'ప్రతిరోజూ కనకధారా స్తోత్రం చదివితే చాలా మంచిది. నేను చదువుతున్నాను' అన్నాడు మా ఫ్రెండ్ ఒకడు ఈ మధ్య.
'ఏమౌతుంది? ఆ స్తోత్రం చదివితే?' అడిగాను ఏమీ తెలీనట్లు.
'కనకవర్షం కురుస్తుంది. నీకు తెలీదా? శంకరాచార్యులవారు చిన్నపిల్లాడిగా ఉన్నపుడు ఒక పేదరాలికోసం ఈ స్తోత్రం చదివాడు. అప్పుడు బంగారు ఉసిరికాయల వర్షం కురిసి ఆ పేదరాలి పేదరికం తీరిపోయింది.' అంటూ ఆ కధంతా నాకు వివరించాడు వాడు.
జీవితంలో మొదటిసారి ఆ కధను వింటున్నట్లుగా ముఖం పెట్టి మరీ అదంతా విన్నాను. అసలు జరిగింది ఒకటైతే వీడి కల్పన ఎక్కువగా ఉంది ఆ కధలో. సరే, మనుషుల పైత్యాలు మనకు బాగా తెలిసినవే గనుక నవ్వుకుంటూ అదంతా విన్నాను.
'కనుక, నువ్వు కూడా రోజూ చదువు. డబ్బులు బాగా వస్తాయి' అన్నాడు వాడు.
'సర్లేగాని, ఎవరు చెప్పారు నీకు ఇలా చదవమని?' అడిగాను.
'మా శాస్త్రిగారు చెప్పారు. ఆయన మాకు గురువు. ఆయన మాట మాకు వేదవాక్కు' అన్నాడు వీడు తన్మయంగా.
ఆ శాస్త్రిగాడెవడో గాని, నాకెదురుగా ఉంటే మాత్రం, ఒక్క తన్ను తందామన్నంత కోపం వచ్చింది నాకు. ఇలాంటి తెలిసీ తెలియని పురోహితులు పూజారులూ సమాజాన్ని నాశనం చెయ్యడంలో, మూడనమ్మకాలను జనానికి ఎక్కించడంలో ముందుంటున్నారు.
'వేదమొక్కటే నీకైనా, నీ గురువుకైనా వాక్కు కావాలి గాని, డబ్బులకోసం ఏమైనా చేసే పూజారి మాట మీకు వేదవాక్కు కాకూడదు' అన్నాను చాలా సీరియస్ గా.
ఫ్రెండ్ గాడు ఖంగుతిన్నాడు.
'అదేంటి అలా అంటున్నావు?' అడిగాడు అయోమయంగా.
'బంగారువర్షం మాట అలా ఉంచు. నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ స్తోత్రాన్ని చదువుతున్నారు కదా !' అడిగాను.
'అవును. మా విష్ణుసహస్రనామం బ్యాచ్ ఒకటుంది. మేము రెగ్యులర్ గా ఈ స్తోత్రాన్ని ప్రతిరోజూ చదువుతాం' అన్నాడు వాడు గర్వంగా.
'మరి ఇంతమంది పడి రోజూ చదూతుంటే, కనీసం మామూలు వర్షం కూడా సకాలంలో కురవడం లేదేమిటి? నువ్వు బంగారు వర్షం దాకా వెళ్ళావ్. మామూలు నీళ్ళ వర్షానికే దిక్కులేకుండా ఉందిగా. ఇదేంటి?' అడిగాను.
'ఆ ! దానికీ దీనికీ సంబంధం ఏముంది? నే చెప్పేది నీకు డబ్బులు బాగా కలసి వస్తాయని' అన్నాడు.
'సరే, పోనీ నువ్వన్నట్లుగానే మీ ఇంటివరకూ బంగారువర్షం కురిసిందే అనుకో. అంత బంగారాన్ని నువ్వు ఏం చెసుకుంటావ్? దాన్ని ఎలా మేనేజ్ చేస్తావ్?' అడిగాను నవ్వుతూ.
