'ఈయన ఫలానా 'ఆయన' కుమారుడు' అంటూ ఒకాయన్ని నాకు పరిచయం చేశారు జిల్లెళ్లమూడిలో.
మా చిన్నప్పుడే జిల్లెల్లమూడిలో 'ఆయన' చాలా ముఖ్యుడు కావడంతో, 'అవునా ! నమస్తే' అంటూ చేతులు జోడించి, నిన్ననే రిలీజైన 'ధర్మపదం' పుస్తకం ఆయనకు బహూకరించాను.
ఆయనా పుస్తకాన్ని చాలా నిర్లక్ష్యంగా చేతిలోకి తీసుకుని ఏదో నవలని నలిపినట్లు దానిని నలుపుతూ, పేకముక్కల్ని తిరగేసినట్లు దానిని తిరగేస్తూ నాతో మాట్లాడటం సాగించాడు.
ఒక్కసారిగా ఆయన మీదా వాళ్ళ నాన్నగారి మీదా నాకున్న మంచి అభిప్రాయం గంగలో కలసిపోయింది. పుస్తకాలను అలా కేజువల్ గా నలిపే వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. అది వాళ్ళలో ఉన్న నిర్లక్ష్యధోరణికీ, లేకి మనస్తత్వానికీ, అహంకారానికి సూచికగా నేను భావిస్తాను.
ఆయనదేమీ పట్టించుకోకుండా, 'ఫలానాయన అమ్మ బోధలనూ, సాయిబాబా బోధలనూ పోలుస్తూ ఒక పుస్తకం వ్రాశారు' అన్నాడు.
'యు మీన్ షిర్డీ?' అనడిగాను.
'అవును. ఒక పక్క అమ్మ చెప్పిన మాట, ఇంకో పక్క సాయిబాబా చెప్పిన మాటతో ఇద్దరి బోధలనూ పోల్చుకుంటూ ఆ పుస్తకం వ్రాశాడు' అన్నాడాయన.
నాకు చచ్చే నవ్వొస్తోంది లోపలనుంచి.
'నా చిన్నప్పుడు శ్రీపాదవారు వ్రాసిన 'అమ్మ - మహర్షి' అనే పుస్తకం చదివాను. అదికూడా అలాంటిదేనేమో?' అన్నాను.
'అవును. అది అమ్మ బోధలకూ, రమణ మహర్షి బోధలకూ ఉన్న సామ్యాన్ని చూపిస్తూ వ్రాసిన పుస్తకం. ఇది సాయిబాబా బోధల గురించిన పుస్తకం. మీరొక పని చెయ్యండి. బుద్ధుని మీద మీరు పుస్తకం వ్రాశారు కదా ! అమ్మ బోధలకూ బుద్ధుని బోధలకూ ఉన్న సామ్యాన్ని వివరిస్తూ పుస్తకం వ్రాయండి' అన్నాడాయన.
'ఇంకా నయం ! పిల్లి తల గొరగమనలేదు' అనుకున్నా లోలోపల.
'వీళ్ళలో ఒక్కరి బోధలలో ఒకదానినైనా సరిగ్గా అర్ధం చేసుకొని జీవితంలో ఆచరించాలిగాని ఇలా వాళ్ళవీ వీళ్ళవీ పోల్చుకుంటూ పోతుంటే మనకేం వస్తుందిరా నాయనా !' అని అందామని అనుకున్నాగాని పోనీలే వయసులో పెద్దాయన బాధపడతాడు మనకెందుకని ఊరుకున్నా.
నా చూపును బట్టి నాకు విషయం అర్ధం కాలేదని అనుకున్నాడో ఏమో? ఇలా చెప్పాడాయన.
'అమ్మ బోధలు చాలా విలక్షణంగా ఉంటాయండి. ఉదాహరణకు - నీ పిల్లవాడిని బాగా చదివించి కలెక్టర్ని చెయ్యి అని మిగతావాళ్ళు చెబితే, 'కలెక్టర్లందరూ నీ పిల్లలే అనుకో అని అమ్మ చెప్పింది. అమ్మ బోధలు ఇలా ఉంటాయి' - అన్నాడాయన.
నా తలను దేనికేసి బాదుకోవాలో అర్ధం కాక, ఒక పిచ్చి చూపు చూసి, ఒక పిచ్చి నవ్వు నవ్వా.
'కలెక్టర్లందరూ నా పిల్లలే అని నేననుకోవచ్చు. కానీ వాళ్ళలా అవ్వరు కదా? అలా అనుకోవడం నా భ్రమ అవుతుంది. పిచ్చివాడు కూడా తను రాజునని నడిరోడ్డు మధ్యలో కూచుని, ట్రాఫిక్ అంతా తన ప్రజలని అనుకుంటూ ఉపన్యాసం ఇస్తూ ఉంటాడు. అది నిజమౌతుందా? వాడికి పిచ్చి అనేది మాత్రం నిజమౌతుంది. అయినా అమ్మ చెప్పింది ఇదా? వీళ్ళకు అర్ధమైంది ఇదా?' అని నాకు చాలా జాలేసింది.
