“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

5, మార్చి 2019, మంగళవారం

శివరాత్రి జాగారం

సామూహిక శివరాత్రి అభిషేకాలున్నాయ్
మీరూ రమ్మని పిలిచారు పరిచయస్తులు
సామూహికం ఏదీ నాకు పడదు
నేను రానని మర్యాదగా చెప్పాను

నాలుగు ఝాముల్లో నాలుగు రకాల పూజలు
నాలుగు రకాల నైవేద్యాలున్నాయ్
వచ్చి చూచి తరించమన్నారు
మీరు తరించండి నాకవసరం లేదన్నాను

నిద్రకు ఆగలేవా అని హేళనగా అడిగారు
నిద్రపోతూ మెలకువగా ఉంటానన్నాను
శివరాత్రి జాగారం చెయ్యాలన్నారు
జీవితమంతా జాగారమే అన్నాను

ఏమీ తినకుండా వాళ్ళు ఉపవాసం ఉన్నారు
అన్నీ తిని నేనూ ఉపవాసం ఉన్నాను
రాత్రంతా అభిషేకాలు చేస్తూ వాళ్ళు జాగారం చేశారు
హాయిగా నిద్రపోతూ నేనూ జాగారమే చేశాను

తెల్లగా తెల్లవారింది
పూజలకు ఫుల్ స్టాప్ పడింది
జాగారం చేసిన వాళ్ళు నిద్రలో జోగుతున్నారు
నేనుమాత్రం మెలకువలో మేల్కొనే ఉన్నాను

రాత్రంతా అభిషేకాలు పూజలు చేసిన
శివలింగం దగ్గర ప్రస్తుతం ఎవరూ లేరు
ఉన్నట్టుండి అందరూ దాన్ని అనాధను చేశారు
నేను మాత్రం దానినే చూస్తున్నాను

అది నన్ను చూచి ప్రేమగా నవ్వింది
పిచ్చిలోకులింతే అన్నట్లు
ఆ నవ్వు ధ్వనించింది
నా శివరాత్రి జాగారం అద్భుతంగా జరిగింది