'ఏమో. అది అప్పుడు ఆలోచిస్తా' అన్నాడు.
'నీకంత ట్రబుల్ ఇవ్వడం ఇష్టం లేకేనేమో అమ్మవారు ఆ వర్షం కురిపించడం లేదు. బహుశా నువ్వెన్నాళ్ళు అలా ఎదురుచూచినా ఆ వర్షం కురవకపోవచ్చు కూడా. ఇలాంటి మూర్ఖపు నమ్మకాలు నా దగ్గర చెప్పకు.' అన్నాను.
'సర్లే నీ వితండవాదం నీది' అంటూ వాడు లేచి వెళ్ళబోయాడు.
'నీ మూఢనమ్మకాలు నీవి' అన్నాను నవ్వుతూ.
వాడు కోపంగా చూస్తూ నా రూమ్ లోనుంచి వెళ్ళిపోయాడు.
జనాల పిచ్చిని చూస్తుంటే నాకు భలే కామెడీగా ఉంటోంది ఈ మధ్య. ఎవరిని చూచినా ఒకటే నవ్వు ! పడీపడీ నవ్వుకుంటున్నా వీళ్ళ పిచ్చి గోలా వీళ్ళూనూ !
ఇదొక రెలిజియస్ మార్కెటింగ్ ! ఈ స్తోత్రం చదవండి. ఈ రంగు గుడ్డలు వేసుకోండి. ఈ దీక్షలు చెయ్యండి. ఈ పూజలు చేయించండి. మీకు మంచి జరుగుతుంది. అంటూ ప్రతివాడూ ఒక గుడినో ఒక దేవతనో మార్కెటింగ్ చేస్తూ, సోమరిగా బ్రతుకుతూ, వాడి పబ్బం గడుపుకోవడమేగాని, ఆ చెప్పేదాంట్లో ఎంత సత్యం ఉంది? అన్న ఆలోచన ఒక్కడికీ లేదు.
అంత డబ్బు వచ్చి పడితే కూడా కష్టమే. ఏది ఎక్కువైనా కష్టమే. సరైన సమయానికి సరైనది దొరకడమే జీవితంలో అతి పెద్దవరం గాని, ప్రపంచంలోని డబ్బంతా మా ఇంట్లోనే ఉండటం కాదు. అలా ఉంటె, దాన్ని ఏం చెయ్యాలో అర్ధంగాక పిచ్చెక్కడ ఖాయం.
కొంతమంది, ఇరవై తరాలదాకా సరిపడా సంపాదించి పడేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా జాలేస్తూ ఉంటుంది. ఇరవై తరాలదాకా ఎందుకు? తర్వాత తరంలో ఏం జరుగుతుందో ఎవడికి తెలుసు? నీ పిల్లలకు ధర్మంగా బ్రతకడం, సంస్కారయుతంగా బ్రతకడం నేర్పకపోతే ఆ ఇరవై తరాల డబ్బులూ ఒక్క తరంలో సర్వనాశనం చేసుకుంటారు. దీనిని మాత్రం ఎవరూ గమనించరు !
శంకరాచార్యులు ఆ స్తోత్రాన్ని ఆశువుగా చదివితే నిజంగా అమ్మవారు మెచ్చి అలా బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించిందేమో? కానీ ఆ తర్వాత ఇన్ని వందల ఏళ్ళలోనూ ఒక్కడికి కూడా అలా జరిగినట్లు దాఖలాలు లేవు. అసలు ఈ కధ నిజంగా జరిగింది అనడానికి కూడా రుజువులు లేవు. ఇదంతా తర్వాత ఎవడో వ్రాసిన కట్టుకధ కావడానికే అవకాశం ఎక్కువగా ఉంది.