ఇక ఆయనా, ఆయన కుటుంబ సభ్యులూ అమ్మ చేసిన మహిమలను ఏకరువు పెడుతూ వచ్చారు.
'మా పెద్దమ్మాయి ఇక్కడే సమర్తాడింది. దాని పెళ్లి అమ్మే చేసింది. రెండో అమ్మాయీ ఇక్కడే సమర్తాడింది. దాని పెళ్ళీ అమ్మే చేసింది. మూడో అమ్మాయి....' అని ఆయన భార్య ఇంకేదో చెప్పబోతుంటే, నేనందుకుని - 'ఆమె కూడా ఇక్కడే ఆడిందా? అన్నాను సీరియస్ గా.
ఆమె ఏదో ఫ్లో లో ఉంది. నా వ్యంగ్యం ఆమెకు అర్ధం కాలేదు. కంటిన్యూ చేస్తూ - 'అది మాత్రం ఇక్కడాడలేదు. హైదరాబాద్ లో ఆడింది. కానీ దాని పెళ్లి కూడా అమ్మే చేసింది' అందామె.
అర్జంటుగా వాళ్ళ మధ్యనుంచి పారిపోయి ఎక్కడైనా దూకి సూయిసైడ్ చేసుకుందామని నాలో బలమైన కోరిక తలెత్తింది. నిగ్రహించుకుని అక్కడే కూచున్నా.
'సమర్తాడటం, పెళ్లి చేసుకోవడం తప్ప, జీవితంలో ఇంక ఉన్నతమైన ఆశయాలు ఆదర్శాలు ఏవీ ఉండవేమో వీళ్ళకి? వీళ్ళ దృష్టిలో ఇవేనేమో ప్రపంచసమస్యలు? వరసపెట్టి పిల్లల్ని కనడం వీళ్ళ పనీనూ, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యడం అమ్మ పనీనా? ఎలాంటి మనుషుల మధ్యకు వచ్చాన్రా దేవుడా !' అనుకున్నా.
ఆయన అందుకున్నాడు.
'నలభై ఏళ్ళ క్రితం మా బాబాయి గారి మూడో కొడుకు డిగ్రీ పూర్తి చేసి ఆరేళ్ళు ఖాళీగా ఉన్నాడు. అయినా ఉద్యోగం రాలేదు. అందుకని అమ్మ దగ్గరకి వచ్చి ఉద్యోగం రావడం లేదని ఏడిచాడు' అన్నాడు.
'కష్టపడి చదివి పరీక్షలు వ్రాస్తే ఉద్యోగం వస్తుంది గాని, ఇంట్లో ఖాళీగా కూచుని ఏడుస్తుంటే ఎలా వస్తుంది? నీ ప్రయత్నం నువ్వు చెయ్యకపోతే అమ్మ మాత్రం ఏం చేస్తుంది?' అందామనుకున్నా. సభ్యత కాదని మళ్ళీ మింగేశా.
'అప్పుడు అమ్మ వాడికి ఒక కర్చీఫ్ ఇచ్చింది. దాన్ని జేబులో పెట్టుకుని వెళ్లి బాపట్ల సముద్రంలో దూకాడు. ఆ కర్చీఫ్ కొట్టుకుని పక్కనే ఉన్న సూర్యలంక నేవీ ఆఫీసర్స్ కి దొరికింది. వాళ్ళు వెదుక్కుంటూ వచ్చి వీడిని కాపాడారు. ఆ విధంగా ఆ కర్చీఫ్ రూపంలో అమ్మే వాడి ప్రాణాలు కాపాడింది' అన్నాడాయన భక్తిగా.
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నందుకు మొదటిసారి నన్ను నేనే తిట్టుకున్నా. నా ప్రమేయం లేకుండానే లేస్తున్న కాళ్ళూ చేతులను చాలా నిగ్రహించుకోవలసి వస్తోంది మరి !
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నందుకు మొదటిసారి నన్ను నేనే తిట్టుకున్నా. నా ప్రమేయం లేకుండానే లేస్తున్న కాళ్ళూ చేతులను చాలా నిగ్రహించుకోవలసి వస్తోంది మరి !
ఈ సోదిభక్తులందరూ ఇలాంటి చవకబారు కధలు చాలా చెబుతూ ఉంటారు. సాయిబాబా భక్తులు కూడా ఇలాంటి సొల్లు చాలా చెప్తారు. వినీ వినీ నాకు ఈ సోకాల్డ్ భక్తులంటేనే పరమ చీదర పుడుతోంది. ' డర్టీ స్లేవ్ మెంటాలిటీస్ !' అని లోలోపల తిట్టుకున్నా.
అంత విసుగులోనూ నాకొక డౌటొచ్చింది.
