమేమీ ఇంప్రెస్ అవకపోవడంతో ఏనుగుకి చిరాకేసినట్టుంది. నావైపు కోపంగా చూసి అక్కణ్ణించి మెల్లిగా వెళ్ళిపోయింది.

'బ్రతకడానికి ఇన్ని అబద్దాలు చెప్పి ఇంత మార్కెటింగ్ చెయ్యాలట్రా?' అనుకున్నా మనసులో.

జ్యోతిష్యశాస్త్రానికి ఇలాంటి చీడలు చాలామంది పట్టుకొని ఉన్నారు. శాస్త్రంలో లోతుపాతులు తెలీక, ఉదయం ఆరుగంటలకి ముహూర్తాలూ, అర్ధరాత్రి పన్నెండు గంటలకి ముహూర్తాలూ పెడుతూ ఉంటారు ఇలాంటివాళ్ళు. డబ్బుకి ఆశపడి ఇలాంటి పనులు చేస్తూ జ్యోతిష్యశాస్త్రంతో ఆటలాడే వీళ్ళకు ఋషిశాపం తప్పదు. ఆ సంగతేమో వీళ్ళకు తెలీదు.

పురోహితులూ పూజారులూ అంటే నాకున్న తేలిక అభిప్రాయం ఈ సంఘటనతో మళ్ళీ బలపడింది.

(ఇంకా ఉంది)
read more " గుడ్డి గురువులు - 2 "

18, మార్చి 2019, సోమవారం

Christchurch Shooting - Astro pointers

15-3-2019 మధ్యాన్నం 1-40 కి న్యూజీలాండ్ లోని క్రిస్ట్ చర్చ్ అనే ప్రదేశంలో రెండు మసీదులలో జరిగిన కాల్పులలో ఒకచోట 50 మంది ఇంకో చోట 7 మంది కాల్చబడ్డారు.

ముస్లిమ్స్ అంటే విపరీతమైన ద్వేషం ఉన్న బ్రెంటన్ హారిసన్ టారంట్ అనే వైట్ రేసిస్ట్ చేసిన పని అది. ఆ సమయానికి ఉన్న గ్రహస్థితులను పరికిద్దాం.

కుజ శనుల మధ్యన కోణదృష్టి
---------------------------------------
కోణదృష్టి మంచిదని సాధారణంగా జ్యోతిష్కులందరూ అనుకునే మాట. కానీ ఆ దృష్టిలో ఉన్న గ్రహాలు పరస్పర శత్రువులై ఉండి, అవి కూడా ప్రమాదకరమైన గ్రహాలైనప్పుడు కోణదృష్టి కూడా భయంకరమైన ఫలితాలనిస్తుంది అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. ఈ సమయంలో కుజుడూ శనీ ఇద్దరూ చాలా దగ్గరగా కోణదృష్టిలో ఉన్నారు.

కుజుని భరణీ నక్షత్రస్థితి
--------------------------------
భరణి యమనక్షత్రం. కనుక యుద్ధాలకు రక్తపాతానికి కారకుడైన కుజుడు ఈ నక్షత్రంలో ఉన్నపుడు తప్పకుండా సామూహిక మరణాలు జరుగుతాయి. అదే మళ్ళీ ఇప్పుడు రుజువైంది.

రాహు గురుల మధ్యన గల షష్ఠ - అష్టక దృష్టి
----------------------------------------------------------
రాహుగురుల సంబంధం, అది ఏ రకంగా ఉన్నాసరే, అది మంచిది కాదు. ఎందుకంటే దీనిని జ్యోతిష్యశాస్త్రంలో 'గురుచండాల యోగం' అని పిలిచారు. అంటే, మతపరమైన విధ్వంసం జరిగే యోగం అని చెప్పవచ్చు. ఇప్పుడు జరిగింది అదేగా !

రాహు గురువుల నక్షత్ర స్థితి
------------------------------------
గురువు, బుధునిదైన జ్యేష్టానక్షత్రంలో ఉన్నాడు. రాహువు బుధుని సూచిస్తూ గురువుదైన పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు. అంటే, వీరిద్దరికీ నక్షత్రస్థాయిలో పరివర్తనా యోగం ఉన్నది. శత్రువులైన వీరు ఇలాంటి సంబంధంలో ఉండటం మంచిది కాదు. కనుక తెలివైన ప్లానింగ్ తో కూడిన ఇలాంటి రక్తపాతపు సంఘటన జరిగింది.

బుధరాహువుల సంబంధం అతితెలివిని ఇస్తుంది. రాహు గురువుల సంబంధం  మతపరమైన గొడవలను సృష్టిస్తుంది. ప్రస్తుతం జరిగింది అదేగా !

బుధుని వక్ర నీచ స్థితి
---------------------------
బుద్ధికారకుడైన బుధుడు వక్రించి ఉండటం వక్రబుద్ధికి సూచన. అలాగే నీచస్థితిలో ఉండటం నీచమైన ప్లాన్స్ కు సూచిక. ఈ రెండూ కలసి ఆ హంతకుని చేత అలాంటి పనిని చేయించాయి.

ముస్లిమ్స్ అంటే పెరుగుతున్న అంతర్జాతీయ ద్వేషం
---------------------------------------------------------------------
ముస్లిమ్స్ ఏ దేశంలో ఉన్నా శాంతిగా ఉండరని, ఆ దేశంలో మతపరమైన చిచ్చు పెడుతూ ఉంటారన్న నమ్మకం ప్రపంచ వ్యాప్తంగా అనేకదేశాలలో గత ఇరవైఏళ్ళుగా బలపడుతూ వస్తున్నది. ఈ నమ్మకానికి ఆధారాలుగా ముస్లిమ్స్ చేసిన, చేస్తున్న అనేక పనులు నిలుస్తున్నాయి. ముస్లిమ్స్ అంటే క్రైస్తవులలో పెరుగుతున్న విద్వేషమే ఈ సంఘటన వెనుకనున్న బలమైన కారణం ! దీనిని Islamophobia అని పిలుస్తున్నారు. ఈ phobia ప్రబలడానికీ, వ్యాప్తి చెందడానికీ ముస్లిములే, ముఖ్యంగా పాకిస్తాన్ వంటి దేశాలే ముఖ్యమైన కారకులు !