పోనీ, అదే శంకరాచార్యులవారు చెప్పిన మిగతా స్తోత్రాలు ఏం అంటున్నాయో పట్టించుకుంటారా ఈ మూర్ఖభక్తులు? 'భజగోవింద స్తోత్రం' లో, ఇదే ఆదిశంకరులు - 'డబ్బులు శాశ్వతం కావురా, అందం శాశ్వతం కాదురా, ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదురా, భగవంతుని చరణాలను నిష్కల్మషంగా ధ్యానించండి. అదే అసలైన మంచి పని' - అంటూ నెత్తీ నోరూ మొత్తుకుని చెప్పాడు. అదెవరు వింటారు?
భజగోవింద స్తోత్రాన్ని కూడా రాగయుక్తంగా పాడుకుని ఆనందించడమే గాని, అదేం చెబుతున్నదో అర్ధం చేసుకుని ఆచరించేవారు ఎక్కడా కనిపించరు. అంటే, మహనీయులు చెప్పిన వాటిల్లో కూడా మన స్వార్ధానికి ఉపయోగపడేవి మాత్రం తీసుకుని మిగతాని గాలికొదిలేస్తాం ! ఇదీ మన వరస ! ఇదీ మన సంస్కృతి !
చాలా ఏళ్ళ క్రితం మా బంధువుల్లో ఒకాయన కూడా రిటైరైన తర్వాత ఇదే స్తోత్రాన్ని ప్రతిరోజూ తడిబట్టలతో చదువుతూ ఉండేవాడు.
ఒకరోజున మా ఇంటికి వచ్చినప్పుడు పొద్దున్నే స్నానం చేసి ఒక మూల నిలబడి గట్టిగా ఈ స్తోత్రం చదువుతూ ఉన్నాడు. విషయం నాకర్ధమైనా ఏమీ తెలీనట్లు మౌనంగా ఉన్నాను. ఆయన తతంగం అంతా అయ్యాక - 'రిటైరైన తర్వాత కూడా ఇదేం పాడుబుద్ధి? డబ్బుల మీద ఇంతాశ ఎందుకు నీకు?' అని అడిగాను.
'బాగా కలిసొస్తుంది' అని ఆయనన్నాడు. ఆయన అజ్ఞానానికి, దురాశకు, నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. కాటికి కాళ్ళు చాచుకున్నవాడికి ఇంకా కలిసోచ్చేది ఏముంటుందో మరి? నా ఆలోచనకు అనుగుణంగానే ఆ తర్వాత రెండేళ్లలో ఆయన చనిపోయాడు. వాళ్ళింట్లో ఏ బంగారువర్షమూ కురవలేదు.
నేటి మనుషుల్లో ఉన్నతమైన ఆలోచనలు తక్కువ, దురాశ చాలా ఎక్కువ. దానిని ఎగదోస్తూ కొందరు పూజారులు, పురోహితులు, నకిలీ గురువులు ఇలాంటి పనికిరాని పనులను ప్రోత్సహిస్తూ జనాలలో మూడనమ్మకాలను ఎక్కువ చేస్తూ ఉంటారు. దురాశాపరులు వాటిని గుడ్డిగా అనుసరిస్తూ ఉంటారు. అంతేగాని సత్యం చెబితే ఎవరూ వినరు.
శంకరులు ఆ స్తోత్రాన్ని చదివినప్పుడు కూడా అమ్మవారు ఎందుకు బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది? 'బాలశంకరుడు భిక్షకు వస్తే ఏమీ ఇవ్వలేని దరిద్రురాలిని కదా నేనని' ఆ పేదరాలు ఏడ్చింది. ఆమె ఏడుపు చూచి శంకరుని హృదయం ద్రవించింది. ఆ ద్రవింపు కనకధారాస్తోత్రంగా ఆయన నోటినుంచి ఆశువుగా ప్రవహించింది. ఇదంతా, జగన్మాతను కదిలించింది. బంగారువర్షాన్ని ఆ పేదరాలి ఇంట్లో కురిపించింది. ఆ సంఘటన వెనుక ఉన్న శక్తి, ఉత్తస్తోత్రం కాదు. మానవత్వం యొక్క శక్తి దానివెనుక ఉంది !
