నా ఫోన్ నంబర్ నా బ్లాగులోనే ఉండటంతో నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. అలా చేసేవారిలో అత్యంత మంచివాళ్ల నుంచీ పరమ బేవార్స్ గాళ్ళ వరకూ అందరూ ఉంటుంటారు. ఎవరెవరి భాషలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఓపికగా అందరితోనూ నేనూ మాట్లాడుతూనే ఉంటాను. అసలిలాంటి చెత్తగాళ్ళతో మీకెందుకు? అని నా శిష్యులు అడుగుతూ ఉంటారు. 'అదొక సరదా' అని వాళ్లకు చెబుతూ ఉంటాను.
మొన్నొక రోజున ఇలాగే ఒక ఫోనొచ్చింది. ఆరోజున అమావాస్య, నేనింకా నిద్ర లేవలేదు. ఉదయం ఆరింటికే ఎవరో ఫోన్ చేశారు. కొత్త నంబర్.
గ్రహప్రభావాలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి 'పొద్దున్నే ఎవడో పిచ్చోడు' అనుకుంటూ హలో అన్నా.
'నీకు మంత్రం తంత్రం తెలుసా?' పరిచయాలు గట్రాలూ ఏమీ లేకుండా ఒక జంతువులాంటి గొంతు వినిపించింది.
'తెలుసు' అన్నా ఆవులిస్తూ.
'నీ దగ్గర ఏమేం విద్యలున్నాయి?' అడిగాడు రఫ్ గా ఆ వ్యక్తి.
'నా దగ్గర ఏ విద్యలుంటే నీకెందుకు? ఎందుకు ఫోన్ చేశావో చెప్పు' అన్నా అంతకంటే రఫ్ గా.
'అలా కాదు. నీ దగ్గర ఏ విద్యలున్నాయో తెలిస్తే అందులోంచి మేం సెలక్ట్ చేసుకుంటాం' అంది జంతువు.
'అది నీలాంటి వాళ్ళ వల్ల కాదులే గాని, ఎందుకు ఫోన్ చేశావో నీకేం కావాలో చెప్పు' అన్నాను.
'ప్రపంచంలో అందరికీ కావాల్సింది డబ్బేగా' అన్నాడు జంతువు తెలివిగా.
'అందరి సంగతీ నీకెందుకు? నీ సంగతి చెప్పు' అన్నా, ఇదేదో తమాషాగానే ఉంది అనుకుంటూ.
'డబ్బు కావాలి' అంది.
'డబ్బు కష్టపడి సంపాదిస్తే వస్తుంది. మంత్రతంత్రాలతో రాదు' అన్నా నేను.
'నీకే తెలీనప్పుడు ఇక మాకేం చేస్తావులే నువ్వు' అంది జంతువు.
'చాలా చెయ్యగలను' అన్నా.
'ఏంటవి' అంది జంతువు.
'నీలాంటి వాళ్లకి ముందు ఫోన్ మ్యానర్స్ నేర్పగలను. ఆ తర్వాత సంస్కారం నేర్పగలను. మంచిగా ఎలా మాట్లాడాలో మంచిగా ఎలా బ్రతకాలో నేర్పగలను. చివరగా నీలాంటి పిచ్చోళ్ళ పిచ్చి తగ్గించగలను కూడా' అన్నాను.
ఏదేదో తిడుతూ టక్కుమని ఫోన్ కట్ అయిపోయింది.
జాలేసింది.
అసలే నిండు అమావాస్య. పాపం ! పిచ్చి ముదిరిన కేసు అనుకున్నా.
టీవీలు యూట్యూబులు చూచి చాలామంది ఇలాంటి భ్రమలలో ఉంటారు. మంత్రతంత్రాలంటే తేరగా డబ్బులు వచ్చిపడే ట్రిక్స్ అని అనుకుంటూ ఉంటారు. పాపం పిచ్చోళ్ళు !
నిజమైన మంత్రతంత్రాలు మనిషిని ఉన్నతంగా మార్చే ప్రక్రియలు. అంతేగాని తేరగా డబ్బులు తెచ్చి పడేసే మ్యాజిక్స్ కావు. అవి దైవాన్ని చేరడానికి రహదారులు. కానీ రహదారులను కూడా టాయిలెట్స్ గా వాడటం మన భారతీయులు చేసే పనే కదా !
మనిషిని దేవునిగా మార్చే ఒక అత్యున్నతమైన మార్గం ఎదురుగా ఉన్నా కూడా మనిషి దానిని స్వలాభానికి వాడుకోవాలనే చూస్తాడు. స్వార్ధపరంగానే ఆలోచిస్తాడు. తన బిజినెస్ ఎదగడానికీ, తన పనులు కావడానికీ, తన గొంతెమ్మ కోరికలు తీరడానికీ గురువులను, దైవశక్తి ఉన్నవారిని ఆశ్రయించాలని చూస్తాడు. ఇది చాలా వెర్రితనం మాత్రమేగాక స్వార్ధపరతకు పరాకాష్ట కూడా !
ఆకాశానికి చేర్చే నిచ్చెన ఎదురుగా ఉంటే, దానిని ముక్కలు చేసి పొయ్యిలో కట్టెలకు వాడుకుందామని చూసేవారిని ఏమనాలి?
ఆకాశానికి చేర్చే నిచ్చెన ఎదురుగా ఉంటే, దానిని ముక్కలు చేసి పొయ్యిలో కట్టెలకు వాడుకుందామని చూసేవారిని ఏమనాలి?
మనుషులు ఎప్పుడు ఎదుగుతారో ఏమోరా దేవుడా !