మూడో ప్రపంచయుద్ధం అంటూ వస్తేగిస్తే, అది క్రైస్తవదేశాలకూ ముస్లిం దేశాలకూ మధ్యన మాత్రమే వస్తుందని జ్యోతిష్కులే కాదు, ప్రపంచ సామాజిక శాస్త్రవేత్తలూ, మేధావులూ కూడా ఎప్పటినుంచో అంటున్నారు. విచిత్రమేమంటే ఈ రెండు మతాలూ 'శాంతి' 'శాంతి' అంటూనే ఉంటాయి. దానినే బోధిస్తున్నామంటాయి. కానీ ఆచరణలో మాత్రం అదెక్కడా కనిపించదు. ప్రపంచంలో ఇప్పటిదాకా జరిగిన రక్తపాతం అంతా ఈ రెండు మతాల వల్లే జరిగింది.

ఆ మార్గంలో రాజుకుంటున్న నిప్పుకు ఈ సంఘటనలు సూచికలని భావిద్దామా?
read more " Christchurch Shooting - Astro pointers "

11, మార్చి 2019, సోమవారం

ఇథియోపియా విమాన ప్రమాదం - జ్యోతిష్య కోణం

ఆదివారం ఉదయం ఒక ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఇధియోపియా ఎయిర్ లైన్స్ విమానం ET302 కూలి పోయింది.దానిలో ఉన్న 35 దేశాలకు చెందిన 157 మంది చనిపోయారు. ఇందులో మన భారతీయులు కూడా ఉన్నారు.

రాహుకేతువులు, యురేనస్ గోచార ఫలితాలకు అనుగుణంగానే, రాహువు వాయుతత్వ రాశిలోకి అడుగుపెట్టీ పెట్టకముందే ఘోరమైన వాయుప్రమాదం జరగడం గమనార్హం.

ఇంకో రెండురోజులలో సూర్యుడు రాశి మారి కుంభరాశి నుండి మీనరాశికి పోతున్నాడు. ప్రస్తుతం ఎనిమిదో నవాంశలో ఉంటూ వాయుతత్వ రాశిలో ఉన్న ఉచ్చరాహువుకు దగ్గరగా వస్తున్నాడు. ఆ సూర్యుడు శనిదైన కుంభంలో ఉంటూ నల్లవారుండే ఆఫ్రికా దేశాలను సూచిస్తున్నాడు.

విమానం నంబర్ 302=5 బుధునికి సూచిక.
చనిపోయినవారు 157=4 కేతువు/(రాహువు)కు సూచిక.
రాహువు బుధుని రాశిలో అడుగు పెట్టగానే ఈ ప్రమాదం జరిగింది.

మేజర్ గ్రహాల మార్పులు జరిగినప్పుడు మేజర్ ప్రమాదాలు జరుగుతాయి అనడానికి ఇంతకంటే ఇంకా ఎన్ని ఉదాహరణలు కావాలి?
read more " ఇథియోపియా విమాన ప్రమాదం - జ్యోతిష్య కోణం "

5, మార్చి 2019, మంగళవారం

శివరాత్రి జాగారం

సామూహిక శివరాత్రి అభిషేకాలున్నాయ్
మీరూ రమ్మని పిలిచారు పరిచయస్తులు
సామూహికం ఏదీ నాకు పడదు
నేను రానని మర్యాదగా చెప్పాను

నాలుగు ఝాముల్లో నాలుగు రకాల పూజలు
నాలుగు రకాల నైవేద్యాలున్నాయ్
వచ్చి చూచి తరించమన్నారు
మీరు తరించండి నాకవసరం లేదన్నాను

నిద్రకు ఆగలేవా అని హేళనగా అడిగారు
నిద్రపోతూ మెలకువగా ఉంటానన్నాను
శివరాత్రి జాగారం చెయ్యాలన్నారు
జీవితమంతా జాగారమే అన్నాను

ఏమీ తినకుండా వాళ్ళు ఉపవాసం ఉన్నారు
అన్నీ తిని నేనూ ఉపవాసం ఉన్నాను
రాత్రంతా అభిషేకాలు చేస్తూ వాళ్ళు జాగారం చేశారు
హాయిగా నిద్రపోతూ నేనూ జాగారమే చేశాను

తెల్లగా తెల్లవారింది
పూజలకు ఫుల్ స్టాప్ పడింది
జాగారం చేసిన వాళ్ళు నిద్రలో జోగుతున్నారు
నేనుమాత్రం మెలకువలో మేల్కొనే ఉన్నాను

రాత్రంతా అభిషేకాలు పూజలు చేసిన
శివలింగం దగ్గర ప్రస్తుతం ఎవరూ లేరు
ఉన్నట్టుండి అందరూ దాన్ని అనాధను చేశారు
నేను మాత్రం దానినే చూస్తున్నాను

అది నన్ను చూచి ప్రేమగా నవ్వింది
పిచ్చిలోకులింతే అన్నట్లు
ఆ నవ్వు ధ్వనించింది
నా శివరాత్రి జాగారం అద్భుతంగా జరిగింది
read more " శివరాత్రి జాగారం "