'అయ్యో ! ఈ చిన్నపిల్లవాడు నా ఇంటిముందు నిలబడితే నేనేమీ ఇవ్వలేకపోయానే' అన్న ఆ పేదరాలి హృదయవేదనా, ఆమె దీనస్థితిని చూచి కరిగిన శంకరుని హృదయమూ, ఈ రెంటినీ చూచి కదిలిన జగన్మాతా - ఇవీ ఆ సంఘటన వెనుక ఉన్న శక్తులు. అంతేగాని ఆ స్తోత్రంలో ఏమీ లేదు. మనబోటి వాళ్ళు ఆ స్తోత్రం జీవితాంతం చదివినా ఏమీ జరగదు గాక జరగదు !
నిలువెల్లా స్వార్ధంతో నిండిపోయి, పక్కవాడు ఏమైపోతున్నా మనం పట్టించుకోకుండా, నా పొట్ట ఒక్కటే నిండితే నాకు చాలు అన్న నీచపు మనస్సుతో, ఎంతకీ చాలని దురాశతో కుళ్ళిపోతూ, లోకంలోని డబ్బులన్నీ నాకే కావాలంటూ, ఈ స్తోత్రాన్ని చదివితే, అప్పుడెప్పుడో జరిగిన అద్భుతం ఇప్పుడెందుకు జరుగుతుంది? చస్తే జరగదు. అందుకే ఎంతమంది ఎన్నిసార్లు ఆ స్తోత్రాన్ని చదివినా ఏ వర్షమూ కురవడం లేదు !
ఊరకే స్తోత్రాలు చదివితే కరిగిపోవడానికి జగన్మాత పిచ్చిది కాదు మరి !
నిస్వార్ధంగా మనం ఒకరికి సహాయపడితే, దైవం మనకు సహాయపడుతుంది. ఇదీ అసలైన బంగారు సూత్రం ! దీనిని ఒదిలేసి రోజుకు వెయ్యి స్తోత్రాలు చదివినా అవన్నీ దండగమారి పనులే !
ధమ్మపదం లో బుద్ధభగవానుడు ఇలా అంటాడు.
న కహాపణస్సేన తిత్తి కామేసు విజ్జతి
అప్పస్సాదా దుఃఖా కామా ఇతి వింజాయ పండితో
'బంగారువర్షం కురిసినా మానవుని ఆశ చావదు. ఈ ఆశ వల్ల దు:ఖం తప్ప ఇంకేమీ రాదని పండితులు గ్రహిస్తారు'
(ధమ్మపదము - 14:8)
దానికి తెలుగులో ఈ పద్యాన్ని వ్రాశాను.
ఆ || కనకధారయైన కరుగదీ మోహమ్ము
శాంతి దొరుకదెపుడు సుంతయైన
దు:ఖభాజనమ్ము దుష్టమౌ కామమ్ము
అనుచు నేర్తురిలను ఆత్మవిదులు
కష్టంలో ఉన్న సాటిజీవికి సాయం చెయ్యడం, స్వార్ధమూ దురాశా తగ్గించుకుని సాటివారితో సహానుభూతితో బ్రతకడం, నీ మనస్సును పాడు చేసుకోకుండా, ప్రకృతిని పాడు చెయ్యకుండా ఉండటం - ఇవీ కనకధారాస్తోత్రం చదవడం కంటే, శక్తివంతమైన పనులు. మనిషనేవాడు చెయ్యవలసిన పనులు !
దేవుడనేవాడు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో చూస్తాడు గాని, ఆయన్ని నీ స్తోత్రాలతో ఎలా ఉబ్బెస్తున్నావో చూడడు. సృష్టికర్తకు నువ్వు రాసుకున్న స్తోత్రాలెందుకు? ఎప్పుడర్ధం చేసుకుంటారో? ఎప్పుడు ఎదుగుతారో ఈ పిచ్చి జనాలు ?!!!