'అమ్మ అతన్ని రక్షించాలీ అనుకుంటే, అసలు సముద్రంలో దూకేటప్పుడే రక్షించాలి. దూకనిచ్చి, ఆ తర్వాత ఆ కర్చీఫ్ ని నేవీ ఆఫీసర్స్ కి దొరికేలా చేసి అప్పుడు రక్షించడం ఏంటి? అసలు, అమ్మ దగ్గరకు వచ్చి వేడుకున్న తర్వాత అతను సముద్రంలో దూకడం ఏంటి? అంటే, అమ్మంటే అంత గొప్ప నమ్మకం ఉందన్నమాట ఆయనకి?' అనుకున్నా.
వీళ్ళు చెబుతున్న కాకమ్మకధలలో ఎన్నో లొసుగులు నాకు కన్పిస్తున్నాయి. ఇవన్నీ వీళ్ళ ఊహలే గాని అమ్మ చేసిన మహిమలు కావన్న నిశ్చయానికి వచ్చేశా లోలోపల.
'సృష్టిని మించిన మహత్యం లేదు' అనీ ' మహత్తత్వానికి మహిమలతో పని లేదు' అనీ అమ్మ చెబితే, వీళ్లేమో నాసిరకం మహిమలు అమ్మ చేసిందని కధలు చెబుతున్నారు. అమ్మ తత్త్వం వీళ్ళకు ఆవగింజంత కూడా ఎక్కలేదని నాకర్ధమైంది. వీళ్ళంతా ఊహలలో బ్రతుకుతున్నారు గాని రియాలిటీ వీళ్ళకు అర్ధం కాలేదన్న సంగతి నాకు స్పష్టమై పోయింది.
మనుషులందరూ పచ్చి స్వార్ధపరులు, దొంగలు. వీళ్ళకు ఉన్నతమైన తత్త్వం ఏనాటికీ ఎక్కదు, అవసరం లేదు కూడా. ఎంతసేపూ, ఉద్యోగాలు రావడం, పెళ్ళిళ్ళు కావడం, పిల్లలు పుట్టడం, ఆస్తులు పెరగడం, అనుకున్న పనులు కావడం తప్ప ఇంకో ఉన్నతమైన ఆలోచనే వీళ్ళ బుర్రలకు తట్టదు. ఇలాంటి మనుషులను వేలాదిమందిని అమ్మ జీవితాంతం ఎలా భరించిందో అన్న ఆలోచనతో నా ఒళ్ళు క్షణకాలం గగుర్పొడిచింది.
ఆయనకు నా పుస్తకాన్ని ఇచ్చినందుకు పశ్చాత్తాపపడ్డాను.
సోకాల్డ్ సోది భక్తులంటే నాకున్న అసహ్యం ఒక్కసారిగా ఎన్నో రెట్లు పెరిగిపోయింది. అదే సమయంలో సృష్టి లీలా, దాన్ని నడిపిస్తున్న మాయా ప్రభావమూ ఎలాంటివో అర్ధమై ఎంతో ఆశ్చర్యమూ, జాలీ, నవ్వూ మూడూ ఒకేసారి కలిగాయి.
అమ్మ ఎలాంటి మనిషి? ఎంత ఉన్నతమైన తాత్వికత ఆమెది? ఎంత ఉన్నతమైన ఆధ్యాత్మిక సత్యాలను ఆమె తన జీవితంలో అలవోకగా ఆచరించి చూపింది? వీళ్ళేం అర్ధం చేసుకున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఇదా అమ్మ చెప్పింది? ఇదా వీళ్ళకు ఎక్కింది? 'ఛీ' అనిపించింది.
'సృష్టి ఇంతే, మనుషులింతే. ఎవరెన్ని చెప్పినా వీళ్ళ అజ్ఞానం ఏ మాత్రమూ తగ్గదు. వీళ్ళు ఎప్పటికీ ఎదగరు. ఇదింతే' - అనిపించింది.
'చక్రవర్తి దగ్గరకు వెళ్లి, దర్బారులో ఆయన ఎదురుగా నిలబడి,వరం కోరుకో అని చక్రవర్తి చెబితే, 'కేజీ పుచ్చు వంకాయలు కావాలి' అని అడుగుతారు మనుషులంతా' అన్న శ్రీరామకృష్ణుల అమృతవాక్కులు గుర్తొచ్చాయి.
మనుషుల అజ్ఞానపు స్థాయిని తలచుకుని నా కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి.
ఆ తర్వాత ఎక్కువసేపు అక్కడ ఉండబుద్ధి కాలేదు. వాళ్ళతో ఎక్కువగా మాట్లాడాలనీ అనిపించలేదు. సెలవు తీసుకుని, అమ్మకు మనస్సులోనే ప్రణామం చేసుకుని, వెనక్కు బయల్దేరి రాత్రి పదిగంటలకల్లా గుంటూరు వచ్చి చేరుకున్నాము.